వ్యామోహం-5

0
1

[శ్రీ వరిగొండ కాంతారావు రచించిన ‘వ్యామోహం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[భర్త తెచ్చిన ఆనపకాయని చూసి ఎక్కడిదిది అని అడుగుతుంది డాక్టరమ్మ. వీరలక్ష్మి ఇచ్చిందని చెప్తాడు. వీరలక్ష్మి ఎవరని అడుగుతుందామె. ఆ రోజు నువ్వు టీ ఇచ్చావు కదా ఆవిడ అని చెప్తాడు. వాళ్ళింటికి ఎందుకు వెళ్ళారని అడిగితే, తాను వెళ్ళలేదని చెప్పి జరిగినదంతా వివరిస్తాడు డాక్టరు సాబ్. దాదాపు మూడు వారాలైనా వీరలక్ష్మి ఆసుపత్రికి రాదు. ఒకరోజు సమ్మక్క మరో రోగిని వెంటబెట్టుకుని వస్తే, భర్తతో కలిసి వస్తానన్న వీరలక్ష్మి రాలేదేమని ఆమెని అడిగితే, రమ్మని చెప్తాలే అని వెళ్ళిపోతుంది సమ్మక్క. కాసేపటికి మళ్ళీ వచ్చి వేరేవాళ్ళ ముందు వీరలక్ష్మి గురించి అడగద్దని అంటుంది. వీరలక్ష్మికి భర్త లేడని, చిన్నప్పుడే చనిపోయాడని, ప్రస్తుతం బాల్రెడ్డి పటే‍ల్‍తో ఉంటోందని, వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోకపోయినా భార్యాభర్తల్లానే ఉంటారని చెప్తుంది. పరిస్థితిని అర్థం చేసుకున్న డాక్టర్ సాబ్, ఆమెను రమ్మను మందిస్తాను అంటాడు. మూడో రోజు ఉదయం వీరలక్ష్మి సమ్మక్క వస్తారు. వీరలక్ష్మికి ధైర్యం చెప్పి నెలకి సరిపడా మందులిచ్చి పంపుతాడు డాక్టర్ సాబ్. ఓ రోజు డాక్టరమ్మ కొడుకుని ఎత్తుకుని డాక్టర్ గారి దగ్గరకొచ్చి నిలుచుంటుంది. ఆమె పట్టుచీర ధరించి ఉండడం చూసి, ఏమిటి విశేషం అని అడుగుతాడు. లక్ష్మింబాయక్క పసుబ్బొట్టుకు పిలిచింది వెళ్ళాలి అంటూ, పిల్లాడిని ఎత్తుకోవడానికి తన వెంట భర్తని రమ్మని కోరుతుంది. మిగతా ముగ్గురు పిల్లల్ని అమృతా వాళ్ళింట్లో ఉంచి బయల్దేరుతారు దంపతులు. నర్సింగరావు గారిల్లు వస్తుంది. ఇక చదవండి.]

[dropcap]వి[/dropcap]శాలమైన అరుగులు, వరండా. వరండానే పట్వారి గారి కార్యాలయంగా పని చేస్తుంది. నేలపైన కూర్చుని రాసేందుకు రెండు రాత బల్లలున్నాయి. ఒకటి పట్వారి గారిది. మరొకటి గుమాస్తాది. ఆ బల్ల సమంగా ఉండదు. వెనుక భాగం ఎత్తుగా ఉంటుంది. మూడంగుళాల మేర సమానంగా పొడవుగా వుంటుంది. కుడివేపున సిరాబుడ్డి పెట్టుకొందుకు గుండ్రంగా తొలచి వుంటుంది. కలాలు పెట్టుకొందుకు గాడి వుంటుంది. అప్పట్లో పత్తి కలాలుండేవి. పొడవాటి చెక్క పెన్నుకు చివరగా ఇత్తడిపత్తి వుండేది. దానికి గడ్డ అంటే నాలిక వుండదు. దవాతు అంటే సిరాబుడ్డిలో ముంచి రాస్తుండేవాళ్ళు. అప్పుడప్పుడే ఫౌంటెయిన్ పెన్నులు వస్తున్నవి కాని, పాతకాలం వాళ్ళు ఆ కలాలనంగీకరించేవారు కాదు.

మూడంగుళాల వెడల్పుతో సమంగా ఉన్న చెక్క చివరి నుండి మనిషి కూర్చునే వేపుకి రాసుకునేందుకు అనువుగా బల్ల ఏటవాలుగా వంగి ఉంటుంది. అది రాత బల్ల మాత్రమే కాదు. సమాంతర ప్రాంతంలో మడతబందులు అంటే నల్లెలు బిగింపబడి వుంటవి. ఏటవాలు బల్ల మూతవలె తెరుచుకుంటుంది. లోపల పెట్టెవలె వుంటుంది. పట్వారి ముఖ్యమైన కాగితాలను ఆ పెట్టెలో దాచుకొంటారు. దానికి తాళం వేసుకొనే సదుపాయం కూడ ఉంటుంది. కొన్ని బల్లలకు మడతబందులుండవు కాని ముందు వేపు సొరుగులుంటవి. ఆ సొరుగుల్లో కాయితాలు దాచుకొంటారు. రాత్రిళ్ళు భద్రత నిమిత్తం ఆ రాతబల్లలలను మచ్కూరివాండ్లు పట్వారి ఇంట్లో పెడతారు.

సింహద్వారానికి ఎడమవేపున పలంగుపీట వున్నది. చేతులున్న చెక్క కుర్చీలు రెండు, ఒక చేతులు లేని కుర్చీ ఉన్నాయి. ఇవి కాక ఒక ఆరాము కుర్చీ అంటే పడక్కుర్చీ, రెండు స్టూలు పీటలున్నాయి.

వీళ్ళు వెళ్ళే సరికి నర్సింగరావు కులకర్ణి పడక్కుర్చీలో కూర్చొని చుట్ట తాగుతూ అర్ధనిమీలిత నేత్రాలతో ఏదో ఆలోచిస్తున్నాడు. నడవాలోంచి సింహద్వారం వేపున్న మెట్లనెక్కుతూ “అన్నయ్యా! మంచిగున్నారా” అంటూ పలుకరించింది డాక్టరమ్మ.

ఆలోచనల్లోంచి అదాటున మేల్కొన్న నర్సింగరావు, డాక్టరు దంపతులను చూచి చుట్టను పక్కన పడేసి “ఓ మీరా! మంచిగున్న చెల్లెమ్మా! రాండ్రి డాక్టర్సాబ్!” అంటూ ఆహ్వానించాడు. డాక్టరమ్మ పిల్లాడితో లోనికెళ్ళింది. డాక్టరు గారు అరుగుమీదకొచ్చి చేతుల కుర్చీలో కూర్చున్నాడు.

“ఏం డాక్టర్సాబు! అంత మంచి సంగతులెకద!” అడిగాడు నర్సింగరావు కులకర్ణి.

“అంత మంచె రావు సాబ్. మల్ల చుట్టలు మొదలు పెట్టిన్రా!”

“మిమ్ములను చూడంగనె పక్కకు బెట్టిన గద!” అంటూ నవ్వాడు నర్సింగరావు.

డాక్టరుగారు కూడ నవ్వుతూ “తక్కువ చెయ్యుండ్రి. రోజుకు రెండు మించగూడది” చెప్పాడు.

“అయింత వెసులుబాటిస్తే చాలు” అన్నాడు నర్సింగరావు.

“పది దన్క గుంజుకపోవచ్చన్నట్టు”

“లే! ఓ ఐదారు వరకు” ముగించాడు నర్సింగరావు.

“మీ బిడ్డ మిమ్ముల్నడిగిన అని చెప్పింది. అల్లుడు, మనుమడు, మీ అక్క అంత బాగె” చెప్పాడు డాక్టరు.

“కాడెద్దులపల్లెకు బొయిన్రా!” అడిగాడు నర్సింగరావు.

“అవును ప్రతి బేస్తవారం బొయ్యొస్తనన్న సంగతి మీకు గుర్తె కద. ఈ నడుమ రెండు వారాలు పోకడ కాలె. ఎల్లుండి పొయ్యొస్త ననుకుంటున్న. ఏమన్న చెప్పుమంటరా!” అడిగాడు డాక్టరు.

“ఈరిగా” అంటూ పిలిచాడు నర్సింగరావు. మచ్కూరి వచ్చాడు. “అమ్మకు చెప్పి మాకేమన్న ఇంతెజాం జేపిచ్చు” అన్నాడు. మచ్కూరి లోపలికెళ్ళాడు.

డాక్టరుగారి ప్రాక్టీసు కాడెద్దులపల్లెలోనే వుండేది. ఊరందరికీ తలలో నాలుకగా ఉండే డాక్టరుగారికి ఏ వూళ్ళోనూ ప్రాక్టీసుకు లోటుండేది కాదు. ఓ రోజు అర్ధరాత్రి ఊరి కరణం రాజారామ్ గారింటి నుండి పిలుపొచ్చింది.

“డాక్టర్సాబ్! ఈయన మా మామ. దగ్గుదమ్ము ఎప్పటి సందో వున్నది. కని ఉన్నట్టుండి గంటసేపైతుంది కిందికి మీదికి చేస్తుండు. ఎప్పుడు దగ్గరుంచుకునే మందులు వేసుకుంటున్నడు గని పనిస్తలేవు. అందుకే మీ ఇంటికి మనిషిని తోలిచ్చిన” వివరించాడు రాజారామ్.

ఊపిరందక ఆయాసంతో ఉక్కిరిబిక్కిరయిపోతున్నాడు పెద్దాయన. స్థిరంగా నాడిని చూచి ఒక నిర్ణయానికి వచ్చాడు డాక్టరుగారు. ఇంటికి వెళ్ళి మందుల పెట్టెను తెచ్చుకున్నాడు. పావుగంట కొకసారి మందులు మారుస్తూ వేస్తూ పోతున్నాడు. తెల్లారగట్ల ఐదుగంటల ప్రాంతంలో నిద్రలోకి జారుకున్నాడు పెద్దాయన.

ఐదుగంటలూ మౌనంగానే వున్నాడు డాక్టరు. ఎవరితోటి ఒక్కమాటంటే ఒక్కమాట మాట్లాడ లేదు. వేణీళ్ళు పెట్టించి రోగి చేత తాగించాడు. ఉపశమనం కోసం రోగి గుండెల మీద కొబ్బరినూనె రాయించాడు.

“ఇప్పుడు పరవాలేదు. ఎనిమిది ప్రాంతంలో లేస్తాడు. ఈయన మీ మామగారా!” అడిగాడు.

“అవును డాక్టర్సాబ్! నర్సింగరావు కులకర్ణి అని జోడెడ్లపాలెం పట్వారి. ముగ్గురు బిడ్డలె. పెద్ద బిడ్డ శాంత నా భార్య. చిన్న వాళ్ళిద్దరిట్ల ఒకరిని సుల్తానాబాదుకిచ్చిండు, ఒకలను పెద్దపల్లికిచ్చిండు. ఈనె నాకు మేనమామ కూడ. మా అమ్మ అందరికంటే పెద్దది. అమ్మెన్క నలుగురు చెల్లెండ్లు. మామ చివరి సంతానం” వివరంగా చెప్పాడు రాజారామ్.

“దగ్గు దమ్మేన! వేరె ఏమన్న ఉన్నయా!” అడిగాడు డాక్టరు.

“దగ్గు దమ్ము తప్ప ఆయనకు వేరే రుగ్మతలేం లేవు. పదేండ్ల సంది బాధపడ్తుండు. వరంగల్లు వైద్యమైంది. కొసాఖరుకు హైదరాబాదు ఛాతి వైద్యశాలల కూడ వైద్యమైంది. వాల్లేమన్నరంటే ‘ఇది తక్కువయ్యెడ్డి కాదు. పడని వస్తువు తినద్దు. పడని తావుకు పోవద్దు. ఎక్కువైతె ఈఈ మందులేసుకోవాలె’ అని రాసిచ్చిన్రు. మామ ఆ పద్ధతిల్నె నడుస్తున్నడు. రాత్రి ఏమయిందో తెలువది. ఇక దక్కడనే అనుకున్నం. మీ దయతోని నయమైండు. ఇప్పుడు పర్వలేదంటరా!” ఆదుర్దాగా అడిగాడు రాజారామ్.

“ఏం పరవాలేదు. ఎనిమిది తొమ్మిది గంటలప్పుడు లేస్తాడు. నాకు మత్లబు చెయుండి. వస్తా!” అంటూ మందుల పెట్టెను తీసుకొని ఇంటికి నడిచాడు డాక్టరు గారు.

ఎనిమిది గంటలప్పుడు కబురు వచ్చింది డాక్టరుగారికి. ఏమీ జరగనట్టుగా కూర్చున్నాడు నర్సింగరావు కులకర్ణి. ఇంటిల్లిపాదీ డాక్టరు గారిని అభినందనలతో ముంచెత్తారు. ధన్యవాదాలు చెప్పారు.

వ్యాధి వివరాలు ఆది నుండి కూలంకషంగా తెలుసుకొని రాసుకున్నాడు డాక్టరు గారు. ఆపైన చెప్పాడు.

“నర్సింగరావు గారూ! మూడు నెలల పాటు నేనిచ్చే మందుల్ని క్రమం తప్పకుండా వేసుకోవాలి. పథ్యం పాటించాలి. ఇదుగో మీ పక్కనున్న పొగాకు చుట్టల్ని తాగడం పూర్తిగా బందు పెట్టాలి. ఆ తర్వాత మీ ఇష్టం. మీరు కావాలనుకున్నా దగ్గు దమ్ము మీ జోలికి రావు. ఈ మూడు నెలలు మాత్రం మీకు అగ్ని పరీక్షగానే వుంటుంది. రాత్రి వచ్చినంత తీవ్రంగా మళ్ళీ ఒకసారి రావచ్చును. చెప్పలేం. మీకిష్టమైతే మందులు ప్రారంభిస్తా.”

“మూణెల్లిక్కణ్ణి వుండాల్నంటె కష్టం కద! జోడెడ్లపాలెం కరణీకం నిభాయించుకోవాలె” అన్నాడు నర్సింగరావు.

“సరె! కనీసం వారంపదిరోజులకోసారైన వచ్చి చూపించుకోవాలె. మరీ తప్పనిసరి పరిస్థితైతె మీ అల్లుడు తీసుకొస్తే నేనే వచ్చిపోతా మీ ఊరికి” చెప్పాడు డాక్టరు.

మూణెల్ల వైద్యం పూర్తయి నాలుగేళ్ళు దాటిపోయింది. తనకు దగ్గు దమ్ముండిన సంగతే మరచిపోయాడు నర్సింగరావు కులకర్ణి. అదన్నమాట చుట్టల నియంత్రణ గురించి వారిద్దరి మధ్య నడచిన సంభాషణ నేపథ్యం.

లోపల్నించి శాంత సకినాలు, అరిసెలు, నువ్వుండలు రెండు ప్లేట్లలో పెట్టుకొచ్చింది. ఈరన్న స్టూలు పీటలను వాళ్ళిద్దరి ముందరా పెట్టాడు. శాంత ఆ పళ్ళాలను చెరొక పీటమీద పెట్టి “బాగున్నారా మామయ్య!” అడిగింది.

“ఊర్నించెప్పుడొచ్చినవు శాంతా!” ఆశ్చర్యపోతూ అడిగాడు డాక్టరు గారు.

“వారమైంది మామయ్యా! చెల్లెండ్లుగూడ వచ్చిన్రు. అమ్మకు సంక్రాంతి నోములుంటయి గద”

“అంత బాగా అని నువ్వు చెప్పుమన్నవట గద! డాక్టర్సాబిప్పుడె చెప్తుండు” నవ్వుతూ అన్నాడు నర్సింగరావు.

“నాయినను కలుసుడు కాలేదమ్మా! ఊర్నించొచ్చిందానివి ఒకసారి ఇంటి వరకు రాలేకపోయినవా శాంతమ్మా!” సంజయిషీతో పాటు నిష్ఠురోక్తిని పలికాడు డాక్టరుగారు.

“లేదు మామయ్య. నోముల పని మస్తుగుండె. మళ్ళ రేపె ప్రయాణం. ఈసారి వచ్చినప్పుడు తప్పక వస్త” క్షమాపణ పూర్వకంగా చెప్పి లోపలికెళ్ళింది శాంత.

“మీరీ ఊరొచ్చి ఎన్ని రోజులైంది డాక్టర్సాబ్” డాక్టరును తినమని సైగచేస్తూ అరిసెను చేతిలోకి తీసుకుంటూ అడిగాడు కులకర్ణి.

“ఎన్నిరోజులేంది రావు సాబ్. మూడేండ్లు దాటిపోయింది” జవాబిచ్చాడు డాక్టరు నువ్వుండను కొరుకుతూ.

“మీ వైద్యం ఎట్ల నడుస్తుంది”

“చాన బాగుంది. మీ బలవంతమ్మీద ఈ ఊరొచ్చినప్పుడు కొద్దిగ సంశయించిన గని, ఇప్పుడు బాగనిపిస్తుంది. ఎట్లయిన ఇది పెద్ద ఊరాయె. ఎనిమిదొందల కడప అని మీరు చెప్పిన్రు కద. వారానికోసారి కాడెద్దులపల్లెగూడ పోయొస్తున్న. మూడు కోసుల దూరం సైకిలు మీద పోవుడు వచ్చుడు కష్టమనిపిస్తది కాని, ఆ ఊరివాండ్ల ఆదరణ చూసినంక, పోకుంటెట్ల అనిపిస్తది.”

“చాన సంతోషం. ఇల్లెంత వరకచ్చె.”

“ఈ మాఘమాసంల వసంత పంచమికి ముగ్గుబొయ్యాలె అని ఆలోచన. మీరిప్పిచ్చిన ఇంటి స్థలమెకద. మీకు తెలువకుంట పని మొదలుపెడ్తనా” జవాబిచ్చాడు డాక్టరు.

“మా బావ అంటే మూడో అక్క భర్త జంగ్లాత్‌లో సారెదారున్నడు. కట్టె మంచిదిప్పిస్తడు. తొల్తనే తీసిపెట్టుకుంటే కట్టె ఎండుతది. దర్వాజలు, కిటికీలు ఎక్కించినంక పలిగి నెట్టెలు బారుడు, తలుపు చెక్కలు వంకరబోవుడు ఉండది.” సలహాతోపాటు తను చేయగలిగిన సహాయాన్ని సూచించాడు నర్సింగరావు.

“అంతకంటే మహాద్భాగ్యమున్నాదా! ముగ్గు బొయ్యంగనె కట్టెకొందాం. ఎండకాలానికి కట్టె కూడ మంచిగ తయారైతది” అన్నాడు డాక్టరు.

“మంచాల లక్ష్మయ్య ఇల్లు అనుకూలంగనె ఉన్నది కద!”

“మస్తుగుంది రావు సాబ్! అల్లంకి శంకరయ్య ఇల్లు బాగనె ఉండెగని దవాఖానకనుకూలంగ లేకుండె. లక్ష్మయ్య షావుకారు గూడ కరీంనగర్లుండుట్ల ఇల్లు మొత్తం నాకె అప్పజెప్పిండు. ఇల్లు అనుకూలమెగని మీ చెల్లెకె చాకిరి బెరిగింది.”

“అదె! ఎవలన్న పనోల్లను చూడకపోయినవా!”

“మా బెట్టుకున్నంగని మీ చెల్లె ఇంటిలోపటి పనికి ఎవలనొప్పది. పనంత ఆమెనె చేసుకోవాన్నంటది.”

“మన ఆడోల్లతోని ఉన్న చిక్కె ఇది. మీ చెల్లె సుత అంతనె. కాకుంటే పట్వారి కొలువు చెయ్యంగ కొంత వెసులుబాటునిస్తది” చెప్పాడు నర్సింగరావు,

పలహారాలయిపోగానే లోపల్నించి మంచినీళ్ళు తేనీరు వచ్చాయి. తేనీటి సేవనం పూర్తవుతుండగా చేతిలో శనగలమూటతో బయటకొచ్చింది డాక్టరమ్మ. ‘పోదామా!’ అన్నట్లుగా కళ్ళెగరేశాడు డాక్టరు. అవునన్నట్లుగా తలూపింది డాక్టరమ్మ. కరణంగారి దగ్గర సెలవుతీసుకొని వీధిలోకొచ్చారు దంపతులు. పిల్లాణ్ణి భుజాన వేసుకొన్నాడు డాక్టరు.

“బాల్రెడ్డి పటేలింటికి వెళ్ళొద్దామా! ఇక్కడికి దగ్గరనే కద” అడిగింది డాక్టరమ్మ.

“పసుబ్బొట్టుకు ఆమె కూడ పిల్చిందా!” అడిగాడు డాక్టరు.

“లేదు ఆమె ఒంట్లో బాగోలేదట. మంచంలోంచి లేవడమే కష్టమౌతున్నదట. పాపం మంచి మనిషి. చక్కగా పలకరిస్తుంది. ఒకసారి చూసొస్తే బాగుంటుందనిపిస్తోంది”

“సరే వెళదాం పద!” అన్నాడు డాక్టరు అటువేపు అడుగులు వేస్తూ.

“మీరు కూడ చెప్పలేదు. ఆవిడ అనారోగ్యం సంగతి మీకు తెలీదా!”

“ఒంట్లో బాగుండట్లేదని తెలుసు గాని, ఇంత తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతోందని తెలీదు. తరతరాల నుంచి వాళ్ళింటి వైద్యం అయ్యోరు పంతులుగారే చేస్తున్నారు. పటేలుకు గూడ ఆయనంటేనే గురి. కలిసినప్పుడు పలకరిస్తాడు, మాట్లాడ్తాడు కాని ఆరోగ్య సమస్యల గురించి నాకు చెప్పడు, నాతో చర్చించడు” వివరించాడు డాక్టరు గారు.

మాట్లాడ్తూ మాట్లాడ్తూ బాల్రెడ్డి ఇంటి ముందుకొచ్చారు. ఇల్లంటే ఇల్లు కాదు గడీ. డాక్టరు దంపతులను చూస్తూనే మచ్కూరీలు లోనికెళ్ళి సమాచారమందించారు.

గడీముందు కార్యాలయంలో కూర్చున్నాడు బాల్రెడ్డి పటేలు. బయట ఇంకా వెలుతురున్నా ఇళ్ళలోకి చీకటి ప్రవేశిస్తోందప్పుడే. కందిలి వెలుగుతోంది. పూర్తి చీకటి కాదు. వెలుగూ కాదు. కందిలి వెలుగు గుడ్డిగుడ్డిగా వుంది. పూర్తిగా చీకటి పడితేగాని కందిలి ప్రకాశం లోకానికి తెలియదు.

“రండ్రి రండ్రి డాక్టర్సాబ్ రండ్రి. దంపతులు వేళకాని వేళల అనుగ్రహించిన్రు” కూర్చున్న చోటు నుంచి లేచి ఎదురొచ్చి ఆహ్వానించాడు బాల్రెడ్డి పటేలు.

బయటి లోకంలోని పటేలు ఇంటి ఆవరణలోని పటేలుకు తేడా కొట్టొచ్చినట్లుగా కనిపించింది డాక్టరు గారికి.

“నమస్తే పటేలా!” అన్నాడు డాక్టరు.

“నమస్తే! నమస్తే! ఏమమ్మ బాగున్నారా! చిన్న డాక్టర్సాబు కూడ వచ్చినట్లున్నడు కద!” పసివాడి బుగ్గ మీద చిటికె వేస్తూ అన్నాడు బాల్రెడ్డి పటేలు.

“ఔనన్నా! లక్ష్మింబాయక్కింటికి పసుబ్బొట్టు కొచ్చినం. వదిన కన్పడలే. అడిగితె చెప్పిన్రు వదినకు పానం బాగలేదని. ఇంటికి పోతె మల్లచుడవుద్దో కాదో అని ఇట్నించి వచ్చినం” చెప్పింది డాక్టరమ్మ.

“ఔ చెల్లె! ఆమె ఆరోగ్యం బిల్కుల్ బాగలేదు. దా చూద్దువు. నువు గూడ లోపటికి రా డాక్టర్సాబ్!” అంటూ లోనికి దారితీశాడు బాల్రెడ్డి పటేల్.

లోపల కందిళ్ళు, ఎక్కలు బాగానే వెలుగుతున్నాయి. వెలుగు సరిపడ ఉన్నది.

చతుశ్శాల భవంతిలో ఓ భాగంలో వేసివున్న పలంగు పీట మీద కూర్చున్నారు డాక్టరు దంపతులు. లోపలికి వెళ్ళిన పటేలు భార్యతో తిరిగి వచ్చాడు. నడవలేక నడవలేక నడుస్తూ వచ్చిందామె. ఇద్దరాడవాళ్ళు చెరో వేపు పట్టుకు నడిపిస్తున్నారు. తీసుకువచ్చి చేతులున్న చెక్క కుర్చీలో కూర్చోబెట్టారావిడను.

“వీల్లు మా మరదండ్లు. ఆమెనేమొ ఈమెకు తోడబుట్టిన చెల్లె. ఈమెనేమొ నా తమ్ముని భార్య” పరిచయం చేశాడు బాల్రెడ్డి పటేలు తనుకూడ ఓ కుర్చీలో కూర్చుంటూ. ఆవిడ చెల్లెలూ, తోటికోడలూ నిలబడే వున్నారు.

“ఒక్కసారి నాడి చూద్దునా!” అడిగాడు డాక్టరు.

“అందుకే గద ఆమెను బయటకు తీసుకచ్చింది. లోపటికి మన మొగోల్లు పొయెటట్టుండది. ఇది నిజాం మనకంటగట్టిపోయిన సంప్రదాయం” అన్నాడు బాల్రెడ్డి చిన్నగా నవ్వుతూ.

డాక్టరుగారు నాడి చూశాడు. నోరు తెరువమని లాంతరు పైకెత్తి పట్టుకొని ఆ వెలుగులో నాలుక పరీక్ష చేశాడు. కళ్ళ క్రింది చర్మాన్ని కిందకు లాగి కళ్ళను పరీక్షించాడు.

“ఆల తేలేదా!” అడిగాడు పటేలు.

“పసుబ్బొట్టుకనొస్తింగద పటేలా! స్టెతస్కోపు లేకున్న పరవాలేదు. ఇప్పుడెవర్నన్న పంపిస్తే మందిస్త. పొద్దుగాల వచ్చి సూదిమందిస్త” చెప్పాడు డాక్టరు.

“మీరు కొద్ది సేపు బయట కూర్చుంటారా!” అన్యాపదేశంగా చెప్పింది డాక్టరమ్మ.

ఆవిడ భావాన్నర్థం చేసికొన్న డాక్టరు గారు, బాల్రెడ్డి పటేలు బయటకు నడిచారు. ఇజ్లాసులో కూర్చున్నాక అడిగాడు పటేలు “ఏం జ్వరమిది డాక్టర్సాబ్! పరవ లేదా! అయ్యోరు పంతులు రోజు మందిస్తుండు గని ఏం ఫాయిద లేదు.”

“ఇది నాలుగైదురోజుల జబ్బు కాదు. కనీసం రెణ్ణెల్ల నిందైన అక్క తీవ్రంగా బాధపడ్తుండాలె” ధృవీకరణ కోసం ఆగాడు డాక్టరు గారు.

“నిజమె డాక్టర్సాబ్, రెన్నెల్లు దాటిపోయింది. తిండి తగ్గిపోయింది. పూర్తి నాత్వానికొచ్చింది”

“ఇప్పుడు నేనిచ్చె మందుతోని రాత్రి మంచి నిద్రపడ్తది” అని చెప్తూ “ఏదీ మీ చెయ్యినియ్యుండ్రొక్కపారి” అని బాల్రెడ్డి పటేల్ చేతిని స్వతంత్రంగా చేతిలోకి తీసుకొని నాడిని పరీక్షించాడు డాక్టరు.

“పటేలా! మీరు గూడ మంచిగ లేరు గద. అక్కను గురించిన ఫికర్ల మిమ్ములను మీరు పట్టించుకుంట లేరు. ఒక రాత్రిల దగ్గస్తది. గంటగంటన్నర సతాయిస్తది. నిజమా కాదా!” సూటిగా అడిగాడు డాక్టరు.

కొద్దిసేపు తటపటాయించి అవునన్నట్టుగా తలూపాడు బాల్రెడ్డి. “ఒక్క నాడి చూసి చెప్పగలిగానవా డాక్టర్సాబ్” ఆశ్చర్యపడుతూ అడిగాడు.

“నాడి పరీక్షంటె ఏమనుకుంటున్నరు. నాకు విద్య నేర్పిన గురువు రోగి నాడిని చూసి వాల్ల అమ్మ నాయినల ఆరోగ్యం గురించి కూడ చెప్పగలుతుండె. లోకంల అనేక విద్యలున్నయి. మనకెరికున్న విషయాలు పైసమందం గాదు. కండ్లతోని చూసిన విద్యను గూడ మనం గౌరవింపజాల్తలేం. ఇప్పుడంత అంగ్రేజి విద్య కమ్ముకస్తోంది. ఇంక యాభైయ్యేండ్లు గడిస్తె మమ్ములను డాక్టర్లనిసుత ఎవ్వరొప్పరు. మేం మోసగాండ్లకిందికె లెక్క” డాక్టరు గారు నిర్లిప్తంగా చెప్పినట్లుగా తోచినా ఆయన హృదయంలోని ఆవేదన బాల్రెడ్డి పటేలు హృదయాన్ని తాకింది.

“బాధపడకుండ్రి డాక్టర్సాబ్! నిజం నిలకడ మీద తెలుస్తదంటరు. ఎప్పటికైన సత్యమే గెలుస్తది. నా కథను వినున్రి.

ఈ గడీని చూసి మేం దొరలమని, దుర్మార్గులమని లోకులందరు భావిస్తరు. రజాకార్లకు వ్యతిరేకంగ పనిచేసినోళ్లకు, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగ ఉద్యమించినోల్లకు ఆశ్రయమిచ్చిన గడీ ఇది. రోజుకు వందకు తక్కువ కాకుంట ఉద్యమకారులు ఈ గడీ పేరు మీద మూడేండ్లు భోజనాల్చేసినంటె నమ్ముతవా డాక్టర్సాబ్! మా నాయిన లక్ష్మారెడ్డి పటేలు నిజాంకు నమ్మకస్తునిగ పేరు బడ్డాడు. అందుకే ఎవలకనుమానం రాకుంట ఉద్యమానికూతాన్నివ్వగలిగిండు. కొసాఖరుకేమైంది? మా ఇంట్లో చెయ్యిగడిగినోడె నిజాంకు ఉప్పందించిండు. రజాకార్లు రాత్రికి రాత్రి దాడి చేసిన్రు. నిద్రలున్నరని సుత చూడకుంట ఇరువై మందిని దన్క చంపిన్రు. లొల్లికి మేల్కున్నోలు పరారయిన్రు. మా నాయినను బందీని చేసి పొద్దటీలి ఎనిమిదింటికి ఊరందర్ని పిలుచుకొచ్చి అందరెదురుంగ గ్రామ చావిడి కాడ తలకాయన్నరికి చంపిన్రు. కసి తీరక సచ్చిపోయిన మనిషిని ముక్కలు ముక్కలుగ నరికిన్రు.

ఊరంత భయంల జొచ్చిన్రు. అందరుగూడ ప్రాణాల మీద ఆశనొదులుకున్నరు. ఏమైందో తెలువది. ఉన్నట్టుండి రజాకార్లు, నిజాం మిలట్రీ, పోలీసోల్లు అందరికందరు మాయమైను. ఒక జాము గడిచినంక ఇండియన్ మిలట్రీ వచ్చుట్ల ప్రజలందరకు పోలీస్ యాక్షన్ జరిగినట్లుగ హైదరాబాద్ స్టేట్ స్వతంత్రాన్ని పొందినట్లుగ తెలిసింది.

మా తాత జరిగిపోయిండని వార్తవచ్చుట్ల మా అమ్మను, ఇద్దరన్నలను, అక్కను, నన్ను, తమ్మున్ని అమ్మమ్మ గారింటికి సవారికచ్చురంల ముందురోజు మాపటీలె తోలిచ్చిండు. పొద్దటిలి తాతకగ్గిపెట్టె యాల్లవరకందుతనని, దుఃఖపడద్దని అమ్మకు మాటిచ్చిండు. అక్కడ తాతకు పాడె తయారవుతుండే ఇక్కడ నాయన దేహం ముక్కలు ముక్కలువుతుండె..” చెబుతూ చెబుతూ ఎక్కిళ్ళ మధ్య ఆగిపోయాడు బాల్రెడ్డి పటేలు.

“బాధపడకున్రి పటేల్ సాబ్. మీ గడీ వెనుక ఇంతటి త్యాగపూరితమైన కథ ఉన్నదన్న విషయం నాకు తెలువది. ఎవ్వరు కూడ చెప్పలే”. బాల్రెడ్డి బాధను మనస్ఫూర్తిగా పంచుకొంటూ చెప్పాడు డాక్టరు గారు.

కొద్ది నిమిషాల తర్వాత తేరుకున్నాడు బాల్రెడ్డి. “త్యాగాన్ని గుర్తించె దేశం కాదిది డాక్టర్సాబ్! స్వాతంత్ర్య సమరయోధునిగ మా నాయినను గుర్తించె వీలె లేదన్నరు. ఎన్నడన్న జైలుకు పోయిండా! పోలె. కాంగ్రెసుపార్టీ సభ్యుడా! కాదు. కమ్యూనిస్టోల్ల సంఘంల సభ్యుడా! కాదు. ఇంక పోరాట యోధుడెట్లయితడు. కాదు పొమ్మన్నరు. ఆఖరుకింకేం పేరు పెట్టిన్రొ ఎరికేన డాక్టర్సాబ్ – దోచుకున్నది పురాంగ అప్పచెప్పకుంట దాచుకునుట్ల నిజాంకు కోపమచ్చి మా నాయినను చంపించిండట. ఇగో ఇది ఈ సమాజం పరిస్థితి. అసొంటప్పుడు ఈ గడీ కథను నీ అటువంటి కొత్త వ్యక్తికి ఎవలు చెప్తరు చెప్పు.”

వాతావరణం పూర్థి స్థాయి గంభీరత్వాన్ని సంతరించుకొంది. దూరంగా కీచురాళ్ళ శబ్దం వినిపిస్తోంది. పిల్లాణెత్తుకుని డాక్టరమ్మ బయటికొచ్చింది. గమనించే స్థితిలో లేరు వారిరువురూను.

“వెళదామాండి!” డాక్టరమ్మ గొంతు విని ఈ లోకంలోకొచ్చారు.

“పదపద” అంటూ లేచాడు డాక్టరు. “మచ్కూరిని వెంబడిచ్చి తొలిచ్చున్రి కాద! మందు పంపుత.”

“నారిగా! డాక్టర్సాబెంబడి పొయి మందులిస్తడు తీస్కరాపో” మచ్కూరిని పురమాయించాడు బాల్రెడ్డి పటేలు.

డాక్టరుగారింటికి చేరి తాళం తీసేటప్పటికి ఇల్లంతా చిమ్మని చీకటి. అగ్గిపుల్ల వెలిగించి ఆఫీసు బల్లమీద వున్న లాంతరును వెలిగించాడు. డాక్టరమ్మ నేరుగా అమృతమ్మ వాళ్ళింటికి వెళ్ళింది పిల్లల పరిస్థితిని తెలుసుకొందుకు.

“బాగ పొద్దు పోయిందమ్మ. పిల్లలు చూసి చూసి నిద్రలకు జారుకున్నరు. అన్నం వండుత తినుమంటే వద్దుగాక వద్దన్నారు. ఆఖరుకు తాలింపేసిన అటుకులుండె. తినుమంటె తిన్నరు. నిద్రకాగజాలక పన్నరు. నువు లోపటికి పొయి దీపమ్ముట్టిచ్చి పన్జూసుకో. కొద్ది తడవైతె వాల్లె లేస్తరు. కడుపుల ఆకలి పిల్లలను పండనియ్యది కద!” అన్నది అమృత.

“లక్ష్మింబాయక్కింటికి పసుబ్బొట్టుకు పొయినం. పట్వారి సాబుకున్ను మా డాక్టర్సాబుకు దోస్తాన బాగ కద. ఆడ చాన సేపె వున్నం. అటెన్క బాల్రెడ్డి పటేల్ పెండ్లానికి బాగలేదంటె చూడనీకి బోయినం. ఆడ బాగనె ఆలస్యమైంది” సంజాయిషీ చెప్పింది డాక్టరమ్మ. “కృష్ణవేణి ఏది” జ్ఞాపకమొచ్చి అడిగింది డాక్టరమ్మ.

“ఇప్పుడే పన్నది. మబ్బుల నా ఎంబడె లేస్తది కద. నిద్రకాగజాలది” చెప్పింది అమృత.

మచ్కూరికి మందులిచ్చి పంపాడు డాక్టరు. డాక్టరమ్మ పొయ్యి వెలిగించి వంట మొదలుపెట్టింది. అమృతా వాళ్ళింట్లో పడుకొన్న పిల్లల్ని ఎత్తుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టాడు డాక్టరు. వాళ్ళు భోజనాలు చేసి, పిల్లల్ని నిద్రలేపి వాళ్ళకు తినిపించేసరికి రాత్రి పదకొండు దాటింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here