వ్యామోహం-22

0
2

[శ్రీ వరిగొండ కాంతారావు రచించిన ‘వ్యామోహం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[మర్నాడు పొద్దున్న కాఫీ కాచుకుని తాగుతుంటే వీరలక్ష్మి వస్తుంది. ఇంత పొద్దున్నే ఏంటిలా వచ్చావని అడిగితే వంట చేసి పోదామని వచ్చానని చెప్పి వంట చేయడానికి సిద్ధమవుతుంది. డాక్టర్సాబ్ పూజ పూర్తయ్యే సరికి వంట సిద్ధం చేస్తుంది. తర్వాత తింటాలే అంటే తన ముందు తింటే తనకి తృప్తి అంటుంది. ఆయన భోంచేశాకా, ఆయన చెప్పిన మీదట ఆమె కూడా అక్కడే తిని ఇంటికి వెళ్తుంది. ఇలా మూడు రోజులు గడుస్తాయి. నాల్గవ రోజు రావద్దని చెప్పేస్తాడు డాక్తర్సాబ్. ఐదో రోజున – తన వెంట టాంగాలో వచ్చిన యువకులలో ఒకడు సైకిల్‍ని బాగు చేయించి తెచ్చి ఇస్తాడు. డబ్బులు ఎంత అయ్యాయంటే వీరలక్ష్మి ఇచ్చిందని చెప్పి వెళ్లిపోతాడు.  గాయాలన్నీ మానుతాయి, ఎడమ బుగ్గ మీద మచ్చ తప్ప. డాక్టర్సాబ్ మామూలుగా ఆసుపత్రికి వెళ్ళడం మొదలుపెడతారు. కొన్ని రోజుల తర్వాత పిల్లలను తీసుకొని డాక్టరమ్మ, సత్యమూర్తి, మంగమ్మ గారు వస్తారు. బుగ్గ మీద మచ్చను గురించి అడిగితే ప్రమాదం జరిగిందని చెప్తాడు డాక్టర్సాబ్. చంటిదానికి అన్నప్రాసన చేయిస్తారు. వారం రోజులతో సత్యమూర్తి, రాము బయల్దేరిపోతారు. మరో వారం తర్వాత మంగమ్మ గారు వెళ్ళిపోతారు. ఓ రాత్రి ఇంటికి వెళ్ళేసరికి డాక్టరమ్మ చాలా కోపంగా కనబడుతుంది. ఏమందైని అడిగితే, ముందు అన్నం తినమంటుంది. నువ్వు కూడా తిను అంటే తర్వాత తింటానంటుంది. ఆయన తిన్నాక, ఆయన బలవంతం మీద తినడం పూర్తి చేసి, అప్పుడు మొదలుపెడుతుంది. వీరలక్ష్మి వరుసగా మూడు రావడం, వంట చేసి వెళ్ళడం  వంటి విషయాల గురించి డాక్టర్సాబ్‍ని ప్రశ్నిస్తుంది. ఆయన జరిగినదంతా చెప్తాడు. వీరలక్ష్మి ప్రవర్తనకి కారణాలను వివరిస్తుంది డాక్టరమ్మ. చివరకి సంశయాలు, సందేహాలు తీరి ప్రశాంతగా నిద్రపోతారు. ఇక చదవండి.]

[dropcap]మ[/dropcap]రునాటి రాత్రి పిల్లలు పడుకున్నాక చెప్పింది డాక్టరమ్మ.

“మన మీ ఊరు వదిలేద్దామండి. సత్తుపల్లిలో లేదా అశ్వారావుపేటలో ప్రాక్టీసు పెట్టుకుందాం. అక్కడంతా మనవాళ్ళుంటారు. ధైర్యంగా వుంటుంది.”

“ఇప్పుడధైర్యపడేందుకేముంది త్రిపురా!”

“అధైర్యం కాక ఏముందండి. జోడెడ్లపాలెంలో సర్వస్వమూ పోగొట్టుకున్నాం. మేకపోతు గాంభీర్యం తప్ప ఏమీ లేదు. వీరలక్ష్మి నీడ కూడ మీ మీద పడడానికి లేదు. వరంగల్లులో దానింట్లోకి వెళ్ళొచ్చారు. మిమ్మల్ని చావబాదారు. భగవంతుడు నాయందున్నాడు కాబట్టి తేలికపాటి దెబ్బల్తో పోయింది.”

“వరంగల్లు సంఘటనకు వీరలక్ష్మికి సంబంధమేముంది? నేను వాడెవడో శేఖరన్నలాగ వున్నాన్ట. వాడెప్పుడో పాపన్నపేట దాదా బాబూరావును కొట్టాట్ట. ప్రతీకారంగా శేఖరన్నను కొట్టారు. నా ఖర్మకాలి నేను శేఖరన్నలా వున్నాను. వాళ్ళకక్కడ దొరికాను” చెప్పాడు డాక్టరుగారు.

“చూశారా! మళ్ళీ వీరలక్ష్మిని వెనుకేసుకొస్తున్నారు” రౌద్రాకారం దాల్చింది డాక్టరమ్మ.

“క్షమించు త్రిపురా! నాకలాంటి ఉద్దేశ్యమేమీ లేదు. జరిగిన విషయం చెప్పాను” సంజాయిషీ నిచ్చాడు డాక్టరు గారు.

“చుట్టు పక్కల వాళ్ళకి రోడ్డు ప్రమాదమని చెప్పార్ట.”

“అసలా విషయమే ఆలోచించలేదు. డాక్టర్సాబ్ కేమైందని అకస్మాత్తుగా వీళ్లడిగిన ప్రశ్నకు అనాలోచితంగానైనా సమయస్ఫూర్తితో వీరలక్ష్మి చెప్పిన సమాధానమిది. ఎవరో వచ్చి కొట్టారని చెప్తే, మనమెవరము, ఎలాంటివాళ్ళము, కొట్టినవాళ్ళకి మనకి ఉన్న శత్రుత్వమేమిటి ఇత్యాది తలాతోకా లేని ప్రశ్నలు వస్తాయి. వాటికి సమాధానాలు కూడ మన దగ్గర లేవు. ప్రమాదమని చెప్పినందువల్ల మేలు జరిగిందనే భావిస్తున్నాను.”

“వీరలక్ష్మిని ఇలాగ కూడ వెనకేసుకురావచ్చన్నమాట” నవ్వుతూ అంది డాక్టరమ్మ.

“నేనే మాట మాట్లాడినా, నీక్కావలసిన అర్థాన్నే తీసుకుంటావు త్రిపురా!” చేతులెత్తేశాడు డాక్టరు గారు.

“అదీ! అలా దారికి రండి. మనం ఈ ఊరు విడిచిపెడుతున్నాం అంతే!”

“విడిచి పెడదాం కాని మన ఊళ్ళొద్దు. నర్సింగరావు కులకర్ణి ఒక మాటన్నాడు. స్వస్థలంలో గంగిగోవును కూడ గొడ్డుటావులాగనే చూస్తారని. నా మటుక్కు అది నిజమనిపించింది. కొంతలో కొంత ఖమ్మం మేలేమో! అయినా ఆలోచిద్దాంలే!”

మౌనంగా ఉండిపోయింది డాక్టరమ్మ. కొంత తడవైనాక డాక్టరు గారే అడిగారు – “రాత్రి నువ్వేదో స్త్రీ తన కృతజ్ఞతను వ్యక్తపరచడం గురించి చెప్పావు. ఎందుకో విషయం పూర్తియినట్లనిపించలేదు.”

“అయ్యగారికి తీపి జ్ఞాపకాలేవో గుర్తుకు వస్తున్నాయన్నమాట” వేళాకోళామాడింది డాక్టరమ్మ.

“ఛఛ! అలాకాదు. కృతజ్ఞత కారణంగా స్త్రీ పురుష సంబంధాలు కొనసాగవచ్చునా అని.”

“ఏడాది పాటు కొనసాగించుకొన్నారుగా! ఇప్పుడు కూడ కొనసాగించుకొనవచ్చునా! అని ప్రశ్న అంతేనా!”

“త్రిపురా నా భావం అదికాదు..”

“నా కర్థమైంది లెండి. కృతజ్ఞతాభావం ఏర్పడినాక తొలి అడుగు స్త్రీ వేస్తే అది కృతజ్ఞత. స్త్రీ మనస్థితిని పురుషుడు అర్థం చేసికొని ముందడుగు వేసి స్త్రీని వశపరచుకొంటే అది ద్రోహం. తాను చేసిన మేలుకు బదులుగా ఆమె శరీరాన్ని స్వీకరించడమౌతుంది. ఇది తొలి సమాగమానికే వర్తిస్తుంది. తదుపరి కొనసాగింపు స్త్రీ ప్రేరణతో జరిగితే అది వ్యామోహం. పురుషుడి పక్షాన జరిగితే మాత్రం అది కచ్చితంగా మానభంగమే. కాకుంటే అది అనుమతి కలిగిన మానభంగం” చెప్పింది డాక్టరమ్మ.

“అంత కచ్చితంగా ఎలా చెప్పగలవు?”

“మైథున క్రీడ పురుషుడికి ఒక అవసరం. స్త్రీకి అదొక అత్యద్భుతమైన పరిణామానికి దోహదకారి కాగలిగిన అవకాశం. అవసరం అనేది కేవలం దైహికవాంఛ. అది తీరేందుకు పశుబలం ఉంటే చాలు. మైథున పూర్వదేహానికి తదనంతర దేహానికి మధ్యన ఉండే అంతరం స్త్రీకి తెలిసినట్లుగా పురుషుడికి తెలియదు. మైథునానంతరానందాన్ని సంపూర్ణంగా పొందగలందులకు మైథున పూర్వ సంసిద్ధత చాలా ముఖ్యమైనది. దురదృష్టవశాత్తు చాలా సందర్భాలలో స్త్రీకి ఈ విషయంలో నిరాశ మాత్రమే మిగులుతుంది.”

“ఎందువల్ల?”

“ఎందువల్లేంటి? పురుషునికీ విషయం తెలియనందువల్ల. తనకెప్పుడూ ఈ విషయంలో నిరాశ కలుగనందువల్ల. సమాగమానందాన్ని తన దేహపు ప్రత్యణువునా నిక్షిప్తం చేసికొనగలిగే అవకాశం కలిగిన స్త్రీ అదృష్టవంతురాలు. ఆమె భర్త అంతకు పది రెట్లు అదృష్టవంతుడు.”

“ఈ విషయంలో తమరదృష్టవంతురాలా కాదా!”

“ఎందుకట!”

“ఊరికే తెలుసుకుందామని.”

“తమరు నోరుమూసుకొంటే మంచిది” లేని నిద్రను నటిస్తూ అటు తిరిగి పడుకుంది డాక్టరమ్మ.

***

నాలుగు రోజులైనాక ఒక అతిథిని భోజనానికి తీసుకువచ్చాడు డాక్టరు గారు. చూచి ఆశ్చర్యపోయింది డాక్టరమ్మ. డాక్టర్ ఎమిని. మందులకుంటలో ఏదైనా సుస్తీ చేస్తే తమ్ముడు తీసుకెళ్ళేవాడు. ఒకటి రెండు సార్లు ఆయన కూడా తమ ఇంటికి వచ్చాడు.

“బాగున్నారా అన్నయ్యా!” పలుకరించింది.

“అంత బాగనె చెల్లెమ్మా!”

“దారి తప్పి వచ్చాడు మీ అన్నయ్య” చెప్పాడు డాక్టరు గారు.

“దారి తప్పి ఏం లేదమ్మ. ఇంక మందులకుంటల దవాఖాన తీసేసిన. అందరం హైదరాబాదులనె ఉండాల్ననుకుంటున్నం. మా తాత కట్టిచ్చిన ఇల్లు చాన పెద్దది. పాడుబడిపోతున్నది. ఇన్ని దినాలు పంచాయతిల వుండె. మా పాలు నిశ్చయమైనంక దాన్ని బాగు చేపిచ్చినం. మలక్‍పేటల మంచి చౌరస్తాల వున్నది. అక్కడనే దవాఖాన. సామానంత హైదరాబాదు పోయింది. మీ వదిన తొల్త సంది హైదరాబాదుల్నె. నీకు తెలుసు కద. నేను మోటార్ సైకిల్ మీద హైదరాబాదు పోతున్న. తొవ్వల్నె కద ఒకసారి కలసిపోదామని వస్తె బలవంతం చేసి భోజనానికి తీసుకొచ్చిండు” వివరించాడు డాక్టర్ ఎమిని.

“అయ్యొ ఎంత మాటన్నయ్యా! మీరు మా ఇంటికొచ్చుడే భాగ్యం. అరగంటలో అంతా సిద్ధమౌతుంది. మీరు మాట్లాడ్తూ కూర్చోండి. ఈలోగా కాఫీ తాగండి” అంటూ కాఫీలనందించింది డాక్టరమ్మ.

భోజనాలైనాక కాస్త విశ్రమించి బయల్దేరడానికి సిద్ధపడ్డాడు డాక్టర్ ఎమిని. టీ పెట్టింది డాక్టరమ్మ. టీ త్రాగుతుండగా అడిగింది డాక్టరమ్మ.

“అన్నా! ఈయన ప్రాక్టీసు హైదరాబాదులో నడుస్తుందా!”

“ఎందుకమ్మా! ఇక్కడ బాగనె వున్నది కద!”

“నాకు మంచి గుంటలేదన్నయ్యా! ఊరు మారుదామనుకుంటున్నాం. సత్తుపల్లి లేకుంటే అశ్వారావుపేటకు పోదామనుకుంటున్నాం. మిమ్ముల్ను చూడంగనె ఆలోచన వచ్చింది. పిల్లల భవిష్యత్తు హైదరాబాదులో బాగుంటుందేమో అనిపించి అడుగుతున్నా!”

“మంచి ఆలోచన. పిల్లల భవిష్యత్తుకు కచ్చితంగ హైదరాబాద్లోనె మంచి అవకాశాలుంటయి. దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంల మీ కుటుంబాలు బాగవున్నయి. అక్కడ మంచి అడ్డ చూసి కార్డు రాస్త రండ్రి” చెప్పాడు డాక్టర్ ఎమిని.

కొద్దిసేపటి తర్వాత డాక్టరు దంపతులు వీడ్కోలు చెప్తుంటే తన బి.ఎస్.ఏ. నార్టన్ మోటార్ సైకిలెక్కి హైదరాబాదుకు బయల్దేరాడు డాక్టర్ ఎమిని.

మరో రెండు నెలల్లో డాక్టరు గారి కుటుంబం దిల్‌సుఖ్‌నగర్ మారిపోయింది. అక్కడే స్థిరపడిపోయింది.

* * *

మరో నాలుగు రోజుల్లో ఆసుపత్రి ఖాళీ చేసేస్తారనగా వచ్చింది వీరలక్ష్మి. కాస్త గందరగోళంగా కనపడింది.

“ఏమైంది వీరలక్ష్మీ!” అడిగాడు డాక్టరు గారు.

“అయ్యా! ఆనాడు మిమ్ముల్ని కొట్టింది మీరెవరో తెలువక కాదు. కావల్సుకోని మీరు డాక్సర్సాబ్ అని ఎర్కుండే కొట్టిన్రు.” గొంతులో ఆందోళన ఆవేదన తొంగిచూస్తున్నాయి వీరలక్ష్మికి.

“ఇదేమిటి కొత్త సమాచారం. నాకు వరంగల్లులో ఎవరు తెలుసును కనుక నాకు శత్రుత్వం” ఆశ్చర్యపోయాడు డాక్టరు గారు.

“వాల్లు బాల్రెడ్డి పటేల్ మనుసులు. వరంగల్ దాదాలతోని మాట్లాడి బాల్రెడ్డి పటేలే ఈ ఏర్పాటు చేసిండు.”

“అవునా! మరి నీకెట్ల తెలిసింది?”

“మల్లిగాడు చెప్పిండు.”

“మల్లిగాడెవరు?”

“జోడెడ్లపాలెంల వుంటడు. మా పెద్దమామ మనుమడు. వాడె వచ్చి చెప్పిండు.”

“వానికెట్ల తెలుసు.”

“కొట్టిచ్చెటప్పుడు గుర్తు పట్టెదానికి పటేలు వాన్ని పెట్టిండట. వాడు మా తమ్మున్దగ్గరకొచ్చి నేనుండె ఇంటి గుర్తులు తెలుసుకున్నడట. ఇంట్లకెల్లి నేనచ్చుడుపోవుడు జూసి ఇల్లు గుర్తుపెట్టుకున్నడు. నిగరానిల ఉన్నడు. వాడు నిన్ను గుర్తుపడ్తాడు. నాకు నీకు తెగిపోలే, నేనె నీ కొఱకు వరంగల్లుకెళ్లొచ్చిన అని పటేలు నమ్మిక. ఏదైన ఒకనాడు నువు నా కొఱకస్తవని వాల్లు చూస్తునట. నెల దినాలు సూద్దామనుకున్నరట. ఇరువైయ్యోనాడు నువ్వచ్చినవు. పగటీలి అని కొట్టి ఇడిసిపెట్టినట. రాత్రయితే సంపుదామనే అనుకున్నరట.” దుఃఖభారంతో ఆగిపోయింది వీరలక్ష్మి.

“మల్లిగాడు నీకీ విషయాన్నెప్పుడు చెప్పాడు” వీరలక్ష్మికి దుఃఖభారం తగ్గేవరకు వేచి వుండి అడిగాడు డాక్టరు గారు.

“నిన్న మాపటీలి”

“ఎందుకట”

“ఎందుకేంది. ఎంతకాదనుకున్న నేను వానికి చిన్నమ్మనయితగద. దాచుకోజాలక చెప్పుంటడు.”

“ఇంకేం చెప్పిండు”

“లష్కర్ బజార్ల డాక్సర్సాబ్ దవాఖాన మీద దాడి చెయ్యుమని పటేలు చెప్పిండట.”

“ఎందుకట”

“తన్నుల్తిన్న బయానికి నువ్వస్తలేవు. నువు రాకుంటె సుత నేను నీ తానకు వచ్చిపోతున్న కాబట్కె”

“నువ్వు వచ్చిపోయ్యె సంగతి పటేలుకేమెర్క”

“అయ్యొ డాక్సర్సాబ్! గ్రహిస్తలెవ్వేంది. నా ఇంటికాడనె కాదు నీ దవాఖాన కాడ సుత నిగరానుంచిండా బాల్రెడ్డి పటేల్.”

“అది సరే వీరలక్ష్మీ! చడీ చప్పుడు చెయ్యకుండా దాడి చేసి నన్ను చంపచ్చు కదా! నీకు చెప్పటమెందుకు!”

“డాక్సర్సాబ్ నీకు సంగతర్థమైతలేదు. ఈ ముచ్చట నాకు పటేల్ చెప్పలే. నా కొడుకు మల్లిగాడు చెప్పిండు. వాడీ రెండు మూడు నెలలల్ల నన్ను బాగర్థం చేసుకున్నడు. నువ్వంటే నాకెంత ఇష్టమొ తెలుసుకున్నడు. నువ్వు సచ్చిపోతె నేనాగమైపోతనని వానికర్థమైంది. అందుకే ముందుగ చెప్పిండు. అన్నడు కదా! ‘చిన్నమ్మా నువు పోవుడు బందుపెట్టు. నువు పోతలేవని, మీ ఇద్దరికి పంచాయితులైనయని పటేలుకు చెప్త. డాక్సర్సాబు బచాయించుతడు”.

“ఇప్పటి సంది నువు నా దగ్గరికి రానని చెప్పెటందుకచ్చినవు. అంతేనా వీరలక్ష్మీ!” చిరునవ్వుతో అడిగాడు డాక్టరు గారు. అవునన్నట్లుగా తలూపిన వీరలక్ష్మి కళ్ళ నుండి నీటి ముత్యాలు బుగ్గల మీదుగా జలజలాజారిపోతున్నాయి. తను సంభాళించుకొనేవరకు వేచి వున్నాడు డాక్టరుగారు. ఆనక చిన్నగా నవ్వి ఇలా అన్నాడు.

“వీరలక్ష్మీ! విషయం నీ కర్థమవలేదు. బాల్రెడ్డి పటేలు నిన్నింకా ప్రేమిస్తున్నాడు. నా జాలంలో నీవు బందీవైవున్నావు. నిన్ను నా నుండి విడిపించుకొని తన వెంట తీసుకొని వెళ్ళడం అతడి లక్ష్యం. నేను ప్రాణభయంతో నీకు దూరం కావాలి. అది జరుగదు. అందువల్ల నాకు హాని కలుగుతుందన్న భయంతో నీ అంతట నీవు నాకు దూరం కావాలి. తర్వాత అతడు నీకు దగ్గరౌతాడు. మల్లిగాడు తనంతతానుగా నీ వద్దకు రాలేదు. పటేలే వాణ్ణి పంపించాడు. మల్లిగాడికి నీ మీద ప్రేమ వుంటే – నన్ను కొట్టిన రెండో రోజో మూడో రోజో కనీసం ఒక వారానికో వచ్చి నీకీ విషయాన్ని చెప్పివుండేవాడు. ఇలా మూణెల్లు ఆగేవాడు కాదు.”

అయోమయంగా చూసింది వీరలక్ష్మి. విషయాన్ని కొనసాగించాడు డాక్టరు గారు.

“నేను నిన్ను వరంగల్‍కి లేపుకొచ్చానని బాల్రెడ్డి పటేల్ నమ్మిక. నా అనుమానం నిజమే అయితే ఆ రోజు మన రైలు ప్రయాణానికి సంబంధించిన సమాచారం పటేలుకు ఎవరో అందించారు. నువ్వు మనసు మార్చుకొని పటేల్తో కలసి వుండడానికి వెళుతుంటే, నేను నిన్ను మధ్యలో బలవంతంగా అడ్డగించి, ఆ పైన నచ్చ చెప్పి మొలకలగూడెం నుంచి వెనక్కు తెచ్చుకున్నానన్నమాట. ఈ కారణంగానే పటేలు నన్ను చంపించే పథకాన్ని రచించాడు.”

“నువు చెప్పేది నిజమా డాక్సర్సాబ్” నమ్మలేనట్లుగా చూస్తూ అనుమానంగా అడిగింది వీరలక్ష్మి.

“అవును వీరలక్ష్మీ! నన్ను మర్చిపో, ఒక నెల పోయాక పటేలు నీ దగ్గరకు వస్తాడు. ఏవేవో చెప్తాడు. అన్నీ విను. నువు నాకు కావాలి అంటాడు. బెట్టు చేసి లొంగిపో. అందులోనే నీ క్షేమముంది. నీ జీవితం ప్రశాంతంగా గడచిపోతుంది. ఈ రెండేళ్ళ తుఫాను సమసిపోతుంది.”

“మరి మీ సంగతి” అడిగింది వీరలక్ష్మి.

“డాక్టరమ్మ నాకంటే ముందు చూపు కలది. లష్కర్ జజార్లో కూడా నాకు హాని కలిగే అవకాశాన్ని ఆవిడ ముందే ఊహించింది. వచ్చే ఆదివారం అంటే ఇంక మూడు దినాలయినంక హైదరాబాదుకు పోతున్నం. ఇల్లు దవాఖాన మొత్తం అక్కడనే” చెప్పాడు డాక్టరు గారు.

“హైదరాబాదల ఎక్కడ డాక్సర్సాబ్!”

“ఆ చిరునామా నీకు వద్దు. నీకు తెలియకపోవడమే మంచిది. నేనెక్కడున్నా నీ క్షేమాన్నే కోరుకుంటాను. నువు తప్పక క్షేమంగా ఉంటావు. వెళ్లిరా!” చెప్పాడు డాక్టరు గారు.

“నువు నాకు దేవునివి. దేవుని పత్తా ఎట్లైన దొరుకుతది” అంటూ నవ్వి డాక్టరు గారి పాదాలకు నమస్కరించి వెళ్ళిపోయింది వీరలక్ష్మి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here