వ్యామోహం-18

0
2

[శ్రీ వరిగొండ కాంతారావు రచించిన ‘వ్యామోహం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[బాల్రెడ్డి పటేలుకీ, డాక్టర్సాబ్‍కీ మధ్య వీరలక్ష్మి గురించిన చర్చ జరుగుతుంది. బాల్రెడ్డి చాలా కర్కశంగా మాట్లాడుతాడు. ఖిన్నుడయిన డాక్టర్సాబ్ తాను చేసిన తప్పుకి ఇప్పటికే తగిన శిక్ష పడిందనీ, ఈ ఊరు విడిచి మరో ఊరు వెళ్ళిపోతాననీ, ఏదో ఒకనాడు నువ్వే నా దగ్గరకి వస్తావని చెప్పి వచ్చేస్తాడు. మర్నాడు ఉదయం నర్సింగరావు కులకర్ణి డాక్టర్సాబ్‍ని తమ ఇంటికి పిలిపిస్తాడు. జరిగిన నష్టానికి నర్సింగరావు ఇంటిల్లిపాదీ డాక్టర్సాబ్‍ను పరామర్శిస్తారు. కాసేపయ్యాక, మరో గదిలోకి వెళ్ళి నర్సింగరావు, డాక్టర్సాబ్ ఏకాంతంగా మాట్లాడుకుంటారు. మీ విశ్వాసాన్ని కోల్పోయానని డాక్టర్సాబ్ అంటే, ఇదంతా కాలమహిమ అని చెప్పి, జరిగిన దాన్ని మరిచిపోయి, కొత్త జీవితం గడిపే మార్గం చూడమంటాడు నర్సింగరావు. కొత్త ప్రాక్టీసెక్కడ అనుకుంటున్నావని అడిగితే, అశ్వారావుపేటలోనే వుందామనుకుంటున్నట్లు చెప్తాడు డాక్టర్సబ్. అక్కడ వద్దని హనుమకొండలో మకాం పెట్టమని చెప్తాడు నర్సింగరావు. తన ఇంటికి చుట్టం చూపుగా వచ్చిన తన మామ కొడుకు రాజుని పిలిచి పరిచయం చేసి, హనుమకొండలో డాక్టర్సాబ్ ఇంటికి, దవాఖానకు వసతి చూడమని చెప్తాడు. అలాగేనంటాడు రాజు. రెండు రోజుల తర్వాత రాజు వెంట హనుమకొండకు వెళ్ళి అక్కడో ఇల్లు, దవాఖానాకి వసతి చూసుకుంటాడు డాక్టర్సాబ్. జోడెద్దులపాలానికి వీడ్కోలు చెప్పి హనుమకొండకు వచ్చేస్తాడు. ఈ వివరాలేవివి మందులకుంటలో ఉన్న భార్యకీ, అత్తగారికీ, బావమరిదికి తెలియకుండా జాగ్రత్త పడ్తాడు. హనుమకొండలోని మిత్రుడు కృష్ణమాచారికి కూడా వెంటనే చెప్పడు. కొన్ని రోజుల తర్వాత, ప్రాక్టీసు పుంజుకున్నాకా, కృష్ణమాచారి ఇంటికి వెళ్ళి ఇక్కడ స్థిరపడిన సంగతి చెప్తాడు. ఆ దంపతులు సంతోషిస్తారు. కాముని పున్నమికి మందులకుంట వెడతాడు డాక్టర్సాబ్. మాటల మధ్యలో ఉగాది పండుగ హనుమకొండలో మన ఇంట్లో చేసుకుందామని చెప్పి, తాను ఇప్పుడు హనుమకొండలో ఉంటున్నట్లు చెప్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు. భార్య కారణమడిగితే, ఏవో రాజకీయ సమస్యల వల్ల ఆ ఊరు విడిచిపెట్టాల్సి వచ్చిందని చెప్తాడు. సంబంధం లేని విషయాల్లో తల దూర్చి చిక్కులు తెచ్చిపెట్టుకోవడం మీ బావగారికి అలవాటేలేరా అని డాక్టరమ్మ తమ్ముడితో అంటుంది. ఇక చదవండి.]

[dropcap]పె[/dropcap]ద్దల విషయమేమోకాని, హనుమకొండ ఇల్లు పిల్లలకు అమితానందాన్ని కలిగించింది. రాము మొట్టమొదటిసారిగా విద్యుద్దీపాల్ని చూచాడు. స్విచ్ వేస్తే బల్బు వెలగడం అతడికి చాల వింతగా తోచింది. లైటు వేయడం, ఆర్పడం అన్నది ఓ వారం రోజులపాటు అతడికి ఆటగా వుండింది. నల్లా గొట్టాల్లో మంచినీళ్ళు రావడం, నీళ్ళు వద్దనుకొన్నప్పుడు బిసను కట్టేయడం అదొక వింత. జోడెడ్లపాలెంలో పట్టుమని పాతికమందికి సైకిళ్ళుండేవేమో! తమది సైకిలు గల కుటుంబం. చాల గొప్ప. ఇక్కడ గుమ్మమ్ముందు నుంచుంటే గంటకు పాతిక సైకిళ్ళు వెళుతున్నాయి. అప్పుడొకటి ఇప్పుడొకటిగా మోటారు సైకిళ్ళు వెళుతున్నాయి. దూరంగా పెద్దరోడ్డు మీద రిక్షాలు, జట్కాలు, బస్సులు, అప్పుడప్పుడు కనిపించే కార్లు ఇవన్నీ వింత గొలిపే విషయాలే. పిల్లల ఆనందానికవధుల్లేవు.

ఇది వరకు వరంగల్లులోను, మార్వాడి సత్రంలోను ఉన్నప్పుడు ఉన్న వివరాలే ఇవి. అయినా ఎందుకో అప్పుడవి రాము మనసును ఆకర్షించలేదు. ఇప్పుడు ఇది మన ఇల్లు, మన ఊరు అన్న భావన కలుగగానే చుట్టూ ఉన్న పరిసరాలు రాము మనసును ఆకట్టుకుంటున్నాయి.

హనుమకొండ టౌనుహాలు, పబ్లిక్ గార్డెన్ కూడ లష్కర్ బజార్‌ను ఆనుకునే వుంటాయి. డాక్టరు దంపతులు రెండు మూడు సార్లు గార్డెన్‌కి కూడా వెళ్ళివచ్చారు.

“ఏమే! మీ ఇంట్లో బోల్డంత ఇత్తడి సామానుండాలి. గుండిగలు, బిందెలు ఉండాలి. అమ్మమ్మ ఇచ్చిన రాగి కాగుండాలి. కనబడడం లేదేంటే!” ఆరా తీసింది మంగమ్మ గారు.

“జోడెడ్లపాలెంలో ఉంటాయిలేమ్మా! ఆయన చెప్పడం లేదు గాని, ఎన్నికలైపోయి పరిస్థితులు చక్కబడ్డాక మళ్ళీ మా వూరికి మేం వెళ్ళిపోతాం. సొంత ఇంట్లోకి మారిపోతాం కూడా!” ధీమాగా చెప్పింది డాక్టరమ్మ.

“హనుమకొండలో మొదటి ఉగాది” ఉగాది పచ్చడి తింటూ అన్నారు డాక్టరు గారు.

“మళ్ళీ ఉగాది మన ఊళ్ళోనే” చెప్పింది డాక్టరమ్మ.

భర్త నుండి చిరునవ్వే సమాధానంగా లభించిందావిడకు. సొంత ఇల్లు కళ్ళల్లో కదలాడుతుండగా ఆనందంతో పొంగిపోయింది డాక్టరమ్మ మనస్సు.

“బళ్ళో పరీక్షలు మొదలవుతున్నాయి. పని ఎక్కువగా ఉంటోంది. అమ్మను పంపిస్తావా అక్కయ్యా!” అడిగాడు సత్యమూర్తి.

“దాన్దేముందిరా తీసుకెళ్ళు” అనుమతించింది అక్కయ్య.

మేనమామ అమ్మమ్మలతో పాటు రాము గూడ బయల్దేరాడు. ఆరవ తరగతి పరీక్షలు రాయాలిగా మరి.

***

తల్లి వెళ్ళిపోయిన నాలుగవరోజున రాత్రి పూట పిల్లలు నిద్రపోయాక ఏకాంతంలో భర్తను అడిగింది డాక్టరమ్మ.

“మనం జోడెడ్లపాలెం ఎప్పుడు వెళదామండి”

“ఎందుకట”

“ఎందుకేమిటి? మీక్కావలసిన సామాన్లు మీరు తెచ్చుకున్నారు. వంటింటి సామానంతా అక్కడే వుంది. మొన్న అమ్మ అడగను కూడ అడిగింది ‘అమ్మమ్మ ఇచ్చిన రాగి కాగు కనపడడం లేదేమిటే’ అని. మీరు వీలు చూచుకుంటే వెళ్ళి ఓ రెండ్రోజులుండి వద్దాం. అందర్నీ కలసినట్టూ వుంటుంది. సామాన్లు తెచ్చుకోవచ్చు”, జవాబిచ్చింది డాక్టరమ్మ.

“జోడెడ్లపాలెం వెళ్ళడానికి కుదరదు త్రిపురా!” అంటూ వీరలక్ష్మితో తన కేర్పడిన సంబంధంతో సహా, తను పొందిన అవమానాల్ని వేటినీ దాచుకోకుండా ఉన్నదున్నట్టుగా చెప్పాడు డాక్టరు గారు.

“అయితే మీరు హనుమకొండకు కట్టుబట్టల్తో వచ్చారా!” దుఃఖాన్ని ఉగ్గబట్టుకుంటూ అడిగింది డాక్టరమ్మ.

“అవును”

తట్టుకోలేకపోయింది డాక్టరమ్మ. దుఃఖం తన్నుకు వచ్చింది. పెద్ద పెట్టున ఏడవసాగింది. నిద్దట్లో వున్న పిల్లలు అదాటున లేచి ఏడవడం మొదలుపెట్టారు. ఆ రాత్రి ఎవరికీ నిద్రలేదు.

మరుసటి రోజు పగలు భార్యాభర్తలిద్దరూ మౌనంగానే వున్నారు. రాత్రి పిల్లలు పడుకున్నాక అడిగింది డాక్టరమ్మ.

“వీరలక్ష్మితో జాగ్రత్త అని నేను మొదటిరోజే చెప్పాను కదా!”

“చెప్పావు. కాని వీరలక్ష్మి మంచిదని నువ్వే తరువాత అన్నావు.”

“అయితే”

“అయితే ఏం లేదు త్రిపురా! పొరపాటు కాదు పెద్ద తప్పే నావల్ల జరిగింది. దాని ఫలితంగా ఏర్పడిన కష్టనష్టాలను మీరు కూడా అనుభవించాల్సి వస్తోంది.”

“మందులకుంటలో మీరు మా వాళ్ళకు చెప్పిన వెంకట్రామయ్య రాజకీయం కట్టుకథేనన్నమాట.”

“కట్టుకథ కాదు, నిజమే. కాని మనం ఊరు వదలి రావడానికి కారణం మాత్రం వీరలక్ష్మి కారణంగా పటేలుతో మనకు ఏర్పడిన వైరం.”

“ఇరవై తులాల బంగారం, బోల్డన్ని నగలు, అందులో సగం మా అమ్మా వాళ్ళు పెట్టినవి. మా అమ్మమ్మ ఇచ్చిన వెండి సామాన్లు, అత్తయ్యగారిచ్చిన గుండిగలు, అమ్మమ్మ ఇచ్చిన రాగి కాగు – ఓరి దేవుడో మీ జారత్వం కారణంగా ఎంతటి నష్టమో చెప్పండి. వస్తువుల విలువ మాత్రమే కాదు, పోయిన ప్రతి వస్తువు వెనుక ఒక జ్ఞాపకం ఉంది. ఆ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉంటాయి.” కళ్ళ వెంట ధారాపాతంగా నీళ్ళు కార్తున్నాయి డాక్టరమ్మకు.

“ఊర్కో త్రిపురా! ఊర్కో! మనది కష్టార్జితం. పోయిన సొమ్ముకి రెండింతలు భగవంతుడే మనకు ఏదో ఒక రూపంలో సమకూరుస్తాడు” అనునయించాడు డాక్టరు గారు.

“అన్యాయంగా పోలేదు కదండి! మీరు చేసిన తప్పుకు శిక్షగా పోయాయి. వాటిని ఏ దేవుడు తిరిగి తెచ్చిస్తాడు. మీ వద్దకు వచ్చే ఎంతోమంది రోగులకు మీరే చెప్పేవారు కదా! ‘చెడు నడత వద్దు, ఆరోగ్యం పోతే రాదు’ అని. మీ విద్య ఏమైంది? వివేకం ఏమైంది? ఒక ఆడది హొయలు పోతే పడిపోవడానికి మీరేమైనా బాలాకుమారులా! నవ యౌవనులా! నలుగురు పిల్లల తండ్రి. ఐదవ శిశువు మీ భార్య కడుపులో వుంది. సంజాయిషీ ఇచ్చుకొందుకైనా సిగ్గూ ఎగ్గూ ఉండాలి” ఉగ్రరూపం దాల్చిన డాక్టరమ్మ వాక్ప్రవాహానికి ఆనకట్ట ఎలా వేయాలో తెలీక నిశ్చేష్టుడైనాడు డాక్టరు గారు.

కొంత తడవైనాక అలసటతో నోరెండిపోయి నిలచిపోయింది డాక్టరమ్మ. మంచినీళ్ళు తెచ్చిచ్చాడు డాక్టరు గారు.

“త్రిపురా! నువ్వు నా మీద గల ప్రేమ కారణంగా నన్ను క్షమించి వదిలేసినా నా తప్పుకు నిష్కృతి వుంటుందని నేననుకోను. దాన్నొక పీడకలగా మరచిపోదాం. మరచిపోవడంలోనే ఆనందముంటుంది.”

“అవును. ఇక్కడ ఇంకొక వీరలక్ష్మిని వెతుక్కోవచ్చు.”

డాక్టరమ్మ ఎత్తిపొడుపుకు నవ్వొచ్చింది డాక్టరు గారికి. డాక్టరు గారి నవ్వును చూచిన డాక్టరమ్మకు చిరాకెత్తుకొచ్చింది.

“మీ నవ్వుకు అర్థమేంటి? వేరెవరినో వెతికిపెట్టుకున్నారనేగా! అసలింతకూ వీరలక్ష్మికీ మీకూ సంబంధం తెగిపోయిందా, ఇంకా మిగిలేవుందా! మీక్కలిగిన కష్టానికి మీకు ఆవిడ ఓదార్పు, మొగుడు కొట్టిన దెబ్బలకు దానికి మీ ఓదార్పు. ఇలా ఓదార్చుకుంటూ ఓదార్చుకుంటూ మళ్ళీ రంగాన్ని సిద్ధం చేసుకుని వున్నారా!” డాక్టరమ్మ కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి.

“దేముడి మీద ఒట్టేసి చెప్తున్నా త్రిపురా! వీరలక్ష్మి గురించి నాకేమి తెలియదు” అంటూ సమ్మక్క వీరలక్ష్మి మందుల గురించి తన వద్దకు రావడం, తను వైద్యం చేయడానికి నిరాకరించడమూ, ఆ విషయాన్ని మళ్ళీ బాల్రెడ్డికి స్పష్టం చేయడమూ వివరంగా చెప్పుకొచ్చాడు డాక్టరు గారు. నమ్మలేనట్లుగా చూచింది డాక్టరమ్మ.

“నీ ఆరోగ్యం గురించిన ఆందోళన కారణంగానే జరిగిన దొంగతనం గురించి నీకు చెప్పలేదు. పరిస్థితులు చక్కబడ్డాయి. ఊరివారి సహకారంతో మళ్ళీ ఒక ఊపు వచ్చింది. జరిగిన నష్టానికి రెండింతలు సంపాదించుకోవచ్చన్న ధీమా వచ్చింది. ఊరివాళ్ళకు మన పట్ల ఏర్పడిన సానుభూతిని, వాళ్ళు మనకందించే సహకారాన్ని జీర్ణించుకోలేకపోయాడు బాల్రెడ్డి పటేలు. ఈ కారణంగానే కొత్త ఇంటిని నేలమట్టం చేశాడు.

కులకర్ణి గారు ‘నీకు జరిగిన నష్టాన్ని పటేలు పూడుస్తాడు. ఇల్లు కూడ దగ్గరుండి కట్టిస్తాడు. నేను చెప్తాను. సరేనా!’ అన్నారు. నాకే మనసొప్పలేదు, వద్దని చెప్పి వచ్చేశాను. మనకిక్కడ ఏర్పాట్లు చూసింది కూడ కులకర్ణి గారే. ఆయన మేనమామ నరసింహారావు. పేరుపొందిన న్యాయవాది. ఒకసారి మనం వాళ్ళింటికి వెళ్ళాల్సివుంది కూడా!” విపులంగా చెప్పాడు డాక్టరు గారు.

“ఇప్పుడు నా మీద ఒట్టేసి చెప్పండి – మీకూ వీరలక్ష్మికీ ఏ సంబంధమూ లేదు కదా!” డాక్టరు గారి కుడి చేతిని తన తల మీద పెట్టుకొంటూ అడిగింది డాక్టరమ్మ.

“నిండు మనసుతో త్రికరణశుద్ధిగా ఒట్టేసి చెప్తున్నా! నాకూ వీరలక్ష్మికి ఏ సంబంధమూ లేదు” చెప్పాడు డాక్టరు గారు.

ఓ గంట తర్వాత ప్రశాంతంగా నిద్రించారా దంపతులు.

***

“శుభాకాంక్షలు మేనత్తా!” ఆసుపత్రి నుండి మధ్యాహ్నం భోజనానికొచ్చిన డాక్టరు గారు తన భార్యతో అన్నాడు.

“అదేమిటండీ కొత్త పిలుపు” అర్థం కాక అడిగింది డాక్టరమ్మ.

“ఆదిలాబాదులో నీకు మేనల్లుడు పుట్టాడోయ్. ఈ పూటే వచ్చింది శుభలేఖ” అంటూ పసుపురాసి వున్న పోస్టు కార్డును డాక్టరమ్మ చేతిలో పెట్టాడు డాక్టరు గారు.

“అవునా వుండండి” అంటూ వంటింట్లోకి పరుగున వెళ్ళి వచ్చి డాక్టరు గారి నోట్లో పంచదార పోసింది డాక్టరమ్మ.

“అబ్బో ఆనందమే!”

“కాదా మరి. వచ్చే శ్రావణానికి అన్నయ్య పెళ్ళయి పన్నెండేళ్ళు. తానింక తల్లిని కాలేమోనని వదిన బెంగపెట్టేసుకుంది కూడా!”

“పోనీలే. వాళ్ళ బెంగ తీరింది. మీ అమ్మ మద్ది ఆంజనేయస్వామికి మొక్కిన మొక్కు నెరవేరింది.”

“అవునండీ! ఆ గుడికి వచ్చిన సాములారిచ్చిన విభూతి, మంత్రమూ బాగానే పనిచేసినయి” ఆనందపడ్డది డాక్టరమ్మ.

“లెక్క చూశాను. ఇవాల్టికి పురిటినీళ్ళు. ఇరవై ఒకటిన బారసాలట. పెద్దాపరేషను జరిగిందట” చెప్పాడు డాక్టరు.

“అవునండి వదిన ముఫ్ఫయ్యవపడిలో కొచ్చేసింది. ఇంకొన్నేళ్ళయితే గర్భధారణ వల్ల తల్లి ప్రాణానికే ముప్పట కదా!”

“నిజమే. తొలికాన్సు పాతికేళ్ళలోపు వరకు సులువుగా వస్తుంది. స్త్రీ దేహ నిర్మాణమే ఆ విధంగా వుంటుంది. వయసు పెరిగిన కొద్ది గర్భాశయ కండరాలు, పురిటి నిమిత్తం వ్యాకోచ సంకోచాలకు లోనుకావలసిన పొత్తి కడుపు కండరాలు గట్టి పడిపోతాయి. శిశు ప్రయాణమార్గం కూడ ఒకోసారి మూసుకుపోవచ్చు.” వివరించి చెప్పాడు డాక్టరు గారు.

“దేముడి దయవల్ల వదిన బ్రతికి బట్ట కట్ట కలిగింది. తల్లి కాగలిగింది” అంటూ గోడకు తగిలించివున్న వెంకటేశ్వరస్వామి పటం వద్దకు వెళ్ళి భక్తి పూర్వకంగా దణ్ణం పెట్టుకొంది.

“ఆసుపత్రి చుట్టూ తిరగడం కష్టమే అయి వుంటుంది.”

“తప్పదు కదా! అయినా పరవాలేదు లెండి. వదినా వాళ్ళమ్మ ఐదో నెలనే వచ్చింది సాయం కోసం. మా అమ్మ గూడ వెళ్ళి నెలరోజులు కావస్తూంది” జవాబిచ్చింది డాక్టరమ్మ.

తల్లిదండ్రుల హడావుడి గమనించి ఆటలు మాని దగ్గరకొచ్చారు పిల్లలు. “మీకు బావ పుట్టాడురా!” చెప్పింది తల్లి ఆనందంగా.

“బావంటే!” అర్థంకాక అడిగాడు రెండోవాడు.

“పెద్ద మామయ్యకు కొడుకు పుట్టాడు” చెప్పాడు రాము. వాడికిప్పుడిప్పుడే విషయాలు తెలుస్తున్నాయి. ‘మనం జాగ్రత్తగా ఉండాలి సుమా!’ అన్నట్లుగా ముఖాలు చూచుకున్నారు తల్లిదండ్రులు.

మర్నాడు మధ్యాహ్నం డాక్టరు గారు భోంచేస్తూండగా “నమస్కారం బావగారూ!” అంటూ వచ్చాడు సత్యమూర్తి.

“శుభాకాంక్షలు బాబాయి గారూ!” పలుకరిస్తూ ఆహ్వానం పలికాడు డాక్టరు గారు.

“శుభలేఖ అందిందన్నమాట. శుభవార్త నేనే ముందు చెబుదామనుకున్నాను” అన్నాడు సత్యమూర్తి.

“తంతి తపాల శాఖవాళ్ళు నీకా అవకాశాన్ని దక్కనీయలేదు” నవ్వుతూ చెప్పాడు డాక్టరు గారు.

“రారా భోంచేద్దువు గాని” అంటూ పీటవేసి కంచంలో అన్నం వడ్డించింది డాక్టరమ్మ. కాళ్ళు కడుక్కొచ్చి భోజనానికి కూర్చున్నాడు సత్యమూర్తి.

“బావా ఎప్పుడు ప్రయాణం”

“ఇంకా పదిరోజులుంది కద బావమరిదీ!” అన్నాడు డాక్టరు గారు.

“ఆదిలాబాదు ప్రయాణమంటే మాటలా! సాయంకాలం ప్యాసింజరెక్కి రాత్రి మంచిర్యాలలో దిగాలా! ఏ హోటలు వాడినో అడిగి లేదా స్టేషన్లోనే రాత్రి కాలక్షేపం చేసి తెల్లారగట్ల నాలుగున్నరకి నిర్మల్ బస్సెక్కాలి. ఉదయం తొమ్మిదిన్నర పదింటికి నిర్మల్‍లో దిగాక ఆదిలాబాదు బస్సుకి పడిగాపులు కాయాలి. బస్సెక్కాక ఎంత లేదన్న మూడున్నర నాలుగ్గంటల ప్రయాణం. ఇవాళ సాయంకాలం బయల్దేరితే రేపు మధ్యాహ్నానికో సాయంత్రానికో చేరుకొంటాం” వివరించాడు సత్యమూర్తి.

“తెల్లారగట్ల రైలెక్కితే రాత్రికల్లా చేరుకుంటాం కదా!” ప్రత్యామ్నాయాన్ని సూచించాడు డాక్టరు గారు.

“అవుననుకో. చివరి బస్సెత్తిపోతే మాత్రం నిర్మల్ లోనే పడుకోవాలి.”

“చివరి బస్సుక్కూడ అందుకోలేమా!”

“చివరి బస్సు నాలుగింటికే బావా!” హెచ్చరించాడు సత్యమూర్తి.

“సరే చూద్దాం లే! ఇప్పుడే కదా వచ్చావు” భోజనం ముగిస్తూ చెప్పాడు డాక్టరు గారు.

“మీ బావ గారు ప్రయాణానికి ఓ పట్టాన ఒప్పుకోరు. తెమలరు.” డాక్టరు గారు ఆసుపత్రికి వెళ్ళిపోయాక తమ్ముడితో చెప్పింది డాక్టరమ్మ.

“అందుకే కదక్కయ్యా! ఊర్నించి రాంగానే మొదలు పెట్టింది” అన్నాడు నవ్వుతూ సత్యమూర్తి.

రాత్రి మళ్ళీ ప్రస్తావన తెచ్చాడు బావమరిది.

“నీకు బడిలేదా! ఇంతముందుగా బయల్దేరుతున్నావు” అడిగాడు డాక్టరు గారు.

“అదేంటి బావా! సెలవులు మొదలయి నాలుగు రోజులయింది. రామూ పరీక్షలయిపోయి కూడ నెల కావస్తూంది కదా!” జవాబిచ్చాడు సత్యమూర్తి.

చిట్ట చివరకు బారసాల ఇంకొక నాలుగు రోజులుందనగా సత్యమూర్తితో పాటు ఆదిలాబాదుకి బయలుదేరింది డాక్టరు గారి కుటుంబం.

సుందరమూర్తి భార్య కాంతిమతి ఆడపడుచు రాకను స్వాగతించింది. ఆనందించింది. తెల్లగా బొద్దుగా ఉన్న మేనల్లుడిని చూచి మురిసిపోయింది డాక్టరమ్మ. రమాలక్ష్మిని ఎత్తుకుని ముద్దాడింది కాంతిమతి. ఆవిడ రమాలక్ష్మిని చూడడం ఇదే ప్రథమం. బారసాల చాలా అట్టహాసంగా జరిగింది. సుందరమూర్తికి ఆదిలాబాదులో అధ్యాపకునిగా చాలామంచి పేరుంది. ఊరి ప్రముఖులందరనూ తన బావకు పరిచయం చేశాడు సుందరమూర్తి.

బారసాల జరిగిన నాలుగవ రోజున హనుమకొండకు ఒంటరిగా బయల్దేరాడు డాక్టరు గారు. మళ్ళీ బళ్ళు తెరిచే వరకు మిగతా అందరూ అక్కడే ఉండిపోయే నిర్ణయమయింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here