VVS.. అనే ఓ మహా సినీవృక్షం

0
2

[శ్రీ ఊటుకూరి వెంకట సత్యనారాయణ రచించిన 13 సినిమా పుస్తకాలు 06 నవంబర్ 2023 నాడు ఆవిష్కరింపబడుతున్న సందర్భంగా, ప్రముఖ సినీ గీత రచయిత శ్రీ భువనచంద్ర రాసిన ముందుమాటను అందిస్తున్నాము.]

[dropcap]చ[/dropcap]రిత్ర మనుషుల్ని సృష్టించదు. కొందరు మాత్రమే చరిత్రను సృష్టిస్తారు. వాళ్ళు సామాన్యంగా కనబడే అసామాన్యులు. ఒక అశోకుడు దారికిరువైపులా చెట్లు నాటించాడు. బావులు తవ్వించాడు. అక్కడక్కడ విశ్రాంతి కోసం విశ్రాంతి గృహాలు కట్టించాడు. గొప్ప చక్రవర్తిగా చరిత్రలో నిలిచిపోయాడు!

అయితే ఎలా? ఎందుకూ? అని ప్రశ్నిస్తే, జవాబు మనకే తడుతుంది. ఆ మంచి పనులు చేయడం తాను నీడ పొందడానికో, తను విశ్రాంతి తీసుకోవడానికో, తన దాహం తీరడానికో కాదు. ప్రజల కోసం. అందుకే చరిత్రలో నిలిచిపోయాడు.. రాజతరంగణి వ్రాసిన కల్హణుడిలాగా.. పావురం ప్రాణం నిలిపిన శిబిచక్రవర్తిలాగా.

తమ స్వార్థం కోసం సృష్టించుకొన్న చరిత్ర కలకాలం నిలువదని కొందరు పాలకులు ఏనాడో ఋజువు చేశారు. నిస్వార్థ సేవ, నిష్కామ కర్మ మాత్రమే మనుషుల్ని మహాపురుషుల్ని చేస్తాయి!

ఊటుకూరి వెంకట్ గారు సినిమాకి సంబంధించిన మనిషి కాదు. వారి వృత్తికి, చలనచిత్ర పరిశ్రమకీ పొంతన లేదు. సినిమా మీద అభిమానం తప్ప, మరే సంబంధం లేదు. వారి వృత్తిలో వారు నిష్ణాతులు. మైనింగ్ స్పెషలిస్ట్‌గా, పరిశోధకులుగా, అనేక పత్రాలు ఎన్నో విశ్వవిద్యాలయాలకు సమర్పించడమే కాక, పోలెండ్ సెంట్రల్ మైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో Ph.D. చేసి, ఎంతోమందికి మార్గదర్శకులయ్యారు. అధ్యాపకునిగా తమ విశేష అనుభవంలో వేలాది విద్యార్థులకు శిక్షణనిచ్చారు.

అటువంటి ఇంజనీర్ సినిమా పరిశ్రమ కోసం ఓ అద్భుతమైన, పటిష్టమైన, అపూర్వమైన కోట నిర్మించి ఇచ్చారు. 1932వ సంవత్సరం నుండి 2000వ సంవత్సరం వరకూ వచ్చిన చిత్రాలు, పాటలు, గీతరచయితల, సంగీత దర్శకుల, గాయకుల వివరాల్ని, అత్యంత నిబద్ధతతో పొందుపరిచారు. 68 సంవత్సరాల సినీ గీత, సంగీతదర్శకుల, గాయనీగాయకుల వివరాలు సేకరించడం, వాటిని క్రమ పద్ధతిలో సమగ్ర నిఘంటువులుగా, అనుబంధ పుస్తకాలుగా మలచడం, ఎంత క్లిష్టమైన పనో ఊహించడానికి కూడా అలవికాదు.

హనుమంతుడు సంజీవని పర్వతాన్ని ఎత్తినట్లుగా, ఊటుకూరి వెంకట సత్యనారాయణగారు యీ అపూర్వ కార్యక్రమాన్ని భుజానికెత్తుకొని దిగ్విజయంగా పూర్తిచేశారు. 13 వాల్యూంస్.. ఒక్కొక్కటి 500 పేజీల చొప్పున, 6,500 పేజీలు! ఎన్నివేల రాత్రిళ్ళు నిద్రకు సెలవిచ్చారో, ఆయనే చెప్పాలి. ఈ మొత్తం పని, కేవలం ‘ఇష్టం’ తో చేశారు! ఎవరి మెప్పు కోసం కాదు! ఎవరి మెహర్బానీ కోసం కాదు!! కేవలం సినిమా, అదీ తెలుగు సినిమాపై ఉన్న ఇష్టంతో, ప్రేమతో- అదీ ఆస్ట్రేలియాలో ఉంటూ!!!

రచయితలు, సంగీత దర్శకులు, గాయకులు అనే త్రివేణి సంగమం, ‘పంచవటి’గా మార్పుచెంది, షడ్బుజిగా, అష్టభుజిగా రూపాంతరం చెందింది. పనిచేస్తున్న కొద్దీ పాఠకులకు, ఔత్సాహికులకు, పరిశోధకులకు మరింత మరింత సమాచారం ఇవ్వాలనే తృష్ణ ఆయనలో హిమాలయమంత పెరిగింది. సమాచార సేకరణ అనేది వారి శ్రీమతి కోటిరత్నమ్మగారికి సవతిగా మారింది. ఆవిడ హృదయంలో ‘సినీ సవతి’ని ప్రేమగానే చూశారు. లేకపోతే, ఆరువేల అయిదువందల పేజీల నికార్శైన సమాచారం మనకు దక్కేదా?

అసలు ఇందులో ఏముందీ?

– 1932 నుండి 2000 వరకూ విడుదలైన సినిమాలు (డైరెక్ట్, డబ్బింగ్) చిట్టా ఉంది. అదీ సంవత్సరం వారీగా.

– గీత రచయితల పేర్లు, వారు వ్రాసిన సినీ గీతాల పల్లవుల మొదటి పంక్తులు ఉన్నాయి.

– సంగీతదర్శకుల పేర్లు, వారు స్వరాలు కూర్చిన సినమాల జాబితాలు ఉన్నాయి.

– గాయనీ గాయకుల పేర్లు వారు పాడిన పాటల జాబితాలు ఉన్నాయి.

కేవలం ఇంతేనా? కాదు, మహాప్రభో కాదు.

– సంగీత దర్శకుల వద్ద ఏయే గీతరచయితలు గీతాలు వ్రాశారు, వారిని ఎవరు పాడారు అనే వివరాలు-

– గీతరచయితలు ఏ సంగీత దర్శకులకి ఏ పాటలు వ్రాశారు, ఎన్ని పాటలు వ్రాశారు, ఆ గీతాల్ని ఎవరు ఆలపించారనే వివరాలు-

‘ఒక్క చూపుతో’ సవివరంగా తెలుసుకొనేట్టుగా పొందుపరచబడి ఉన్నాయి.

ఎవరు, ఏ గీతకారుడు, సంగీత దర్శకుడు, గాయనీగాయకుల మీద పరిశోధన చెయ్యాలన్నా ఇది ఇంద్రజాల పేటికలాంటిది. క్షణాల్లో వివరాలు సంపాదించవచ్చు.

ఇటువంటి మహాయత్నం ఇప్పటివరకూ ఏ భాషలోనూ జరగలేదు. జరిగినా, దొరికే సమాచారం అసంపూర్ణము, అరకొరగానూ దొరుకుతుంది. ప్రతిలైనూ ISI మార్కులాగా వి.వి.యస్. మార్కు పేజీ బయటకు వచ్చిందని 200% గ్యారంటీతో చెప్పగలను.

ఓ మహా స్టాటిస్టికల్ వ్యవస్థ చెయ్యవలసిన పనిని ఒకే ఒక వ్యక్తి చెయ్యడం అద్భుతమూ, అపూర్వమూ. తెలుగు చలనచిత్ర పరిశ్రమ శ్రీ ఊటుకూరి వెంకట సత్యనారాయణ గారికి కలకాలం ఋణపడి ఉంటుంది. అంతేకాదు- చరిత్ర మరిచిన గీత, సంగీత, గాయక శిరోమణుల అమూల్యమైన వివరాలు ఇందులో లభిస్తాయి.

ఎవరైనా తమ కృషిలో అత్యున్నతమైన ప్రతిభ కనపరిస్తే, వారిని ‘పద్మశ్రీ, పద్మభూషణ్’లతో సత్కరిస్తారు. వి.వి.యస్. గారు చేసిన కృషి అపూర్వమైనది, అంతులేనిది. అందుకే సినీ పరిశ్రమ వారిని అత్యున్నత గౌరవంతో సత్కరించాలి.

ఒక సినీ గేయరచయితగా వారికి నా సాష్టాంగ నమస్కారాలు!

వారు చేసిన కృషి ఆచంద్రతారార్కమూ చెక్కు చెదరని హిమాలయంలా నిలిచిపోతుంది!

మరోసారి, మరోసారి, శ్రీ ఊటుకూరి వెంకట సత్యనారాయణ గారికి నమస్సులతో, అభినందనలతో, శుభాకాంక్షలతో,

– భువనచంద్ర.

తేదీ: 22-September-2023.

తాక:

ఈ పుస్తకాల్లో ఉన్నది, గీత, సంగీత, గాయకగాయనీమణులే కాదు.. సినిమా టైటిల్సే కాదు.. నిర్మాతల, దర్శకుల వివరాలు కూడా ఉన్నాయి.

సినీ పరిశ్రమ ఓ పచ్చని వృక్షమైతే, ఆ వృక్షపు కొమ్మలు, రెమ్మలూ, నీడా, కాయా, పండూ, మాత్రమేకాక అది లోకానికిచ్చే ఆనందాన్ని కూడా ఇక్కడ ఆస్వాదించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here