Site icon Sanchika

వ్యామోహం-19

[శ్రీ వరిగొండ కాంతారావు రచించిన ‘వ్యామోహం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[హనుమకొండలోని ఇల్లు డాక్టర్సాబ్ పిల్లలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంతకు ముందెన్నడూ చూడని వింతలూ, విశేషాలు వాళ్ళు ఇక్కడ చూస్తారు. ఈ ఇంట్లో ఇత్తడి సామాన్లు, గుండిగలు, బిందెలు, రాగి కాగు ఇవన్నీ లేవు, ఏమయ్యాయని మంగమ్మ గారు ఆరాతీస్తే, జోడెడ్లపాలెంలో ఉంటాయిలేమ్మా, పరిస్థితులు చక్కబడ్డాకా, మేం మా ఊరికి వెళ్ళిపోతాం, సొంత ఇంటికి మారిపోతాం అంటుంది డాక్టరమ్మ. అమ్మని, రాముని వెంట తీసుకుని మందులకుంట వెళ్ళిపోతాడు సత్యమూర్తి. నాలుగు రోజులయ్యాక, ఓ రాత్రి పూట మనం జోడెడ్లపాలెం ఎప్పుడు వెళ్తాం అని అడుగుతుంది డాక్టరమ్మ. ఇక జోడెడ్లపాలానికి వెళ్ళడం కుదరదు అంటూ అక్కడ జరిగిన అన్ని సంఘటనలనూ, వీరలక్ష్మితో తనకి ఏర్పడిన సంబంధంతో సహా ఏదీ దాచకుండా అన్నీ చెప్పేస్తాడు డాక్టర్సబ్. నిర్ఘాంతపోతుంది డాక్టరమ్మ. గట్టిగా ఏడుస్తుంది. నిద్ర లేచిన పిల్లలూ ఏడుస్తారు. ఆ రాత్రి మౌనంగా గడిచిపోతుంది. మర్నాడు తాము కోల్పోయిన బంగారం, నగలు, విలువైన వస్తువులను తలచుకుని ఏడుస్తూ, మీ జారత్వం వల్లే ఇలా జరిగిందని భర్తని తిడుతుంది. ఆ తిట్లన్నీ పడతాడు డాక్టర్సాబ్. అది ముగిసిపోయిన అధ్యాయం అనీ, ఇప్పుడు వీరలక్ష్మితో ఎటువంటి బంధం లేదని గట్టిగా చెప్తాడు. ఆదిలాబాదులో డాక్టరమ్మ అన్నయ్యకు కొడుకు పుట్టాడన్న వార్తతో ఉత్తరం వస్తుంది. బారసాలకు రమ్మని ఆహ్వానం అందుతుంది. బారసాల ఇంకొక నాలుగు రోజులుందనగా సత్యమూర్తితో పాటు ఆదిలాబాదుకి బయలుదేరుతుంది డాక్టరు గారి కుటుంబం. బారసాల పూర్తయ్యాకా, మరో నాలుగు రోజులకి డాక్టర్సాబ్ ఒక్కడే హనుమకొండకి తిరిగి వస్తాడు. ఇక చదవండి.]

[dropcap]మ[/dropcap]ధ్యాహ్నం పన్నెండు కావస్తోంది. ఎండలు విపరీతంగా ఉన్నాయి. జనసంచారం అంతగా లేదు. ఆసుపత్రిలో డాక్టరు గారొక్కరే వున్నారు. పొద్దుట్నించి ఐదుగురో ఆరుగురో వచ్చి వెళ్ళారు. పట్నమయ్యేసరికి రోగులు ఇంగ్లీషు వైద్యాన్నే ఇష్టపడుతున్నారు. ఎవరికేది కావాలి అంటే వారికది అన్నట్లుగా వైద్యం చేస్తున్నాడు. పన్నెండున్నర వరకు ఉండాలన్న నియమం పెట్టుకున్న కారణంగా రోగులెవరూ లేకున్నా ఆసుపత్రిలో అలాగే ఉండిపోయాడు డాక్టరుగారు. వైద్య గ్రంథాలను మాత్రమే కాదు వైద్యేతర గ్రంథాలను కూడ చాల ఇష్టంగ చదువుతారాయన. ఇప్పుడాయన స్వామి శివానంద జీవిత చరిత్రను తదేక దీక్షతో చదువుతున్నారు.

“రావచ్చునా డాక్సర్‌సాబ్!” పరిచితమైన గొంతు వినబడింది. కాని ఎవరిదో గుర్తుకు రావడం లేదు.

మధ్యగా తెరలను కట్టి ఆసుపత్రి గదిని రెండు భాగాలుగా విభజించారు. ముందు భాగంలో రోగులు వేచి వుండడానికి, వెనుక భాగంలో డాక్టరు గారు రోగిని పరీక్షించి మందులివ్వడానికి. పట్నం రోగులు తమ అనారోగ్యాన్ని గురించి నలుగురి మధ్య చెప్పుకోవడానికిష్టపడరు కనుక ఏకాంతం అవసరం.

“రండి! రండి!!” ఆహ్వానించాడు డాక్టరు గారు.

“నమస్తే డాక్సర్‌సాబ్” అంటూ లోనికొచ్చిన మనిషిని చూసి నివ్వెరపోయాడు డాక్టరు గారు. ఆమె వీరలక్ష్మి. ఆహార్యము మారింది. మాట తీరు మారింది.

“కూచుండు మంటరా!” అని అడుగుతునే ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. డాక్టరు గారు తేరుకోవడానికి రెండు నిమిషాల సమయం పట్టింది.

“బాగున్నవా వీరలక్ష్మీ!” చిరునవ్వుతో అడిగాడు.

“మంచిగనె. నన్ను గుర్తుపడ్తారొ పట్టరొ అనుకున్న.”

“గడుసుతనం పోలేదు వీరలక్ష్మీ!”

“పొమ్మంటె పొయ్యెటందుకు ఇది కావల్సుకోని తెచ్చుకున్నది కాదు కద డాక్సర్సాబ్.”

“ఏమిటి ఇక్కడ. నేనిక్కడున్నానని ఎవరు చెప్పారు?” కొంత అసహనం తొంగి చూసింది డాక్టరుగారి గొంతులో.

“యాష్టపడకయ్య! చెప్పేదిను!” అసహనాన్ని పసిగట్టేసింది వీరలక్ష్మి.

“ఊఁ చెప్పు”

“దేవుని పత్తా ఎవలైన చెప్తరు. నువు నాకు దేవునివి. మా తల్లి గారు కరీమాబాదు. మర్చిపోయినవా అయ్యా!”

“తల్లిగారింటికొచ్చినవా!”

“నీ లెక్కనె.”

“అంటే హనుమకొండ మా తల్లిగారిల్లన్నట్టా!” కోపంగా అడిగాడు డాక్టరు గారు.

“మల్ల జోడెడ్లపాలెం పోతలేను.” పట్టించుకోకుండా చెప్పింది వీరలక్ష్మి.

“ఎందుకట!” వెటకారంగా అడిగాడు డాక్టరు గారు.

“అయ్య! నువు నా మొకం జూసి ఏడెనిమిది నెలలయితాంది. మీ ఇంట్ల దొంగలు పడ్డ కాడికెల్లి నా మొకం జూసింది లేదు. అంతకు ముందు నెలదినాలు వరంగల్లుల్నె వున్నవు. కొద్దిగ దయతోని నాకత ఇనాల్నయ్య. నువు తప్ప నాకీ లోకంల ఎవలులేరు.” కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్పింది వీరలక్ష్మి.

“మీ తమ్ముడు, మరదలు నీ వాళ్ళు కాదా! నీకూ నాకు ఏం సంబంధం. అది అక్రమ సంబంధం. గడువు ముగిసిపోయింది. సంబంధం రద్దయింది.”

“ఇన్నొద్దులకీ సంబంధం రద్దని మనమనుకున్నమా!”

“అనుకున్నా అనుకోకపోయినా ఏదో ఒక రోజున ఆగిపోయే సంబంధమే. పరిస్థితులు కమ్ముకొచ్చిన కారణంగా అకస్మాత్తుగా రద్దయింది. నా జీవితం అస్తవ్యస్తమయింది. ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమయింది. పేరు ప్రతిష్ఠలు మంటగలిసిపోయాయి. ఇంత జరిగాక నీకూ నాకూ ఏ అనుబంధముందనుకోవాలి” కోపం డాక్టరు గారి నియంత్రణలో ఉండడం లేదు.

లేచి నుల్చుంది వీరలక్ష్మి. “అయ్యా! నేను సచ్చిపోవాల్ననె తీర్మానించుకున్న. జోడెడ్లపాలెంలనె ఉరిపెట్టుకుంటుంటి. వరంగల్లుకు మా తమ్ముడు, మరదలు కొఱకు రాలె. నీ కొఱకె వచ్చిన. నిన్ను చూసినంక చచ్చిపోదామనుకున్న. కని ఆత్మహత్య మహాపాపమని గుళ్ళె పూజారి చెప్తుంటే ఇన్న. నాకు బతుకాన్ననని వున్నది. నిన్ను చూసి నీతోని మాట్లాడ్తె బతుకు మీద ఆశపుడదనుకోని వచ్చిన. ఇప్పుడు బతుకాన్నని లేదు. పోతున్న. ఇదే ఆఖరి చూపనుకో. నేన్నిన్ను బెదరిస్తలేను. మనిషి బతుకుండాన్నంటె ఏదన్న ఒక ఆధారముండాలె. నీ మీది ఆలోచననె నాకు బతుకు తీపి. ఉన్న ఒక్క ఆధారం పోయినంక బతికేటికి సచ్చేటికి” అంటూ నమస్కరించి బయటకు నడిచింది వీరలక్ష్మి. ఆసుపత్రి గుమ్మందాటి మెట్లు దిగుతున్నది. లోపల్నుండి పిలుపు వచ్చింది ‘వీరలక్ష్మీ’!

డాక్టరు గారి ఎదురుగా కూర్చుంది వీరలక్ష్మి.

“చెప్పు వీరలక్ష్మీ!”

వీరలక్ష్మికి దుఃఖం తన్నుకు వచ్చింది. ఎక్కిళ్ళు వచ్చేంత ఏడ్చింది. అంతా నిశ్శబ్దంగానే. డాక్టరు గారు చూస్తూ కూర్చున్నాడు. అదే జోడెడ్లపాలెంలో అయితే లేచి వచ్చి భుజమ్మీద చెయ్యివేసి అనునయించేవాడేమో! తేరుకున్నాక తన పక్కనే ఉన్న కూజాలో నీళ్ళను గాజు గ్లాసులో పోసి ఇచ్చాడు. తాగింది వీరలక్ష్మి. చీరకొంగుతో కన్నీళ్లను తుడుచుకొంది. సిగ్గుతో తల వంచుకుంది.

“ఇప్పుడు చెప్పు”

“నవ్వు ఊల్లె లెవ్వు. డాక్టరమ్మ ప్రసూతి కొఱకు వరంగల్లు కొచ్చినవు. బాల్రెడ్డి పటేలుకు మన సంగతి తెలిసింది. ఎట్ల తెలిసిందో ఏమొ!”

“మనమేమన్న రహస్యంగున్నమా! ఊరంతకు తెలిసిన ముచ్చట్నె కద!” అన్నాడు డాక్టరు.

“నాకు తెలిసి సుంకరోల్లు చెప్పలే. ఊరోల్లు చెప్పలే. ఆఁ ఇప్పుడనిపిస్తోంది. మా కులంలనే యాదిగాడు. నా మీద ఆశపడ్డాడు. నేను కాదన్న. చెప్తే వాడే చెప్పాలె. కాదు వాడే చెప్పిండు. ఈ నడమ వాని కండ్లు నెత్తికెక్కినయి.”

“ఎట్లనో అట్ల తెలిసింది. అసలు విషయం చెప్పు” తొందరపెట్టాడు డాక్టరు గారు.

“పటేలు నన్ను ఇరుగదంచిండు. చింతబరిగెతోని వాతలు దేలెటట్టు కొట్టిండు. పిడిగుద్దులు గుద్దిండు. కాల్తోని తన్నిండు. నోటికొచ్చిన తిట్లు తిట్టిండు. అన్నిట్ని భరించిన. నేను తప్పు చేసిన నాకు శిక్ష పడ్డది అనుకున్న. ‘వాడేదొ పెద్ద మొనగాన్నననుకుంటాండు. ఊల్లెకడుగు పెట్టనియి, చంపి బొంద బెడ్త’ అని నిన్ను కూడ చెప్పరాని తిట్లు తిట్టిండు.

నేనన్న గద, తప్పు నాది. నన్ను కొట్టినవు. తిట్టినవు. డాక్సర్సాబును సంపుడేంది. ఆయన దేవుడు. ఎంతమంది కెన్ని తీర్ల బీమార్లు నయం జేసిండు. నీకు నీ పెండ్లానికి గూడ మందులిచ్చి పూర్తిగ నయం చేసిండు కద. ‘ఈ నమూన వాన్నెనుకేసుకోనొస్తున్నవా! వాని మీద నీకు ప్రేమ సావలేదన్నట్టు’ అనుకుంట ఇయ్యరమయ్యర దంచిండు. నేను సస్తనొ బతుకుతనొ అని గూడ జూడలె. ఇప్పుడనిపిస్తోంది ఆ రోజు వాని దెబ్బలకు సచ్చిపోతె మంచిగుండునని” మళ్ళీ దుఃఖం ముంచుకొచ్చింది వీరలక్ష్మికి.

“బాధపడకు వీరలక్ష్మి. కష్టాలు కలకాలముండవు” అనునయించాడు డాక్టరు గారు.

ఈసారి తనే లేచొచ్చి కూజాలోంచి నీళ్ళు గ్లాసులోకి ఒంపుకొంది. మంచినీళ్ళు తాగాక కాస్త తేటపడింది. కొంగుతో మొహం తుడుచుకొని చెప్పడమ్మొదలు పెట్టింది.

“మీ ఇంట్లో దొంగతనమైంది. పటేలె చేపిచ్చిండు. ఊరంతకెర్కనె. ఎవ్వరు గూడ నీతోననలె. సమ్మక్క నా కొఱకు నీ దగ్గర కొచ్చిందట. నువు మందులియ్యనన్నవట. ఇయ్యందె నయమైంది. నువు మందులిచ్చుంటే పటేలు నన్నానా చంపి బొందపెడ్తుండె.

నువ్వచ్చి ఇల్లు చూసుకున్నవట. నట్టింట్ల కూలబడ్డవట. సంబురపడుకుంట నాతోని చెప్పిండు పటేలు. ‘చూడు వాడు అడుక్కతినెటట్టు చెయ్యకుంటే నేను బాల్రెడ్డి పటేల్నె కాదు’ అన్నడు.

అది నీతోనయ్యే పనిగాదు. ఊరంతకు డాక్సర్సాబ్ దేవుడు. దేవుడడుక్కుతినెడ్ది వుండది, అన్న. ఈ మాటకు మస్తు కోపమచ్చింది పటేలుకు. పెరట్ల గుత్పందుకోని గొడ్డును బాదినట్లు బాదిండు. మొండిదాన్ని అన్ని తన్నుల్దిన్న బతికే వున్న. నేనన్నమాట నిజమైంది. ఊరంత నీదిక్కె నిలబడ్డారు. పటేలు ఓర్వజాలలె. నీ కొత్తిల్లు సర్వనాశనం చేసిండు. నువ్వు ఎల్లచ్చినవు.

అంతకు ముందు పటేలు మాపటీలి మాత్రమె వస్తుండె. అనుమానమచ్చిన కాడికెల్లి ఒక యాల్లపాల్ల లేకుంట వస్తుండు. ఇల్లంత అనుమానంగ జూస్తడు పోతడు. నేనన్న ‘తప్పనేది నేను ఒక్క డాక్సరు సాబుతోనె చేసిన. నాకే మొగోని మీద మోజు లేదు’. దానికి బగ్గ నవ్విండు. ‘నాకా సంగతి ఎర్కనే గని నేనూసేది గూడ డాక్సర్సాబు నీ దగ్గర కొచ్చిపోయిన గుర్తుల కోసమే’ అన్నడు. ఇంక ఏం చెప్పజాల్త బాంచెను.

ఒక దినం పొద్దుగాల్నే వచ్చిండు. బయటి గల్మ దగ్గరేసిన. గొల్లెం బెట్టిలేదు. దగ్గర కూసుండి జింకకు గడ్డిమేపుతున్న. రఘునాథరావేర్పాటు చేసిన మనిసి పచ్చిగడ్డి నింక తెస్తనే ఉన్నడు. జింకకు మొక్కుత, డాక్టరమ్మకు మొక్కినట్లుంటది. జింకతోని మాట్లాడ్త రాముతోని ముచ్చట బెట్టినట్లనిపిస్తది. జింక పెయ్యంత నిముర్త. నువు నన్ను కావలిచ్చుకున్నట్టుంటది. చప్పుడు చెయ్యకుంట పెరట్లకచ్చిండు. నేనప్పుడు కండ్లు మూసుకోని జింక మెడచుట్టు చెయ్యేసి కావలించుకోని కలలు కంటున్న.

‘ఈర్లక్ష్మీ’ పిలిచిండు. నేను కండ్లు తెరిచిన. ఎదురుంగ పటేలు. గాబరగాబర లేచి నిలబడ్డ. ‘నీకు జింకంటే పానంలే’ వంకర నవ్వు నవ్వుకుంటన్నడు. ‘ఒక్కదాన్నె కద బాంచెను ఇంట్ల. అందుకే’ అన్న ‘అంతేనా లేకుంటే దాన్ని కావలిచ్చుకుంటే డాక్సర్సాబును కావలించుకున్నట్లుంటదా!’ అడిగిండు. నేను నప్పుడు చెయ్యలే. దగ్గరికచ్చిండు. కొడ్తాడనుకున్న. కొట్టలే. చెంప మీద ముద్దుపెట్టుకోని పొయిండు.

నాలుగొద్దులైనంక పొద్దుగాల పొద్దుగాల్నె వచ్చిండు పటేలు. ఎంబడి కసాయి రాములున్నడు. సుంకరి సాంబయ్య ఉన్నడు. లోపటికచ్చి జింకను చూపెట్టిండు. నాకు సమజయింది. ఉర్కిపొయ్యి జింకను కావలిచ్చుకున్న. పటేలచ్చి నన్ను గట్టిగ పట్టుకున్నడు. రాములు, సాంబయ్య నా నుంచి జింకను ఇడిపిచ్చుకున్నరు. పటేలు ఇషార మీద లోపటికెల్లి చెక్క కుర్చి తెచ్చిన్రు. పటేలు నన్నా కుర్చీల కూర్చుండ బెట్టిండు. లెవ్వరాకుంట నన్నా కుర్చికేసి కట్టేసిండు. ఇంకో కుర్చి తెచ్చుకోని కూసుండి సుట్ట ముట్టిచ్చుకున్నడు. ‘కానియ్యుండ్రిర!’ అన్నడు. చూడజాలక కండ్లు మూసుకున్న. కాల్తున్న చుట్టను చేతికంటించిండు. చురుక్కున కాలింది. కండ్లు తెరిచి పటేల్దిక్కు చూసిన. ‘జింక సచ్చేది నువ్వు సూడాలె. కండ్లు మూసుకుంటె సైసేది లేదు. పెయ్యంత వాతలు బడ్తయి’ బెదిరిచ్చిండు. అట్లనె చూస్కుంట కూసున్న జింకను కోసిన్రు. తోలువల్చిన్రు. రాములు కత్తితోని సటసటకొట్టి ముక్కలు చేసిండు.

పటేలు కట్లప్పిండు. ‘ఇయ్యాల అమిన్‍సాబు, తాసీల్దార్, నాయబ్ తాసీల్దార్, గిర్దావర్లందరిస్తాండ్రు. దావతుల జింక మాంసం కావాల్నన్నరు. ఇప్పటికిప్పుడు జింకేడ దొరుకుతది. అందుకే ఈ జింకను చంపుడు. కావాన్నంటె సారెదార్తోన్చెప్పి ఇంకో జింకను తెప్పిచ్చిస్త నీకు” అని నన్ను బుదుగరిచ్చిండు.

‘జింక మాంసం నువ్వు పెడ్తానన్నవా! వాలిచ్చ వాల్లె అడిగినా!’ అడిగిన నేను. ‘ఎట్లయితేంది. వాల్లియ్యాల జింక మాంసం తింటున్రు. నువు వండుతున్నవు.’ నా మీద పిడుగు బడ్డట్టయింది. ‘అయ్యా! నాతో కాదయ్యా!’ అని మస్తు బతిలాడిన. కాల్లమీద పడ్డ. పొర్లాడిన. ఒప్పలే. ‘సాంబయ్యా! నువ్వీడనే వుండి ఈర్లక్ష్మికి సాయపడు. ఈర్లక్ష్మి వండాలె. మధ్యల వచ్చిపోత. నువు పొయికాడ కనపడ్డవో తోడ్కల్దీస్త’ అని సాంబయ్యను బెదిరిచ్చిండు.

కసాయి రాములు కండ్లతోటె బాధపడ్డడు. పటేలెదురుంగ ఏమనజాలడు గద. పటేలు, రాములు పొయినంక సాంబయ్య నా మీద మస్తు జాలిపడ్డడు కని ఏంచెయ్యజాలడు. వాడు కూడ పనోడె కద! గరమ్మసాల, వంటసామాన్లు పట్టుకచ్చిండు మచ్కూరి మల్లయ్య. నేనె వండెటట్టు చూడాన్నని వానికి చెప్పి పంపిండు. సాంబయ్య మీద పటేలుకు నమ్మకం లేదన్నట్టు. కూర వండి పంపిన.

“నా కంత పిచ్చిలేచినట్టైంది. ఏం తినబుద్దికాలే. చాతనైతలేదు. జరమచ్చినట్టున్నది. ఏ పనిమీద మనసు పోతలేదు. పండజాల, కూసుండజాల, నిలబడజాల. ఆఖరుకు సొమ్మసిల్లి మంచమ్మీద పడ్డ. సోయిల లేను. దర్వాజ బెట్టుకోలే. చీకటి పడ్డ సంగతి గూడ తెల్వది. పటేలు వచ్చిండు. దీపమ్ముట్టిచ్చిండు. నన్ను లేపి కూచుండబెట్టిండు. మంచినీల్లిచ్చిండు. తాగిన. ఆయన తాగె బరాండి సీస దెచ్చిండు. టిఫిన్ డబ్బులు తెచ్చిండు. అండ్ల బిర్యాని వున్నది. నేను వండిన జింక మాంసమున్నది. ‘జింక కూర మంచిగ వండినవు. వచ్చినోల్లందరు మెచ్చిన్రు. లొట్టలేసుకుంట తిన్నరు’ నక్కుంట చెప్పిండు.

అటెన్క నన్ను తినుమన్నడు. నాకు పట్టదన్న. అన్గబట్టి బల్మిటికి బరాండి తాగిపిచ్చిండు. బల్మిటికి నోరు తెరిచి మాంసం ముక్క నోట్లెపెట్టి నోరు మూసిండు. నాతోని జింక మాంసం తినిపిచ్చిండు. గింతాంత ముక్కనె కావచ్చు. మింగిన కద. మూడొద్దులు జరమచ్చింది. అయ్యోరు పంతులు మందులిచ్చిండు. జరమైతే తక్కువైంది. ఫికరు తక్కువ కాలె. కండ్లు మూస్తె జింక. కండ్లు తెరిస్తె జింక. ఇక ఉండజాలలె. బట్టలు సదురుకున్న. ఇల్లు తాలం బెట్టిన రైలెక్కిన. వచ్చి నెలదినాలైంది. నీ పత్తా దొరికింది. వచ్చిన” చెప్పడమ్ముగించి నోట్లో చీర కొంగు దోపుకొని మౌనంగా రోదించసాగింది వీరలక్ష్మి. ఐదు నిమిషాలకు తెప్పరిల్లింది.

“తమ్మున్దగ్గరుంటున్నవా!” అడిగాడు డాక్టరు గారు.

ఔననట్లుగా తలూపింది వీరలక్ష్మి.

“మీ తల్లిగారిల్లు పటేలుకు తెలుసా!”

తెలుసన్నట్లుగా తలూపింది.

“పటేలు నీ గురించి వెతుక్కుంటూ మీ తల్లిగారింటికి వస్తాడు. గొడవ చేస్తాడు. మీ తమ్ముడు అల్లరి పాలవుతాడు. పటేలుకు నీ మీద ప్రేమ తగ్గలేదు. కోరిక కూడ తగ్గలేదు. నాకు సంబంధించిన జ్ఞాపకాలను తుడిచివేయాలని ప్రయత్నిస్తున్నాడు. జ్ఞాపకాలు మనసుకు సంబంధించినవి. మిన్నకుంటే మరుపున పడ్డాయి. బాధపెడ్తే గాయాలు రేగి జ్ఞాపకాలు మరింత తాజాదనాన్ని సంతరించుకొంటాయి” చెప్పాడు డాక్టరు గారు.

అర్థంకానట్టు చూసింది వీరలక్ష్మి. చిన్నగా నవ్వి మళ్ళీ చెప్పాడు డాక్టరు గారు.

“పటేలు నీతోని సంసారం కొనసాగించాల్ననుకుంటుండు. నువు నన్ను మర్చిపోతె తన తొవ్వకస్తవని ఉద్దేశం.”

“అసొంటోడైతె సస్తనొ బతుకుతనొ సూడకుంట కొడ్తాడెందుకు. పానమసొంటి నా జింకను సంపుతడెందుకు” అడిగింది వీరలక్ష్మి.

“నీ మీది అధికారంతోని కొట్టిండు. పగతోని కాదు. తొవ్వకు తెచ్చుకోవాన్నని కొట్టిండు. దూరం చేసుకోవాన్నని కాదు. కందురుంగ జింక ఉన్నంతకాలం నువు నన్ను మరువజాలవు. జింక చచ్చిపోతె కొన్ని దినాలు ఏడ్చి ఊకుంటవు. మర్చిపోతవు. తన తొవ్వకస్తవు.”

“మగనికి పెండ్లాన్ని చంపే అధికారం కూడ ఉంటదా!”

“ఉండదు. కోపం శరీరాన్నాక్రమించుకొంటుంది. శరీరాన్నాక్రమించుకున్న కోపం వివిధ రకాలుగా ప్రసరిస్తుంది. తనవనుకున్న వస్తువులన్నింటినీ ధ్వంసం చేయిస్తుంది. భార్య తన స్వంత ఆస్తి అని భర్త భావిస్తాడు కాబట్టి, కోపంతో అదుపుతప్పిన భర్త శరీరం భార్య శరీరాన్ని హింసిస్తుంది. శరీరంతో పాటు మనసు కూడ గాయపడుతుంది. ఈ హింసను ఎవరూ ఒప్పని అంగీకరించరు. ఆమోదించరు. అలాగని చట్ట ప్రకారం శిక్షలు వేయాలని కూడ ఎవరూ అడుగరు. చట్టాలు సంసారాల్లోకి ప్రవేశిస్తే కాపురాలు గంగలో కలుస్తాయి కాబట్టి. స్వీయనియంత్రణమే ఇందుకు పరిష్కారం.”

“మగని మీద కోపం తీర్చుకొనే హక్కుగని, అధికారంగని పెండ్లానికి ఉండదా!” తీవ్రంగా అడిగింది వీరలక్ష్మి.

“ఎందుకుండదు. ఉంటుంది. భార్య భర్త మీద చెలరేగిపోయే విధానమే వేరుగా ఉంటుంది. అక్కడ భౌతిక హింస ఉండదు. మానసిక ఒత్తిడి ఉంటుంది. అలజడి ఉంటుంది. అశాంతి ఉంటుంది. మనుషులను శాశ్వతంగా విడదీయగలిగే శక్తి ఆవిడ కోపానికి ఉంటుంది. ఎంత దగ్గరి వాడినైనా సరే దూరం పెట్టగలిగే శక్తి స్త్రీకి మాత్రమే ఉంటుంది. స్త్రీకి సహనం ఎక్కువ. సహనం కోల్పోయిన స్త్రీని అదుపు చేసే శక్తి ఎవరికీ ఉండదు. స్త్రీ కోపమన్నది ఒక దవాగ్ని లేదా బడబాగ్ని. వందల ఏళ్ళుగా పెరిగివున్న కీకారణ్యాన్ని దవాగ్ని నాలుగైదు రోజుల్లో భస్మీపటలం చేయగలదు. నిప్పునార్పడానికి నీళ్ళను వాడతాం. అలాంటిది ఆ నీళ్ళలోనే కాపురముండే బడబాగ్నిని ఎవరార్పగలరు? స్త్రీ హృదయంలోంచి పుట్టుకొచ్చే పగ బడబాగ్ని అయితే ప్రతీకారం దవాగ్నివంటిది. బడబాగ్నికి చల్లారడమంటే ఏమిటో తెలియదు. తానంటుకున్న వస్తువు బూడిదైతేకాని చల్లారడం దవాగ్నికి రాదు.

స్త్రీ సౌకుమార్యాన్ని, హృదయ సౌందర్యాన్ని, అందులోని సున్నితత్త్వాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని, స్త్రీలను పగ, ప్రతీకారాలకు దూరంగా ఉంచాలని మన పెద్దలు చెప్పడానికి గల కారణమిదే.” తను చెప్పదలచుకొన్న విషయమై పోయిందన్నట్లుగా తలపంకించాడు డాక్టరు గారు.

“ఇప్పుడు నేను పటేలు మీద పగతోని వున్న.”

“పగవద్దు. పగవల్ల నష్టపోయేది పటేలు మాత్రమే కాదు. నువ్వు, నీ తోబుట్టువు కూడ. పటేలు కోపంలో ప్రేమ వున్నది. ప్రేమను ప్రేమతోనే వశం చేసుకో. జోడెడ్లపాలెం వెళ్ళు. నీ ఇంట్లో నువ్వుండు. నాలుగైదు రోజుల్లో పరిస్థితులు చక్కబడుతాయి.”

“నాతోని అయెటట్టులేదు”.

“ఆలోచించుకో వీరలక్ష్మీ! ఇంటికి వెళ్ళు. నీకు అభ్యంతరం లేకపోతే నీ తమ్మునితో మాట్లాడు. మరదలుతో మాట్లాడు. నిర్ణయం నీ ఇష్టం. నేను నీకిచ్చింది సలహా మాత్రమే.”

“మంచిది డాక్సర్సాబ్. అమ్మగిట్ల బాగున్నరా!” లేస్తూ అడిగింది వీరలక్ష్మి.

“అంత బాగనె. మా పెద్ద బావమరిదికి కొడుకు పుట్టిండు. పిల్లలంత అక్కడనె వున్నరు. నేను కూడ బారసాలకు పొయివచ్చిన”. జవాబిచ్చాడు డాక్టరు గారు.

“వస్తనయ్య” అంటూ డాక్టరు గారి పాదాలనంటి బయల్దేరింది వీరలక్ష్మి. “అన్నం తిన్నవా వీరలక్ష్మీ!” వెనుక నుంచి అడిగాడు డాక్టరు గారు.

“తినే బయలెల్లిన బాంచెను” వెనుతిరిగి చెప్పి ఆసుపత్రి మెట్లు దిగింది వీరలక్ష్మి.

(ఇంకా ఉంది)

Exit mobile version