వ్యామోహం-11

0
1

[శ్రీ వరిగొండ కాంతారావు రచించిన ‘వ్యామోహం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[డాక్టర్సాబ్ ఇంటి భూమి పూజకి ముహూర్తం నిశ్చయమవుతుంది. డాక్టరు గారి అత్తగారు, బావమరిది వస్తారు. డాక్టర్సాబ్ దంపతులతో పురోహితుడు వారణాసి మహదేవయ్య పూజ చేయిస్తాడు. పట్వారి నర్సింగరావు దంపతులు, పోలీసు పటేల్ బాల్రెడ్డి, సర్పంచు రాజిరెడ్డి, మాలిపటేల్ నర్సిరెడ్డి, షావుకారు అల్లెంకి శంకరయ్య, హెడ్మాస్టరు అనంతుల నరహరి, సారెదార్ రఘునాథరావు ఇలా ఒకరేమిటి ఊర్లో సగమ్మంది ఆడామగా అక్కడే వుంటారు. అందరూ కాసేపు ఆ ఇంటి స్థలం గురించి మాట్లాడుకుంటారు. ముహూర్త సమయం కావడంతో పంతులుగారి సూచన మేరకు డాక్టర్సబ్ గడ్దపారతో భూమి మీద నాలుగుసార్లు పొడుస్తాడు. తాపి మేస్త్రి మైసయ్య పనివాళ్ళతో సహకారంతో ముగ్గు పోస్తాడు. నర్సింగరావు  కులకర్ణి టేకు చెక్కలకి ఏర్పాటు చేయిస్తే, బాల్రెడ్డి పటేల్ ఇటుకల ఖర్చు మొత్తం తాను పెట్తుకుంటాడు. డంగు ముత్తిలింగం సున్నం ఏర్పాటు చేస్తానంటాడు. ఇంటి నిర్మాణం మొదలవుతుంది. పన్నెండు గుమ్మాలు, ఎనిమిది కిటికీల ఇల్లది. గోడలు నాలుగడుగుల ఎత్తుకు లేచాక, బావిలో నీళ్ళయిపోతాయి. వర్షాలు మడి మళ్ళీ బావిలో నీరు చేరేదాకా ఇంటి నిర్మాణం వాయిదా పడుతుంది. ఒకరోజు మంచినీళ్ళు తెచ్చుకోడానికి బావి దగ్గరకి వెళ్తుంది డాక్టరమ్మ. నీళ్ళు తోడుకొని కూజా బిందెని చంకనెత్తుకోవడంలో డాక్టరమ్మ ఆయాసపడితే, నీళ్ళు తోడుకోవడాని కొచ్చిన మహదేవయ్యగారి భార్య మహాలక్ష్మమ్మ సాయం చేస్తుంది. డాక్టరమ్మ వాలకం చూసి, మళ్ళీ ఏమన్నా విశేషమా అని అడుగుతుంది. అవునని చెప్పి, మూడో నెల వచ్చిందని అంటుంది డాక్టరమ్మ. మరో వారం తరువాత మంచినీళ్ళు తెచ్చి బిందె కిందకి దింపుతున్న సమయంలో బిందె జారిపోతే, దాన్ని ఆపే ప్రయత్నంలో డాక్టరమ్మ పట్టుదప్పి పడిపోతుంది. ఆ సమయంలో డాక్టర్సాబ్ ఇంట్లోనే ఉండడంతో, పరీక్ష చేసి మందులిస్తాడు. వంట చేసి పిల్లలకు అన్నాలు పెడతాడు. సాయంత్రానికి పొత్తికడుపులో నొప్పి రావడంతో భార్యకి ఇంజెక్షన్ ఇచ్చి కాసేపు పడుకోమంటాడు డాక్టర్సాబ్. మర్నాడుదయం హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి భార్యని తీసుకొస్తాడు. ఆమెకి సహాయంగా ఉండటానికి అమృత కూడా వస్తుంది. అక్కడ పరీక్ష చేసిన లేడీ డాక్టర్ – గర్భసంచికి దెబ్బ తగిలిందనీ. కానీ పిండం దెబ్బ తినలేదనీ, ఇప్పట్నించి పురుడయ్యేవరకు ఆమె ఏ పనులూ చెయ్యకూడదనీ, పిల్లల్ని కూడ ఎత్తుకోకూడదని చెప్తుంది. ఇక్కడే ఉండే ఏర్పాట్లు చేసుకోమంటుంది. కాసేపు ఆలోచించాకా, వరంగల్లు లోనే ఉంటున్న తన సహధ్యాయి కృష్ణమాచార్యులు గుర్తొస్తాడు. పైగా కృష్ణమాచార్యులు భార్య అన్నపూర్ణ కూడా డాక్టరమ్మ (సుందరి) స్నేహితురాలే. రిక్షా చేయించుకుని వాళ్ళింటికి వెళ్తారు. జరిగిన విషయమంతా చెబితే, ఇక్కడే ఇల్లు చూద్దాం అంటాడాయన. అమృతని దింపటానికి ఖాజీపేట వెళ్ళి రైలెక్కితే, తమ ఊరి వాళ్ళయిన అల్లెంకి శంకరయ్య కుటుంబసభ్యులు కనబడతారు. విషయం తెలుసుకున్న వాళ్ళు అమృతని తాము దింపుతామని, డాక్టర్సాబ్‍ని ఇక్కడ పనులు చూసుకోమని చెప్తారు. కృష్ణమాచార్యులు ఒక ఇల్లు చూసి పెడతాడు. ఆ ఇంటి యజమాని అల్లెంకి శంకరయ్య షడ్డకుడు కావటంతో – ముందు చెప్పిన షరతులని కాదని ఇల్లు అద్దెకి ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఇంటికి తిరిగి వచ్చి – బాడుగకి ఇల్లు దొరికిన సంగతి చెప్తారు. అన్నాలు తింటారు. కాసేపు విశ్రమంచమంటుంది అన్నపూర్ణ. ఇక చదవండి.]

[dropcap]“లే[/dropcap]దు. నేను బయల్దేరుతాను. రేపీపాటికల్లా మా అత్తగార్ని తీసుకురావాలి. జోడెడ్లపాలానికి త్వరగా వెళ్ళాలి. లేకుంటే డాక్టరు సాబేమయినాడో అని ఊరివాళ్ళందోళన పడతారు.”

“బస్సులుంటాయా ఇప్పుడు” అడిగాడు కృష్ణమాచారి.

“పసరాకు ప్రతి రెండు గంటలకొక బస్సుంది. ఏటూరునాగారానికి ప్రతి మూడు గంటలకో బస్సుంటుంది. పసరా బస్సును లోకల్ అంటారు.”

“సరేలే! నా ఆసుపత్రి వంటశాలను చూడు” అంటూ డాక్టరుగారిని వెంటబెట్టుకొని పెరటి గుమ్మాన్నుండి బయటకు దారి తీశాడు కృష్ణమాచారి.

మరీ విశాలమైంది కాకున్నా పెరడు పెద్దదే. పెద్ద రేకుల షెడ్డు. పక్కనే ఒక పెంకుటింటి గది తాళం వేసి వుంది. పెద్దపొయ్యి. రాగి డేగిసా, గిన్నెలు, కల్వాలు, రోళ్ళు, రోకళ్ళు, రుబ్బురోళ్ళు, ఆ పక్కనే కట్టెలమోపులు. గది తాళం తెరిచాడు. లోపల గరిటెలు, చెంచాలు, తూనికలు, త్రాసులు, కొలతపాత్రలు, గాజు కుప్పెలు ఇలా చాలా సరంజామా వుంది.

“ఏమిటి చిన్నసైజు మందుల తయారీ కంపెనీని స్థాపించినట్టున్నావు” ఆశ్చర్యపోతూ అడిగాడు డాక్టరుగారు.

“నా రోగులకు కావలసిన మందులు నేనే తయారు చేసి ఇస్తాను. మూలికలు, దినుసులు తెప్పించుకొంటాను. మొదట్లో నేనే వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఉత్తరం రాస్తే చాలు వస్తాయి. మరీ తొందరగా కావలసి వస్తే తంతి పంపుతాను. లేదా పి.సి.ఒ. నుండి ట్రంక్ కాల్ మాట్లాడ్తాను” వివరించాడు కృష్ణమాచారి.

“ఖర్చుతో కూడుకొన్నది. శ్రమతో కూడుకొన్నది. రోగులు నీ శ్రమను గుర్తిస్తున్నారా!”

“గుర్తిస్తున్నారు. గుర్తింపుకు తగినట్లుగా డబ్బులు కూడా చెల్లిస్తున్నారు. ‘ముల్లోకాలు తిరిగినా నా రోగం నయం కాలేదు. ఇంకేదిరా దారి భగవంతుడా!’ అని బాధపడే వాళ్ళను ఆ దేముడే నా దగ్గరకు పంపిస్తున్నాడనుకొంటున్నాను. లోకాలకు అమృతాన్ని ప్రసాదించిన ఆ ధన్వంతరి అనుగ్రహంతో నా హస్తవాసి మంచిదన్న ప్రచారం కూడ బాగ జరిగిపోయింది” ఆనందాన్ని మిత్రుడితో పంచుకొన్నాడు కృష్ణమాచారి.

మిత్రుడి విజయాన్ని మనస్ఫూర్తిగా అభినందించాడు డాక్టరు గారు. ఇద్దరూ లోనికొచ్చారు.

“రంగాచారి అని అన్నపూర్ణ పిన్ని కొడుకు. తండ్రిలేడు. పదిహేడేళ్ళు. మనకి చేదోడు వాదోడుగా వుంటాడు. తనకీ భవిష్యత్తులో ఓ వృత్తి ఏర్పడుతుంది అన్న ఉద్దేశ్యంతో చేరదీశాను. నేను ఆసుపత్రికి నాగాలు పెట్టిన రోజున రోగులని సాయంత్రం రమ్మని పొద్దున్న రమ్మని చెప్తూంటాడన్న మాట. మందులు వండడంలోనూ సాయం చేస్తాడు. ఇక్కడే పక్కవీధిలో వాళ్ళమ్మతో పాటు వుంటాడు” తన వృత్తికి సంబంధించిన మరిన్ని వివరాలను చెప్పాడు కృష్ణమూర్తి.

ఇంట్లో కొస్తున్న ఇద్దర్నీ చూస్తూ “అన్నయ్య గారూ! మీ ఇంట్లోనూ ఈ కర్మాగారముందా! ఆయన మందులు వండిన రోజు నాకు నరకయాతన అనుకోండి. ఆ వాసన, ఘాటు భరించలేక చచ్చిపోతున్నా. సుందరి ఎలా భరిస్తోందో!” అంది అన్నపూర్ణ డాక్టరమ్మ వంక సాభిప్రాయంగా చూస్తూ.

“మా ఇంట్లో ఇవేవీ లేవమ్మ! నేను హోమియో డాక్టర్ని ఆయుర్వేదం వాడాల్సి వస్తే మందులు రాసిస్తాను. రోగులు వాళ్ళే తెచ్చుకుంటారు” చెప్పాడు డాక్టరు గారు.

“మీ ఇద్దరూ కలిసే కదా వైద్యం చదువుకున్నారు. ఒకళ్ళు ఆయుర్వేదమెట్లా ఇంకొకళ్ళు హోమియోపతి ఎలా?” అనుమానపడుతూ అడిగింది అన్నపూర్ణ.

అన్నపూర్ణ వంక మెచ్చుకోలుగా చూసింది డాక్టరమ్మ. ఆవిడకలాంటి ఆలోచనలు రావు మరి.

“భలే ప్రశ్న వేశావమ్మా! మేము నిజంగానే సహాధ్యాయులమా లేక మిమ్మల్నొప్పించడానికిలా నటిస్తున్నామా! అనే కదా నీ అనుమానం” సూటిగా అడిగాడు డాక్టరు గారు.

“చెరో వైద్యం చదువుకున్న వాళ్ళు క్లాసుమేట్లమని చెప్తే ఎవరికైనా అనుమానం వస్తుంది. నేనడుగుతున్నాను. సుందరి అడగట్లేదు అంతే తేడా!” తన మాట మీద దృఢంగా నిలబడింది అన్నపూర్ణ.

“అవునవును” వంత పాడింది డాక్టరమ్మ.

“సరే చెప్తా వినండి. మీరు నమ్మినా నమ్మకపోయినా మేము కలిసి చదువుకున్న వాళ్ళమే. గ్రామీణుల ఆరోగ్యావసరాలను దృష్టిలో పెట్టుకొని, గ్రామాల ఆరోగ్య ప్రమాణాలను పెంచేందుకుగాను భారత ప్రభుత్వం ఆరోగ్య కార్యకర్తలను తయారు చేసేందుకు నిశ్చయించి ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. అది ఆరునెలల కోర్సు. స్కూలు ఫైనలు వరకు చదువుకుంటే చాలు. వైద్యరంగం పట్ల అభిరుచి వున్నవాళ్ళందర్నీ దరఖాస్తు చేసికొమ్మన్నారు. అలా వచ్చిన వాళ్ళలో ఓ యాభై మందిని ఎంపిక చేశారు. ఆ యాభైమందిలో మేమిరువురము వున్నామన్నమాట.

కోర్సు సిలబసు ప్రకారం మాకు ప్రథమ చికిత్సా విధానాన్ని, రోగ నిదానాన్ని నేర్పించారు. ఇంజెక్షన్లనివ్వడం నేర్పించారు. దగ్గు, జలుబు, జ్వరము ఇత్యాది చిన్న చిన్న అనారోగ్యాలకు మందులెలా వాడాలో నేర్పించారు. ఇది కాక ఆరోగ్యాన్నెలా కాపాడుకోవాలి, అనారోగ్యాలనెలా నివారించాలి అన్న అంశాలు కూడా నేర్పించారు” మంచినీళ్ళ కోసం చేయిజాస్తూ చెప్పడం ఆపాడు డాక్టరు గారు. డాక్టరమ్మ మంచినీళ్ళనందించింది.

ఈలోగా విషయాన్ని కృష్ణమాచారి అందుకున్నాడు. “శిక్షణా తరగతులను ఏలూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా బావా, నేనూ గది అద్దెకు తీసుకుని కలిసి వున్నాం. ఒండుకు తిన్నాం. దుర్ముఖి నామ సంవత్సర దసరా నుంచి హేవళంబి ఉగాది వరకు క్లాసులు జరిగాయి. ఉగాదికి మేం ఇళ్ళకు వెళ్ళలేదు. నేను దినుసులు తెచ్చాను. బావ ఉగాదికి పచ్చడి చేశాడు”.

“ఓహో మీ వంటల్లో ప్రావీణ్యానికి కారణమిదన్నమాట” వెక్కిరించింది డాక్టరమ్మ. గట్టిగా నవ్వింది అన్నపూర్ణ.

పట్టించుకోకుండా చెప్తూ పోయాడు కృష్ణమాచారి. “చివరగా పరీక్షలు పెట్టారు. యాభయమందికి గాను ముప్ఫైమందిమి పరీక్షల్లో ఉత్తీర్ణులమైనాము. ఉత్తీర్ణులైన వారికి ‘విలేజి వైద్య’ అన్న ప్రమాణ పత్రాన్ని బహూకరించారు. ఈ ప్రమాణ పత్రం ఆధారంగానే మాకు గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేసే అధికారం లభించింది” వివరణ ముగించాడు కృష్ణమాచారి.

“మా చెల్లాయి ప్రశ్న ఇంకా మిగిలే వుంది” అంటూ మరింత సమాచారాన్నిందించాడు డాక్టరు గారు.

“మాకు తరగతులు తీసుకున్న వాళ్ళల్లో అనంతాచార్లు, శతానందశర్మ అన్న ఇద్దరు మహనీయులుండేవాళ్ళు. వాళ్ళు మాకు వైద్య రంగం పుట్టు పూర్వోత్తరాలను విశదీకరించి చెప్పేవారు. అనంతాచార్లు ఆయుర్వేదంలో దిట్ట. శతానందశర్మ హోమియోవైద్యాన్ని ఆపోశన పట్టిన మహానుభావుడు. వారిరువురూ మాకు వైద్యరంగంపట్ల అపారమైన ఆసక్తిని కలుగజేశారు. బావ ఆయుర్వేదం పట్ల ఆసక్తిని పెంచుకొంటే, నేను హోమియోపతి పట్ల ఇష్టాన్ని పెంచుకొన్నాను. కాని మా అందరకూ అన్ని రకాల వైద్యాలకు సంబంధించిన మూలసూత్రాలు తెలుసు. వారంతగా బోధించినా, కేవలం ఐదుగురమ్మాత్రం వైద్యుల స్థాయికెదిగాం. మిగతా పాతికమంది క్షేత్ర స్థాయి కార్యకర్తలుగానే మిగిలిపోయారు.

“మేము సాధారణ వైద్యులుగా నన్నా గ్రామ ప్రజలకు సేవ చేయాలన్న ఆశయంతో మాకీ విద్యను ప్రసాదించారా ఇద్దరు భిషగ్వరేణ్యులు. కాని మేమిప్పుడు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు చేతులెత్తేసిన రోగులకు ప్రాణదానం చేస్తున్నాం. ఇదే మేము అనంతాచార్లవారికి, శతానందశర్మగారికి ఇచ్చిన, ఇస్తున్న గురుదక్షిణ. వారిరువురూ ఇప్పుడు లేరు. వారేలోకాల్లో వున్నా మమ్మల్నశీర్వదిస్తూనే వుంటారు. అన్ని రకాల ప్రభుత్వ పథకాల వలెనే ‘విలేజి వైద్య’ విద్యాపథకం కూడ అటకెక్కింది.”

“మీ చదువుల వెనకాల ఇంతటి కథాకమామీషు వున్నాయన్నమాట” ఆశ్చర్యపోయారు ఆడవాళ్ళిద్దరూ.

అన్నపూర్ణ పెట్టిచ్చిన టీ త్రాగి హనుమకొండ బస్టాండుకు బయల్దేరాడు డాక్టరు గారు.

***

డాక్టరు గారు మందులకుంటలో బస్సు దిగేటప్పటికి రాత్రి ఎనిమిది గంటలు కావస్తోంది. బస్టాండులో కాకుండా తరువాత వచ్చే రిక్వెస్టు స్టాపులో దిగాడు. తన బావమరిది ఇంటికది దగ్గరవుతుంది. వరంగల్లు వంటి చోట కరెంటు వున్నా పల్లెటూళ్ళలో ఇంకా కరంటంటే ఏమిటో తెలియని పరిస్థితి. వెన్నెల రాత్రి అందులోనూ పరిచితమైన దారే కాబట్టి గబగబా నడుస్తున్నారు డాక్టరు గారు.

గొళ్ళెం చప్పుడైంది. ‘ఇంత రాత్రి ఎవరొచ్చారబ్బా’ అనుకొంటూ తలుపు తీసిన సత్యమూర్తి “ఎవరండీ! ఎవరు కావాలి?” అడిగాడు చీకట్లో మనిషిని పోల్చుకోలేక. సత్యమూర్తి అడిగేలోపలే వెనుక నుండి లాంతరు పట్టుకొచ్చింది అతని తల్లి మంగమ్మ గారు. దీపం వెలుగులో బావగార్ని చూచి ఆశ్చర్యపడ్డాడు సత్యమూర్తి. వెంటనే తమాయించుకొని “రండి బావా రండి” అంటూ తలుపుకడ్డు తొలగి దారినిచ్చాడు అక్కయ్యా పిల్లల కోసం బయటికి తొంగి చూస్తూ.

“ఒక్కణ్ణే ఒచ్చాను సత్యమూర్తీ!” అంటూ లోనికి నడిచాడు డాక్టరు గారు.

“అంతా కులాసాయేగా అల్లుడు గారూ!” అడిగింది మంగమ్మ మంచినీళ్ళనందిస్తూ. ఈ లోగా పడక్కుర్చీ వేసి ముందుకు జరిపి బావగారిని కూర్చోమన్నాడు సత్యమూర్తి.

“ఆఁ అంతా కులాసాయే!” సమాధానమిచ్చాడు డాక్టరు గారు. ఎప్పుడైనా వరంగల్లుకి పనిమీద వచ్చినప్పుడు గాలి మళ్ళితే ఓసారి మందులకుంట వరకు వచ్చి వెళుతుంటాడు డాక్టరుగారు. అంచేత డాక్టరు గారి రాకను వారు విశేషంగా స్వీకరించలేదు. “స్నానం చేస్తావా బావా!” అడిగాడు సత్యమూర్తి కట్టుకోవడానికి లుంగీనందిస్తూ.

“ఆఁ చేస్తాను. బస్సులో విపరీతంగా దుమ్మూ, ధూళీను” అంటూ లేచాడు డాక్టరు గారు.

పెరట్లో తొట్టెలోని నీళ్ళను బక్కెట్టులోకి తొలిపి పెట్టాడు. లోపల్నించి లైఫ్‌బోయ్ సబ్బుని తెచ్చిచ్చాడు. వెలుగుకోసం రెండో లాంతర్ని గుమ్మంలో వుంచి, పక్కనే వున్న మల్లెపందిరి గుంజ మీద తువ్వాలు పెట్టాడు. “అవసరమైతే పిలువు బావా!” అంటూ లోనికడుగేశాడు సత్యమూర్తి.

“ఆఁ అవసరమే. వీపు రుద్దుతావా!” వేళాకోళమాడాడు బావమరిదిని డాక్టరు గారు.

“అట్లాంటి అవసరాలు తీర్చబడవు” అంటూ లోపలికెళ్ళిపోయాడు సత్యమూర్తి.

సత్యమూర్తి మందులకుంట మిడిల్ స్కూల్ హెడ్మాస్టరు. ఆపాటి కల్లా తల్లీ కొడుకుల భోజనాలయిపోతాయి సాధారణంగా. ఇవ్వాళ స్కూలుకు సంబంధించిన రిజిష్టర్లను ఇంటికి తెచ్చుకొన్నాడు. అవన్నీ సరిచూచుకొనేసరికి ఈవేళయింది. ఎల్లుండి జిల్లా విద్యాశాఖాధికారి పాఠశాల తనిఖీకి వస్తున్నట్లుగా కబురందింది. అందుకే ఈ ముందస్తు జాగర్త అన్నమాట.

బొగ్గుల కుంపటి రాజేసి అల్లుడికోసం అత్తెసరు పడేసింది మంగమ్మగారు.

స్నానం చేసి తుండు చుట్టుకొని వంటింట్లో దేముడి సింహాసనం ముందు కూర్చుని బొట్టెట్టుకుని ఓరెణ్ణిమిషాలు దణ్ణం పెట్టుకొని బయటకు వచ్చాడు డాక్టరు గారు. ఈ లోగా ఇత్తడి చెంబు, బక్కెట్టు, సబ్బు, లాంతరు లోనికి తెచ్చి దొడ్డి తలుపు గడియవేశాడు. సత్యమూర్తి.

సత్యమూర్తి బావగారికి కొత్తలుంగీ ఇచ్చాడు. కట్టుకొని తన బ్యాగులోంచి బనీను తీసుకొని వేసుకొన్నాడు డాక్టరు గారు. పడక్కుర్చీలో కూర్చుంటూ అడిగారు “ఇంకా మీ భోజనాలు కాలేదా!”

“లేదు బావా! ఎల్లుండి స్కూల్ ఇన్స్పెక్షనుంది. డి.ఇ.ఒ. గారొస్తున్నారు. అందుకే స్కూలు రిజిష్టర్లు ఇంటికి తెచ్చుకున్నా. ఏమన్నా లోపాలుంటే సరిదిద్దుకోవచ్చు కదాని” జవాబిచ్చాడు సత్యమూర్తి.

“ఎండాకాలం సెలవులు దగ్గరపడుతున్నట్టున్నాయి. ఈసారి ప్రణాళికలేంటి?”

“ప్రణాళికంటూ ఏమీ లేదు బావా! అమ్మ మొదట్లో అన్నయ్య దగ్గరికని ఆదిలాబాదు వెళదామనుకొంది. వదిన పోయిన సెలవుల్లో ఎక్కడికీ వెళ్ళలేదట. అందుకని పుట్టింటికెళుతోంది. అన్నయ్య వుంటున్నాడు కానీ, అమ్మకి అక్కడ ఎవరూ పరిచయం లేరు. అక్కడి వాళ్ళు మాట్లాడే మరాఠి తెలుగు అమ్మకి అర్థం కాదు. అందుకని విరమించుకొంది.”

“మరిక్కడే వుంటారా!”

“లేదు బావా! మందులకుంటలో మామూలు రోజుల్లోనే నీటికి కటకట. ఇక్కడ ఈ ఇంట్లో పరవాలేదు. అట్లూరి వెంకట సుబ్బయ్య గారని ఇంటి యజమాని. వాళ్ళది పెద్ద వ్యవసాయం. వాళ్ళ పనివాళ్ళే మనక్కూడా నీళ్ళ తొట్లను నింపి పెడతాడరు. పదేసి బిందెల నీళ్ళు పట్టే రెండు గోలాలను కూడ వాళ్ళే ఇచ్చారు. మంచినీళ్ళు మాత్రం అమ్మ బావి వద్దకు వెళ్ళి తోడుకొస్తుంది. నీళ్ళెక్కడో పాతాళంలో వుంటాయి. వీలైన రోజుల్లో నేనే మడిగట్టుకొని రెండు బిందెల నీళ్ళు తోడుకొస్తాను. అదైనా రెండు ఫర్లాంగుల దూరం వెళ్ళాల్సిందే” చెప్పాడు సత్యమూర్తి.

ఈలోగా ఇద్దరికీ పీటలు వేసి కంచాలలో భోజనాలు వడ్డించింది మంగమ్మగారు. “లేవండి భోంచేస్తూ మాట్లాడుకోవచ్చు” అంది అల్లుడితో.

“మరి మీరు” అడిగారు డాక్టరు గారు.

“నేను తర్వాత చేస్తాను. మీరు కానివ్వండి” అంది మంగమ్మగారు.

అతిథులు వచ్చినప్పుడు ఇంటి ఆడవాళ్ళు తరువాత విడిగా భోంచేయడం ఆ రోజుల్లోని సంప్రదాయం. అల్లుడు గారితో అత్తగారు కలసి భోంచేయడం మరీ తప్పు. డాక్టరు గారికీ పట్టింపు వుండదు గాని, మంగమ్మ గారు మాత్రం తన ఆచారాన్ని విడచిపెట్టడానికి ససేమిరా ఒప్పుకోదు.

డాక్టరు గారి పెళ్ళినాటికే మామగారు లేరు. బొట్టూ గాజులు సరేసరి. ఆవిడ శిరోముండనం కూడా క్రమం తప్పకుండా చేయించుకొంటుంది. అంచుల్లేని మల్లు పంచెను చీరెగా కట్టుకొంటుంది. ఆ చీర కట్టు కూడ విశేషంగా వుంటుంది. చీరను గోచి పోసి కట్టుకోవడమే గాక తలపైన టోపిలాంటి ముసుగు వచ్చేలా కట్టుకొంటుంది. ఆవిడ రవిక ధరించదు కాని ఆ స్పృహ ఆవిడను చూచిన ఎవరికీ కలిగేది కాదు. ఆవిడ ఏ ఋషి ఆశ్రమంలోనో వుండే స్త్రీ వలె వుంటుంది. జనావాసాల్లో వుండే పడతి వలె కనిపించదు.

“బచ్చలికూరపప్పు, గోంగూరు పచ్చడి, చింతకాయ మిరప్పళ్ళ పచ్చడి” వడ్డనను పరిచయం చేస్తూ చెప్పింది మంగమ్మ గారు. “ములక్కాళ్ళచారు కూడా వుంది. గడ్డ పెరుగెలాగూ వుంటుంది కదా! రాత్రి పూట కాబట్టి కాసిని నీళ్ళు పోసుకోవాల్సి వస్తుంది.” ఈ కాసేపట్లోనే గుమ్మడి వడియాలను కూడ వేయించి వడ్డించిందావిడ.

“సెలవులకు జంగారెడ్డి గూడెం వెళ్ళొద్దామనుకుంటున్నాను. మేమెవరమూ లేకపోయినా ఇల్లంటూ వుంది కదా! అద్దెకున్న వాళ్ళు ఎంతైనా సొంత ఇంటిలా చూచుకోరు కదా! అద్దెకున్నారన్న పేరే కాని ఎన్నడూ ఎర్రని ఏగాణిని అద్దెగా ఇచ్చిన పాపాన పోలేదు వాళ్ళు. ఈ మరమ్మత్తు చేయించాం, ఆ మరమ్మత్తు చేయించాం అంటూ ఎక్కడికక్కడ లెక్క అప్పచెప్తారు. మా మరిది ఊళ్ళోనే వుంటాడు. ఇల్లును నేనే కాపాడుతున్నానంటాడు. కాపాడుతున్న దాఖలాలు మాత్రం ఏమీ లేవు. అయినా ఏమీ అనడానికి లేదు. వెళ్ళక వెళ్ళక వెళ్ళినప్పుడు ఉండాల్సింది వాళ్ళింట్లోనే కదా! ఓసారి ఇల్లు చూచి రావాలని తపన” తన సొదను వెళ్ళబోసుకుంది ముసలావిడ.

“వెళ్ళిరండి. అయినా అది మామయ్య గారు కట్టిచ్చిన ఇల్లు కదా. చూసొస్తే అదొక సంతృప్తి” నవ్వుతూ అన్నాడు డాక్టరు గారు.

“అది మీ మామగారు కట్టిచ్చిన ఇల్లేమీ కాదు. మా మామగారు కట్టిచ్చిన ఇల్లు. ముగ్గురు కొడుకులకూ మూడిళ్ళు కట్టిచ్చాడు పెద్దాయన. మా మామగారిచ్చిన పొలాలు, పుట్రలు మిగతా ఇద్దరూ బాగానే వృద్ధి చేసుకున్నారు. మీ మామగారే దానాలు ధర్మాలు అంటూ సంపాదించిదంతా తగలేశారు. అవడానికి పెద్ద ఉద్యోగమే. బియ్యపు మిల్లుల మీద ఇన్స్పెక్టరు. బెజవాడ నుండి వాల్తేరు దాకా ఉన్న మిల్లులన్నింటిని తనిఖీ చేసేవారు.

ఇదిగో మీ బావమరిది. వీడి మూడో ఏట. వీపులో ఏదో వ్రణం లేచింది. రాచపుండు అన్నారు. ఎన్నెన్ని చోట్లకి తిరిగామో తెలీదు. రాచపుండుకు మందులేదన్నారు. పుణ్య పురుషుడు. ఆయన దారి ఆయన చూచుకొన్నారు.” కళ్ళల్లో నీళ్ళు నిండుకొస్తుంటే డగ్గుత్తికతో ఆగిపోయింది ముసలావిడ.

“అయయ్యో! అనవసరంగా పాత విషయాలు గుర్తు చేశానే” బాధపడ్డాడు డాక్టరు గారు.

“పరవాలేదు బావా! ఆవిడ మరచిపోతే కదా నువు గుర్తుచేయడానికి. వారానికోసారన్నా గుర్తుచేసుకొని కళ్ళనీళ్ళెట్టుకుంటుంది” అనునయించాడు సత్యమూర్తి.

మగవాళ్ళ భోజనాలయినయి. మంగమ్మ గారు భోజనానికి కూర్చుంది. “మనుమలెలావున్నారు” ప్రస్తావనగా అడిగింది. “అంతా బానే వున్నారు. పెద్దాడికి ఐదో క్లాసు అయిపోతుంది. ఆరో తరగతిలో కొస్తాడు. రెండో వాడు రెండో తరగతికొస్తాడు. చిన్న మనుమలు బానే ఆడుకొంటున్నారు. మీ అమ్మాయి మళ్ళీ నీళ్ళోసుకుంది. మూడు వెళ్ళి నాలుగు” విషయం చెప్పాడు డాక్టరు గారు.

“అలాగా!” నిర్ఘాంతపోయింది మంగమ్మ. ఆడదాని కష్టం ఆడదానికే తెలుస్తుంది. వెంటనే తమాయించుకొని “సంతోషం, తేలిగ్గానే వుంది కదా!” అడిగింది.

“బావా శుభాకాంక్షలు” షేక్ హ్యాండిచ్చాడు సత్యమూర్తి.

“ధన్యవాదాలు” బదులు చెప్పాడు డాక్టరు గారు.

“నేను జంగారెడ్డి గూడెం వెళ్ళడంలోని అంతరార్థం కూడా ఇదే. పెళ్ళయి పదేళ్ళయినా కోడలి కడుపు పండలేదు. అక్కడ మద్ది ఆంజనేయస్వామి గుళ్ళోకి ఓ స్వాములారొచ్చార్ట. విభూతి ఇచ్చి మంత్రం చెప్తారు. మంత్ర జపం చేస్తూ ఆయన చెప్పినన్ని మంగళవారాలు పళ్ళు మాత్రమే తింటూ ఉపవాసం చేస్తే చాలుట. ఆ వారాలయిపోయిన మరుసటి నెల నెల తప్పడం ఖాయమంటున్నారు. కోడలు పుట్టిల్లు ఏలూరే కదా! ఓసారి గూడేనికి పిల్చుకొని స్వాముల వారికి చూపిద్దామని ఆలోచన” చెప్పింది మంగమ్మగారు.

“అంతేకాదు బావా! అమ్మకి వాళ్ళ పుట్టింటి మీదక్కూడ మనసు మళ్ళింది. చీమలపాడు వెళ్ళి ఓ పదిహేను రోజులుంటానికి నిశ్చయమైంది కూడాను. జంగారెడ్డి గూడానికి, చీమలపాడుకి, ఆదిలాబాదుకి వివరాలతో కూడిన ఉత్తరాలు కూడా వెళ్ళినయి. నిన్ననే పోస్టు చేశాను” చెప్పాడు సత్యమూర్తి.

అప్పటికి మంగమ్మ గారి భోజనం పూర్తయింది. నేల మీద శుద్ధి పెట్టింది. మట్టిల్లే అయినా పేడతో పలుమార్లు అలకడం ద్వారా నేలను గచ్చుగా మార్చేస్తారు. అదొక ప్రత్యేకమైన ప్రక్రియ. గుంటూరు జిల్లా కమ్మవారికది వెన్నతో పెట్టిన విద్య. వీళ్ళద్దెకున్నది కమ్మవారిల్లే.

“ఇల్లు మీరే అలుక్కుంటున్నారా అత్తయ్యా!” అడిగారు డాక్టరు గారు.

“లేదండీ. కాంతమ్మ అని పనిమనిషి పొద్దుటే వస్తుంది. రోజూ ఊడ్చి వెళుతుంది. వారానికి రెండు సార్లు ఇల్లంతా అలుకుతుంది. వంటిల్లు మాత్రం నేనే అలుక్కుంటాను. వీధి వాకిలి రోజూ రెండు పూటలా సానుపు చేస్తుంది. పొద్దుట పేడ నీళ్ళతో అలుకు చల్లుతుంది. సాయంత్రం మామూలు నీళ్ళు చల్లుతుంది.”

“బావా పక్కలు రెడీ. నువ్వీ నవారు మంచమ్మీద పడుకో. నేనూ అమ్మా చెరో మడత మంచమ్మీద పడుకుంటాం” చెప్పాడు సత్యమూర్తి.

“త్వరగా పడుకోండి. తెల్లారగట్లే లేవాలి కదా!” చెప్పింది మంగమ్మ గారు.

“అదేమిటి రేపేమన్నా విశేషమా!”

“అదేం లేదు బావా! పొద్దుటే చెంబట్టుకు వెళ్ళాలి కదా! చీకట్లో అయితే రెండు ఫర్లాంగులు వెళితే చాలు. అదే సూర్యోదయమైతే కనీసం మైలు దూరమైనా నడవాలి” చెప్పాడు సత్యమూర్తి.

“అలా అయితే మైలుదూరమే వెళదాం బామ్మర్ది. వచ్చేప్పుడు కానుగుపుల్ల నోట్లో వేసుకురావచ్చు. కానుగుపుల్లతో పళ్ళు తోముకుని చాలాకాలమయింది. మా వూళ్ళో అన్నీ వేప్పుల్లల్లే” తన నిశ్చయాన్ని తెలుపుతూ ‘రెండ్రోజుల్నుంచీ ఒళ్ళు హూనమైంది.” ముక్తాయింపుగా చెప్పాడు డాక్టరు గారు.

“అదేంటి బావా! నువ్వు ఇంటి నుండి రావడం లేదా!” అడిగాడు సత్యమూర్తి.

డాక్టరమ్మ మంచినీళ్ళ బిందెను వేసుకుపడ్డ దగ్గర నుండి వరంగల్లులో నివాసం నిశ్చయమయేంత వరకు వివరంగా చెప్పుకొచ్చాడు డాక్టరు గారు.

“పరీక్షలు చేయించుకు మందులు తీసుకెళ్ళడమే కదా అని ఒకట్రెండు చీరలు తను తెచ్చుకొంది. మార్చడానికుండాలి గదాని పిల్లల బట్టలు రెండేసి జతల చొప్పున తెచ్చింది. కట్టుబట్టల్తో వచ్చి కదలలేని స్థితిలోకొచ్చిపడ్డాం. ఇప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్లామని వచ్చాను. మీ ప్రయాణాల్లో మీరు చిక్కుకుపోయారు. ఇప్పుడేం చేసేది తోచట్లేదు” నిట్టూర్పు విడిచాడు డాక్టరు గారు.

రెండు నిమిషాల నిశ్శబ్దం తర్వాత “అమ్మ ప్రయాణాలు ఇప్పట్లో కాదు కదా! ఇంకా ఇరవై రోజుల వరకు బడే వుంది. అదంతా బడి అయిపోయాక సంగతి. ఒంటిపూట బళ్ళే కాబట్టి నేనేదోలాగు సర్దుకోగలను. రేపు మధ్యాహ్నాన్నుండి అమ్మను తీసుకు బయల్దేరండి. ఏమంటావమ్మా!” అంటూ అమ్మ అనుమతి కోసం అడిగాడు సత్యమూర్తి.

“దీనిలో అనడానికేముందిరా! అలాగే కానీ. మధ్యలో కోడలి కోసం జంగారెడ్డి గూడెం మాత్రం తప్పని సరిగా వెళ్ళాలి.. చీమలపాడంటావా! బతికి బాగుంటే వచ్చే వేసవికి చూద్దాం” పుట్టింటికి వెళ్ళడం కుదర్దన్న విషయం ఆవిడను బాధించింది మరి.

సమస్యకు పరిష్కారం లభించడంతో అంతా నిద్రకుపక్రమించారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here