[శ్రీ వరిగొండ కాంతారావు రచించిన ‘వ్యామోహం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[తన ఇంటికి వేరే తాళం వేసి ఉండడం చూసిన డాక్టర్సాబ్ ఎదురింటి విశ్వనాథం ఇంటికి వెళ్తాడు. ఏం జరిగిందని అడిగితే, పది రోజుల క్రితం మీ ఇంట్లో దొంగలు పడ్డారని, మొత్తం ఇల్లంతా నాశనం చేశారని చెప్తాడు. తనకి కబురు చేయాల్సింది కదా, అంటే వరంగల్లులో ఎక్కడున్నావో తెలియదు అంటాడు విశ్వనాథం. మర్నాడు ఉదయమే, బాల్రెడ్డి మందీ మార్బలంతో వచ్చి తలుపులు తీయిస్తాడు. ఇల్లు చూసుకుంటాడు డాక్టర్సాబ్. ఆసుపత్రి గది మాత్రం యథాతథంగా ఉంటుంది. మిగతా ఇల్లంతా చిందరవందరగా ఉంటుంది. పూచికపుల్లతో సహా అన్నీ ఎత్తుకుపోయారని గ్రహిస్తాడు డాక్టర్సాబ్. గ్రామస్తులు వచ్చి పరామర్శించి వెళ్తారు. వంటపాత్రలు, బిందెలు బక్కెట్లు తెచ్చియ్యమని కంచరి వెంకట్రాములుకు చెప్తాడు బాల్రెడ్డి. ఇల్లు కుదురుకునే వరకూ తమ ఇంటికి భోజనానికి రమ్మని పట్వారి నర్సింగ రావు కులకర్ణి చెప్తాడు. బాల్రెడ్డి పురమాయించిన మనుషులు ఇల్లంతా సర్దిపెడతారు. తన బ్యాగ్‍లో ఉన్న కట్టుబట్టలు తప్ప ఇంకేమీ లేవని గుర్తు చేసుకున్న డాక్టర్సాబ్ ఈ సారి మందులకుంట వెళ్ళినప్పుడు బట్టలు కొనుక్కోవాలని అనుకుంటాడు. కొత్తింటికి వెళ్ళి అక్కడ అన్నీ చూసుకుని సాయిలుని, నీలమ్మని పలకరించి వస్తాడు డాక్టర్సాబ్. మరో నాలుగు రోజుల తరువాత మందులకుంటకు బయల్దేరుతాడు. ఇప్పటిదాక కథ వింటున్న రమణ కాస్త విరామం కావాలని జనార్దనమూర్తిని అడుగుతాడు. దైహికావసరాలు తీర్చుకుని, ఐస్ క్రీమ్ తిని మళ్ళీ కథని చెప్పడం కొనసాగిస్తాడు జనార్దనమూర్తి. ఇక చదవండి.]
[dropcap]మం[/dropcap]దులకుంటకు పయనమైన డాక్టరు గారికి ఎడతెగని ఆలోచనలు. తన జీవితంలో వీలైనంతవరకు ఒకరికి సాయమే చేశాడు కాని కీడు చేయలేదు. వైద్య వృత్తిని దైవంగా నమ్మాడు. కుటుంబం గడవాలి కనుక ఫీజు తీసుకున్నాడు. ఏ ఒక్క రోగినీ డబ్బు కొఱకు పీడించలేదు సరికదా డబ్బు కారణంగా పథ్య పానాలు చేయలేని వాళ్ళకు ఎదురు సాయం చేశాడు.
మరెందుకిలా! కట్టుబట్టల్తో మిగిలాడు. వరంగల్లుకు వచ్చేప్పుడు సైకిలును మొలకలగూడెం స్టేషను మాస్టరు కప్పచెప్పి వచ్చాడు కాబట్టి అదన్నా మిగిలింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే సర్వాన్ని దోచుకొని ఎత్తుకుపోయి, ఎత్తుకు పోలేమనుకున్న వస్తువుల్ని విరగ్గొట్టి పాడు చేసి పోయిన వాళ్ళు ఆసుపత్రిని ముట్టుకోలేదు. ఆసుపత్రి విలువ తెలిసిన వాళ్ళు ఈ దొంగతనం చేశారు. దొంగలకంత వివేచన ఉంటుందా! ఏమో! హోమియో వైద్యాన్ని కనుగొన్న శామ్యూల్ హానిమన్‌ను మహర్షి అనుకోవడంలో తప్పులేదు కదా! తన నిజాయితీకి సంతోషించి హానిమన్ గారీ దొంగల బుర్రలో ప్రవేశించి ఆసుపత్రిని కాపాడినాడేమో!
గత ఏడెనిమిది నెలలుగా తన భార్య ఆరోగ్య స్థితి సంతోషజనకంగా లేదు. మూడో నెలలో మంచినీళ్ళ బిందెనేసుకొని పడ్డ మనిషి కోలుకోలేదు. పదో నెల పురుడు వచ్చేవరకు ఏరోజు కారోజు గండంలానే గడిచింది. సహాధ్యాయి కృష్ణమాచారి సహాయమూ తక్కువది కాదు. అతని భార్య అన్నపూర్ణ ఇచ్చిన ధైర్యమూ గొప్పదే. అన్నిటికన్న మిన్న అత్తగారు వచ్చి సకాలంలో ఆదుకోవడం.
పురిటి సమయంలో ప్రభుత్వాసుపత్రి వైద్యులు చూపిన శ్రద్ధ కారణంగానే తను బతికి బట్టకట్టింది. నలుగురు మగపిల్లల వెనుక ఆడపిల్ల. అందంగా వుంది. ముఖం లక్ష్మీ కళ. బారసాలలో తను రమాలక్ష్మి అన్నాడు. అదే పేరు ఖాయమైంది. బాలెంతరాలికి కనీసం మూణెల్ల వరకు మనిషి సాయం తప్పనిసరి అని చెప్పింది లేడీ డాక్టరు. ఆ కారణంగానే పురిటి తర్వాత జోడెడ్లపాలానికి రావలసిన డాక్టరమ్మ మకాం మందులకుంటకు మారింది.
అత్తగారూ, బావమరిదీ బాగా చూసుకుంటారన్న ధైర్యంతో తను భార్యాపిల్లలను మందులకుంటలో వదలివచ్చాడు. పెద్దాడు రాము చదువు ఈ సంవత్సరమింక మందులకుంటలోనే. చిన్నపిల్లల చదువు నష్టం ఎంచదగిందేం కాదు కనుక పరవాలేదు.
ఇంకా నయం. తాము మొదలనుకున్నట్లుగా అందరూ కలసి జోడెడ్లపాలానికి వెళ్ళుంటే, అక్కడి భీభత్స దృశ్యాలను త్రిపుర చూచివుంటే భరించగలిగేదా! ఆ మేరకు దేముడు తనను ఆదుకున్నట్లే.
కట్టుబట్టల్తో మిగిలిన సంగతిని చెప్తే త్రిపుర తట్టుకోగలదా! అసలే బాలెంతరాలు. పిల్లలా చిన్నవాళ్ళు. వాళ్ళకేమని అర్థం చేయించగలడు. అత్తగారూ, బావమరిది ఎలా స్పందిస్తారో!
త్రిపురని మూడవ నెల బదులు ఐదవ నెల తీసుకువెళతానని చెప్పాలి. వచ్చేప్పుడు వరంగల్లులో లేడీ డాక్టర్‌ని కలిసానని, ఆవిడ ఐదో నెల వరకు ఇక్కడే వుండనిమ్మందని చెప్పాలి. రాత్రి ఎనిమిది గంటలకు మందులకుంటలో బావమరిది ఇంటి తలుపును తడ్తూండగా ఒక నిర్ణయానికి వచ్చిన డాక్టరు మనసు కుదుటపడ్డది.
డాక్టరమ్మ తన భర్తను ఆప్యాయంగా పలుకరించింది. సత్యమూర్తి స్నానానికి నీళ్ళేర్పాటు చేశాడు. అప్పటికందరి భోజనాలు అయిపోయాయి కనుక కుంపటి వెలిగించి అత్తెసరు పడేసింది మంగమ్మగారు.
చంటిది నిద్రపోయింది. చిన్నపిల్లలిద్దరూ నిద్రపోయారు. మెళుకువతో ఉన్న పెద్ద వాళ్ళిద్దరూ తండ్రిని అల్లుకుపోయారు. భోజనాలయి ఆ కబురూ ఈ కబురూతో నిద్రకుపక్రమించేటప్పటికి రాత్రి పన్నెండు.
పొద్దున్న కాఫీలప్పుడు కంటతడి పెట్టిన డాక్టరమ్మ కొద్ది సేపట్లోనే వలవల ఏడ్చేసింది “ఏమైందండి మీకు. అలా చిక్కిపోయారు. మొహంలో కళాకాంతులు లేవు. నీరసంగా కనిపిస్తున్నారు. మీలో ఉత్సాహమన్నదే లేదు” అంటూ.
“అవునండి అల్లుడు గారూ! రాత్రి చీకట్లో కనుక్కోలేకపోయాం. ఏమన్నా జ్వరం గానీ కాస్తోందా! కొంపదీసి కామెర్లు కాదు కదా! ఏదీ ఒకసారి కళ్ళిలా చూపించండి” అంటూ దగ్గరగా వచ్చి కళ్ళను పరీక్షించింది మంగమ్మగారు.
“కళ్ళు బాగానే వున్నాయ్. మూత్రం పచ్చగా వస్తోందా! ఎవరన్నా డాక్టరుకు చూపించుకోలేకపోయారా!” సలహా ఇచ్చింది. మంగమ్మగారు.
“అలాంటిదేమీ లేదండి. నెలపైన ఊళ్ళో లేను కదా! రోగుల తాకిడి ఎక్కువైంది. ఇల్లంతా బూజులు, దుమ్మూను. పనివాళ్ళను పెట్టుకొని శుభ్రం చేయించేటప్పటికి తలప్రాణం తోకకొచ్చిందంటే నమ్మండి.” చిరునవ్వుతో సమాధానం చెప్పాడు డాక్టరు గారు.
“బావే డాక్టరు కదమ్మా! మళ్ళీ ఎవరికో చూపిచ్చుకోమంటావేంటి?” నవ్వుతూ అన్నాడు సత్యమూర్తి.
“పెరటి చెట్టు మందుకు పనికిరాదంటార్రా! సొంత వైద్యం పనివ్వదని అమ్మ ఉద్దేశ్యమేమో!” తల్లిని సమర్థించింది డాక్టరమ్మ.
“అవునా బావా!” అడిగాడు సత్యమూర్తి.
“అవును సత్యమూర్తి. డాక్టరు గారి అపాయింటుమెంటు దొరకటం లేదు” ఓరకంట డాక్టరమ్మను చూస్తూ అన్నాడు డాక్టరు గారు. సిగ్గుపడింది డాక్టరమ్మ.
“నీకు తెలీని డాక్టర్లెవరున్నారు బావా!” బావగారి చేష్టల్ని గమనించని సత్యమూర్తి మళ్ళీ అడిగాడు.
“స్పెషలిస్టులుంటార్లే. అనుభవంలోకి వస్తేగాని ఆ లోతుపాతులు నీకు తెలీవు” అన్నాడు డాక్టరు గారు.
“ఓహో!” అనుకున్నాడు సత్యమూర్తి. డాక్టరు గారి మాటల్లోని శ్లేష అర్థమైన మంగమ్మగారు తల మీద ముసుగుని ముందుకు లాక్కుని చిరునవ్వుతో వంటింట్లోకి వెళ్ళిపోయింది. అందరి ఎదుటా అలా అనొచ్చా అంటూ భర్తను కళ్ళతోనే కోప్పడింది డాక్టరమ్మ.
వారం రోజుల తర్వాత తేటపడ్డ మనసుతో ఆరోగ్యాన్ని పుంజుకున్న దేహంతో జోడెడ్లపాలానికి బయల్దేరాడు డాక్టరు గారు.
***
జోడెడ్లపాలానికి వచ్చిన డాక్టరు గారు తన వృత్తిలో మునిగిపోయాడు. జనం కూడ విషయాన్ని క్రమేణ మరచిపోయారు. ఒకరోజు ప్రొద్దుటే తాపి మేస్త్రి మైసయ్య వచ్చాడు.
“ఇయ్యాల పున్నమి బాంచెను. ఇంకైదొద్దులె వున్నదట గద మీరు పెట్టుకున్న మూర్తం. పూజారి పంతులు చెప్పిండు. ఏర్పాట్లు చూడమని చెప్పెదానికొచ్చిన.”
“నా కన్న నీకె బాగ గుర్తున్నది మేస్త్రి. అట్లనే కానియ్యి. ఏర్పాట్లదేమ్నుది ఇటుక గురించి యాదగిరికి చెప్పు. యాకయ్యను మట్టిగొట్టుమని చెప్పు. పైసలేమన్న అవుసరముంటె చెప్పు. ఇప్పుడే ఇస్త. వాల్లకు సుత అట్లనె జెప్పు” అన్నాడు డాక్టరు గారు.
“పైసలదేమున్నది డాక్సర్సాబ్! నీ దగ్గరున్న పైసలు నా సందుగల వున్నట్టే. వాల్లగూడ పైసల పట్టింపుంటదనుకోను. మత్లబు మా చెప్తగని, వడ్లాయన పనేమన్న ఉన్నదా!”
“అది నీకెర్క నన్నడుగుతవేంది?”
“ఇప్పట్లేమి లేదు కని వాసాలుగిట్ల ఇప్పటి సంది సిద్ధం చేసుకొంటే పని రికాము లేకుంట నడుస్తాంటది” చెప్పాడు మైసయ్య.
“పట్వారి సాబును కలువాలె. వాసాలిప్పిస్తనన్నడు” చెప్పాడు డాక్టరు గారు.
“డంగు సున్నం సంగతి మరిస్తిమి” జ్ఞాపకం చేశాడు మైసయ్య.
“ముత్తిలింగంకు కూడ చెప్పు” అన్నాడు డాక్టరు గారు.
“డంగు మానడుస్తుంది గాని, మనకెన్ని వాయిలు గావాన్నో చెప్పాలె” అన్నాడు మైసయ్య.
“అది గూడ నీకె ఎర్క. “
“మనం గిలాబు కొఱకె సున్నమడిగినంగని, దర్వాజల మీద కిటికీల మీద సున్నం అడుసుతోని షాబాదు బండ బెట్టి దాని మించి ఇంటి చుట్టూరంగ డంగు సున్నంతోని ఒక ఇటుక వరుస కట్టుకస్తె ఇంటికి బలమస్తదని ఆలోచిస్తున్న” చెప్పాడు మైసయ్య.
“అట్లనె కాని మైసయ్యా! గృహప్రవేశం అయినంక నా ఇల్లు. అందాంక అది నీ ఇల్లే.” నవ్వుతూ చెప్పాడు డాక్టరు గారు. “మా ఆడిదానికి జరమస్తొంది బాంచెను. ఏమన్న మందిస్తావా!”
“అప్పటి సంది చెప్తలేవేంది. తీస్కరాపో!” అన్నాడు డాక్టరు గారు.
“లేస్త లేదు బాంచెను. ఇందాక వచ్చే పరిస్థితి లేదు”.
“పోదాం పా!” అంటూ వెంటనే లేచాడు డాక్టరు గారు మందుల సంచీని చేతిలోకి తీసుకుంటూ. ఇంటికి తాళం వేయమన్నట్లుగా తాళం కప్పని మేస్త్రి కందించాడు. నివ్వెరపోయి డాక్టరు గారికి దండం పెట్టి శిలావిగ్రహంలా నిల్చుండి పోయాడు మైసయ్య. మైసయ్య చేతుల్ని కిందకు దించుతూ చెప్పాడు డాక్టరు గారు “ఇది నా వృత్తి ధర్మం మైసయ్యా! ఇందులో నా గొప్పతనమేమీ లేదు.”
***
రేపటి ఉదయమే ఇంటిపని పునఃప్రారంభం. పూజ పూర్తి చేసుకొని ఆసుపత్రి తలుపులు బార్లా తీస్తున్నాడు డాక్టరు గారు. వీధి చివర నుండి కొత్తింటి కాపలా మనిషి సాయిలు పరుగు పరుగు వస్తున్నాడు. అతడిని చూచి అలాగే నిలుచుండి పోయాడు డాక్టరు గారు.
సాయిలు గబగబా వచ్చి డాక్టరు గారి కాళ్ళ మీద పడి బావురుమన్నాడు. డాక్టరు గారికేమీ అర్థం కాలేదు. కిందకు వంగి సాయిలును లేవనెత్తి “రా లోపలికి” అంటూ లోనికి తీసుకువచ్చి అడిగాడు.
“ఏమైంది సాయిలూ. నీలమ్మ మంచిగనె వున్నదా! నొప్పులొస్తున్నయా! రమ్మంటావా!” ఆదరం నిండి ఆత్రుతతో అడిగాడు డాక్టరు గారు.
“అయ్యా! నీలమ్మ సంగతి కాదయ్యా!” ఏడుపు మధ్యలో ఎక్కిళ్ళతో చెప్పాడు సాయిలు.
“మరి!” ఆశ్చర్యపోతూ లోనికెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చాడు డాక్టరు గారు. గ్లాసెడు నీళ్ళూ ఒక్కగుక్కలో తాగేసి కొంత తడవు తెప్పరిల్లాక చెప్పాడు సాయిలు.
“నీలమ్మ మంచిగనె వున్నది బాంచెను. మన ఇల్లే..” మళ్ళీ దుఃఖపు తెరతో ఆగిపోయాడు.
“చెప్పు సాయిలూ చెప్పు” ఈసారి డాక్టరు గారి గొంతులో ఆదుర్దా ధ్వనించింది.
“నీలమ్మను తల్లిగారింట్ల దించస్తనని మూడొద్దుల కింద పొయిన బాంచెను. ఇంక పదిహేను దినాలకు పసిద్దయితదని మంత్రసాని చెప్పింది. ఎంబడె ఎల్లొద్దామనుకున్నగని వాల్లు రానియ్యలె. మబ్బుల లేచి బయలెల్లిన. ఈడికచ్చెటాల్లకేమున్నది ఇల్లు మొత్తం..” మళ్ళీ దుఃఖపు తెరవచ్చింది సాయిలుకు.
సాయిలు విషయం చెప్పే పరిస్థితిలో లేడని బోధపడింది. బట్టలు వేసుకొని సాయిలు వెంట బయలుదేరాడు డాక్టరు గారు. ఇంటి స్థలానికి వచ్చి చూసిన డాక్టరు గారిని నిస్సత్తువ ఆవహించింది. సైకిలును వదిలేసి నేల మీద కూలబడి పోయాడు.
కిటికీలు, ద్వారబంధాలు ఒక్కటి కూడ లేవు. గడ్డపారలతో తవ్వి తీసుకెళ్ళిపోయారు. గోడలు నేలమట్టమయ్యాయి. పునాదిని కూడ తవ్వేసే వాళ్ళేమోగాని రాతి కట్టడం కనుక సాధ్యపడలేదేమో!
జంపన్నగూడెం నుంచి ఊళ్ళో కొచ్చే వారి ద్వారా వర్తమానం తెలుసుకున్న జనమంతా ఒక్కొక్కరూ వచ్చి డాక్టరు గారిని పలుకరించి ఓదార్చి పోసాగారు.
“కలికాలం కాకుంటే కట్టుకం జరిగిన చౌకోట్లు, కిటికీలు తవ్వుకోని బండ్లల్లేస్కపోతరా! దొంగల నుంచి దేన్ని కూడ కాపాడుకునెటట్టు లేదు కద!” అంటూ వాపోయారు వచ్చిన వాళ్ళంతా.
***
మరునాడుదయం పది పదకొండు మధ్య పోలీసుపటేలింటికి కాలినడకన వెళ్ళారు డాక్టరు గారు. ఇజ్లాస్ పని అయిపోయింది. ఒకళ్ళిద్దరు సుంకరివాళ్ళున్నారు.
“రా డాక్టర్ సాబ్ రా! రా!” అంటూ ఆప్యాయంగా ఆహ్వానించాడు బాల్రెడ్డి.
ఆ ఆప్యాయతను స్వీకరించే స్థితిలో లేడు డాక్టరు గారు. “మీతోని కొద్దిగ మాట్లాడాలె.”
“కొద్దిగేంది పూర్తిగ మాట్లాడుకుందాం. లోపటికి రా!” అంటూ డాక్టరు గార్ని మిద్దెపైకి తీసుకెళ్ళాడు బాల్రెడ్డి. లోగడ వైద్యం నిమిత్తం చర్చ జరిగిన చోటనే కూర్చున్నారిద్దరూ.
“పటేలా! ఈ వూరు వదిలి పొమ్మని చెప్తే పోతుంటి కదా! నాకింత నష్టం చేసుడు, నన్నింత అవమానం చేసుడు అవుసరమా!” సూటిగా అడిగాడు డాక్టరు గారు.
“నేన్నీకు నష్టం చేసిన్నా! ఏం చేసిన చెప్పు.”
“నా ఇల్లు దోచుకున్నది దొంగలు కాదు. నువు పురమాయించిన మనుషులు.”
“బడె వున్నవ్ డాక్టర్సాబ్! దేవున్లెక్క దొరికినవు. మా ప్రాణాలు కాపాడినవు. మాకు ఆరోగ్య ప్రదాతవు అని ప్రేమగ, గౌరవంగ చూస్కుంటుంటే తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్టుగ నన్నె బద్నాం చేస్తున్నవు” కోపానికొచ్చాడు బాల్రెడ్డి.
“తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన్నని నువు భావించినవు కాబట్కెనె మొన్న మా ఇంట్ల దొంగలు పడ్డరు. నిన్న నా కొత్తిల్లు నేలమట్టమయింది.”
“మేము మూడు రోజుల సంది వరంగల్లులనె వున్నం. రాత్రి ప్యాసెంజరుకొచ్చినం. అగౌ మీ అక్కనడుగు” అంటూ మంచినీళ్ళు, తేనీరు తెస్తున్న భార్యను చూస్తూ అన్నాడు బాల్రెడ్డి.
ఆవిడ డాక్టరు గారి వెనుక నుండి వస్తున్నది. వెనుతిరిగాడు డాక్టరు గారు. “నమస్తెనక్కా ఆరోగ్యం బాగున్నదా!” పలుకరించాడు.
“నీ దయవల్ల బాగున్నదన్నయ్యా! వదిన మంచిగున్నదా! ఆడపిల్లనట గద! చాన సంతోషం.”
“మంచిగున్నదక్కా!” సమాధానమిచ్చాడు డాక్టరు గారు.
“దొంగలు పడ్డరటకద! పటేల్సాబు చెప్తుండె. ఇన్న దినమంత నేను నిద్రపోలేదంటె నమ్ముని. నేను వస్తననుకున్నగని వదినమ్మ తల్లిగారింటికి పొయిందట గద. అందుకే రాలె. వదినమ్మ వచ్చినంక మత్లబు చెయ్యుని వస్త” అన్నది వనజమ్మ మంచినీళ్ళను, టీ ని బల్లమీద పెడుతూ.
“అక్కా! మీరు తెచ్చుడేంది. పనోల్లతోని పంపుతె సరిపోతుండె గద” నొచ్చుకున్నాడు డాక్టరు గారు.
“మా అన్నకు నేన్దెచ్చిన. నాకిష్టం లేకుంటెనా ఈడ తాసీల్దారు కూకున్న లెక్కజెయ్య” ప్రేమ పూర్వకంగా చెప్పింది. రెణ్ణిమిషాలు మౌనం రాజ్యం చేసింది. “అన్నా! వస్త. మీరేదొ కార్వాయి మాట్లాడుకుంటున్నట్టున్నరు” అంటూ నిష్క్రమించింది వనజమ్మ.
“చాయ తాగు, తర్వాత కొట్లాడుకుందాం గని” అంటూ టీ గ్లాసును డాక్టరు గారికందించి తాను కూడా ఒక గ్లాసు తీసుకున్నాడు బాల్రెడ్డి. తేనీటి సేవనం పూర్తయింది.
“నీ కొత్తింటి సంగతి ఇప్పుడిప్పుడే ఎరుకయింది. నేనె వస్తననుకున్న. నువ్వె వచ్చినవు” చెప్పాడు బాల్రెడ్డి.
“పటేలా! ఈ కతలన్ని లోకానికి చెప్పు. నా ఇంట్ల దొంగలు పడ్డరు. దవాఖాన ఒక్క వస్తువును ముట్టుకోలె. డ్రాయరు సొరుగుల వెయ్యి రూపాయలున్నయి. అట్లనె వున్నయి. ఇల్లంత ధ్వంసమయింది. దొంగలు చేతనయినకాడికి ఎత్తుకపోతరు కని ఇట్ల పరుపులు చింపుడు, బట్టలు ఖరాబు చేసుడువంటి పనులు చెయ్యరు.”
“ఆనాడు నువ్వె అన్నవు కద పైసలు దొరుకక అక్కసుతోని ఇల్లు నాశనం పట్టిచ్చినని.”
“పటేలా ఇరువై తులాల బంగారం శేరున్నర వెండి కంటే ఎక్కువ ధనం దొరుకాన్నా!”
“ఉండెనా! ఎక్కడ!”
“అమాకత్వం నటించకు పటేలా! వెండి బంగారాలు నీ దగ్గర్నె ఉన్నయి. అక్కరకచ్చె సామాన్లు వాల్లెత్తుకపొయిన్రు.”
“చీకట్ల రాయేస్తున్నవు డాక్టర్సాబ్!”
“చీకట్ల కాదు. వెలుగులనె. నేను నీకు ద్రోహం చేసిన అని నువ్వనుకుంటున్నవు. నీ దిక్కు నుండి చూసినపుడు అది నిజమే. కాని అది ప్రణాళిక ప్రకారం చేసింది కాదు. ఇప్పుడు నేనేం జెప్పిన నువు నమ్మవు. లోకం నమ్మది.”
“నువు దేన్ని గురించి చెప్తున్నవొ. నాకర్థమైతలేదు.”
“నీ కర్థమైందన్న విషయం నీ పెదవుల మీద పారాడుతున్న నీ విషపు నవ్వే చెప్తున్నది. నా వైద్యం పట్ల గల గౌరవం కారణంగ దవాఖానను ముట్టుకోలేదు. అది నీ కృతజ్ఞతకు తార్కాణం. తతిమ్మ ఇల్లంత ధ్వంసం చేసినవు. నీ కోపం తీరాలె. కని కొత్తగ కట్టుకుంటున్న ఇల్లు నేలమట్టం చేసేటంత కోపమెందుకు?”
“ఎందుకంటె నువు మారలె గనుక. ఎందుకంటే నువ్వు ఒదిగి ఉండలె గనుక. నా ఇంటికచ్చి తప్పైంది బాంచెను. ఇక నుంచి మంచిగుంట అని నా కాల్ల మీద పడలేదు కనుక” కోపాన్ని ఒడిసి పట్టుకొని తగ్గు స్వరంతో సాధ్యమైనంత తీవ్రంగా చెప్పాడు బాల్రెడ్డి. వనజమ్మకు ఈ విషయాలేవీ తెలియవు. తెలియకూడదన్నది బాల్రెడ్డి ఆలోచన.
(ఇంకా ఉంది)