[శ్రీ వరిగొండ కాంతారావు రచించిన ‘వ్యామోహం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
‘హోటల్ ఉత్సవం’ పోర్టికోలోకి వచ్చి ఆగిన ‘ఆడి’ కారులోంచి దిగిన జనార్దనమూర్తి రెండు మెట్లెక్కాడో లేదో “నమస్కారమన్నయ్యా!” అంటూ ఎదురొచ్చాడు రమణ.
“అబ్బ పంక్చుయాలిటీ అంటే నీదన్నయ్యా! ఒక్క నిమిషం కూడా ఆలస్యం కావు” మెచ్చుకున్నాడు రమణ.
మెచ్చుకోలును చిరునవ్వుతో స్వీకరించాడు జనార్దనమూర్తి. “రా అన్నయ్యా!” అంటూ లిఫ్టు వేపు నడిచాడు రమణ.
“ఏంటి విశేషం. పార్టీ కెవరెవరు వస్తున్నారు” అడిగాడు జనార్దనమూర్తి.
“విశేషం పైకి వెళ్ళాక తెలుస్తుంది. అష్టమూర్తులెనమండుగురూ వచ్చారు” చెప్పాడు రమణ.
పదిహేనేళ్ళ క్రితం ఓ ఐదేళ్ళ పాటు సత్యంలో టీమ్ మేనేజరుగా పనిచేశాడు జనార్దనమూర్తి. అతని టీంలో ఎనమండుగురు సభ్యులుండేవాళ్ళు. వాళ్ళందర్నీ కలిపి అష్టమూర్తులనుగా పిలచేవాడు తను. “సారూ గీరూ జాన్తానై! బహువచనాలసల్లేవు. అన్నయ్యా! అని పిలవండి చాలు” అని చెప్పాడు వాళ్ళకి.
సత్యం కంపెనీ చిక్కుల్లో పడ్డప్పుడు అమెరికాలో ఏవో అవకాశాలున్నాయని మిత్రుడొకరు చెబితే ఇక్కడ రాజీనామా చేసి అక్కడకు వెళ్ళాడు. అక్కడికెళ్ళాక తెలిసొచ్చింది దూరపు కొండలు నునుపని. పట్టుదలగల మనిషవడం వలన నిలదొక్కుకొని, కొంతమంది మిత్రులతో కలసి ‘సాఫ్టీ క్లౌడ్’ కంపెనీని స్థాపించాడు. ఇప్పుడు కంపెనీ పనుల మీద నెలకొక్కసారన్నా భారతదేశానికి వచ్చి వెళ్తుంటాడు.
లిఫ్టు తెరచుకోవడంతో ఆలోచనలు ఆగిపోయాయి. “రా అన్నయ్యా!” అంటూ ముందుకు నడిచాడు రమణ.
రెస్టారెంటు హాలుపైన పెద్దగా ‘మావిడాకులు’ అని రాసివుంది అచ్చమైన తెలుగులో. ‘బాగుంది’ మనసులోనే అనుకున్నాడు మూర్తి. లోపలికిరాగానే ఎదురొచ్చారు మిగిలిన ఏడుగురూను “గుడీవినింగ్ సార్!” అంటూ.
“ఇదేంటీ కొత్త పిలుపు” అడిగాడు జనార్దనమూర్తి.
“సారీ అన్నయ్యా!” అన్నారందరూ ముక్తకంఠంతో.
“గుడ్” అన్నాడు జనార్దనమూర్తి.
రాత్రి ఎనిమిది కావస్తూంది. దీపాలు మసకగా వెలుగుతున్నాయి. మంద్రస్థాయిలో ‘జీనా యహాఁ మర్నా యహాఁ’ పాటకు సంబంధించిన వాద్య సంగీతం వినిపిస్తోంది.
మూడు బల్లలనొక చోట చేర్చి సీట్ల నేర్పరిచారు. శీర్షస్థానంలో జనార్దనమూర్తి కూర్చోగా అతనికి కుడివైపు నలుగురు ఎడమవైపున నలుగురు కూర్చున్నారు. జనార్దనమూర్తికి ఎడమవేపు వరుసగా రమణ, సాకేత్, సౌమ్య, సమ్మయ్య కూర్చోగా కుడివైపున రాజీవ్, హిమాంశురాయ్, స్వాతి, సంజయ్ కూర్చున్నారు.
“ఇదేమన్నా బోర్డు మీటింగా!” అడిగాడు జనార్దనమూర్తి అందరూ గొల్లున నవ్వారు.
“అన్నయ్యలో మార్పేమీ లేదు” అన్నాడు రాజీవ్.
“మీరే మారి పోయారు. రాగానే సార్ అంటూ దూరంపెట్టే ప్రయత్నం చేశారుగా!”
“సారీ అన్నయ్యా! నిజానికి మనం ప్రత్యక్షంగా కలుసుకొని రెండేళ్ళు దాటిపోయింది. పైగా నువ్విప్పుడు టాప్ రేటెడ్ యు.ఎస్. కంపెనీల్లో ఒకటైన ‘సాఫ్టీ క్లౌడ్’ కి సి.ఇ.ఓ.వి. అందుకే అప్రయత్నంగా సార్ అనేశాం.” సంజాయిషీ ఇచ్చాడు సంజయ్.
“మీరు మటుక్కు పాత కంపెనీలోనే ఉన్నారా! అందరూ తలోచోటా పనిచేస్తున్నా కలిసుండడంలా! మనమెంత ఎత్తుకు ఎదిగినా మన మూలమ్మాత్రమిదే కదా! ఎప్పటికైనా మీరు నా అష్టమూర్తులు నేను మీ అన్నయ్య నేను.”
“థాంక్యూ అన్నయ్యా! చాలా గొప్ప విషయాన్ని ఆత్మీయంగా చెప్పావు” అన్నాడు హిమాంశురాయ్.
“ఇదిగో వినండి. రమణ భవుడు, సాకేత్ రుద్రుడు, సౌమ్య శర్వాణి, సమ్మయ్య భీముడు, రాజీవ్ ఉగ్రుడు, హిమాంశు పశుపతి, స్వాతి మహాదేవి, సంజయ్ ఈశానుడు. సరిగ్గా చెప్పానా!” అడిగాడు జనార్దనమూర్తి.
“అద్భుతమన్నయ్యా! పర్‌ఫెక్ట్లీ కరెక్ట్” అరచినంత పని చేశాడు సంజయ్. అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు.
“ఇంతకీ ఆడపిల్లలే మాట్లాడ్డం లేదు” అడిగాడు జనార్దనమూర్తి. అష్టమూర్తుల్లో సౌమ్య, స్వాతి ఆడపిల్లలు. అందరి కన్నా మూర్తి పదిపదిహేనేళ్ళు పెద్ద. అందుకే ఆ చనువు.
“ఏదీ! అవకాశం రాందే!” అన్నారిద్దరూ ఒక్కమాటగా.
“అయితే మేల్ షావెనిజం ఇంకా నడుస్తోందన్నమాట” అన్నాడు జనార్దనమూర్తి. గొల్లున నవ్వారందరూ.
“నడవడం కాదు. నడుస్తున్న భ్రాంతి. అంతే!” అన్నాడు హిమాంశురాయ్. మళ్ళీ నవ్వారందరూ.
హిమాంశురాయ్ మాటలకి అతడి డొక్కలో మోచేత్తో పొడిచింది స్వాతి. ‘ఓహో! మీరిద్దరూ పెళ్ళి చేసుకున్నారా!’ అన్నట్లుగా సైగ చేశాడు జనార్దనమూర్తి. అవునన్నట్లుగా తలూపాడు హిమాంశు. “కంగ్రాట్స్ టు హిమాంశు అండ్ స్వాతి” లేచి ఇద్దరికీ షేక్ హ్యాండిచ్చాడు జనార్దనమూర్తి.
హిమాంశురాయ్ బెంగాలి. స్వాతి మలయాళి. హైదరాబాదు వచ్చాక తెలుగు మాట్లాడ్డం నేర్చుకున్నారు. సత్యంలో పనిచేస్తున్నప్పుడు వీళ్ళ తెలుగు మీద రోజూ జోక్స్ పేల్తూండేవి. గుర్చుకొచ్చింది జనార్దనమూర్తికి. “ఇప్పుడు మీ తెలుగు బాగుందా!” అడిగాడు.
“డు, ము, వు, లు ప్రథమా విభక్తి” చెప్పాడు హిమాంశు.
“కూర్చి, గురించి ద్వితీయా విభక్తి” చెప్పింది స్వాతి.
“అమ్మో! వద్దులే తల్లీ! అంత తెలుగు నాక్కూడ రాదు” అన్నాడు జనార్దనమూర్తి. పగలబడి నవ్వారందరూ.
“రెస్టారెంటు బాగుంది. కొత్తగా పెట్టారా!” అడిగాడు మూర్తి.
“అవునన్నయ్యా! ఇప్పుడు ట్విన్ సిటీస్‌లో ఇదే టాప్ రెస్టారెంటు” అన్నాడు సమ్మయ్య.
“అవునా! అందుకేనేమో టాప్‌మోస్ట్ ఫ్లోర్‌లో రెస్టారెంటు పెట్టారు. పేరు కూడా బాగుంది ‘మావిడాకులు’. ‘మామిడాకులు’ అని కదా ఉండాలి. బహుశః ఓనరు కోస్తా జిల్లా వాడైవుంటాడు.”
“అదేమో తెలీదు కాని, ఈ హోటలు గురించి కొంత చెప్పాలి నీకు” అన్నాడు రమణ.
“అది సరే! ఈ పార్టీ ఏంటి! నేను ఇండియా వస్తున్నట్టు మీకు ముందే తెలుసా!” అడిగాడు మూర్తి.
“లేదన్నయ్యా! పార్టీ నిర్ణయమయ్యాక నువ్వీ పార్టీలో వుంటే బాగుంటుందనిపించింది. మీ ఆఫీసు నెంబరు మాత్రమే వుండింది. ఫోన్ చేస్తే మీ సెక్రటరీ చెప్పింది. నువ్విండియాలోనే వున్నావని. నెంబరు కూడా ఆవిడే చెప్పింది. వెంటనే ఫోన్ చేశాం. దొరికిపోయావు” వివరంగా చెప్పాడు రాజీవ్.
“బాగుంది, ఐ విల్ బి ది హోస్ట్” అన్నాడు జనార్దనమూర్తి.
“లేదన్నయ్యా! ఇవాల్టి హోస్ట్‌లు సౌమ్య, సాకేత్‌లు” చెప్పాడు సమ్మయ్య.
“శుభం. అవునూ మీ పెళ్ళికి పిలిచారు కదా! రాలేకపోయాను. మూడేళ్ళన్నా అయివుంటుంది. న్యూ ఎరైవల్స్ పార్టీనా!” ఉత్సాహంగా అడిగాడు జనార్దనమూర్తి.
“అలాంటిదేం లేదన్నయ్యా!” తలొంచుకొని చెప్పింది సౌమ్య. సాకేత్ వంక చూశాడు మూర్తి. అతడూ తలొంచుకొన్నాడు.
“నేను చెప్తాను వినన్నయ్యా! వాళ్ళద్దరూ విడిపోతున్నారు” చెప్పాడు రాజీవ్.
“వాట్!” నివ్వెరపోయాడు జనార్దనమూర్తి.
“అవున్నిజమే. రేపే కోర్టు తీర్పు. విడాకుల డిక్రీ ఇస్తారు. విడిపోయేముందు దంపతులు కలసి ఇచ్చే పార్టీ ఇది” చెప్పాడు రమణ.
“విడాకులు తీసుకునేవాళ్ళు కలసి పార్టీ ఇవ్వడమేమిటి? ట్రాష్” సరిపెట్టుకోలేకపోతున్నాడు జనార్దనమూర్తి.
“ఈ హోటలు గురించి కొంత చెప్పాలనుకొన్నాడు రమణ. నువు చెప్పనియ్యలేదు. నేను చెప్తాను విను. ఈ హోటలు ఐదంతస్తులూ రెస్టారెంట్లే. అన్ని అంతస్తులూ కిటకిటలాడుతూనే వుంటాయి. గ్రౌండు ఫ్లోరులో ఎంక్వైరీలు, అనుబంధంగా ఉన్న కల్యాణ మంటపాలు, వసతిగృహాలూ వగైరాల బుకింగుకు సంబంధించిన కౌంటర్లుంటాయి. మొదటి అంతస్తులో ఉండేది ‘కాలక్షేపం’. కాఫీలు, టీలు, బెవరేజెస్ మాత్రమే వుంటాయి. రెండో అంతస్తులోది ‘మకరందం’. ప్రేమలో పడ్డ వాళ్ళందరూ వెళ్ళే రెస్టారెంటది. మూడో అంతస్తులోది ‘అల్లిక’. మకరందం పెళ్ళిగా మారాక కొత్తజంటల కొఱకు ప్రత్యేకం. నాలుగో అంతస్తులోది ‘పేరంటం’. కుటుంబం పెరిగే కొద్దీ లేదా పెళ్ళి కారణంగా పెరిగిన పరిచయస్తులతో వేడుకలు జరుపుకొనే రెస్టారెంటది. ఇక చివరిది, మునమున్నది. ‘మ్యూచువల్ కన్సెంటు’తో ‘డివోర్సు’ తీసుకొనే జంటలు సాంకేతికంగా భార్యాభర్తలుగా ఉన్నప్పుడు కలసి ఇచ్చే చివరి విందు. విడిపోయినా స్నేహభావంతోనే ఉండాలన్న ఆలోచనతో వచ్చిన వినూత్నమైన ఆచారమిది. విడాకుల తర్వాత వాళ్ళిద్దరూ ఏ మాత్రం మిత్రత్వాన్ని పాటిస్తారో తెలియదు కాని, విడిపోయే జంటల ఆంతరంగిక మిత్రులకు మాత్రం సుష్టుగా భోజనం లభిస్తుంది. నువ్విందాక అన్నావే ‘మావిడాకులు’ అని, ‘మామిడాకులు’ కావవి, ‘మా విడాకులు’. ఇదీ ఈ రెస్టారెంటు కథా కమామిషు” చెప్పడం ముగించి నిట్టూర్చాడు సంజయ్.
“ఇంతటి విచారకరమైన సందర్భంలో ఇచ్చే విందుకు నన్ను ప్రత్యేకించి పిలవాలనుకున్నారా! ఇదా మీరు నాకిచ్చే గౌరవం” అణచిపెట్టుకొన్న బాధ, కోపం జనార్దనమూర్తి గొంతులో ధ్వనిస్తూనే ఉన్నాయి.
“సారీ అన్నయ్యా! మా ఉద్దేశం అది కాదు. సౌమ్య, సాకేత్‍ల వ్యవహారంలో మేం పీకల్లోతు కూరుకుపోయాం. వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా విడిపోవడమే కాదు మేం అష్టమూర్తులుగా మిగుల్తామో లేదో కూడా సంశయాస్పదమైంది. అష్టమూర్తుల నేర్పరచిన ప్రణవమూర్తివి. నిన్నొకసారి అందరమూ కలసి చూచుకొందామన్న ఆలోచనతోనే ఆహ్వానించాం. మా అదృష్టం బాగుండి నువ్వు ఫోన్‍లో దొరికావు, వచ్చావు” గొంతు గద్గదమౌతుంటే చెప్పాడు సమ్మయ్య.
జనార్దనమూర్తి మనసు మ్లానమయింది. అప్పుడు గమనించాడు. నేపథ్యంలో ‘దోస్త్, దోస్త్ నా రహా’ పాటకు సంబంధించిన సంగీతం వినిపిస్తోంది. అందరూ నిశ్శబ్దంలో మునిగిపోయారు.
బేరర్లు వచ్చి కట్లెరీ సర్దడం మొదలెట్టారు. రెండు మూడు రకాల సూపులు వచ్చాయి. ఎవరికే సూపు అవసరమో కనుక్కొని ఆ సూపుని కప్పుల్లో పోస్తున్నారు. తేలికపాటి కరకరలాడే తినుబండారాలు కూడా తెచ్చిపెట్టారు.
ముందుగా తేరుకొన్నది జనార్దనమూర్తే. “సరే! మీరు విడిపోవడానికి నిశ్చయించుకొన్నాక, కోర్టు కూడ నిర్ణయించేశాక, నేను చేయగలిగిందేముంది. విషయూ హాపీ సెపరేటెడ్ లైఫ్” అంటూ చెంచాతో సూపును తీసుకొని నోటితో చప్పరించాడు.
అందరూ చప్పట్లు కొట్టి “ఆల్ ఆఫ్ అజ్ విష్ యు హాపీ ఇండివిడ్యుయల్ లైఫ్” అని అభినందించారు సౌమ్యా, సాకేత్‍లను. ఇద్దరూ నిలబడి అందరకూ థ్యాంక్స్ చెప్పి కూర్చున్నారు.
“ఇంతకూ మీరెందుకు విడిపోతున్నారో తెలుసుకోవచ్చా!” చివుక్కున తలెత్తి చూశారు సౌమ్య, సాకేత్‍లు. కాస్త విరామాన్నిచ్చి “అభ్యంతరం లేకపోతేనే సుమా!” వాక్యాన్ని పూర్తిచేశాడు జనార్దనమూర్తి.
“ఇదమిత్థంగా ఇదీ కారణమని చెప్పలేను. కాని, కలసి ఉండలేమన్న నిర్ధారణ జరిగిపోయింది. కలసివుండి అశాంతిని అనుభవించే దానికన్నా విడిపోయి శాంతి పూర్వక స్నేహాన్ని కొనసాగించడం మేలు కదా!” జవాబిచ్చాడు సాకేత్.
“ఇందులో చెప్పలేకపోయేదేమీ లేదన్నయ్యా! వ్యామోహాన్ని ప్రేమ అని భ్రమించాం. కాదని తేలిపోయింది. విడిపోతున్నాం” కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే బాధతో చెప్పింది సౌమ్య. కన్నీళ్ళు కనబడేంత వెలుగు లేదా రెస్టారెంట్లో. స్వాతి బల్లకింద నుండి కర్చీఫ్ నందించిన కారణంగా విషయం బోధపడింది జనార్దనమూర్తికి.
“వ్యామోహమా! అంటే!” అడిగాడు జనార్దనమూర్తి.
“ఇన్ఫ్యాచ్యుయేషన్” అందించాడు రమణ.
“అవునా!” మళ్ళీ అడిగాడు జనార్దనమూర్తి.
అవునన్నట్లుగా తలూపారు సౌమ్య, సాకేత్‍లు. సౌమ్యది బళ్ళారి. సాకేత్ బరంపురం. ఇద్దరూ తెలుగువాళ్ళే. కులగోత్రాలడ్డు రాకపోవడంతో ఇరు కుటుంబాలవాళ్ళు వీళ్ళ ప్రేమనంగీకరించి మూడుముళ్ళు వేయించారు.
“ఇన్‌ఫాచ్యుయేషన్ అంటే ఆకర్షణ. వ్యామోహం అంటే అబ్సెషన్. తెలుగుపదాల్ని ఇంగ్లీషులో చెప్తే కాని అర్థం కాని స్థితికి వచ్చేశాం. ఇంతకీ మీ సమస్య ఏది?” అడిగాడు జనార్దనమూర్తి.
“రెండూను” చెప్పింది సౌమ్య.
“రెండూ ఏకకాలంలో వుంటానికి వీల్లేదు. ఆకర్షణ అధికతరమైతే ప్రేమగా మారుతుంది. ప్రేమ తీవ్రతరమైతే వ్యామోహంగా మారుతుంది. వ్యామోహం వల్ల ప్రేమలో సమస్యలొస్తాయి. తెలివిడితో సమస్యలను పరిష్కరించుకొంటే ప్రేమ మరింత చిక్కనౌతుంది తప్ప తగ్గదు.”
“ఏమో! మేము రాత్రింబవళ్ళు ఎడతెరిపి లేకుండా చర్చించుకొంటూనే ఉన్నాం. పరిష్కారం దొరకలేదు. అందుకే విడిపోతున్నాం” చెప్పాడు సాకేత్.
“చర్చించుకొన్నారా! వాదించుకొన్నారా!” అడిగాడు జనార్దనమూర్తి.
“రెండూ ఒకటే కదా! కాకపోతే మాట తేడా!” తేలిగ్గా కొట్టిపారేసింది సౌమ్య.
“లేదు సౌమ్యా! రెండూ ఒకటి కాదు. చర్చలో నీ వాదాన్ని అవతలి వ్యక్తి ముందర పెడతావు. ఆ వ్యక్తికి నీ వాదాన్ని అర్థం చేసికొనే సమయాన్నిస్తావు. అతడి భావ వ్యక్తీకరణకు అవకాశాన్నిస్తావు. అతడు చెప్పేదాంట్లో సత్యముంటే మారుమాటాడకుండా అంగీకరిస్తావు. పొరపాటుంటే – దాన్ని ఎత్తిచూపి సరిచేసే ప్రయత్నాన్ని చేస్తావు. అతడి వాదాన్ని సరిచేసే యత్నాన్ని అతడు హర్షిస్తాడు కూడా! వాదనలో అలాకాదు. గెలుపే అంతిమలక్ష్యం. నీ వాదాన్ని తర్కబద్ధంగా అతడి ముందుంచి అతణ్ణి నిరుత్తరుణ్ణి చేయడమే నీకు ప్రధానమౌతుంది. సవరణలకు, సర్దుబాట్లకు స్థానంలేని చర్చ పేరు వాదన. ఎదుటివ్యక్తి వాదనలోని సత్యాసత్యాల విచారణకు స్థానముండదు. అతని వాదనను పూర్వపక్షం చేయడమెలాగన్నదే ప్రధానాంశం” వివరించాడు జనార్దనమూర్తి.
వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది.
“సౌమ్యా, సాకేత్! తేలిగ్గా తీసుకోండి. అన్నయ్య మరీ లాల్ బహద్దూర్ అకాడెమీలో ఐ.ఎఫ్.ఎస్. ట్రైనీనికి బోధించే స్థాయిలో క్లాసు తీసుకున్నాడు” అన్నాడు రాజీవ్ వాతావరణాన్ని తేలికపరిచే ఉద్దేశంతో.
“దినాం ఈ నమూన నడిపియ్యాన్నంటె సంసారాన్ని ఎల్లదీసినట్టే” తన గ్రామీణ యాసలో అన్నాడు సమ్మయ్య. ఫక్కున నవ్వారందరూ.
అందరూ సూప్ తాగడమైపోయింది. “తినుబండారాలు రావడానికెంత సమయం పడుతుంది” అడిగాడు జనార్దనమూర్తి.
“మనం చాలా డిటెయిల్డ్ ఆర్డరిచ్చాం. రావడానికి గంటైనా పడుతుంది” జవాబిచ్చాడు రమణ.
“మా అయ్యనోపారి ఇసొంటి హోటల్కే తీస్కచ్చిన. ‘వారీ నీకు దండం పెడగని నన్నిసొంటి హోటల్కు మల్లోపారి తోల్కరాకు. సద్దిగట్టుకచ్చుకోని తింటె మల్ల ఆకలయ్యెటాల్లకు అన్నందెస్తడు. ఛీ వీనింట్ల పీనుగెల్ల! ఇదేం హోటల్ర’ అన్నడు” నవ్వుకుంటూ చెప్పాడు సమ్మయ్య. మళ్ళీ నవ్వారంతా.
“మీరంతా వింటానంటే సమయం గడవడానిగ్గాను ఓ కథ చెప్తాను. సరేనా!” అడిగాడు జనార్దనమూర్తి.
“సరే!” అందరూ అరిచారు సంతోషంగా.
“భేతాళ కథ కాదు గదా! చివర ప్రశ్నలడగవు కదా!” భయాన్ని నటిస్తూ అడిగాడు సంజయ్.
“నీకా భయమేమీ అక్కర్లేదు ఈశానా! కాకపోతే వేడివేడిగా మళ్ళీ ఓ రౌండు సూప్‍లను సర్వ్ చేయించండి చాలు” చెప్పాడు. జనార్దనమూర్తి.
రమణ ఆర్డర్ కౌంటరు దగ్గరకు వెళ్ళి మెనూ మార్పించి వచ్చాడు. మరో ఐదు నిమిషాల్లో వేడి వేడి సూప్ కొత్తగా వచ్చింది. అందరూ సూప్ చప్పరిస్తుండగా “కథారంభ కాలం 1950 ప్రాంతం. మీక్కాస్త విసుగ్గా వుండొచ్చు” సంశయిస్తూ అన్నాడు జనార్దనమూర్తి.
“విసుగ్గా ఉండే విషయాన్ని వినదగ్గదిగా మార్చడం నీకు వెన్నతో పెట్టిన విద్య కదన్నయ్యా!” వెంటనే జవాబిచ్చాడు సంజయ్. ఒక్కసారిగా నవ్వారందరూ. కథ మొదలెట్టాడు జనార్దనమూర్తి.
(ఇంకా ఉంది)