[శ్రీ వరిగొండ కాంతారావు రచించిన ‘వ్యామోహం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[అమెరికాలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ నడిపే జనార్దన మూర్తి ఇండియాకి వస్తాడు. ఇండియాలో పని చేసినప్పుడు తన పాత కంపెనీలోని టీమ్‍లో ఎనిమిది మంది ఉండేవారు. వాళ్ళని అష్టమూర్తులని పిలిచేవాడు జనార్దన మూర్తి. ఆ అష్టమూర్తులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హోటల్‍కి వస్తాడు జనార్దన మూర్తి. రమణి అతనికి స్వాగతం పలికి లోపలికి తీసుకువెళ్తాడు. మిగిలిన ఏడుగురూ అతన్ని ఆప్యాయంగా పలకరిస్తారు. అందరూ కూర్చుంటారు. జనార్దనమూర్తికి ఎడమవేపు వరుసగా రమణ, సాకేత్, సౌమ్య, సమ్మయ్య కూర్చోగా కుడివైపున రాజీవ్, హిమాంశురాయ్, స్వాతి, సంజయ్ కూర్చుంటారు. కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉండగా హిమాంశు, స్వాతి పెళ్ళి చేసుకున్నారని గ్రహించి వారికి అభినందనలు చెప్తాడు జనార్దన మూర్తి. హోటల్ ఆంబియన్స్‌ని మెచ్చుకుంటాడు జనార్దన మూర్తి. హోస్ట్ తానవుతానని అంటే, సమ్మయ్య వద్దని చెప్పి, హోస్ట్‌లు సౌమ్య, సాకేత్‌లని చెప్తాడు. వాళ్ళ పెళ్ళికి తాను రాలేకపోయానని, ఏదైనా శుభవార్త కోసమా ఈ పార్టీ అని అడిగితే, కాదంటారు. వాళ్ళద్దరూ విడిపోతున్నారనీ అందుకే ఈ పార్టీ అని చెప్తాడు రాజీవ్. విడాకులు తీసుకునేవాళ్ళు కలసి పార్టీ ఇవ్వడమేమిటని ఆశ్చర్యపోతాడు జనార్దన మూర్తి. బాధపడతాడు. వాళ్ళకి అభ్యంతరం లేకపోతే, వాళ్ళెందుకు విడిపోతున్నారో తెలుసుకోవాలనుకుంటాడు. ఇద్దరూ తమ తమ కారణాలను వివరిస్తారు. వాళ్లిచ్చినా ఆర్డర్ రావడానికి ఇంకా సమయం ఉండడంతో ఒక కథ చెప్తాను వినమంటాడు మూర్తి. కథ మొదలుపెడ్తాడు. ఇక చదవండి.]
కథకు ముందరి కథ
[dropcap]సూ[/dropcap]ర్యాస్తమయమవడానికి ఇంకా అరగంట సమయముంది. పశువులు ఇళ్ళకు వచ్చే వేళయింది. ఈశ్వరమ్మ సాయంకాలపు సానుపు చేసి గుడిసెలోని నులకమంచం తెచ్చి గుమ్మం ముందర వేసింది. భర్త లక్ష్మయ్య గోలెంలోని నీళ్ళతో ముఖం కడుక్కొని భుజమ్మీది తువ్వాలుతో తుడుచుకొని వచ్చి మంచమ్మీద కూర్చున్నాడు. సాయంత్రం వంటకు పొయ్యి రాజేసే యత్నంలో ఉన్నది ఈశ్వరమ్మ. వాన పడితేనే వంట గుడిసె లోపల, లేకుంటే ఆరుబయటనే.
“ఈర్లక్ష్మి పద్ధతి నాకు నచ్చుతలేదయ్య” తన పని తను చేసుకుంటూ గట్టిగానే అన్నది ఈశ్వరమ్మ.
“అంటేంది?” అడిగాడు లక్ష్మయ్య.
“నీకు తెలువదా!” రెట్టించడంతోపాటు గొంతు హెచ్చించింది ఈశ్వరమ్మ.
“కొద్ది సేపటికీడికిరా!” పిలిచాడు లక్ష్మయ్య. వచ్చి నులకమంచం పట్టె మీద కూర్చున్నది ఈశ్వరమ్మ.
“ఇప్పుడు చెప్పు. నీ రందేంది?” అడిగాడు లక్ష్మయ్య.
“నీకు తెలువని రందానయ్య. ఊరంత ఈర్లక్ష్మి గురించె అనుకుంటాను. ఇట్లయితే మనం బతుకజాల్తమా! పొయి పొయి ఇది సొంటి పనిచేస్తదని కలల సుత అనుకోలె” దుఃఖపడ్తూ చెప్పింది ఈశ్వరమ్మ.
“చూడు ఈశమ్మా! ఈర్లక్ష్మి మందిపొల్ల కాదు గద! నీ సొంత తమ్ముని బిడ్డనె కద! నీ కొడుక్కు లగ్గంజేసెనాటికి వానికిరువైయేండ్లు. పొల్లకు పద్నాలుగేండ్లు. లగ్గమైన రెండేండ్లకే మనోడు కల్లు గీసుకుంట గీసుకంట తాటిచెట్టుమించి ఎట్ల పడ్డడొ పడ్డడు. పడుడు పడుడె తలపండు పలిగె. పానంబాయె. దినాలయినంక నీ తమ్ముడేమన్నడు! ‘పొల్లను దీస్కపోతనె. ఏడాది మాసికమైనంక మారు మనువు జేస్త’ అన్నడు. నువ్వొక్కతీర్గ ఏడ్సుకుంట తలిగినవు.
చిన్న పొల్లయిన సుత కోడలేమన్నది. ‘అయ్యా! అత్తమ్మకు మనం దప్ప ఎవలున్నరు. నేనీడనె వుంట. వాల్లకు కొడుకునైన నేనె కోడల్నైన నేనె. నేను మల్ల లగ్గం జేసుకొనెడ్డిలేదు. మీ ఇంటికచ్చెడ్దిలేదు’.
ఇంత కచ్చితంగ చెప్పిందని, కన్నబిడ్డ అనన్న సూడకుంట కోపంల అప్పటికప్పుడు మూటముల్లె సదురుకపోయిన మీ తమ్ముడు, మరదలు పదేండ్లు దాటితె సుత మనింట్లెకడుగుబెట్టింది లేదు. నీ కోడలు సుత ఎన్నడన్న ‘అమ్మ నాయిన మీద బెంగటిల్లిన పోత’నన్నదా! అనలే!” పాత కథను వివరంగా జ్ఞాపకం చేశాడు లక్ష్మయ్య.
“ఔనయ్య! అది బంగారమె! కని కాని కాలంల ఇట్ల చేసిందేంది!” యాష్టపడ్డది ఈశ్వరమ్మ. ఈశ్వరమ్మ యాష్టకు సమాధానంగా తను చెప్తున్న కథను కొనసాగించాడు లక్ష్మయ్య.
“ఐదేండ్ల కింద నేను చెట్టు మీంచి పడ్డనా! తుంటి బొక్క ఇరిగిందా! చెట్టెక్క రాకుంటయిన్నా! ఇంట్లనే వుంటాన్ననా! మరి కోడలు మన వంతుకచ్చిన కల్లుకుండలు దొరల ఇండ్లల్ల ఇచ్చస్తోందా! కల్లు ఎక్కువ బారినప్పుడు తతిమ్మోల్లెంబడి నిలబడి తాల్లల్ల కల్లు బోస్తోందా! ఉన్న ఎకురం తరికి, నా ఎంబడచ్చి పొలం పన్లన్ని చూసుకుంటాందా!..”
“ఇయ్యన్ని మంచిగనె ఉన్నయయ్య! మంచిగలేని ముచ్చట సంగతె నేననడుగుతున్న.” భర్త మాటలకడ్డు తగిలింది ఈశ్వరమ్మ. భార్య మాటల్ని పట్టించుకోకుండా తన ధోరణిలో తాను చెప్పుకుంటూ పోతున్నాడు లక్ష్మయ్య.
“పదహారేండ్ల పిల్ల ఇప్పుడిరువైయ్యారేండ్లకచ్చింది. వయసు ఊకుంటదా! ఎంత నిగ్రహంతోని ఉన్నది. కులపోల్లు ఎంతమంది దాన్నెన్నెన్ని తీర్ల పడెయ్యాన్నని చూసి తిప్పలు బెడ్తున్నరొ నువ్వెన్నడైన గ్రహించినవా!
కొసాఖరుకు బాల్రెడ్డి పటేలు దాని రెట్టబట్టుకున్నడు. సాటుకె ఎవ్వలకు తెల్వకుంటనె. అది కాదనలె. అది కావురం బట్టి లొంగిపోయిందని నువ్వనుకుంటున్నవు. కోరికకు లొంగిందని నేననుకుంటున్న. ఇది మనసు ముచ్చట.
లోకమ్ముచ్చట చెప్తయిను. అది లొల్లి బెట్టిందనుకో, పోలీసు పటేల్తోని పంచాయితి పెట్టుకున్నదనకో, ఊల్లె నెగులజాల్తవా! నీ కోడుల్ను నమ్మెటోడుంటడా! ఇప్పటి దన్క ఇది కాదంటె సుత నోర్మూస్కోనున్నోల్లు దాని మీదికి పిచ్చికుక్కల్లెక్క ఎగబడరా! అప్పుడు దాన్ని నువ్వు నేను కాపాడలెస్తమా!
ఇది లొంగిపోయిందని బాల్రెడ్డి పటేలేమన్న అల్కగ జూసిండా! కుట్టు మిషిని కొనిచ్చిండు. మేర రాములుకు జెప్పి దీనికి పని నేర్పిచ్చిండు. ఇప్పుడు నాలుగు రైకలు కుడ్తాంది. నాలుగు పైసలు సంపాయిస్తాంది. మన ఎకురా చెక్కెంబడె రెండెకురాలు మడి పటేల్దె వున్నది. మూడెకురాల యవుసం పటేలె జేపిస్తుండు. కని ఫలసాయం మనింటికె వస్తాంది. నన్ను గూడ ‘పొలం పనులకు వద్దు తియ్యిర! రికాంగుండు!’ అని చెప్పిండు. పట్వారికి జెప్పి పహానిల సుత ఆ రెండెకురాలకు ఈర్లక్ష్మి పేరె పట్టెదారుగ రాపిచ్చిండట. తొల్త కాస్తు జేస్తాందని రాపిచ్చి అటెన్క పట్టెదారుగ మార్పిచ్చిండట” కథను ముగించాడు లక్ష్మయ్య.
“నువు జెప్పెడిదంత నివద్దె కని గవురతగల పని కాదు గదనయ్య!” తన మాట తనదే అన్నట్లుగా చెప్పింది ఈశ్వరమ్మ.
“ఇప్పుడేం జేస్తవు చెప్పు. ఈర్లక్ష్మి నా పెండ్లామని బాల్రెడ్డి పటేల్ ఊరంతకు చెప్తడా! వాడు దీని రెట్ట పట్టెట్నాటికె పెండ్లాముండె ముగ్గురు పోరలుండిరి. అయిన ఇదేం దొంగముచ్చట్నా, ఊరంతటికెర్కనే ఎర్కయిపాయె. ఎన్కట ఒకడు గాకుంటే ఒకడన్నట్టుగ దీన్ని వలలేసుకోవాన్నని చూసిన్రుకని, ఇప్పుడయితే ఎవనికి వాడు వాని జాగ్రత్తల వాడుంటాండు. పటేలు వచ్చిపోతాంటె మనకు ఇబ్బందిగుంటదని రెండర్రల పెంకుటిల్లు గూడ పక్కకె ఏపిచ్చిండు గద. రాకడ పోకడ మనకు సంబంధం లేకుంటనె ఉన్నది కద!
ఈర్లక్ష్మి చేతి వంట తిననని నివ్వె వంట జేస్తున్నవు కని పాపమది ‘వద్దత్తమ్మ! నేను వండి పెడ్త!’ అని ఎన్నిసార్లు బతిలాడింది” వివరించాడు లక్ష్మయ్య.
“నీతోన్జెప్పుడు నాదె బుద్ది తక్కువయ్య. ఎన్నడైన నా దిక్కు మాట్లాడినవా!” అలిగింది ఈశ్వరమ్మ.
“ఈ వూర్లె సగమ్మంది ఆడోల్ల మొగోల్ల నివద్ది ముచ్చట చెప్తే నీకె సమజయితది మన కోడలు చేసిందేమంత పెద్ద తప్పు కాదని”
“నాకు తెలవని ముచ్చట్లా అయి” సాగదీసింది ఈశ్వరమ్మ.
“మరింకేంది. మ్యానకోడల్ను బిడ్డలెక్క సూస్కోక” గలగలా నవ్వాడు లక్ష్మయ్య.
“చాతకాన్నాడు చూస్కుందాంగని, ఇప్పటికైతె మాట్లాడకు” కోపంగా మంచమ్మించి లేచి వెళ్ళి వంట పనిలో నిమగ్నమైంది ఈశ్వరమ్మ. ప్రేమగా భార్య వంక చూస్తుండిపోయాడు లక్ష్మయ్య.
***
అసలు కథ
మరో పదేళ్ళ కాలం గడిచిపోయింది. కాలం చాలా మార్పులు తీసుకువచ్చింది. ఆ మధ్య వచ్చిన గత్తరలో ఈశ్వరమ్మ, లక్ష్మయ్యలు రోజుల వ్యవధిలోనే కాలం చేశారు. వీరలక్ష్మి కుట్టుపని సాఫీగా నడుస్తోంది. సరిపడేంత ఆదాయాన్ని కూడ ఇస్తోంది. మధ్యాహ్నం పూట ఆడంగులు కాలక్షేపం కోసం కూడా వచ్చి వీరలక్ష్మి దగ్గర కూర్చొని వెడుతున్నారు. అలా వచ్చే వాళ్ళలో సమ్మక్క వీరలక్ష్మికి దగ్గరి స్నేహితురాలైంది. అవడానికి సమ్మక్క వీరలక్ష్మి కన్నా పదేళ్ళు చిన్నదే కాని, వరంగల్లులో తన పుట్టినింటికి అవతలి వీధిలోనే వుంటుంది సమ్మక్క పుట్టిల్లు. ఆ కారణంగా సమ్మక్క వీరలక్ష్మికి మనసుకు నచ్చిన స్నేహితురాలైంది.
అత్తమామలు కాలం చేసినపుడు తమ్ముడు వచ్చి పిలుచుకు వెళ్ళాడు. అప్పట్నించి పుట్టింటితో రాకపోకలేర్పడ్డాయి వీరలక్ష్మికి. తదుపరి కాలంలో వీరలక్ష్మి అమ్మా, నాన్నా కాలం చేశారు. ఉన్నదొక్క తమ్ముడు. కరీమాబాదులో ఉంటాడు. కల్లుదుకాణం చూసుకుంటాడు. అతడికిద్దరు కొడుకులు, ఒక కూతురూను. అక్కడే చదువుకుంటున్నారు. మరదలు కూడ వీరలక్ష్మిని బాగానే చూచుకొంటుంది.
గత నెల రోజులుగా వీరలక్ష్మికి బాగాలేదు. రాత్రిళ్ళు జ్వరం కాస్తుంది. పగలు బాగానే ఉంటుంది. వెనుకటి ఉత్సాహం లేదు. మన్నుతిన్న పాములాగ పడి ఉంటుంది. అప్పుడప్పుడు ఒండుకోవడం కూడా మానేసి పస్తుంటుంది. అడిగితే బాగానే వున్నానంటుంది. సమ్మక్క ఇంటి నుండి వంటకాలు తెచ్చి తినిపిస్తూ ఉంటుంది. ఎంతైనా ఇరవైనాలుగ్గంటలూ కలసి ఉండలేరు కదా! సమ్మక్క సంసారం సమ్మక్కకుంటుంది కదా!
“ఏందక్కా! ఏం చెప్పవు. పటేలు మంచిగుంటలేడా!” అడిగింది సమ్మక్క.
“అదేంలేదె! నాకె మంచిగుంటలేదు. ఏందొ తెలువదు. నిదుర రాదు. ఆకలి బుట్టది. అంతెట్లెట్లనొ అయితది. ఇగొ ఇది తక్లీఫని చెప్పజాల” జవాబిచ్చింది వీరలక్ష్మి.
“మందు మాకు లేకుంటె ఎన్నొద్దులైన ఇట్లనె ఉంటది. కమ్మిగావాన్నంటె మందుపడాలె కద!” అన్నది సమ్మక్క.
“పటేల్జెప్పిండట. అయ్యోరు పంతులు వచ్చి చూసిపోతాండు. మందులిస్తాండుగని ఫలితమె కనబడ్తలేదు.”
“ఊల్లెకు కొత్తగ డాక్సరు సాబచ్చిండు. ఐదార్నెల్లయితాంది. బీమారున్నోల్లందరు అటే తొవ్వబడ్తాన్రు. మనం గూడ బోదామేన్ది?” అడిగింది సమ్మక్క.
“పటేలేమంటడొ!” అనుమానం వ్యక్తం చేసింది వీరలక్ష్మి.
“గిసొంటివాటికి సుత వద్దంటడా ఏంది? పానం బాగలేక చూపెట్టుకోనికి పోతున్నవు. అంతగ్గాకుంటే పటేలచ్చినప్పుడు నేనచ్చి చెప్తతియ్యి” అంటూ బలవంతంగా తయారుచేయించి బయల్దేరదీసింది సమ్మక్క వీరలక్ష్మిని.
చలి మొదలవలేదు గాని చలికాలం ప్రారంభమైనట్లే. మధ్యాహ్నం మూడుగంటలకే సూర్యుడి తీక్ష్ణత తగ్గిపోతోంది. సాయంత్రం నాలుగ్గంటల ప్రాంతంలో డాక్టరు గారింటికి చేరుకొన్నారు వీరలక్ష్మి, సమ్మక్కలు. రోగులెవరూ లేరు. ఆయనేదో పుస్తకం చదువుకుంటున్నాడు. ఇల్లు, ఆసుపత్రి ఒకటే. ముందుగది ఆసుపత్రి కింద లెక్క. ఆయన ఏం చదువుకున్నారో ఎవరికీ తెలీదు. ఆయన పేరు కూడా ఎవరికీ తెలియదు. అందరకూ ఆయన డాక్టరుగానే పరిచయం. చదువుకున్నవాళ్ళకు డాక్టరుసాబు. చదువుకోని వాళ్ళకు డాక్సరుసాబు.
డాక్టరుగారికి నలుగురు మగపిల్లలు. ఆయన భార్య పేరు కూడా ఎవరికీ తెలియదు. ఆవిడ డాక్టరమ్మ. పంతులు భార్య పంతులమ్మ, షావుకారు భార్య షావుకారమ్మ, సేటు భార్య పేటమ్మ, దొర భార్య దొర్సాని, ఇవే ఆ రోజుల్లోని వ్యవహారాలు.
“డాక్సరుసాబు సూదిమందిస్తాడు. హలువా ఇస్తడు. భస్మాలిస్తడు. చేదు గోలీలిస్తడు. తియ్యటి గోలీలు చక్కెరతోని చేస్తరుగావచ్చు. తెల్లగుంటయి. చిన్నగుంటయి అయి కూడ ఇస్తడు. నోరు తెరువుమంటడు. రెండు చుక్కలు అరకు వేస్తడు. అబ్బ ఘాటుగుంటది. సరంబడ్డది. నాలుక మండుతది” వచ్చేప్పుడు దారిలో ఏకరువు పెట్టింది సమ్మక్క.
“ఇయన్ని నీకెట్లెర్కనె” అడిగింది వీరలక్ష్మి.
“నాకు జరమస్తె నీమరిది తీస్కపోయిండక్క, అట్లగాకసుత మనవాడకట్టోలతోని ఐదారుసార్ల సోపతెంబడి వచ్చిన్ననుకోరాదు” జవాబిచ్చింది సమ్మక్క.
గుమ్మంలోకి అడుగుపెడుతున్న ఆడవాళ్ళను చూచి చదువుతున్న పుస్తకాన్ని పక్కనబెట్టి రమ్మన్నట్టుగా చూచాడు డాక్టరు గారు. చేతులున్న చెక్క కుర్చీ, ముందు బల్ల. బల్లమీద స్టెతస్కోపు, బి.పి. పరికరం, థర్మామీటరు, మందుల సీసాలు. వెనుక బీరువాలో హోమియో, ఆయుర్వేదం, అల్లోపతి వైద్యాలకు సంబంధించిన పుస్తకాలున్నాయి. రోగి పడుకొనేందుకు ఒక బెంచి, వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి రెండు కుర్చీలు, మరో రెండు స్టూళ్ళున్నాయి.
ఆసుపత్రి గది పెద్దదే. పాతకాలపు మండువా ఇల్లు. చతుశ్శాలభవంతి అంటారు. కుడివేపున వీధివేపు ఉండే గదికి బయటిగుమ్మం పెట్టారు. ఆ కారణంగా ఆసుపత్రికి వచ్చేవారికి, ఇంట్లోనివారికి సంబంధముండదు.
వచ్చినవాళ్ళను కూర్చోమన్నట్టుగా సైగ చేశాడు డాక్టరు. సమ్మక్క వీరలక్ష్మిని స్టూలు మీద కూర్చోమని ముందుకు తోసి తాను నిలబడే ఉన్నది. వీరలక్ష్మి పూర్తిగా తలొంచుకొని కూర్చున్నది.
“ఏమైంది?” అడిగాడు డాక్టరు వీరలక్ష్మిని పరీక్షగా చూస్తూ.
“పానం బాగలేదు” చెప్పింది సమ్మక్క
“నీకా! ఆమెకా!” సమ్మక్క వంక చూస్తూ అడిగాడు డాక్టరు.
“ఆమెకే!” జవాబిచ్చింది సమ్మక్క
“మరి”
“నువ్వంటె బుగులుపడ్తుంది డాక్సరు సాబూ”
“నేనేమన్న పెద్ద పులిలెక్కగొడ్తున్ననా!” అడిగాడు డాక్టరు.
కిసుక్కున నవ్వబోయి తమాయించుకొన్నది వీరలక్ష్మి.
“ఇప్పుడు చెప్పవమ్మ ఏమయితున్నది.”
వివరాలన్నీ ఏకరువు పెట్టింది వీరలక్ష్మి. “ఈసారి అక్క బతుకమ్మను కూడ పేర్వజాలలేదయ్య!” ముక్తాయింపుగా చెప్పింది
నోరు బాగా తెరచి నాలుక జాపమన్నాడు డాక్టరు. జాపింది వీరలక్ష్మి. ధర్మామీటరుతో టెంపరేచరు చూశాడు. బ్లడ్ ప్రెషరు చూశాడు. స్టెతస్కోపుతో పరీక్ష చేశాడు. వీపు మీద స్టెతస్కోపును నొక్కి పెట్టి గాలి బాగా పీల్చుకోమన్నాడు. అలా రెండు మూడు చోట్ల చూశాక నిటారుగ కూర్చోమన్నాడు. స్టెతస్కోపు గుండెపై భాగాన పెట్టబోయాడు. ఆమె ఒక్కసారిగా వెనక్కు జరిగింది.
“అమ్మా! నేను డాక్టర్ని. నిన్ను పరీక్ష చేస్తున్నాను. ఏమీ చేయబోవట్లేదు.” నెమ్మదిగానే చెప్పినా కాస్త కోపం ధ్వనించింది డాక్టరు గొంతులో.
“అక్కా! డాక్సరు సాబు పరీక్షనె చేస్తడక్క బయపడకు” హామీ ఇచ్చింది సమ్మక్క.
అడ్డుగా పెట్టిన చేతిని బిడియంతో తొలగించింది వీరలక్ష్మి. బెంచిమీద పడుకోమన్నాడు. పొట్టమీద గట్టిగా నొక్కి చూశాడు. ‘అమ్మా!’ నొప్పితో అరిచింది వీరలక్ష్మి. “ఎప్పట్నించి వున్నదీ నొప్పి” అడిగాడు డాక్టరు.
“కడుపు నొప్పి లేదయ్య. ఇప్పుడు నువ్వొత్తితెనె నొచ్చింది. కని బాగ నొచ్చింది” జవాబిచ్చింది వీరలక్ష్మి.
“ఇగొ ఈ కారణంగనె నీకాకలయితలేదు. మందులిస్త. పొద్దుమాపు క్రమం తప్పకుంట ఏస్కోవాలె. టానిక్కిస్త. రాత్రి పండేటప్పుడు తాగాలె. ఇప్పుడు సూదిస్త. తుంటికియ్యాలె. చీరకట్టు వదల్జేసుకోని అటు తిరిగి పండు” వీరలక్ష్మి భాషలోనే చెప్పాడు డాక్టరు. ఏ రోగి దగ్గర ఆ రోగి భాష మాట్లాడ్డం డాక్టరుగారికి వెన్నతో పెట్టిన విద్య.
కిరోసిన్ గ్యాస్ స్టవ్‌ని వెలిగించారు డాక్టరు. స్టవ్ మీద నీళ్ల గిన్నెలో విడదీసిన సిరంజి, రెండు నీడిల్సు ఉన్నాయి. నీళ్ళు బాగా మరిగాక స్టౌ కట్టేశాడు. పట్టకారువంటి పరికరంతో వేడినీళ్ళల్లోంచి సిరంజిని తీసి సిరంజిలోకి పిస్టన్ వంటి భాగాన్ని దూర్చి, నీడిల్‌ని తీసిముందు భాగంలో అమర్చి, పిస్టన్‌ని రెండు మూడుసార్లు ముందుకి వెనక్కి ఆడించాడు. తదుపరి ఇంజెక్షన్ బాటిల్ కున్న రబ్బరు మూతలోకి నీడిల్‌ను గుచ్చి, సిరంజిలోకి మోతాదుకు తగినంత మందును లాగి, బయటకు తీసి, సిరంజిలోని మందులో గాలి బుడగలు లేకుండా చూచుకొని, నీడిల్ మార్చి వీరలక్ష్మి దగ్గర కొచ్చాడు డాక్టరు.
వీరలక్ష్మి పడుకొని ఉన్నది గాని, చీరకట్టు వదులు చేసుకోలేదు. సమ్మక్క వంక చూచాడు డాక్టరు. సమ్మక్క వచ్చి వీరలక్ష్మిని సన్నగా కోప్పడి చీరకట్టు వదులుచేసింది. డాక్టరు గారు సూది ఇచ్చి తీసేసిన చోట వేలితో నొక్కి పట్టుకొని గట్టిగా రాయమని సైగ చేశాడు సమ్మక్కకు. సమ్మక్క గట్టిగా నాలుగైదు సార్లు రాశాక లెమ్మని చెప్పింది వీరలక్ష్మికి. చీరకట్టు సరిచేసుకొని లేచింది. కాని ఆ కాసేపు సిగ్గుతో చచ్చిపోయింది వీరలక్ష్మి. బుద్ధి తెలిసిన తరువాత ఆమె తుంటికి తీసుకొన్న తొలి ఇంజెక్షన్ ఇదే.
“ఇగో ఈ మందులు తీస్కో. వారం రోజులకిస్తున్న. ఇవాళ శుక్రవారం. మల్ల శుక్రవారానికి రా! రోజుకింత తక్కువైతది. దబ్బున ఎక్కువనిపిస్తె మధ్యల్నైన రా!” చెప్పాడు డాక్టరు.
“ఎన్ని కొత్తలు”
“రూపాయి”
“రూపాయనా!” ఆశ్చర్యపోయింది వీరలక్ష్మి
“అమ్మా! నా వైద్యానికి రెండ్రూపాయలైతది గని, మీరాడోల్లొచ్చిన్రు. చిన్న కుటుంబపోల్లని రూపాయనె చెప్పిన” అన్నాడు డాక్టరు.
మారుమాట్లాడకుండా బొడ్లోంచి పైసల సంచి తీసి రూపాయనోటు డాక్టరు గారి చేతిలో పెట్టింది వీరలక్ష్మి.
“పొయ్యొస్తమయ్య!” అని దండం పెట్టి బయల్దేరారు సమ్మక్క వీరలక్ష్ములు.
“ఇంతకు మీ పేర్లు చెప్పనె లేదు.”
“అయ్యా నా పేరు సమ్మక్క. అక్క పేరు ఈర్లక్ష్మి.”
“సమ్మక్కా నువు మునుపొచ్చినవా ఇక్కడికి”
“ఆఁ రెండు మూడు సార్లచ్చిన. గుర్తుపట్టలేదా డాక్సర్ సాబు” ఎదురడిగింది సమ్మక్క.
“ఇప్పుడు యాదుంచుకుంట తియ్యి. వీరలక్ష్మి నువ్వు కొద్దిగ నూనె వాడుకం తక్కువ చెయ్యి” హెచ్చరికగా చెప్పి వెళ్ళి రమ్మన్నాడు డాక్టరు.
మర్నాటికి కొంత కోలుకొన్నది వీరలక్ష్మి. ఇంటిపనుల్లో సాయం చేయడానికి వచ్చింది సమ్మక్క, “ఎట్లున్నదక్క” అడిగింది.
“అప్పుడే తెలుస్తదా! కని ఆలతోని చూసెటప్పుడు మస్తు భయమైంది. సూది ఇస్తనన్నప్పుడు సిగ్గయింది” అని నవ్వింది వీరలక్ష్మి.
“ఏమొనక్క! ఆ డాక్సర్ను చూస్తెనైతె మంచిగనె అనిపిస్తాడు. పొయినోల్లకు పొయినట్టుగ బీమార్లైతె కమ్మయితాన్నయి” చెప్పింది సమ్మక్క
మళ్ళీ శుక్రవారం నాటికి వీరలక్ష్మి కొంత సత్తువ పుంజుకొంది. డాక్టరు దగ్గరకు వెళ్ళారిద్దరూ. ఈ సారి ఆయన లోపల ఉన్నాడు. వీధి తలుపు తీసే ఉన్నది. పిలుస్తే బయటకు వచ్చాడు. పలకరింపుగా నవ్వాడు.
“ఎట్లున్నది” అడిగాడు వీరలక్ష్మిని.
“మంచిగనె ఉన్నది” సమాధానమిచ్చింది వీరలక్ష్మి.
స్టూలు మీద కూర్చోమని సైగ చేశాడు. కూర్చున్నది చేయందుకొని నాడి చూశాడు. లోగడలానే పరీక్షలన్నీ చేశాడు. పడుకోమని పొట్టను నొక్కి చూశాడు. ఈసారి వీరలక్ష్మి అరవలేదు. “ఒత్తుతుంటే నొప్పనిపిస్తలేదా!” అడిగాడు.
లేదన్నది వీరలక్ష్మి.
“అంతమంచిగనె వున్నది మందులవసరం లేదుపో” అన్నాడు డాక్టరు.
“పొయిరా అంటరు గదా డాక్సరు సాబు” అన్నది సమ్మక్క నవ్వుకుంటూ.
“అది చుట్టాల ముచ్చట. దవాఖాన నుంచి పొయెటప్పుడు పొమ్మనుమనె చెప్పాలె. మల్ల రమ్మనుమంటె నువు బీమారుకమ్మనుమనె కద అర్థం” వివరించాడు డాక్టరు.
“అట్లనా!” అన్నారు కాని, వాళ్ళిద్దరూ కదలడం లేదు. ఒకరి మొహాన్నొకరు చూచుకుంటూ నిల్చున్నారు సంశయంగా. “ఏమన్న చెప్పేదున్నదా!” అడిగాడు డాక్టరు.
“అక్కకు పురాంగ తక్కువ కాలేదయ్య” అన్నది సమ్మక్క,
“మరప్పటి సంది చెప్పవేంది. మొన్న వచ్చినప్పుడు చెప్పినయన్ని బందయినయి అనే అనుకున్న. నువు చెప్తెనెకద నాకు ఎరుకయ్యేడ్ది” కోప్పడ్డాడు డాక్టరు.
“మొన్నచ్చినప్పుడు చెప్పలేదయ్య. ఇప్పుడు చెప్తామనుకున్నంగని అక్క సిగ్గుతోని చెప్పజాల్తలేదు” వివరించింది సమ్మక్క,
“డాక్టరు దగ్గర సిగ్గుపడితె నడుస్తదా! చెప్పవమ్మ! నీ సమస్యేంది!”.
వీరలక్ష్మి కదలక మెదలక అట్లానే నిలబడ్డది. ఆఖరుకు సమ్మక్కనె చెప్పింది. “అక్కకు తెల్లబట్టయితుంది”.
“దీనికంత ఆలోచనెందుకమ్మ! ఇండ్ల సిగ్గుపడేడ్దేమున్నది. ఆడిదన్నంక ఎర్రబట్ట, తెల్లబట్ట అయితనే వుంటయి. అది సృష్టి ధర్మం. అయిన తెల్లబట్టవుడు అనారోగ్యం అని ఎవరు చెప్పిన్రు. ఆరోగ్యకరమైన స్త్రీల లక్షణమది. ఏం కాదు. దానికి మందులేం అవుసరం లేదు. పొయిరాన్రి” చెప్పాడు డాక్టరు.
“నెలకు ముప్ఫైరోజులు పొద్దుమాపయితనే వుండుడు ఆరోగ్యమేనానయ్య!” అడిగింది సమ్మక్క గొంతులో వినయమే వున్నా ప్రశ్నలో వెటకారం ధ్వనించినట్లనిపించింది డాక్టరుకు.
“సమ్మక్కా! చెప్పేది స్పష్టంగ ఉండాలె. మేం చెప్పెకాడికి చెప్తం. నువ్వె సమజ్జేసుకోవాలె అన్నది డాక్టరు దగ్గర నడువది. నువ్వు సరిగ్గా చెప్పకున్న, డాక్టరుకు సరిగ్గా అర్థం కాకున్న నష్టపొయ్యెడ్ది నువ్వె” డాక్టరు మెల్లిగానే చెప్పినా అందులో ఉన్న కోపం మాత్రం స్పష్టంగా అర్థమయింది ఇద్దరికీ.
కొద్ది నిమిషాలెవరూ మాట్లాడలేదు. “ఇద్దరూ కూర్చోండి!” చెప్పాడు డాక్టరు. బిడియపడుతూ కూర్చున్నారిద్దరూ.
కాగితం కలం తీసుకున్నాడు డాక్టరు. “వీరలక్ష్మి కదా నీ పేరు” రాసుకుంటూ అడిగాడు. “అవునయ్య” చెప్పింది వీరలక్ష్మి. “ఇప్పుడు నేను నిన్ను కొన్ని ప్రశ్నలడుగుత. వాటికి సిగ్గుపడకుంట దాచుకోకుంట సమాధానం చెప్పాలె.” తలదించుకొనే తలకాయ నూపింది వీరలక్ష్మి.
“ఎంత మంది పిల్లలు?”
“లేరయ్యా!”
“అయ్యో! ఎక్కడన్న చూపెట్టుకున్నవా!”
“లేదయ్య! నా బాకిల పిల్లలు లేరనుకున్న. ఊకున్న.”
“తియ్యి. నెలసరి సక్రమంగ నడుస్తున్నదా!”
అంటే అన్నట్లుగా చూచారు వీరలక్ష్మి, సమ్మక్కలు.
“నెలనెల ఓరకుంటరు గద ఆడోల్లు. ఓరుకుంటున్నవా!”
“ఆఁ” సిగ్గుపడుకుంటూ చెప్పారు ఇద్దరూను.
సమ్మక్క నుండి కూడా సమాధానం రావడంతో దృష్టి సమ్మక్క వేపు మరల్చాడు డాక్టరు గారు. “నీ కెంతమంది పిల్లలు.”
“ఒక కొడుకు, ఒక బిడ్డ బాంచెను.” జవాబిచ్చింది సమ్మక్క.
“ఎంత వయసున్నరు?”
“కొడుక్కు మూడు నిండి నాలుగు బడ్డయి. బిడ్డకు యాడాది నిండింది బాంచెను”.
“శుభం. ఇప్పుడు చెప్పు వీరలక్ష్మీ! ఎన్నిరోజుల కొకసారి బయటుంటున్నావు.”
“నెలనెలా!”
“అంటే సరిగ్గా ముప్ఫైరోజులకొకసారి.”
“లేదయ్యా! ఓ సారి ఇరువైరోజులకైతది. ఒక్కోసారి నెలదాటిపోతది. ఇంకొన్నాద్దులైతే మూడోనెలబడది అనంగ సుత అయిత. నిలుకడలేదయ్య!”
“అయినప్పుడు ఎర్రబట్ట ఎన్ని రోజులు కనపడ్తది?”
“ఒక్కోసారి రెండ్రోజులకె ఆగిపోతది. ఒక్కోసారి వారంపద్దినాలు నడుస్తనె వుంటది.”
“నెత్తురు బాగపోతదా లేకుంటె మామూలుగనా!”
“బాగనె పోతది. చెయికోసుకుంటె పొయినట్టు పోతదయ్య!”
“బాగా నీరసించిపోతావు కదా! పనులు చేసుకోలేకపోతావు. అవునా!”
డాక్టరు గారి ఈ ప్రశ్నకు కళ్ళల్లో నీళ్ళు నిండుకొచ్చాయి వీరలక్ష్మికి. రెండు చేతులూ జోడించి అవునన్నట్లుగా తలూపింది. ముఖం సిగ్గుతో జేవురించింది. పెదాలు వణుకుతున్నాయి. సమ్మక్క వంక చూశాడు. ఆమె ముఖమూ అలాగే వుంది. కానైతే కన్నీళ్ళు లేవు.
డాక్టరు గారు లోపలకు వెళ్ళి రెండు గ్లాసులతో మంచినీళ్ళు తెచ్చిచ్చి తాగమన్నాడు. గటగటా తాగేశారిద్దరూ. “చాల్నా ఇంక కావాల్నా!” అడిగాడు డాక్టరు. చాలన్నట్టుగా సైగ చేశారిద్దరూ.
“నీకు సరైన మందుపడాలంటే నాకు విషయం పూర్తిగా తెలియాలి. దాచుకోకుండా చెప్పు. నీకు చెప్పడమూ, నాకు అడగడమూ రెండూ ఇబ్బందికర విషయాలే. నువ్వు ఆరోగ్యవంతురాలవు కావాలన్నా నీకు నేను వైద్యం చెయ్యగలగాలన్నా ఇది తప్పనిసరి ప్రక్రియ” వివరించాడు డాక్టరు గారు.
ఐదు నిమిషాలు అంతా మౌనంగా ఉన్నాక మళ్ళీ ప్రశ్నలు ప్రారంభించాడు డాక్టరు. ఈసారి తెల్లబట్ట గురించి.
“మీరు ఆలుమగలు కలసినప్పుడే అయితదా! ఎప్పటికైతనే ఉంటదా!’
“ఎప్పట కైతనె వుంటది కని ఆ దినం ఇంకెంతెక్కువైతది.”
దానిపైన మరిన్ని ప్రశ్నలు సంధించాడు డాక్టరు. ద్రవం చిక్కగా ఉంటుందా! పలుచగా ఉంటుందా! చీములాగా ఉంటుందా! పసుపుపచ్చగా ఉంటుందా! దుర్వాసన వస్తుందా!
వీరలక్ష్మి చాలా ఇబ్బంది పడింది కాని సమాధానాలు చెప్తూనే పోయింది. సమాధానాలన్నీ యథాతథంగా రాసుకున్నాడు డాక్టరు. “మీ తల్లిగారెక్కడ వీరలక్ష్మీ!”
“వరంగల్లు కరీమాబాదు. మా ఇద్దరిదక్కడనె బాంచెను” చెప్పింది సమ్మక్క.
“ఓ అందుకే కలిసి వస్తాన్రా! సమ్మక్కకు ఇక్కడి సంబంధం నువ్వె చూసినవా!” నవ్వుతూ వీరలక్ష్మిని అడిగాడు డాక్టరు.
“లేదయ్యా! సమ్మక్క కాపురానికొచ్చినంకనె నాకెర్క!” జవాబిచ్చింది వీరలక్ష్మి.
ఇలా సరదా విషయాలు మాట్లాడుతూ మందు పొట్లాలు సిద్ధం చేశాడు డాక్టరు. వీరలక్ష్మిని నోరు తెరువమని రెండు అరకు చుక్కలు నాలుక మీద వేశాడు. వెంటనే నోరు మూసుకొని కాసేపు తెరవకుండా ఉండమన్నాడు. అరకు ఘాటు నసాళానికంటుకుంది. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నోరు తెరిస్తే ఉపశమనంగా ఉంటుంది. కాని డాక్టరు నోరు తెరువొద్దన్నాడాయె.
“మొన్నటి నెల ఎప్పుడు ఓరకున్నవు.”
“సద్దుల బతుకమ్మనాడె అనుకో.”
“ఇంక నెల కాలేకద. మల్ల ఓర కెప్పుడుంటవో చూస్కోని లెక్కగట్టుకో. ఇప్పుడు నెల రోజులకు మందులిస్తున్న. తియ్యటి చక్కెర గోలీలె కద, ఇంత చిన్నటి గోలీలేం పనిచేస్తయి అనుకోకు. తెల్లటి పొట్లం పొద్దుగాల మొకం గడుక్కోని ఎంబడె ఏస్కో, చాయగిట్ల తాగదల్చుకున్న, ఏమన్న తినదల్చుకున్న ఒక అర్ధగంట ఆగాలె. పసుపురంగు పొట్లం రాత్రి పండెటప్పుడు ఏస్కోవాలె. తిన్నంక ఒక గంట అయినంకనె మందు ఏస్కోవాలె. రాత్రి భోజనం కొద్దిగ తొందరగ చెయ్యాన్నన్నట్టు” వివరించాడు డాక్టరు.
“ఎన్ని కొత్తలు” అడిగింది సమ్మక్క.
“రెండ్రూపాయలు”
ఈసారి మారుమాటడకుండా జాకెట్లోంచి తీసిచ్చింది సమ్మక్క, వాళ్ళిద్దరి మధ్య వుండే సామీప్యత అర్థమైంది డాక్టరు గారికి.
“ఇది ఒక్కసారిగ తగ్గేదికాదు. ఐదారు నెలలు మందు వాడాలె. కొద్దిగ తగ్గంగనె అశ్రద్ధ చేయకూడది. నీ శరీరంల వచ్చె మార్పులు, ఎర్రబట్ట, తెల్లబట్టలవుట్ల జరిగే మార్పులు రాసిపెట్టుకోవాలె..”
“మాకు చదువనీకి రాయనీకి రాదు గద డాక్సరు సాబు” మధ్యలోనే అడ్డుకుంది సమ్మక్క
“అట్లయితె యాదంచుకోవాలె. ఎప్పటికప్పుడు నీకు చెప్పుమను. నువు యాదుంచుకోని నాకు చెప్పు. ఒకలు మరుస్తె సుత ఇంకోలకు యాదుంటది కద!” చిరునవ్వుతో చెప్పాడు డాక్టరు.
“సరె డాక్సరు సాబు! అట్లనె చేస్తం” జవాబిచ్చింది సమ్మక్క.
“పొలం పన్లకు పోతవా వీరలక్ష్మీ!” అడిగాడు డాక్టరు.
“లేదయ్యా! బట్టలు కుడ్త.”
“నెత్తురెక్కువపొయ్యెట్నాడు కుట్టకు. విశ్రాంతిగ వుండు. పదిలంగ ఉండు వీరలక్ష్మీ. పొయిరాండ్రి” చెప్పాడు డాక్టరు.
“పొయిరమ్మంటున్నవు డాక్సర్సాబూ!’ ఆక్షేపించింది సమ్మక్క.
“నెలనెల రావాలె కద! అందుకే చెప్పిన” సమర్థించుకొన్నాడు డాక్టరు.
ఆరోగ్యం కనుచూపు మేరలో వుందన్న నమ్మకంతో వీరలక్ష్మి, వీరలక్ష్మి కష్టాలు గట్టెక్కుతాయన్న నమ్మకంతో సమ్మక్క తేలికపడ్డ మనసుతో బయల్దేరారు.
(ఇంకా ఉంది)