వ్యామోహం-15

0
1

[శ్రీ వరిగొండ కాంతారావు రచించిన ‘వ్యామోహం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[భారీ వర్షం కారణంగా కాసేపు ఆగుదామని వీరలక్ష్మి ఇంటికి వెళ్ళిన డాక్టర్సాబ్ ఆ రాత్రికి అక్కడ చిక్కుకుపోతాడు. అనుకోకుండా ఆ రాత్రి వారిద్దరూ ఏకమవుతారు. కోడికూతకి లేచిన డాక్టర్సాబ్ జరిగినదానికి సిగ్గుపడి, గబగబా ఇంటికి వెళ్ళిపోతాడు. పొద్దున్న ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు తన తప్పుకి మళ్ళీ చింతిస్తాడు. మూడు  నాలుగు రోజులు భార్యాపిల్లల్తో కాలక్షేపం చేసి వస్తే కానీ, ఆ ఆలోచనలు మనసులోంచి తొలగవని గ్రహించి ఊరెళ్ళి వస్తాడు. ఐదు రోజున జోడెడ్లపాలానికి చేరుకొని తన పనుల్లో మునుగుతాడు. మర్నాడు మధ్యాహ్నం వీరలక్ష్మి వచ్చి తలుపు కొడుతుంది. తనతో సంబంధం కొనసాగించాలని ఒత్తిడి చేస్తుంది, లేదంటే ప్రతి రోజూ రాత్రి వచ్చి డాక్టర్సాబ్ వరండాలో పడుకుంటాననీ, పొద్దున్నే లేచి వెళ్తానని బెదిరించి వెళ్ళిపోతుంది. ఆమె బెదిరింపుకి లొంగిపోతాడాయన. యాత్రలు పూర్తి చేసుకువచ్చిన బాల్రెడ్డి పటేలు వ్రతం చేసుకుని అందరికీ భోజనాలు పెడతాడు. యాత్రా విశేషాలను డాక్టర్సాబ్‍కు వివరిస్తాడు. డాక్టరమ్మకి ప్రసవమై, ఆడపిల్ల పుడుతుంది.  ప్రసవం కష్టమైనా, అదృష్టం బావుండి, తల్లీ పిల్లా ఇద్దరూ క్షేమంగా ఉంటారు. దాదాపు నలభై రోజుల తర్వాత జోడెడ్లపాలానికి తిరిగి వస్తాడు డాక్టర్సాబ్. తన ఇంటి తాళం తీద్దామని ప్రయత్నిస్తే, అది రాదు. అగ్గిపుల్ల వెలిగించి చూస్తే, అది తను వేసిన తాళం కాదని తెలుస్తుంది. ఎదురింటి కిరాణా దుకాణం విశ్వనాథం తలుపు కొడ్తాడు. వాళ్ళు లోపలికి పిలిచి, మంచినీళ్ళిచ్చి, డాక్టరమ్మ గురించి, బిడ్డ గురించి అడుగుతారు. తన ఇంటికి కొత్త తాళం వేసి ఉంది, ఏమైందని ఆందోళనగా అడుగుతాడు డాక్టర్సాబ్. ఇక చదవండి.]

[dropcap]“మీ[/dropcap] ఇంట్లో దొంగలు పడ్డరు డాక్టర్సాబ్. తాళం పలగ్గొట్టిన్రు. నాగవాసం కూడ కొత్తదె. చీకట్ల నీకు కనపడలే.”

“ఎప్పుడు? ఎట్ల?” గబుక్కున లేచినుంచున్నాడు డాక్టరు గారు తన ఇంటి గుమ్మం దగ్గరకు వెళ్ళడానికని.

“కూర్చుండు డాక్టర్సాబ్. దొంగలు పడి కూడ పది దినాలయితుంది. గడ్డపారతోని తాలం పలగ్గొట్టిన్రు. తాలం రానట్టున్నది. నాగవాసాన్ని వంచి లోపటికి పోయిన్రు. ఇల్లంత చిందర వందర చేసిన్రు. మేం పక్కకే వున్నం గని మాకేం చప్పుడినరాలె. అమృతక్కోల్లగూడ ఇనరాలేదట.

మబ్బులమబ్బుల్నె సానుపు చేద్దామని మా సుశీలమ్మ వాకిట్లకచ్చి ఊడ్చుకుంటాంటె మీ తలుపు తెరువబెట్టి ఉన్నదట. నువ్వు ఊర్నుంచచ్చినవు గావచ్చని, డాక్టరమ్మకెట్లున్నదో అర్సుకుందామని గల్మలకచ్చెటాలకు లోపట కందిల్లు ఎలుగుతున్నయట. ఇద్దరు ముగ్గురు సామాన్లు సదురుతున్రట. బీరుపోయి సూస్కుంట నిలబడ్డదట గని అంతల్నె “ఎవలుల్ల మీరు!” అని ఆమెకు తెలుపకుంటనె ఒక్కసారిగ గట్టిగ ఒర్రింది. ఈమె కీక పెట్టెటాల్లకు వాల్లు ఎన్కగల్మలకెల్లి పెరట్లకు, పెరట్లకెల్లి అట్నించటె గోడదున్కి పరారయిన్రు.

ఆమె కీక యిని నేను ఉరికచ్చిన. అట్నుంచి అమృతక్క ఉరికిచ్చింది. చూసెటాల్లకేమున్నది ఇల్లంత చిందరవందర. ఇంట్లో సామాన్లన్నయె కానస్తలేవు. ఇటు జూస్తె సుశీలమ్మ భయానికి గజ్జగజ్జ వనుకుతాంది” వివరంగా చెప్పాడు విశ్వనాథం.

“నాకు మత్లబు జెయ్యద్దా!” అడిగాడు డాక్టరు గారు.

“నీ పత్త ఎవలు సుత మాకు దెల్వదంటే మాకు దెల్వదన్నరు. అమృతక్క నీ ఎంబడచ్చిందిగాని అంత పెద్ద వరంగల్లుల యాడికి బొయినమొ నేన్జెప్పజాలనన్నది.”

“అల్లెంకి శంకరయ్య షడ్డకునింట్లోనె కిరాయకు దిగితిమి గద” అన్నాడు డాక్టరు గారు.

“ఏమొ, అదంత నాకు తెలువది డాక్టర్సాబ్! ఊర్లందరు వచ్చిన్రు. సూసిన్రు పొయిన్రు. కొందరు మొలకలగూడెం దిక్కుకు ఐదారుగురు మూటలేసుకోని ఉరుకుతుంటే చూసిన్రటగని చూసినోల్లకు వాల్లెవలొ, ఎందుకురుకుతున్నరొ తెలువకపాయె. పోలీసుపటేలుకు తెలిసినట్టున్నది. ఎనిమిది తొమ్మిది గొట్టంగ వచ్చిండు. ఠాణకు మనిసిని బంపిండు. పోలీసోల్లచ్చి పంచనామ చేసేదాన్క ఇక్కడనె వున్నడు. మస్తు బాధపడవట్టిండు. ఏమేం బోయినయొ నువ్వస్తెగని తెలువదని, వడ్లోన్ని పిలిపించి కొత్త నాగవాసం చేపిచ్చిండు. తాలం మా ఇంట్లదె. తాలమేసిండు. తాలపుచెయ్యి తన దగ్గర్నె వుంచుకున్నడు. డాక్టర్సాబస్తె మత్లబు చెయ్యున్రి నేనె వస్త. లేకుంటె ఆయన వచ్చిన సరె అన్నడు. ఈ రాత్రెక్కడికి బోతవయ్య. మా ఇంట్లనె పండు” అంటూ “సుశీలమ్మా” కేకవేశాడు.

జంతికలు, చేగోడీలు, కారపప్పాలు, పోపు వేసిన అటుకులు పళ్ళెంలో పెట్టుకొచ్చి తినుమంటూ డాక్టరు గారికి అందించింది సుశీలమ్మ. “వద్దమ్మా!” అంటూ తీసుకోవడానికి నిరాకరించాడు డాక్టరు గారు.

“తిను డాక్టర్సాబూ! పగటీలి వరంగల్లుల ఎప్పుడేం తిన్నవో! తెల్లన్దన్కనైతె మనం చేయగలిగింది లేదు గద!” అన్నాడు విశ్వనాథం.

“రంది పడ్డె పని నడుస్తదా! పక్క వేసె వుంచిన. తిన్నంక ఇక్కన్నె నడుం వాల్చున్రి. పొద్దుగాల సంగతి పొద్దుగాల జూసుకోవచ్చు” అంటూ పడుకోవడానికి వెళ్ళిపోయింది సుశీలమ్మ.

డాక్టరు గారు ప్రొద్దుటే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం సంధ్యా పూర్తి చేసుకొనేటప్పటికి పోలీసు పటేలు మందీమార్బలంతో వచ్చేశాడు. ఉదయమే విశ్వనాథం పటేలింటికి వెళ్ళి డాక్టరు గారు వచ్చిన సమాచారాన్నందించి వచ్చాడన్న మాట.

“ఎన్నడు లేంది ఇట్లైంది డాక్టర్సాబ్. ఏదో చిన్న చితుక దొంగతనాలైతయి గని ఈ నమూన ఇల్లు దోచుకుపోవుడన్నది నేను పోలీసు పటేలైన కాన్నించి ఎర్కలే” డాక్టరు గారిని కలవగానే తన సానుభూతిని వ్యక్తం చేశాడు బాల్రెడ్డి.

బాధతో తలపంకించి మౌనంగా వున్నాడు డాక్టరు. పటేల్ ఆజ్ఞతో తాళం తీసి గుమ్మం తెరిచాడు మచ్కూరి. అంతా లోపలికి వచ్చారు. ఈలోగా పట్వారి నర్సింగరావు కులకర్ణి కూడ వచ్చాడు. ఆత్మీయంగా డాక్టరు గారిని కావలించుకున్నాడు.

ఆసుపత్రి గది యథాతథంగా వుంది. మందులు, పుస్తకాలు, డాక్టరు గారి బల్లపైన స్టెతస్కోపు, బి.పి. ఆపరేటసు, తను వెళ్ళేటప్పుడు చదువుతూ చదువుతూ సగం తెరచిపెట్టిన పుస్తకం కూడ అలానే వుంది. కానైతే పెంకుటిల్లు అవడమ్మూలన రాలి పడ్డ మట్టితో దుమ్ము పేరుకుపోయి వుంది. డ్రాయరు సొరుగుపైన దృష్టి సారించాడు డాక్టరు గారు. వేసిన తాళం వేసినట్లే వుంది. దానిలో వెయ్యి రూపాయలుండాలి. ఇప్పుడు చూడ్డం సరికాదనుకొన్నాడాయన. మౌనంగా అందరితో పాటు లోపలికొచ్చాడు.

డాక్టరు గారొచ్చిన వార్త కార్చిచ్చులా వ్యాపించింది. ఊరు ఊరంతా కదలి వచ్చింది.

వెనకాల చతుశ్శాల భవంతి. నాలుగు విడివిడి గదులున్నాయి. అన్ని తాళాలు పగులగొట్టబడి వున్నాయి. వంటగది, ఆ గది నుండి వెనుకకు పెరట్లోకి దారి, పెరటి తలుపు తెరిచారెవరో. అదనంగా ఈ ఇంట్లోంచి అమృతమ్మ వాళ్ళింట్లోకి కూడ గుమ్మం ఉంది. ఆ గుమ్మాన్నీ తెరిచారు. ఇల్లంతా వెలుగు పరుచుకొంది.

ఇంట్లో ఏ వస్తువూ సక్రమంగా లేదు. వంటగదిలో పప్పులు ఉప్పులు చిందరవందరగా పారబోయబడి వున్నాయి. చాలా రోజులైన కారణంగా చీమలు బారులు తీరి ఆహార సామగ్రిని తీసుకువెళుతున్నాయి. బొద్దింకలన్నీ వెలుగును తట్టుకోలేక చీకట్లోకి పారిపోతున్నాయి. చిట్టెలుకలు రెండు బొరియల్లోకి పారిపోయాయి. పందికొక్కు కొత్తగా తవ్విన బొరియ తాలూకు మట్టివంటింట్లో కుప్పగా వుంది.

మంచాలు పెరట్లో వున్నాయి. నవారు మొత్తాన్ని ముక్కలు ముక్కలుగా కోసి పడేశారు. మంచం పట్టెల్ని గొడ్డళ్ళతో నరికినట్లుగా దాఖలాలున్నాయి. మంచాలికపై పనికిరావు. నులక మంచాలు రెండు కనపట్టం లేదు. తీసుకుపోయివుంటారు. మూడు మడతమంచాలు కూడ లేవు. పడక్కుర్చీలు నాలుగుండాలి లేవు.

నాలుగు బూరుగు దూది పరుపులు బాకులతోనో కత్తులతోనో కోసి పడేశారు. పెరడంతా దూదిమయం. చిరిగిపోయిన నాలుగు దుప్పట్లను వదిలేశారు. పక్కబట్టలు మొత్తంగా మాయం. చెక్క బీరువాలోను, ట్రంకు పెట్టెల్లోను ఉండాల్సిన డాక్టరు గారి బట్టలు, పిల్లల బట్టలు లేవు. డాక్టరమ్మ మనసుపడి కొనుక్కున్న పట్టుచీరలు లేవు. మామూలు చీరలే లేవు. పట్టుచీరలొక లెక్కా! చెక్క బీరువా తలుపులు విరగ్గొట్టబడి వున్నాయి.

సంత ముగిసిన అనంతరం నాలుగు రోడ్ల కూడలి ఎలా వుంటుందో ఇప్పుడా ఇల్లు అలా వుంది.

గ్రామస్తులందరూ బిత్తరబోయారు. డాక్టరు గారికి సానుభూతిని తెలిపారు.

“నేను పోలీసులకు తెలిపిన. ఆ దినం ఎస్.ఐ. సుత వచ్చిండు. రిపోర్టిచ్చిన. ఎఫ్.ఐ.ఆర్. కూడ దర్జ్ చేపిచ్చిన. పోలీసులను మల్ల పిలిపిస్త. పోయిన వస్తువులే మేం వున్నయో చెప్త వాఙ్మూలం రాసుకొని కార్వాయి చేస్తరు” చెప్పాడు పోలీసు పటేలు.

“ఏమద్దు పటేలా! డాక్టర్సాబంటే ముల్లెల కొద్ది పైసలుంటయని దొంగలు పడ్డరు కావచ్చు. వాల్లకేం దొరుకలే. ఉంటె కద దొర్కెదానికి. ఏం దొర్కలేదన్న అక్కసుకొద్ది సర్వం నాశనం చేసి పోయిన్రు. బిందెలు, గుండిగలు, వంటపాత్రలు, ఇత్తడి బక్కెట్లకాడికెల్లి ఎత్తుక పొయిన్రంటె వాల్లెంత ఆకలి మీదున్నరొ తెలుస్తున్నది కద! కట్టుబట్టల్తోని మిగిలిన. నాకే కార్వాయి బట్టది” అనుకుంటూ అక్కడే నేల మీద కూలబడిపోయాడు డాక్టరు గారు.

పెద్దపులి వలె వుండే డాక్టరు గారు దుఃఖభారాన్నణచి పెట్టుకుంటూ కూలబడి పోయేసరికి గ్రామస్తులకు సైతం దుఃఖం పెల్లుబికి వచ్చింది.

“కార్వాయి వద్దంటవ డాక్టర్సాబ్!”

“పట్టదంటున్నకద పటేలా! ఈ వరకు దర్జయిన ఎఫ్.ఐ.ఆర్. వున్నది కద. అది సాలు. బాకుంటే సామాను దొరుకుతది. లేకుంటే లేదు” యాష్టపడ్డాడు డాక్టరు గారు.

“తబ్బట్టుకోకు డాక్టర్సాబ్! పోలీస్ పటేలుగ నా ధర్మత కాబట్కె మల్లడిగిన” ఓదార్చాడు బాల్రెడ్డి.

ఈ మధ్యలో సర్పంచి రాజిరెడ్డి కూడ వచ్చి పరామర్శించి వెళ్ళాడు. రాజిరెడ్డి బాల్రెడ్డి వాళ్ల పెద్దన్న గారు. ఎంత లేదన్నా వయసు డెబ్భై పైమాటే. పేరుకే సర్పంచు. పనులన్నీ బాల్రెడ్డే చూసుకొంటాడు. ఏమాటకామాట చెప్పుకోవాలి. రాజిరెడ్డికి లభింపవలసిన మర్యాదల్లో ఏ మాత్రం తేడా రానీకుండా చూచుకొంటాడు బాల్రెడ్డి.

“అందరు బైటికెల్లున్రి” అని ఊరివాళ్ళనంటూ, “డాక్టర్సాబ్! దవాఖానర్రల కూర్చుందాం రాండ్రి” అంటూ “అరె ఇల్లు మొత్తం ఊడ్చి శుభ్రం చెయ్యున్రా! సామాన్లు మంచిగున్నయేమన్న వుంటె పొతం చెయ్యున్రి” అన్నాడు పటేలు పనివారల నుద్దేశించి. గ్రామస్తులు ఒక్కరొక్కరుగా వెళ్ళిపోసాగారు. “కంచరి వెంకట్రాములు కనబడె కద! పిలువున్రి” అన్నాడు పటేలు.

“అయ్యా! ఇక్కన్నె వున్న” అంటూ ముందుకొచ్చాడు వెంకట్రాములు.

“ఇగొ డాక్టరు సాబుకు వంటపాత్రలు, బిందెలు, బక్కెట్లు, అన్ని తెచ్చియ్యి. ఇప్పుడే తీస్కరా! పైసలు నా దగ్గర తీసుకో” చెప్పాడు బాల్రెడ్డి పటేల్.

“అట్లెందుకు నేనె ఇస్త” అన్నాడు డాక్టరు గారు.

“నువ్వూకో డాక్టర్సాబ్! వెంకట్రాములూ డాక్టర్సాబ్ దగ్గర పైన ముట్టుకుంటే మాటదక్కది” మల్ల హెచ్చరించాడు బాల్రెడ్డి పటేలు.

“అట్లనే పటేలా!” అంటూ ఇంటికి బయల్దేరాడు కంచరి వెంకట్రాములు.

పనివాళ్ళందరూ ఇల్లు శుభ్రం చేయడంలో మునిగిపోయారు. దవాఖాన గదిలో డాక్టరు గారితో పాటు పోలీసు పటేలు, పట్వారి, హెడ్మాస్టరు నరహరి ఇంకొకళ్ళిద్దరు మిగిలారు. అందరికీ టీలు తీసుకొని వచ్చాడు విశ్వనాథం. టీ తాగుతూ అన్నాడు పట్వారి నర్సింగరావు కులకర్ణి “ఇల్లు కుదురుకునే వరకు మా ఇంటికి భోజనానికి రావాలె డాక్టర్సాబ్” అన్నాడు. మొహమాటంగా చూచాడు డాక్టరుగారు.

“దీన్లో మొహమాటమేమున్నది డాక్టర్సాబ్. మేమేం కానోల్లమా! మన దోస్తాన ఇప్పటిది కాదు గద. కాడెద్దులపల్లెల మా అల్లుని ద్వార పరిచయమైతిరి” అన్నాడు కులకర్ణి.

“డాక్టర్సాబ్! ఈ గ్రామ శాంతిని కాపాడే బాధ్యత నాది. అసొంటిది నేను ఊళ్ళె ఉండంగనె ఇంత పెద్ద దొంగతనం జరుగుడు నాకు నాదాని కాద! నాకు తోచిన సాయం నేన్జేస్త. కాదనొద్దు” అన్నాడు బాల్రెడ్డి పటేలు.

“మంచాల లక్ష్మయ్యకు మత్లబు చేసినా! ఇల్లు గూడ బాగనె దెబ్బతిన్నది కద” అడిగాడు డాక్టరు గారు.

“చేసిన. వచ్చి చూసిపొయిండు. ఇవాలనె కరీంనగరుకు మల్ల మత్లబు చేస్త” అన్నాడు బాల్రెడ్డి పటేలు.

“మత్లబు చేసుడెందుకె. ఎల్లుండి పొద్దుగాల మా బామ్మర్ది బిడ్డ పెండ్లున్నది కరీంనగర్లనె. పగటిలి బయలెల్తున్నం. నేన్చెప్తతియ్యి లక్ష్మన్నకు” అన్నాడు విశ్వనాథం.

ఆ మాటా ఈ మాటాతో ఇంకో గంట గడచిపోయింది.

“దా డాక్టర్సాబ్! బుక్కెడంత దిని కొద్దిసేపు పండి వత్తువు” అంటూ లేచాడు కులకర్ణి.

ఆ మాటతో అందరూ బయల్దేరారు. “వారీ! డాక్టర్సాబు మాపటి వరకస్తడు. అప్పటి వరకంత శుభ్రం చేసి పెట్టున్రి” పనివాళ్ళకు పురమాయించి బయటకు వచ్చాడు బాల్రెడ్డి పటేలు.

పలకరింపులు, పరామర్శలు, పురుటి వార్తలు అన్నీ అయి భోజనాలయేప్పటికి మధ్యాహ్నం రెండు దాటింది. ఇంటికి వెళతానన్నాడు. డాక్టరుగారు. కసేపు విశ్రమించమన్నారు కులకర్ణి. విశ్రాంతిలో గాఢంగానే నిద్రపోయాడు డాక్టరు గారు. లేచి తేనీరు సేవించి బయల్దేరేప్పటికి సాయంత్రం నాలుగయింది. రాత్రి మళ్ళీ భోజనానికి రమ్మన్నారు వాళ్ళు. వండుకు తింటానన్నాడు డాక్టరు గారు. అలాగయితే తానే దవాఖాన వరకు వచ్చి తీసుకొచ్చుకుంటానన్నాడు కులకర్ణి. వాళ్ళ ప్రేమకు వివశుడైన డాక్టరుగారు రాత్రి భోజనం కూడ కులకర్ణి గారింట్లోనే కానిచ్చేందుకొప్పుకున్నాడు.

నాలుగింటికి డాక్టరు గారు ఇంటికి వచ్చారు. పనివాళ్ళంతా ఇంటిని అద్దంలా సర్దిపెట్టారు. జేబులోంచి పది రూపాయల కాయితం తీసి ఇవ్వబోయాడు డాక్టరుగారు. వాళ్ళకు కోపం వచ్చింది. అందులో కాస్త పెద్ద వయసతను అన్నాడు – “ఇది మా ఇల్లనుకోని బాగుచేసినం. కూలికచ్చినమనుకున్నవా!”

“తప్పు పట్టుకోకు పెద్దమనిషి. ఏదో సంతోషం కొద్ది ఇద్దామనుకొన్న.” సర్దుకొన్నాడు డాక్టరు.

“మల్లచ్చె సంక్రాంతికస్తం. అప్పుడు వట్టిగనె ఇనామిత్తువుగాని, ఇప్పుడైతె పైసలు బట్టయి” సమాధానమిచ్చాడతడు. వాళ్ళ సౌజన్యానికి డాక్టరు గారి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

అమృతతో పాటు మరో ఇద్దరాడవాళ్ళు ఎర్రమట్టితో అలికి ఇంటికి ముగ్గులు వేశారు. “దేవునసొంటి డాక్టరింట్లో పడ్డారు. వాల్లు నాశనం గాను” అంటూ దొంగల్ని శాపనార్థాలు పెట్టారు.

కంచరి వెంకట్రాములు గిన్నెలు, గరిటలు, రెండు బిందెలు, ఒక బక్కెట్టు, రెండు చెంబులు తెచ్చిచ్చాడు. డబ్బివ్వబోయాడు డాక్టరు గారు. “పటేలు చెప్పిన్దినలేదా డాక్టర్సాబ్. పైసలు బట్టయి” అంటూ వెళ్ళిపోయాడతడు.

బ్యాగులో రెండు జతల బట్టలున్నాయి. నాలుగు రోజులు కాలక్షేపం చేసి మందులకుంట వెళ్ళేప్పుడు వరంగల్లులో కొనుక్కోవాలి. రాత్రి కులకర్ణి గారింట్లో భోజనం చేసి వచ్చేటప్పటికి అమృతమ్మ తనింట్లో నులకమంచం తెచ్చి పక్కవేసి సిద్ధంగా ఉంచింది. “దుప్పట్లు కొత్తయే బాంచెను తప్పు పట్టుకోకు” అంది ప్రాధేయపడుతూ. చలించిపోయాడు డాక్టరు గారు.

మృత్యు దేవతతో పోరాడి గెల్చింది తన భార్య. అందరూ మహాలక్ష్మిలాంటి కూతురు పుట్టిందన్నారు. దీపావళి రోజునే పుట్టింది. మహాలక్ష్మి కాక మరెవరు పుడతారనుకొన్నాడు తను కూడ. ఇక్కడికి వచ్చి చూస్తే ఏముంది. సర్వం తుడిచిపెట్టుకుపోయింది. సర్వమూ పోయిందా! గ్రామ ప్రజల అభిమానపు వెల్లువలో తడిసి తరించిపోతున్న ఆనందంలో జరిగిన నష్టానికి బాధపడవలసిందేమీ లేదనిపిస్తున్నది.

ఆలోచనల్తో నిద్రపట్టడం లేదు. లాంతరు తీసుకొని ఆసుపత్రి గదిలోకొచ్చాడు. కిరసనాయిలు గ్యాస్ స్టవ్ అక్కడే వున్నది. ఆసుపత్రిలో పెట్టినందున ఉంది. దొంగలు ఆసుపత్రి గుమ్మం తాళాన్ని పగులగొట్టుకొనే లోనికొచ్చారు. ఆసుపత్రిని వదిలిపెట్టి లోపలికెళ్ళారు. విచిత్రంగా ఉంది. వాళ్ళకసలు ఆసుపత్రిని ముట్టుకోవద్దన్న ఆలోచన ఎందుకొచ్చింది? బ్యాగులోంచి తాళం చెవి తీసి టేబుల్ డ్రాయరు సొరుగు తీసి చూశాడు. అత్యవసర సమయంలో పనికొస్తాయని దాటిపెట్టిన నోట్ల కట్ట వెయ్యిరూపాయలు అలానే వుంది. పరవాలేదు. భగవంతుడు కొంతమేర తన దీనావస్థ నుండి తప్పించాడు. మనసులోనే దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొని పడుకున్నాడు డాక్టరు గారు. ఇప్పుడతనికి త్వరగానే నిద్రపట్టింది.

ప్రొద్దుటే పాలవాడు తలుపుకొడుతుంటే మెళకువ వచ్చింది. మొహం కడుక్కుని స్టవ్ వెలిగించి కాఫీ పెట్టుకున్నాడు. డాక్టరమ్మ వరంగల్లుకు చూపించుకోవడానికి వెళ్ళి పురిటికని అక్కడే ఉండాల్సి రావడంతో వీరలక్ష్మి పాలవాడుకను మాన్పించాడు డాక్టరు గారు.

నిన్న సాయంత్రం కరీంనగర్ వెళ్ళేప్పుడు కిరాణా సామాను బియ్యంతో సహా మూటలు గట్టి డాక్టరు గారింట్లో పెట్టి వెళ్ళాడు విశ్వనాథం. వాళ్ళ కొట్లో కాఫీ పొడెం వుండదు. బ్రూక్ బాండ్ వారి కాఫీ బిళ్ళలు మాత్రం లభిస్తాయి. ఒక ముక్కను త్రుంచి మరుగుతున్న నీళ్ళలో వేశాడు. బిళ్ళలు కరిగిపోయాక గిన్నెను దించి పాలను కాచాడు. కాఫీ డికాషనుపైన చన్నీళ్ళను చిలకరించాడు. కాఫీ బిళ్ళకు సంబంధించిన మడ్డి అడుక్కు చేరుకుంది. తేరుకున్న డికాషన్ని గ్లాసులో పోసుకొని వేడి వేడి పాలను జతచేసి, చెంచాడు పంచదార వేసుకొని, మరొక గ్లాసు తీసుకొని రెండు మూడుసార్లు కొలబోసుకొని చప్పరించాడు. “బాగుంది” తన్ను తాను మెచ్చుకున్నాడు.

పూజ పూర్తి చేసుకొనేటప్పటికి ఒకళ్ళిద్దరు రోగులు వచ్చారు. వాళ్ళను చూడ్డం పూర్తయింది. వంటకుపక్రమమిద్దాం అనుకునే లోపున నరసింగరావు కులకర్ణి మేనల్లుడు వచ్చాడు క్యారేజి తీసుకుని.

“ఏమిటిది?” అడిగాడు డాక్టరు గారు.

“మీరు భోజనానికి వచ్చెటందుకు మొహమాటపడుతున్నరట. మామ ఇచ్చిరమన్నడు. సాయంత్రం కూడ టిఫిన్ తెచ్చిస్త. అత్తమ్మ మిమ్ముల్ను రేపట్నుంచి వండుకొమ్మన్నది” అంటూ క్యారేజి నక్కడపెట్టి పరుగులంకించుకున్నాడు కుర్రాడు, డాక్టరు గారు పిలుస్తున్నా వినకుండా.

రుచికరమైన వంటకాలు. సుష్టుగా భోంచేసి రెండు గంటలపాటు మైమరచి నిదురించారు డాక్టరు గారు. సాయంత్రం పదిమంది వరకు వచ్చారు. వారు వైద్యం నిమిత్తం వస్తున్నారో, పరామర్శిద్దామని వస్తున్నారో బోధపడడం లేదు. పరామర్శలతో విసువు పుట్టింది డాక్టరు గారికి. కాని విసుక్కోవడమంటే వారి అవ్యాజానురాగాలను అవమానించడమే అవుతుంది. దాంతో మిన్నకున్నాడు డాక్టరు గారు. మరో నాలుగు రోజుల తరువాత పరిస్థితి చక్కబడింది.

మధ్యలో మంచాల లక్ష్మయ్య వచ్చి వెళ్ళాడు. “దొంగలు పడ్డదానికి నువ్వేంచేస్తవు డాక్టర్సాబ్. ఏం పర్వలేదు. ఏదన్నుంటే బాగు చేపిచ్చుకొని కిరాయల బట్టుకో” అన్నాడు.

“నీకిచ్చె నెలకయిదు రూపాయల కిరాయకు పట్టుకునేద్దేంది. నేనె బాగు చేపిచ్చుకుంట” అన్నాడు డాక్టరు గారు.

వారం తర్వాత ఓ రోజున తీరిక చేసుకొని, నిర్మాణంలో ఉన్న తన కొత్త ఇంటిని చూచుకొందుకు వెళ్ళాడు డాక్టరు గారు. లోపలా బయటా పదిసార్లు తిరిగితే గాని సంతృప్తిగా అనిపించలేదు.

‘డాక్సర్సాబిట్ల తిరుగుతున్నదేంది’ అనుకున్నాడు చూస్తున్న సాయిలు.

“మనసు నిండుతలేదానయ్య” నవ్వుతూ అడిగింది సాయిలు భార్య నిండుచూలాలు, నీలమ్మ.

“అవును నీలమ్మా! పనులు తొందరగా పూర్తి చేయించుకొని ఇంట్లోకొస్తాం. అప్పటికి నీ ప్రసవం కూడా అయిపోతుంది. పండంటి కొడుకుతో మా ముంగిట్లో వుందువు గాని” చెప్పాడు డాక్టరు గారు.

గలగలా నవ్వింది నీలమ్మ. డాక్టరు గారి పాదాలనంటి నమస్కరించాడు సాయిలు.

మరుసటి రోజు తాపీ మేస్త్రిని, వడ్రంగిని పిలిపించి వచ్చే మార్గశిర బహుళ పంచమి రోజు పని మొదలుపెట్టేట్లుగా నిర్ణయించాడు. అప్పటి వరకు కర్ర పని పూర్తి చేసిపెడతానన్నాడు వడ్రంగి. యాదగిరి నడిగితే బట్టి కాల్తున్నది, పని మొదలు పెట్టేటప్పటికి ఇటుక నందిస్తానన్నాడు. అంతేకాదు కప్పుపైన కర్ర పని పూర్తయ్యేనాటికి గూన పెంకలు కూడ అందిస్తానని మాట ఇచ్చాడు.

మరో నాలుగైదు రోజులైనాక భార్యా పిల్లలను చూచేందుకు మందులకుంటకు బయల్దేరాడు డాక్టరు గారు.

***

“అన్నయ్యా! డాక్టరు గారు మందులకుంటకు వెళ్ళొచ్చేలోపు ఓ పావుగంట విరామం కావాలి” అన్నాడు రమణ.

కథను ఏకబిగిన చెప్పుకుపోతున్న జనార్దనమూర్తి ఆగిపోయాడు ఎందుకన్నట్లు చూస్తూ.

“అన్నయ్యా! మా అందరి మనసులూ నువు చెప్పే కథ మీదనే లగ్నమయివున్నాయి. శరీరాలు వాటి పనినవి చేస్తూ పోతున్నాయి కదా! దైహిక బాధలు” జనార్దనమూర్తి చూపులకు జవాబుగా చెప్పాడు రమణ. అందరూ గొల్లున నవ్వి నిజమే అన్నట్లుగా ఒక్కొక్కరూ లేచి నుంచోవడం మొదలుపెట్టారు.

“ఆపేద్దామా!” అడిగాడు జనార్దనమూర్తి.

“మాటి మాటికీ నువ్విలా మమ్మల్ని బ్లాక్‌మేల్ చెయ్యడం బాగోలేదన్నయ్యా! జస్ట్ బ్రేక్ అంతే!” అన్నాడు సంజయ్.

“సరే! సరే! నా దేహమూ ఇబ్బంది పెడ్తోంది” అంటూ లేచాడు జనార్దనమూర్తి.

అందరూ తమ తమ అవసరాలు తీర్చుకొని మళ్ళీ సమావేశమయ్యేప్పటికి అరగంట పట్టింది. అందరి ముందరా ఐస్‌క్రీమ్ సిద్దంగా వుంది.

“అర్ధరాత్రి ఐస్‍క్రీమ్‍లేంటి రమణా!” అడిగాడు జనార్దనమూర్తి.

“అన్నయ్యా! ఇది మామూలు ఐస్‌క్రీమ్ కాదు. ఇది హోటల్ ఉత్సవం వాళ్ళ స్పెషల్ ట్రీట్. ఓవర్ నైట్ స్టే చేసేవాళ్ళకు ఉచితంగా ఇస్తారు. సాధారణంగా భోజనంతో పాటుగా ఇస్తారు. ఈ టైముకిమ్మని రమణ హోటల్ వాళ్ళనడిగితే ఒప్పుకొన్నారు” వివరించాడు సమ్మయ్య.

“అన్నయ్యా! ఇందాకేదో కాఫీ బిళ్ళ అన్నావు” అడిగింది స్వాతి.

“ఆడపిల్లవనిపించుకున్నావు” నవ్వుతూ అన్నాడు జనార్దనమూర్తి. “అప్పట్లో కాఫీ పొడి పొట్లాలు ఇలా విరివిగా లభించేవి కావు. కాఫీ గింజలను మరాడించి తెచ్చుకోవడమే వుండేది. ఐతే గ్రామగ్రామాన కాఫీ పొడి సువాసన నశించకుండా అందగలందులకు మొదట బ్రూక్ బాండ్ కంపెనీవాళ్ళు, తరువాత లిఫ్టన్ కంపెనీవాళ్ళు కాఫీ బిళ్ళలను అందుబాటులోకి తెచ్చారు. ఆ బిళ్ళలు పొడవుగా ఇప్పటి డైరీ మిల్క్ లేదా ఫైవ్ స్టార్ చాక్లెట్టు మాదిరిగా వుండేవి. మూడు ముక్కలు చేయడానికి అనువుగా మధ్యలో రెండు గంట్లుండేవి. పన్నెండు బిళ్ళలకొక ప్యాకెట్టుగా అమ్మేవారు. ఇప్పటి మిల్క్ బికీస్ లేదా పార్లేజి బిస్కెటు ప్యాకెట్టులాగా ఉండేవి అప్పటి ఆ కాఫీ బిళ్ళల ప్యాకెట్లు.

మరుగుతున్న నీళ్ళలో ఆ బిళ్ళను ముక్కలు చేసి వేస్తే, కరిగిపోయి డికాక్షన్ తయారయేది. టీ డికాక్షన్ మాదిరి కాఫీ డికాక్షన్ వడగట్టుకోవడానికుండదు. వేడి వేడి డికాక్షన్ పైన కాసిని చన్నీళ్ళను చిలకరిస్తే మడ్డి అడుక్కు తేరుకుంటుంది. పై తేటను వేరు చేసి వేడిపాలతో కలుపుకొంటే కాఫీ అవుతుంది. కాఫీనలా ఊరికే కలుపుకొంటే రుచిరాదు. కొలబోసుకోవాలి. తిరుపతి ప్రాంతం వాళ్ళు కొట్టడమంటారు. కాఫీని ఎంత కొడితే అంత రుచి వస్తుందన్నమాట” వివరించాడు జనార్దనమూర్తి.

“కాఫీ రుచి వెనుక ఇంత కథ ఉందా అన్నయ్యా!” గుండెల మీద చేయివేసుకొని ఆశ్చర్యపోయారు స్వాతి, సౌమ్యలు. చిన్నగా నవ్వాడు జనార్దనమూర్తి.

“అన్నయ్యా! టేస్ట్ ది ఐస్‌క్రీమ్. దిసీజ్ ద టోస్ట్ ఫర్ డాక్టర్స్ విక్టరీ. మరో అరగంటలో రెండో రౌండు వస్తుంది. బి రెడీ! అన్నయ్యా! ఇక కథ మొదలెట్టు” ఉత్సాహం పెల్లుబుకుతుంటే చెప్పాడు రమణ.

కథను మొదలు పెట్టాడు జనార్దనమూర్తి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here