Site icon Sanchika

వ్యామోహం-6

[శ్రీ వరిగొండ కాంతారావు రచించిన ‘వ్యామోహం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[పట్వారీ నర్సింగరావు ఇంట్లోకి డాక్టర్ దంపతులు ప్రవేశించేసరికి ఆయన చుట్ట తాగుతుంటాడు. డాక్టరమ్మ పలకరించగానే, చుట్టని పారేసి, ఆహ్వానిస్తాడాయన. పలకరింపులయ్యాకా, డాక్టరమ్మ పిల్లవాడితో లోపలికి వెళ్తుంది. నర్సింగరావూ, డాక్టర్సాబ్ కబుర్లలో పడతారు. నర్సింగరావుకీ తనకీ పరిచయమెలా అయిందో గుర్తుచేసుకుంటాడు డాక్టర్సాబ్. వైద్య వృత్తి ఎలా సాగుతోందని నర్సింగరావు అడిగితే, బావుందని చెప్తాడు. ఇంటి నిర్మాణం ఎంత వరకొచ్చిందని అడిగితే, వివరిస్తాడు డాక్టర్ సాబ్. పేరంటం పూర్తయి భార్య బయటకి రావడంతో, నర్సింగరావు వద్ద వీడ్కోలు తీసుకుని బయల్దేరుతారు డాక్టర్ సాబ్ దంపతులు. దగ్గర్లోనే ఉన్న బాల్రెడ్డి పటేల్ ఇంటికి వెళ్దామనీ, అతని భార్యకి బాలేదని తెలిసిందని చెబుతుంది డాక్టరమ్మ. ఒంట్లో బాలేదని తెలుసుగానీ, తీవ్రమైన అనారోగ్యమని తెలీదంటాడు డాక్టర్ సాబ్. బాల్రెడ్డి ఇంటికెళ్ళి పలకరిస్తారు. లక్ష్మింబాయి ఇంటికి పేరంటానికి వస్తే, వదినకి బాలేదని తెలిసిందని, అందుకే చూడ్డానికి వచ్చామని చెబుతుంది డాక్టరమ్మ. లోపలికి గదిలోకి ఆ దంపతులని తీసుకువెళ్తాడు బాల్రెడ్డి. అతని భార్యని అతి కష్టం మీద నడిపించుకుంటూ అక్కడికి తెస్తారు బాల్రెడ్డి మరదళ్లు. ఆమె నాడి చూసి పరీక్షిస్తాడు డాక్టర్సాబ్. తనతో ఎవరినయినా పంపిస్తే మందులిచ్చి పంపుతానంటాడు. బాల్రెడ్డితో పాటు బయటకి నడిచి, ఆయన భార్యకి ఒకటి రెండురోజులలో వచ్చిన జబ్బు కాదని, కనీసం రెండు నెలల నుంచి ఆమె బాధపడుతూండాలి అని అంటాడు డాక్టర్సాబ్. అవునంటాడు బాల్రెడ్డి. ఆయన నాడి కూడా పరీక్షించి ఆయన ఆరోగ్యం కూడా బాగులేదని అంటాడు. మాటల సందర్భంలో తన గడీ గురించి, నిజామ్‍కి, రజాకార్లకు వ్యతిరేకంగా తమ కుటుంబంలోని వారు చేసిన పోరాటాన్ని చెప్తాడు బాల్రెడ్డి. ఇల్లు చేరిన తర్వాత, డాక్టరమ్మ వంట మొదలుపెడితే, డాక్టర్ సాబ్ అమృత ఇంటికి వెళ్ళి, పిల్లల్ని ఇంటికి తెస్తాడు. భోజనాలు చేసి పడుకుంటారు. ఇక చదవండి.]

[dropcap]“అ[/dropcap]న్నయ్యా! ఇక్కడ కూడా రాత్రి పదయ్యింది” అన్నాడు రమణ కాస్త హెచ్చించిన గొంతుతో.

కళ్ళు మూసుకొని కథను ఉద్వేగంతో చెప్పుకుపోతున్న జనార్దనమూర్తి ఈ లోకంలోకి వచ్చాడు రమణ పిలుపుతో. అందరూ దాదాపుగా కథా జగత్తులోనే వున్నారు.

రమణ మళ్ళీ అన్నాడు. “అందరకూ సారీ! పదయిపోయింది రెస్టారెంటు మూసేసే వేళయింది. మీరు తినేస్తే మేం వెళిపోతాం అంటున్నారు వాళ్ళు.”

“ఓహ్! అంత టైమైందా! సరే ఏం చేద్దామ్మరి!” అన్నాడు సంజయ్.

“ఏమీ లేదు. భోంచేద్దాం. నీ పని కానీ రమణా!” అన్నాడు జనార్దనమూర్తి.

ఐదు నిమిషాల్లో చకచకా ఏర్పాట్లు చేశారు సర్వర్లు. నలభై నిమిషాల్లో అందరి భోజనాలు అయిపోయినయి. భోంచేసేటప్పుడెవరూ కాలక్షేపం కబర్లు చెప్పుకోలేదు, కావలసిన వస్తువునడగడం వడ్డించుకోవడం తప్ప. చివరిగా మసాలా పాన్లు వచ్చాయి. వీడ్కోలు సమయమాసన్నమైంది. అప్పుడున్నాడు రమణ.

“కింద ఫస్ట్ ఫ్లోర్‌లో ఎ.సి. కౌన్సెలింగ్ హాల్సున్నాయి. సరిగ్గా పది కుర్చీలు మధ్యలో బల్ల వుంటాయి. మీరు కథను శ్రద్ధగా వింటున్నపుడు వెళ్ళి బుక్ చేసి వచ్చాను. మనమున్నంత సేపూ, కావాలన్నప్పుడల్లా కాఫీలు, టీలు వగైరా బెవరేజెస్ వస్తూనే వుంటాయి. కథను పూర్తిగా వినాలని మీరూ చెప్పాలని అన్నయ్యా అనుకొంటే వేదిక రెడీగా వుంది. లేదూ వెళ్ళిపోదాం అంటే బుకింగ్ క్యాన్సిల్ చేసేస్తాను. క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఏమీ వుండకుండా మాట్లాడివచ్చాను. ఆపైన మీరెలా చెప్తే అలా!”

“వెరీ గుడ్ రమణ! కంగ్రాచ్యులేషన్స్! యూ ఆర్ ఎ గ్రేట్ ఈవెంట్ ఆర్గనైజర్” మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు విడాకులు తీసుకొంటున్న సౌమ్యా సాకేత్‌లు.

“సో అందరమూ కథను వింటున్నామన్నమాట” అన్నారు రెండవ జంట స్వాతి, హిమాంశురామ్‌లు. మిగిలిన వాళ్ళందరూ చప్పట్లు చరిచారు సంతోషంతో.

“అన్నయ్యా! నీ కథ కొత్త వెన్యూలో” అన్నాడు రమణ లేవడానికుద్యుక్తుడవుతూ.

“కథ ఏమీ బోర్‍గా లేదు కదా! నిద్ర పాడుచేసుకొని వినాల్సినంత గొప్ప కథేమీ కాదిది. కావాలంటే మరోసారెప్పుడన్నా కలుసుకున్నపుడు చెప్తాను” అన్నాడు జనార్దనమూర్తి.

“అన్నయ్యా! దిసీజ్ టూమచ్. నువ్వు కథ చెప్తున్నావు. మేం వింటున్నాము. దట్సాల్.” అన్నాడు సమ్మయ్య.

“అన్నట్టు డ్రైవర‌‍కు భోజనం? అసలా సంగతే మర్చిపోయాను” అకస్మాత్తుగా గుర్తుకొచ్చింది జనార్దనమూర్తికి.

“నేను మర్చిపోలేదన్నయ్యా! అతడు వేళకే భోంచేశాడు. మనమే ఆలస్యమయ్యాం” చెప్పాడు రమణ చిరునవ్వుతో.

మరో పది నిమిషాల్లో అందరూ కౌన్సెలింగ్ హాల్లో సమావేశమయ్యారు. వేడివేడి కాఫీలు వచ్చినయి. అందరూ కాఫీలు చప్పరిస్తుండగా – తను కూడా అదే పనిచేస్తూ కథను మొదలెట్టాడు జనార్దనమూర్తి.

***

పొద్దున్న ఎనిమిది ఎనిమిదిన్నరకు సైకిలు మీద పోలీసు పటేలు ఇంటికి చేరుకున్నాడు డాక్టరు గారు. పటేలు, ఇజ్లాసు అంటే పని స్థానంలో పూర్తి వ్యస్తతతో ఉన్నాడు. ఆ సమయంలో గ్రామ సేవకులంతా వస్తారు. రాత్రి గ్రామంలో జరిగిన విశేషాలను విన్నవిస్తారు. నేరాలు వగైరాలు జరిగినా, దొంగలెవరైనా దొరికినా పోలీసు పటేలు విషయాన్ని సమీప పోలీసు స్టేషన్‌కు తెలియజేస్తాడు. పోలీసులు వచ్చి తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తారు. లేదా సందర్భాన్ని బట్టి వీళ్ళే పోలీసు స్టేషన్‌కు వెళతారు. కొన్ని సందర్భాల్లో పోలీసు పటేలు కూడ స్టేషనుకు వెళ్ళాల్సి వస్తుంది.

అదే విధంగా ఈ రోజటి కార్యక్రమాలను సేవకులకు వివరించి పనులనప్పగిస్తాడు. తహశీల్దార్లు, గిర్దావర్లు లేదా చెరువులు కుంటలు తనిఖీలు చేయడానికొచ్చే ఓవర్ సీర్లు ఇత్యాది విషయాలను తెలియజేసి వారికి కావలసిన సహకారాన్నందించవలసిన బాధ్యతలను అప్పజెప్తాడు. ఇవన్నీ పోలీసు పటేలుకు నిత్యకృత్యాలన్నమాట.

డాక్టరును చూడగానే పటేలు “ఒక్క పావుగంట కూర్చుండుండ్రి డాక్టర్సాబ్!” అంటూ కుర్చీని చూపించాడు. డాక్టరుగారు కుర్చీలో కూర్చోగానే తన పనిలో మునిగిపోయాడు పటేలు. జరుగుతున్న సంభాషణలను శ్రద్ధగా వింటున్నాడు డాక్టరు. పావుగంట అన్నచోట ముప్పావుగంట పట్టింది. అందరూ వెళ్ళిపోయారు. ఇద్దరు మచ్కూరీలు మాత్రం అక్కడే వుండిపోయారు. వాళ్ళు ఆరోజటి పోలీసు పటేలు అవసరాలు చూడాలన్నమాట. ‘అమ్మయ్య!’ అని ఊపిరి పీల్చుకొని “చెప్పండి డాక్టర్సాబ్” అంటూ డాక్టరు వేపుకి తిరిగాడు బాల్రెడ్డి.

“పోలీసు పటేలంటె అధికారం చెలాయించుడే అనుకున్నగని, ఇంత పనుంటదని గని వ్యవహారాలింత సున్నితంగ ఉంటయనిగని నాకింత వరకు తెలువది” అన్నాడు డాక్టరు ఆశ్చర్యపోతూ.

“ఇంకేం చూసినవు డాక్టర్ సాబ్! ఊర్లెకు ఏ కొత్త మనిషి వచ్చిన సుత వాని మనసు నొవ్వకుంట వాని ఆనుపానులన్ని తెలుసుకోవాలె. వాడెవనింటికొస్తాండు. ఏం పనిమీద వస్తాండు. ఎన్నొద్దులుంటడు తెలుసుకోవాలె. వాడిక్కడున్నన్ని రోజులల్ల ఈ ఊల్లె ఏమన్న నేరాలు జరిగితే, ఈ కొత్తగొచ్చినోని పాత్ర ఏమన్న ఉన్నదా! విచారించాలె. ఈ విచారించుట్ల ఈ ఊరి గృహస్తు బద్నాం కాకుంట చూసుకోవాలె. ఇసొంటియింక మస్తుగుంటయనుకో” చెప్పుకొచ్చాడు పటేలు.

చిరునవ్వుతో శ్రద్ధగా వింటూండిన డాక్టరు నేరుగా విషయంలోకొచ్చాడు. “అక్క రాత్రి మంచిగనె పన్నదా!”

“అవునయ్యో! మర్చేపోయిన. లేచుడు లేచుడె ఇజ్లాసులకచ్చిన. రాండ్రి” అంటూ లోపలికి దారితీశాడు బాల్రెడ్డి పటేలు.

“వనజమ్మను తీస్కరాండ్రి” అక్కడి వాళ్ళకు చెప్పాడు పటేలు.

“వద్దు పటేలా! ఆమె కలిష్టయితది. మనమే లోపటికి పోదాం” అన్నాడు డాక్టరు.

లోపల అందరూ సద్దుకున్నాక పటేలు, డాక్టరు లోనికెళ్ళారు. “కొద్దిగన్ని ఉడుకు నీళ్ళు తెప్పియ్యండి గాదా!” చెప్పాడు డాక్టరు. తేవడానికెళ్ళింది పటేలు మరదలు.

“ఎట్లున్నదక్కా! రాత్రి నిద్ర పట్టిందా!” అడిగాడు డాక్టరు.

పట్టిందన్నట్లుగా తలూపి నీరసంగా నవ్వింది వనజమ్మ. మళ్ళీ నాడి పరీక్ష చేసి, స్టెతస్కోపుతో పరీక్షించాడు. ఈలోగా వేణీళ్ళు వచ్చాయి. ఇంటి దగ్గర స్టెరిలైజ్ చేసుకొచ్చిన సిరంజిని నీడిల్సునూ వేణీళ్ళలో కడిగి సీసాలోని మందును లాగి సూది మార్చి “అక్కా! కొద్దిగ నొస్తది. ఓర్చుకో!” అంటూ ఇంజెక్షను చేశాడు ఆవిడ చట్టకు.

“చేసినవా!” అడిగింది సిరంజిని కడుక్కుంటున్న డాక్టరును చూసి. అవునన్నట్లుగా చిరునవ్వు నవ్వాడు డాక్టరు.

“అయ్యొ తెలువకనె పాయె. అయ్యోరు పంతులు సూదిగుచ్చితె నా ఒర్రుడుతోని అవుతలర్రలోల్లక్కూడ సూది గుచ్చినట్టు తెలుస్తుండె. విద్య మంచిగ నేర్చినవు డాక్టర్సాబు” మెచ్చుకున్నది వనజమ్మ.

“అక్కా! నాలుగు దినాలు వరుసగ సూదిపడాలె. రోజీయాల్లకె వస్త. బుక్కెడంత తిని వుండు” చెప్పాడు డాక్టరు.

“ఏం తినబుద్ధెతలేదన్న” చెప్పింది వనజమ్మ.

“రేపటికి నాలుకకు రుచస్తది. దబ్బున ఏం తినబుద్ధి గాకుంటె పొద్దటీలి సాయబ్ హుస్సేన్ సైకిలు మీద తిరుక్కుంట డబల్ రొట్టెలు, బన్నులమ్ముతడు కద. అది కొనుక్కోని తిని వుండు. ఇంజక్షను పరగడుపున ఇయ్యగూడది” వివరించాడు డాక్టరు.

“మరిప్పుడు గూడ ఏం దినలె”

“ఇయ్యాల్టికి పరువలేదు. దానికి తగిన గోలీలు రాత్రే పంపిన. ఇప్పుడు మల్ల మందులిచ్చిపోత. రంది పడకక్క, మంచిగనె కోలుకుంటవు” బేలగా చూస్తున్న వనజమ్మకు ధైర్యం చెప్పి మందుల సంచితో బయటకు నడిచాడు డాక్టరు.

“పటేలా కొద్దిగ మీతోని ఒంటరిగ మాట్లాడాలె. ఇజ్లాసుల కెవరన్న వస్తరా! లేకుంటే ఈ చతుశ్శాలల్నె కూచుందామా! కొద్దిగ వేరేటోల్లినగూడది” గొంతు తగ్గించి కేవలం బాల్రెడ్డికి మాత్రమే వినపడేట్టుగ అడిగాడు డాక్టరు.

“ఇజ్లాసె పక్క పోదాం పా!” అన్నాడు పటేలు.

అప్పటికి ఒకళ్ళిద్దరు పటేలు కోసం వేచి చూస్తున్నారు. పదినిమిషాల్లో వాళ్ళను పంపించి “ఇక చెప్పు డాక్టర్సాబ్” అన్నాడు. ఈ లోగా లోపల్నుంచి మంచినీళ్ళు, చాయ వచ్చినయి.

“ఇగొ పటేలా! పన్నెండు గోలీలు. పొద్దుగాల, పగటిలి, మల్ల రాత్రి పండెటప్పుడు. నాలుగు దినాలు క్రమం తప్పక వాడాలె. అయ్యోరు పంతులిచ్చిన మందులేమన్న వుంటే బందుపెట్టున్రి. ఆయనిచ్చిన మందులకు నేనిచ్చిన మందులకు పడకుంటే అక్కకు తిప్పలైతది” చెప్పాడు డాక్టరు.

“అట్లనె కని. ఏకాంతంల మాట్లాడాలెనంటివి గద. ఏందది?” అడిగాడు పటేలు.

మచ్కూర్లవంక చూచాడు డాక్టరు. వాళ్ళను దూరంగా వెళ్ళమన్నాడు పటేలు.

“పటేలా! అక్క జబ్బు సామాన్యమైనది లెక్క కొడ్తలేదు. తక్కువైతది. కాదన్న ముచ్చట్నె లేదు. కని నాకు జబ్బు స్వభావం తెలువాలె. తెలువాలంటె నాకీ సమాచారం గావాలె” అంటూ వెంట తెచ్చుకున్న కాగితాన్ని మందుల సంచిలోంచి తీసిచ్చాడు డాక్టరు.

“ఏందిది?” అడిగాడు పటేలు కాగితాన్ని తీసుకుంటూ.

“ఈ కాయితంల ప్రశ్నలు రాసిన. వాటి సమాధానాలు మీరు అక్కనడిగి రాసుకోని నాకియ్యాలె. పరిచయం లేని రోగులను నేనె అడిగి రాసుకుంట. అక్కనడుగాన్నంటె ఇబ్బందిగుంటది. మీరు రాసిస్తె దాన్ని బట్టి వైద్యాన్ని నిర్ణయిస్త.”

ప్రశ్నలను మనసులోనే చదువుకోవడం మొదలుపెట్టాడు పటేలు. కాగితాన్ని పూర్తి చేసేటప్పటికి అతని ముఖం ఎర్ర బారింది. “నీ వైద్యానికి ఇవన్ని అవుసరమంటవా డాక్టరూ!” పటేలు గొంతులో జీర కోపాన్ని ధ్వనిస్తోంది.

పటేలు కోపాన్ని పట్టించుకోలేదు డాక్టరు. స్థిరమైన స్వరంతో మెల్లగా చెప్పసాగాడు.

“అవును. ఆ వివరాలు లేకుండా వైద్యం చేయడం కుదరదు. ఇది అందరకు చెప్పే సమాధానమే. కాని మీరు గ్రామాధికారి. మీ అవగాహనా స్థాయి మిగతావారి కన్న ఎక్కువగా వుంటుంది. కాబట్టి మీకు కొంత వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. అది కూడ మీరు సావధానంగా వింటానంటేనే!”

డాక్టరు గారి మాటలతో కొంత సర్దుకున్నాడు పటేల్. “చెప్పుండ్రి వింట”. చెప్పడమ్మొదలెట్టాడు డాక్టరు.

“మనకందుబాటులో వున్నవి, బాగా తెలిసినవి నాలుగు వైద్యవిధానాలున్నాయి. అవి అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, యూనాని.

అల్లోపతి వైద్య విధానం మనకు ఇంగ్లీషు వారి ద్వారా సంక్రమించింది. మిక్కిలిగా వ్యాప్తిలోకి వస్తున్నది. కారణమేమంటే ఆ మందులు వేగంగా పనిచేస్తవి. రోగికి సత్వరమే స్వస్థత చేకూరుతుంది.

మీరు పోలీసు పటేలు. మీ చేతికింద కొంత సైన్యమున్నది..”

“సైన్యం కాదు డాక్టర్సాబ్. వాల్లు నా సహాయకులు మాత్రమే. నిజంగ చెప్పాన్నంటె గ్రామ సేవకులు” డాక్టరు గారి మాటలకడ్డు పడ్డాడు బాల్రెడ్డి పటేలు.

చిన్నగా నవ్వి చెప్పడమ్మొదలెట్టాడు డాక్టరు. “నా ఉద్దేశ్యంలో సైన్యమంటే నిజంగా సైన్యమని కాదు. క్రమశిక్షణతో మెదిలే సహాయకులని. వారు ప్రజల మధ్యన, ప్రజలతో కలసిమెలసి తిరుగుతూనే సమాజానికి హాని చేసే వారిని పట్టి మీ వద్దకు తెస్తారు. వారిని మీరు మందలించడమో, శిక్షించడమో చేస్తారు. మీ పరిధిలోనిది కాదనుకొంటే పోలీసు వారికప్పగిస్తారు.

అలాగే మన శరీరంలో కూడ గూఢచారి రక్తకణాలు, సైనిక రక్తకణాలు వుంటాయి. అవి రోగ క్రిములను గుర్తించి యుద్ధం చేసి వాటిని చంపేస్తాయి. ఆ యుద్ధం జరిగేటప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దాన్నే మనం జ్వరమంటాం.

అల్లోపతి వైద్య విధానంలో రోగికి ఇవ్వబడిన మందు సైనిక రక్తకణాల పాత్ర పోషిస్తుంది. దానితో రోగక్రిములు తక్షణమే మరణించి రోగికి ఉపశమనం కలుగుతుంది. కొంతకాలానికి ఇదే అలవాటయి, సైనిక రక్తకణాలు శత్రువులతో పోరాడడమెలా అన్న అంశాన్ని మరచిపోతాయి. గూఢచారి రక్తకణాలు రోగక్రిములను గుర్తించడం మానివేస్తాయి. వ్యాధి ముదిరే వరకు రోగి తాను అనారోగ్యవంతుడనైనానని గుర్తించలేకపోతాడు. దానితో మందుల మోతాదు పెంచవలసి వస్తుంది. మందు మోతాదు పెరిగిన కొద్దీ రోగక్రిములు తమ శక్తిని మరింత పెంచుకుంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో రోగక్రిములు మరణించినాక కూడ మందు శక్తి మిగిలి వుంటుంది. అప్పుడా మందు మనిషి దేహంలోని ఆరోగ్యవంతమైన కణాలను తినివేయడం మొదలెడ్తుంది. దాన్ని మెడిసినల్ రియాక్షన్ అంటారు. అంతకు ముందులేని కొత్త వ్యాధులు మొదలవుతాయి. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని అల్లోపతి వైద్యులు ఒప్పుకోరు. వైద్యాన్ని పొందుతున్న రోగులు కూడ ఒప్పుకోరు.”

“నువ్వు చెప్పేది సత్యమైతె వాల్లెందుకొప్పుకోరు” ఎదురడిగాడు బాల్రెడ్డి.

“దొంగను పోలీసు ఠాణాలేసి ఉతికి ఆరేసి దొంగతనాన్నొప్పిస్తె మంచిగనా, పరిశోధన చేసి దొంగతనాన్ని నిర్ధారణ చేస్తే మంచిగనా!” ప్రశ్నించాడు డాక్టరు.

“పరిశోధన చేసి ఒప్పిస్తేనే మంచిగ గని, అంత ఓపిక ఇయ్యాల రేపు ఎవనికున్నది” జవాబిచ్చాడు పటేలు.

“ఇంగ్లీషు వైద్యంల సరిగ్గా అదే జరుగుతది. దొంగను నాలుగు ఉతికి దొంగతనం ఒప్పిస్తరు. శిక్షపడది. ఒక దొంగకే రెండోసారి మూడోసారి కూడ అట్లనే అయిందనుకోని అయితెనా వాడు దొంగతనాన్ని వృత్తిగ చేసుకుంటడు లేదా బండబారిపోయి పెద్ద నేరస్తుడౌతడు. రోగం మందుకలువాటయితది. మందు చాలకుంటె ముదిరి పెద్ద రోగమైతది. దొంగను ఠాణాలు కొట్టి నేరాన్ని ఒప్పించే ఇన్స్పెక్టరుకు పరిశోధన చేసి నేరాన్ని ఒప్పిచ్చుడు ఎట్లనైతె నచ్చదొ – ఇంగ్లీషు వైద్యం చేసెటోల్లకు కూడ భారతీయ వైద్య పద్ధతులు నచ్చయి.

ఈ పద్ధతిల ఒక్కోసారి అమాయకుడు కూడ దొంగగ మారిపోతడు. అట్లనే ఆరోగ్యవంతుడు కూడ జీవితకాల రోగిగ మారిపోతడు” వివరించాడు డాక్టరు.

“మరిప్పుడు దేశమంతట అంగ్రేజి వైద్యమె నడుస్తున్నది కద! దీనికి ప్రత్యామ్నాయమేంది” అడిగాడు బాల్రెడ్డి పటేలు.

“మన ఆలోచనా విధానాన్ని సరిచేసుకోవడమే ప్రత్యామ్నాయం. క్షీరసాగర మథనంలో జన్మించిన ధన్వంతరి సమస్త మానవాళి ఆరోగ్యం నిమిత్తం ఆయుర్వేదాన్ని ప్రసాదించాడు. ఆయుర్వేదమంటే మన ఆయుష్షుకు సంబంధించిన జ్ఞానమని అర్థం. మానవుడు ఆరోగ్యవంతంగా ఉంటూ తన ఆయుష్షును పొడిగించుకొనే మార్గమన్నమాట.”

“మన ఆయుష్షు మన చేతిల ఉంటదా!” అడొచ్చాడు పటేలు.

“ఉండదు కాని, ఉంచుకొనే ప్రయత్నాన్ని చేయవచ్చు”

“ఎట్ల!”

“శరీర వ్యాయామం, ప్రాణాయామం, యోగాసనాలు, ఆహార విహారాలలో మంచి అలవాట్లు – ఇవన్నీ మన ఆయుష్షును మనం పొడిగించుకొనే మార్గాలు. ‘జీవంతు శరదశ్శతం, పశ్యతి పుత్రం. పశ్యతి పాత్రం’ అన్నమాట లెప్పుడన్న విన్నరా!”

“ఎందుకిన్లే డాక్టర్సాబ్! మల్లన్న గుడి పూజారి అక్షింతలు వేసుకుంట ఇవే మాటలంటడు గద. ‘నూరేండ్లు బతకాలె. కొడుకులను కనాలె. మనుమలనెత్తాలె’. ఓసారి అడుగుతె అర్థం చెప్పిండు” జవాబిచ్చాడు పటేలు.

“అది ఆశీర్వాదం. ‘నాకు నూరేండ్ల వయసొచ్చె వరకు ప్రతిరోజు నా కండ్లతోని నేను సూర్యోదయాన్ని చూడగలుగాలె, మంచిమాటలు వినగలుగాలె, మాట్లాడగలుగాలె, అజేయునిగ ఉండాలె, ఆనందంగ ఉండాలె, సంతృప్తిగ ఉండాలె, బలంగా ఉండాలె’ అని ప్రతిదినం మనం దేవున్ని ప్రార్థించాల్నట. ఇది ఋషులు మనకు చెప్పిన ప్రార్థన. ఆరోగ్యంగా ఉండమని ధన్వంతరి చెప్తే ఆరోగ్యమంటేందొ ఋషులు చెప్పిన్రనుకోరాదు” చెప్పాడు డాక్టరు.

“ఇది బాగనె వున్నది కని మనిషన్నంక బీమారు గాకుంట ఉండుడు సాధ్యమైతదా డాక్టర్సాబ్!” అనుమానం వెలిబుచ్చాడు పటేలు.

“ఆయుర్వేదం ఏం చెప్తుందంటే ప్రతి మనిషి శరీరంల గాలి, నీరు, నిప్పు వుంటయి. ఇవి సమపాళ్ళల్ల ఉంటే ఆరోగ్యం, పాళ్ళు చెడిపోతె అనారోగ్యం.”

“పెయిని గట్టిగ నల్చుకుంటే మట్టి వస్తది కద. దాని గురించి చెప్పకపోతివి” అడిగాడు బాల్రెడ్డి.

“ఐదు భూతాలు కలుస్తెనె మనిషి.”

“అగొ భూతాలెక్కడికెల్లి తెస్తివి.”

చిన్నగా నవ్వి చెప్పసాగాడు డాక్టరు “భూతాలంటె దయ్యాలు భూతాలు కావు పటేలా! పంచ భూతాలు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వి. పృథ్వి అంటే భూమి. భూమి అంటే మట్టి. నువు చెప్పినట్టుగ ఈ శరీరం మట్టితో తయారయింది. కాబట్కెనే కంటికి స్థిరంగ కనిపిస్తున్నది. వాసన మట్టి స్వభావం, మట్టితో తయారయిన మన శరీరాలు కూడ వాసనస్తయి. ఆకాశం, అంటే ఖాళీ. మన శరీరంలో ఖాళీ అనే అవకాశం ఉంది కాబట్టే శరీరంలోని వివిధావయవాలు కదులగలుగుతున్నాయి. రక్త ప్రసరణ ఇత్యాదిపనులు చేసుకోగలుగుతున్నాయి. శబ్దమన్నది ఆకాశ లక్షణం. మనం శబ్దాలను వినగలుగుతున్నామంటే మనలో ఆకాశం వున్నట్టే.”

“సరె సరె! వైద్యం సంగతి చెప్పు.”

“మీరు వింటున్నరని చెప్తున్న. పనుంటె చెప్పున్రి. మీరా కాయితం రాసి పెట్టుని. రేప్పొద్దుగాల వచ్చినపుడు తీసుకుంట” అన్నాడు

“బడె వున్నవు డాక్టర్సాబ్! సగంల ఇడిసి నాకు మనసున బట్టద్దా! వైద్యాన్ని హరికత లెక్క సుతారంగ చెప్తున్నవు. సమ్మిగా! కచేరి కాడికి ఒక గంట ఆలస్యంగ వస్తనని సర్పంచుకు చెప్పురా!” మచ్కూరికి పురమాయించాడు పటేలు.

“అయ్యయ్యో! ఎంత పనాయె. నా ముచ్చట చెయ్యంగ మీ పని ఖరాబు” నొచ్చుకున్నాడు డాక్టరు.

“పరవలేత్తియి డాక్టర్సాబ్. మన ఊరు పంచాయతులు రోజుండేటియె. నువు చెప్పేది మస్తు ఇన బుద్దయితుంది. చెప్పు” అన్నాడు పటేలు. చెప్పడం మొదలు పెట్టాడు డాక్టరు.

“గాలి, నీరు, నిప్పు అనుకున్నాం గద. గాలివల్ల శరీరంలో అంటే కీళ్ళలో కదలిక వస్తుంది. గాలి మన ప్రాణం కూడా. ఊపిరి ఆగిపోతే ప్రాణం పోతుంది. నిప్పువల్ల మనం తిన్న భోజనం కడుపులో దహింపబడి శక్తిగ మారుతుంది. మనకంటి చూపు, మాట ఇత్యాదులన్నీ అగ్ని వల్లనే సాధ్యమౌతాయి. మన శరీరంలో అగ్ని నిప్పుకణికల వలె ఉండదు. ఆమ్లాలు, క్షారాల రూపంలో వుంటుంది. నీరు లేకపోతే మన జీవితమే లేదు. రక్తమంటేనే నీరు. తిన్న ఆహారం జీర్ణమైనాక విడుదలయ్యే శక్తిని రక్తమే మోసుకెళ్ళి దేహమంతటా సరఫరా చేస్తుంది.”

“ఇదంత మా పిల్లలు చదువుతుంటే విన్నగని దీనికి నీ ఆయుర్వేదానికి సంబంధమేంది” అడిగాడు బాల్రెడ్డి పటేలు.

“నీరు, నిప్పు, గాలి వీటి స్వభావాలు తెలుసుకున్నాం కద. స్వభావాన్ని ఆయుర్వేదంలో తత్త్వమని పిలుస్తాం. ప్రతి మనిషి శరీరంలో మూడు తత్త్వాలు ఉన్నా గాని, మూడింటిలో ఏదో ఒక తత్త్వం ఉద్దీపించి ఉంటుంది. ఒక మనిషి శరీరానికి జలతత్త్వం నాయకత్వం వహిస్తే, మరో మనిషి శరీరానికి అగ్నితత్త్వం, ఇంకో మనిషి శరీరానికి వాయుతత్త్వం నాయకత్వాన్ని వహిస్తాయన్న మాట. జల స్వభావాన్ని శీతల లేదా శైత్య లేదా శ్లేష్మ తత్త్వమని, అగ్ని స్వభావాన్ని పిత్త లేదా పైత్య తత్త్వమని, వాయు స్వభావాన్ని వాయు లేదా వాత తత్త్వమని వైద్యులు వ్యవహరిస్తారు. మొట్టమొదట వైద్యుడు రోగి శరీర తత్త్వాన్ని తెలుసుకుందుకు ప్రయత్నిస్తాడు. శరీరతత్త్వం నిర్ధారణ అయినాక వైద్యం మొదలుపెడ్తాడు.”

(ఇంకా ఉంది)

Exit mobile version