వ్యామోహం-8

0
2

[శ్రీ వరిగొండ కాంతారావు రచించిన ‘వ్యామోహం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[పటేల్ అడిగిన మీదట ఆయనకి అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, యూనాని వైద్య విధానాల గురించి చెబుతుంటాడు డాక్టర్సాబ్. జబ్బును బట్టి మందు ఉంటుందని, మందుకు తగిన అనుపాతాన్ని ఎంచుకోవాలని చెబుతాడు. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, యూనాని మందులలో ఉండే తేడాల గురించి చెబుతాడు. స్త్రీలు ఆహారం విషయంలో నియమంగా ఉంటారనీ, రోగం వస్తే మాత్రం వెంటనే వైద్యం చేయించుకోరని, అందుకే హోమియోపతి విధానంలో మహిళా రోగి వస్తే ఆమెకున్న బాధతోని సంబంధం ఉన్న లేకున్న నెలసరి గురించిన ప్రశ్నలడుతామని అంటాడు డాక్టర్సాబ్. వనజమ్మ గురించి తాను రాసిచ్చిన ప్రశ్నలకు బాల్రెడ్డి రాసిచ్చిన జవాబులను ఆ రాత్రి చదువుతూ ఆమె కేసును స్టడీ చేస్తుంటాడు డాక్టర్సాబ్. ఇంతలో డాక్టరమ్మ వచ్చి బాగా ఆలస్యమయింది, పడుకోమని అంటుంది. వనజమ్మకి వచ్చిన జబ్బుకీ, వీరలక్ష్మికున్న జబ్బుకీ, బాల్రెడ్డి పటేల్ కారణమని చెప్తాడామెకు. సమ్మక్క తనకి చెప్పిన వీరలక్ష్మి కథని భార్యకి చెప్తాడు డాక్టర్సాబ్. కొన్ని ఈ విషయాలు మగవాళ్ళకి మామూలుగానే కనిపిస్తాయనీ, ఆడవాళ్ళకి గోరంతలు కొండంతలుగా కనిపిస్తాయని అంటాడు. ఇక చదవండి.]

[dropcap]నా[/dropcap]లుగో రోజు వనజమ్మకు ఇంజెక్షన్ చేయడం అయిపోయాక “పటేలా! కొద్దిసేపు ఏకాంతంగ మాట్లాడాలె” అన్నాడు డాక్టరు.

“కచ్చేరిల కూచుందామ. అందరు వచ్చుడు పోవుడు అయిపోయింది” అన్నాడు పటేలు.

“మిద్దె మీద వీలయితదా!” అడిగాడు డాక్టరు.

“స! అయితె అట్లనె కానియ్యున్రి” అంటూ మెట్ల వేపు దారి తీశాడు పటేలు.

మిద్దెమీద ఒక హాలు రెండు గదులు వున్నాయి. “నిజానికీ గది మాది. కని వనజమ్మకు చాతనైతలేదని కిందనె ఏర్పాటు చేసినం” చెప్పాడు బాల్రెడ్డి.

హాల్లో కూర్చున్నారిద్దరూ. నాలుగు కుర్చీలు మధ్యలో పెద్ద బల్లా ఉన్నాయి.

“పైన కూడ ఏర్పాట్లు బాగనె ఉన్నయికద!” అడిగాడు డాక్టరు.

“మావోల్లొచ్చినపుడు ఇంతెజాం చెయ్యబడ్తది కద. దావతులన్ని ఈడనె అయితయి” వివరించాడు బాల్రెడ్డి పటేలు. టీలు వచ్చాయి. టీ కప్పు చేతిలోకి తీసుకుంటూ అన్నాడు డాక్టరు “పటేలా! ఒక్క ముచ్చటడుగుత. కోపగించుకోవద్దు”

“కోపం రానిముచ్చటడుగుతె కోపమెందుకస్తదె” ఎదురడిగాడు పటేలు.

“సరె! వచ్చెడ్దొ రాన్దొ మీరె నిర్ణయించుకోన్రి. మీ కొడుకులు ముగ్గురు కూడ వరంగల్లుల చదువుతున్నరు కద. మీరు నెలకోసారన్న పిల్లల దగ్గరకు పొయ్యొస్తరా!”

“నెలకోపారేంది. రెండు మూడు సార్లు పొయ్యొస్త!”

“వాల్లు హాస్టల్ల వుంటరా!”

“హాస్టల్లేడియి. మా దూరపు బంధువొకామె. ప్యాదరాలు. భర్త లేడు. భోజనశాలను నడుపుకుంటది. మన పిల్లలు ఆమె దగ్గర్నె వుంటరు. సరిపోదని పెద్ద యిల్లు కిరాయికిప్పిచ్చిన. పిల్లల చదువుకు భోజనశాలకు సంబంధముండది” చెప్పాడు బాల్రెడ్డి.

“పిల్లలకు అంత మంచిగనె ఏర్పాటు చేసిన్రు గని మీ కొఱకేమన్న ఏర్పాటు చేసుకొన్నరా!”

“అంటె!”

“అక్కడేమన్న ఠికాన”

“ఠికానెందుకు. పిల్లల దగ్గరనె ఉంట వస్త”.

“ఆ ఠికాన కాదు నేననేడ్ది. స్త్రీ పొందుకు సంబంధించిన ఠికాన” చిరునవ్వులు చిందిస్తూ అడిగాడు డాక్టరు.

“డాక్టర్సాబ్! ఏమ్మాట్లాడ్తున్నవు నువ్వు!” పటేలు కోపానికొచ్చాడు.

“నేను ముందుగాల్నె చెప్పిన మీకు కోపం వస్తదని. అక్కకు వచ్చింది మామూలు జబ్బు కాదు. సుఖ వ్యాధి. గనేరియా, సిఫిలిస్ రెండు వ్యాధుల లక్షణాలు కలగలుపుగా కనిపిస్తున్నయి. ఆమె కావ్యాధి రావడానికున్న ఏకైక మార్గం మీరు మాత్రమే. మీకు మూత్రంల మంట వున్నది. చీము పోతున్నది. వృషణాలు వాచి వున్నయి. కని చెప్పుకుంట లేరు. లేదా! ఎక్కడన్న రహస్యంగ వైద్యం పొందుతున్నరు. నిజమా కాదా!” స్థిరంగా అడిగాడు డాక్టరు.

తలదించుకొన్నాడు పటేలు. “నిజమే! వరంగల్లుల డాక్టరుకు చూపించుకున్న. కని మందులు పనిస్త లెవ్వు.”

“మీ సంబంధం భోజనశాల నడిపెటామెతోనేనా!” స్వతంత్రించి అడిగాడు డాక్టరు.

“ఛీ కాదు. ఆమె అగ్గి. బయటనె. మీకు తెలువదా! దొరుకుతుంటరు కద!” విషయం తెలిసిపోవడంతో మామూలు స్థితికొచ్చాడు బాల్రెడ్డి.

“అది పూర్తిగ బందు పెట్టాలె. ఇంటి దగ్గర కూడ బ్రహ్మచర్యం పాటించాలె. తగ్గడానికి ఆర్నెల్లు పడ్డది. మీ ఇద్దరికి కూడ మందులిస్త. మందులు సకాలంల వేసుకోవాలె. పొద్దటికని ఇచ్చింది పరగడుపున వేసుకోవాలె. మందేసుకున్నంక అర్ధగంట దాక చాయ సుత తాగద్దు. పగలు వేసుకొనే మందు భోజనానికి ఒక గంట ముందు గని, భోజనమైనంక ఒక గంటకు గని వేసుకోవాలె. రాత్రి మందు పండెటప్పుడు వేసుకోవాలె. భోజనం చేసినంక ఒక గంట మేల్కతోని వుండి మందులేసుకోవాలె.

కల్లు, ఇప్పసార, పట్నం నుండి తెచ్చుకొనె బీరు, బ్రాంది పురాంగ బందువెట్టాలె. సాధ్యం కాదనుకుంటె నేనిచ్చిన మందుకు నువ్వేసుకునె మందుకు నడుమ కనీసం రెండు గంటల వ్యవధి వుండాలె. చిన్న చిన్న చెక్కెర గోలీలె కద ఏం పనిస్తయి అనుకోగూడది. మందు మీద నమ్మకముండాలె. డాక్టరు మీద నమ్మకముండాలె. అట్లయితెనె నేను వైద్యం చెయ్యగలుగుత. లేకుంటె మీరు వేరే డాక్టరు చూసుకోవచ్చు” నిక్కచ్చిగా చెప్పాడు డాక్టరు.

ఐదు నిమిషాలపాటు మౌనం రాజ్యం చేసింది. “వైద్యం షురు చెయ్యి డాక్టర్సాబ్! రోగుల మీద నీ అంత పట్టింపున్నోడు ఇంకోడు దొరుకడు. వరంగల్లు డాక్టరుకు మస్తు పైనలిచ్చినగని ఫలితం నాస్తి. మీ ఫీజెంతొ గూడ చెప్తె బరాబరిచ్చేస్త.” బాల్రెడ్డి మాటల్లో పటేలు పదవిలో ఉండే కరకుదనం లేదిప్పుడు.

“ఫీజుదేమున్నది పటేలా! నీకు తోచినంత ఇయ్యు. పురాంగ తక్కువైనంక ఇచ్చిన కూడ నాకు బాధ లేదు.” నవ్వుతూ చెప్పాడు డాక్టరు తెల్లకాయితం బయటకు తీస్తూ. బాల్రెడ్డి రోగ చరిత్ర మొత్తం రాసుకున్నాక బయల్దేరడానికి లేచాడు డాక్టరు. గడీ బయటి వరకు వచ్చి సాగనంపాడు బాల్రెడ్డి.

***

వసంత పంచమి వచ్చింది పోయింది కాని డాక్టరు గారింటి ముహూర్తం కుదరలేదు. కట్టక కట్టక ఇల్లు కట్టుకుంటున్నాం. జోడెడ్లపాలెంలో స్థిరనివాసముండబోతున్నాం కాబట్టి తను నిర్మించుకొనే ఇల్లు సకల సౌకర్యాలతో కూడి ఉండాలి. ‘ఇల్లంటే డాక్టర్సాబు ఇల్లు లెక్క ఉండాల’ని ఊరందరూ అనుకోవాలి. ఇదీ డాక్టరు గారి ఆలోచన.

చతుశ్శాల భవంతి సౌకర్యవంతంగానే వుంటుంది. కాని మధ్యలో వానగచ్చు ఉంటుంది. నిజానికది నీటి వాడకానికొక సౌకర్యం. కాని ఎండలప్పుడు, వానలప్పుడు అసౌకర్యం, పైన కప్పు లేకుండా ఖాళీగా వుంటుంది కనుక చలి కూడ ఎక్కువే. కత్తెర వాసం ఇల్లు బాగుంటుంది. మధ్యహాలులో వెలుగు కూడా బాగా వస్తుంది. కాని కత్తెర వాసం ఇల్లు తననుకున్నంత పెద్దగా కట్టడానికి లేదు. నిట్రాడు ఇల్లైతే బాగుంటుంది. కాని నిట్రాళ్ళ ఎత్తు అపరిమితంగా పెంచడానికుండదు గదా! పెంకుటింటి నిర్మాణమే సరైనది. ఈ పల్లెలో ఇప్పుడు మిద్దెలు వేసుకొని చేసేదేముంది. తానేమీ దొర కాదు కదా మిద్దెలు వేసుకోవడానికి. ఇలా సాగుతున్నాయి డాక్టరుగారి ఆలోచనలు.

ఇవన్నీ కాకుండా తనకిప్పుడు గ్రహబలం తక్కువగా వుందని జ్యోతిష్యుడు చెప్పాడు. గ్రహబలం కన్నా సంకల్ప బలం గొప్పదని తండ్రి తనకు చెప్పాడు. ‘రోగం తగ్గించగలనని వైద్యుడూ, తగ్గిపోతుందని రోగి మనస్ఫూర్తిగా సంకల్పం చేసికొంటే వచ్చి నిల్చున్న యమధర్మరాజు కూడా వెనక్కి వెళ్ళిపోతాడ’ని చెప్పాడు తనకు వైద్యం నేర్పిన గురువు.

ఏది ఏమైనా సంకల్ప లోపం వల్లనే డాక్టరుగారి గృహ నిర్మాణారంభ ప్రక్రియ ఆగిపోయిందని చెప్పాలి. నిర్మింపబడిన ఇల్లు ఆయన మనోనేత్రానికి సాకారమైతే తప్ప ఆయన శంకుస్థాపన జోలికి వెళ్ళడు. ఇదొక్కటే కాదు. ఏ పని చేయాలనుకున్నా ఆ పని తాలూకు తుదిరూపం ఆయన కళ్ళముందు కదలాడుతూ వుంటుంది. బహుశః ఈ కారణంగానే ఆయన ఒక గొప్ప వైద్యుడైనాడు.

***

“వీరలక్ష్మి ఒచ్చి వెళ్ళింది. మీరప్పటికింకా లేవలేదు” చెప్పింది డాక్టరమ్మ భర్తకు కాఫీనందిస్తూ.

“ఇంత పొద్దున్నేనా!” ఆశ్చర్యపోతూ అడిగాడు డాక్టరు గారు.

“ఇంత పొద్దున్నేనా కాదు అంత పొద్దున్నేనా అనాలి. అప్పటికింకా పూర్తి తెల్లారలేదు. ఆకాశంలో అక్కడక్కడా ఇంకా చుక్కలు మిగిలే వున్నాయి. నేను లేచి వాకిలూడ్చుకుందామని తలుపు తీస్తున్నాను. ఎదురుగా ప్రత్యక్షమైంది.”

“వాకిలి మైసమ్మ ఊడుస్తుంది కదా!”

“వాళ్ళందరూ ఏదో జాతరకు వెళుతున్నారట. ‘యాటపోతును బలిచ్చెదాన్కి తీస్కపోతున్నం. మూడొద్దుల్దన్కరాను’ అని చెప్పిపోయింది.”

“నాకు చెప్పలేదు”

“చెప్తే వాకిలి మీరూడ్చేవారా!” ఎదురడిగింది డాక్టరమ్మ.

“మందుకోసం వచ్చే మనిషి అంత పొద్దుటే రాకూడదని చెప్పలేకపోయావా!” మాట మార్చాడు డాక్టరు గారు.

“వీరలక్ష్మి మీ మందుల కోసం రాలేదు”

“మరి”

“చెంబు నిండుగా పాలట్టుకొచ్చింది”

“ఎందుకట!”

“ఎందుకేమిటి. మనకివ్వడానికి. కొత్తగా పాడిబర్రెను కొందట. మొట్ట మొదట పితికిన పాలను మనకోసమనే తీసుకొచ్చిందట”

“ఎందుకలా!”

“నేనూ అడిగాను. ‘డాక్టరు గారు దేవుడు. మీరు దేవత. దీన్ని నైవేద్యంగా మీకిస్తున్నాను’ అంది”

“అంతా పిచ్చి, వైద్యం చేశాం. వ్యాధి తగ్గింది. అంతే! పాలు వద్దనలేకపోయావా!”

“దేవుడు నైవేద్యాన్ని తిరస్కరించకూడదు కదా! అందుకే తీసుకున్నాను. మీకిచ్చిన కాఫీ కూడ ఆ పాలతో కలిపిందే!”

ఆ మాటతో పొలమారింది డాక్టరుగారికి. “చూశారా దేవుడికి నైవేద్యం ఇష్టమే” చిరునవ్వులు చిందించింది డాక్టరమ్మ.

“నీ అధిక్షేపానికి నవ్వొచ్చి పొలమారింది. నైవేద్యాన్ని స్వీకరించినందుకు కాదు” జవాబిచ్చాడు డాక్టరు గారు.

“పాలు రోజూ పోస్తానంది. వతను పెట్టుకోమన్నది.”

“మన పాలవాడున్నాడుగా! మానేశాడా!”

“లేదు”

“మరి!”

“నలుగురు పిల్లల మీద పాలు ఎన్నున్నా తక్కువేనంది.”

“ఇంత చెంబుడు పాలు నిజంగానే ఎక్కువైతాయన్నాను. ఇవి రెండు శేర్లున్నాయి. రేపట్నించి శేరే తెస్తానంది. నెలకెంతవుతుందని అడిగాను. పైసలు పట్టయి వూరికెనే పోస్తున్నానంది. ఊరికెనే అయితే వద్దన్నాను.”

“మంచిపని చేశావు”

“వీరలక్ష్మి ఊర్కోలేదు. పాలమ్మితే పాపమొస్తుందంది. అవి పాత రోజులు. ఇప్పుడు పాలను అందరూ అమ్ముతూనే వున్నారన్నాను. మీరు తీసుకున్నా తీసుకోకపోయినా పాలచెంబు ఇంటి గుమ్మమ్ముందు పెట్టిపోతానంది. డబ్బుతీసుకోకపోతే డాక్టరు గారూర్కోరు అన్నాను. వాడుక వాడి దగ్గర ఎన్ని పాలు పోయించుకుంటున్నారంది. శేరు అని చెప్పాను. ఎంతిస్తున్నారంది. నెలకు పది రూపాయలన్నాను. నెల నెలా పది రూపాయలు మీ దగ్గర తీసుకుని అట్టే పెట్టుకొమ్మంది. పుట్టింటికెళ్ళినప్పుడు చీరె కొనుక్కోమంది. లేదంటే ఏ నగో నట్రానో చేయించుకోమంది.”

“నువ్వేమన్నావు” ఆందోళనగా అడిగాడు డాక్టరు గారు.

“అదంత మంచి సలహానిస్తుంటే చూస్తూ చూస్తూ ఒద్దనలేను కదా! పాలు తెమ్మన్నాను”

“నేను పది రూపాయలు ఇవ్వకపోతే”

“దానికి చెబుతాను. మీ పరువేపోతుంది” కిలకిలా నవ్వింది డాక్టరమ్మ.

“నన్ను భలే బిగించావు”

“ఈ బిగింపు సలహా నాది కాదు వీరలక్ష్మిది. వాళ్ళింటి దగ్గర ఓదేలు అని కుర్రాడున్నాట్ట. తనతో పాటు మీ దగ్గరికొచ్చాట్ట కూడాను. వాడి చేత రోజూ పొద్దున్నే పాలు పంపిస్తానంది. ‘చచ్చిపొయ్యె దాన్ని బతికించిండు డాక్టరుసాబు’ అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది కూడాను” చెప్పింది డాక్టరమ్మ.

“ఏదీ వైద్యం పూర్తవందే. ఇంకా రెణ్ణెల్లు వాడాలి మందులు. తగ్గిపోయిందనుకుని మానేస్తుందేమో. పొద్దున్నే పాల కుర్రాడికి చెప్పు.”

“చెప్తాల్లెండి. పాపం మంచి మనిషే. నేనే తప్పుగా అనుకున్నానేమో అనిపిస్తోందిప్పుడు.”

“మంచి చెడులు సాపేక్షాలు. మన మనస్థితిని బట్టి మంచి చెడుగా కనపడవచ్చు. చెడు మంచిగానూ కనపడవచ్చు” అన్నాడు డాక్టరు.

“అంటే ఆమె మంచిది కాదంటారా!” అనుమానపడింది డాక్టరమ్మ.

“నేనామాట అనలేదే. లోక సహజమైన రీతిలో ఆ రోజామె చెడ్డది అనుకున్నావు. నీ పరిచయంలోకొచ్చాక నీకామె పట్ల సదభిప్రాయం కలిగింది” వివరించాడు డాక్టరు గారు.

“అంతే కావచ్చును” అంగీకరించింది డాక్టరమ్మ.

డాక్టరుగారికి నలుగురూ మగ సంతానమే. పెద్దవాడికి ఎనిమిదేళ్ళు. ఐదో క్లాసు చదువుతున్నాడు. రెండోవాడికి ఐదేళ్ళు. ఒకటో క్లాసులో వున్నాడు. మూడోవాడికి మొన్ననే మూడేళ్ళు నిండాయి. నాలుగోవాడికి ఏడాదిన్నర వయసు. చిన్నవాళ్ళిద్దరికీ ఎడం పెద్దగా లేదు.

ఆదివారాలు, బడికి సెలవులుండే రోజులు ముందుగానే చూచుకొని వీరలక్ష్మి అమృతా వాళ్ళింటికొస్తోందిప్పుడు. డాక్టరుగారి నలుగురు పిల్లలూ, కృష్ణవేణి ఇల్లుపీకి పందిరేస్తుంటే చూచి ఆనందిస్తున్నారు అమృతా వీరలక్ష్ములు. వాళ్ళిద్దరికీ వయసులో పెద్ద తేడా లేకపోయినా, పిల్లలతో ఆడేటప్పుడు, వీరలక్ష్మి మరీ చిన్నపిల్లయిపోతుంది. అమృత పెద్దమనిషి తరహాలో వుండిపోతుంది.

చెప్పొద్దూ డాక్టరమ్మకు పిల్లల సెలవురోజుల్లో కాస్తంత విశ్రాంతిగా వుంటోంది. డాక్టరుగారు జోడెడ్లపాలానికి వచ్చి నాలుగేళ్ళు దాటింది. ఈ నాలుగేళ్ళలోనూ డాక్టరుగారి ఖ్యాతి క్రమేణా నలుదెసలా వ్యాపింపసాగింది. ఎడతెరిపి లేకుండా చుట్టుపక్కల చాలా ఊళ్ళ నుంచి రోగులు వస్తున్నారు. ఆయనకు ఖాళీ ఉండట్లేదు. ఉన్న ఊళ్ళో కూడా పరపతి బాగానే పెరిగింది.

ఊళ్ళో హైస్కూలు లేదు గాని, మిడిల్ స్కూలు వుంది. అప్పట్లో ఎనిమిదవ తరగతి వరకు ఉన్న బళ్ళను మాధ్యమిక పాఠశాలలనేవారు. హెడ్మాస్టరు అనంతుల నరహరి, మిగిలిన పదిమంది మేస్టార్లు డాక్టరు గారికి స్నేహితులైపోయారు. బళ్ళో ఏవైనా కార్యక్రమాలవుతుంటే డాక్టరుగారికి పిలుపులు వస్తున్నాయి.

ఊళ్ళోకి గిర్దావరు, తహసీల్దారు, ఆటవీ అధికారులు వగైరాలు వచ్చినపుడు పట్వారి, పోలీసు పటేలు, మాలిపటేలు వారికి కలిసిగాని విడివిడిగా గాని మందుతో కూడిన విందులిచ్చే ఆచారముండేది. ఆ విందులతో తనకు సంబంధం లేకున్నా డాక్టరు గారికి పిలుపులందేవి. డాక్టరు గారు విసిరే ఛలోక్తులకు అతిథులు పడిపడి నవ్వేవారు. “నీకు తెలువని విషయం ఈ లోకంల లేదా డాక్టర్సాబ్” అంటూ మెచ్చుకొనేవారు.

పటేలు, పట్వారి ఎప్పుడన్నా మరిచిపోయో, వీలుగాకనో డాక్టరు గారిని పిలవకపోతే వచ్చిన అధికారులే అడిగేవారు “ఏందియాల డాక్టర్సాబ్ రాలేదు” అని.

“ఆయన మీ ఎంబడి తింటడా తాగుతడా! మడిగట్టుకోని కూకుంటడు. ఆయన రాకుంటే రంధి పడ్తరేంది” అన్నాడు ఓ రోజు పోలీసు పటేలు.

“నీకు తెలువది పటేలా! డాక్టరున్నడంటె గుక్కెడంత ఎక్కువ తాగుతం. బుక్కెడంత ఎక్కువ తింటం. తాగుటాన్ని, తినుటాన్ని ఆనందిస్తం. ఆయన మాటల ప్రభావమసొంటిది” అన్నాడు తహసీల్దారు.

పోలీసు అధికారుల విందులు మాత్రం గప్‌చిప్‌గా రెండో కంటికి తెలియకుండా పోలీసు పటేలు ఇంట్లోనే జరిగిపోతాయి. ఆ విందు సమయంలో మిక్కిలి ప్రమాదకర రహస్యాలను గురించిన చర్చలు జరుగుతుంటాయి.

రఘునాథరావు అటవీశాఖలో సారెదార్ అంటె ఫారెస్టు గార్డుగా పనిచేస్తాడు. అతడి ఉద్యోగ కేంద్రం జోడెడ్లపాలెమే. అప్పుడప్పుడూ వైద్యం నిమిత్తం అతడు మాత్రమే గాక తన పై అధికార్లను సైతం తీసుకొస్తూండేవాడు. వాళ్ళు కూడ డాక్టరు గారి హస్తవాసి మంచిదని నమ్మేవాళ్ళు. ఒకరోజున రఘునాథరావు జింకపిల్లనొకదాన్ని తీసుకొచ్చి డాక్టరుగారికిచ్చి పెంచుకోమన్నాడు.

“ఆవునో, బర్రెనో సాదుకొమ్మంటే అర్థమున్నది. జింకపిల్లనెట్ల పెంచుకుంట చెప్పు. నాకొద్దు” అన్నాడు డాక్టరు.

“మా రేంజరు పెంచుకుంట తెమ్మన్నడు. మన అడవిల ఇవి బాగుంటయి. అదునుజూసి ఒకదాన్ని పట్టితెచ్చిన. ఈ లోపట ఆయన హైదరాబాదుకు తబాదలయిండు. నేనెక్కడ తీస్కపోత. అడివిల ఇడిచిపెట్టుమన్నడు. అటుజేసి ఇటుజేసి నెల దాటిపోయింది. ఇదింక తల్లిచాటు పిల్లనె. దీన్నడవిలిడిచి పెడితె ఇది తల్లిని కలుస్తదొ లేదొ తెలువది కని తల్లైతె దీన్నొప్పది. మనిషి వాసన సోకిన జంతువులన్నిట్ని అడివి జంతువులు నిరాకరిస్తయి. ఇప్పుడు దీనికి తనను తాను కాపాడుకొనే శక్తిపోయింది. అడివిలిడిసి పెట్టిన్ననుకో – గంటసేపట్ల తోడేలుకో జిట్టపులికొ ఆహారమైతది. ఆ పాపం నాకద్దనె నీకిస్తనంటున్న డాక్టర్ సాబ్!” వివరంగా చెప్పాడు రఘునాథరావు.

“నువ్వే పెంచుకోవచ్చు కద!” అన్నాడు డాక్టరు.

“వీడు జింకను పెంచుకొనెటంతటోడైండులే. వీని సంగతి జూసుకోవల్సిందే అనుకుంటరు నా పై అధికారులు. అందుకొఱకె నీకిద్దామని జింకను తెచ్చిన.”

“నీ ఆలోచన బాగనె ఉన్నది కని దీనికి దినాం పచ్చిగడ్డి కావాలె. చెంగు చెంగున ఎగుర్తాంటది. ఆ ఎగురుట్ల ఊల్లెకు పోయిందనుకో ఏ కుక్కలో పీక్కతింటయి. ఆ పాపం నాకెందుకు” అన్నాడు డాక్టరు.

ఆదివారం కావడంతో ఆ రోజు పెద్దపిల్లలిద్దరూ ఇంట్లోనే వున్నారు. ఆసుపత్రి గదిలో జింకకు ఊపిరాడ్డం లేదని తాడుతో సహా తీసుకెళ్ళి అమృత వాళ్ళ వాకిట్లో కట్టేసాడు రఘునాథరావు. అమృత వాళ్ళింటి వీధి వాకిలి ప్రహారీ గోడకు లోపలే వుంటుంది. వాకిలి కూడ చాల పెద్దది. ప్రహరీకి గేటువలె కాక ఇంటిగుమ్మంలానే పెద్ద పెద్ద తలుపులున్నాయి. ప్రహరీ గోడలెత్తుగా ఉన్నందునా, మదురు గోడలవడం వల్ల రక్షణతో పాటుగా ఇంటికి అందం కూడా చేకూరింది.

జింకను చూచిన పిల్లల ఉత్సాహానికంతం లేకుండాపోయింది. దానితో ఆడుకోవడం మొదలు పెట్టారు. ఆదివారం నాడు పిల్లలతో ఆడుకొందుకని వీరలక్ష్మి కూడ అదివరకే వచ్చి వున్నది.

“ఏం కాదు డాక్టర్సాబ్! అమృత వాల్లింట్ల ఉంచి పెంచుకోన్రి” అన్నాడు రఘునాథరావు.

“పోలీసు పటేలుకియ్యకపొయినావు. చేతికింద పనోల్లుంటరు. మంచి కాపలా వుంటది” అన్నాడు డాక్టరు.

“దానికంటే అడివిడిసి పెట్టింది నయం కద డాక్టర్సాబ్. ఇయ్యాల పొద్దుగాల పటేలుకిచ్చిన్నంటె రొప్పొద్దుగాల దాని బొక్కలు గడీ ఎనుకకున్న బొందల కనపడ్తాయి. ఇదంతద్దుసార్! ఉంచుకుంటావా నువ్వుంచుకో. లేదంటావా దాని కిస్మత్. అడివిల విడిచిపెట్టస్త” చివరిమాటగా చెప్పాడు రఘునాథరావు.

జింక అలికిడి విని గుమ్మందాకా వచ్చిచూసిన డాక్టరమ్మ వెనుక గుమ్మం నుండి అమృత వాళ్ళింట్లోకి వెళ్ళి ఉప్పందించి వచ్చేసింది. వాళ్ళు వీధిలోంచి వచ్చి డాక్టరు గారి కంటపడకుండా ఏమాత్రం అలికిడి లేకుండా జింకను చూసిపోయారు. దైవికంగా రఘునాథరావు అమృతవాళ్ళ వాకిట్లో జింకను కట్టేయడంతో వాళ్ళ ఆనందానికి అంతులేకుండా పోయింది.

“ఏమండీ!” గుమ్మంచాటు నుండి పిలిచింది డాక్టరమ్మ.

“ఏమిటి! బయటకురా! వచ్చింది మన రఘునాథరావే!” పిలిచాడు డాక్టరు.

“నమస్కారమమ్మా!” అన్నాడు రఘునాథరావు లేచి నిల్చుని.

“నమస్కారమన్నయ్యా!” ప్రతి నమస్కారం చేసింది డాక్టరమ్మ.

“రఘునాథమన్నయ్య అంతగా చెప్తుంటే వద్దంటే ఏం బాగుంటుంది. పిల్లలు కూడ జింకను పెంచుకుందామని ముచ్చటపడ్తున్నారు”

“అది సరే! మన పెరట్లో జింకకు రక్షణ తక్కువ. అట్లా అని అమృతా వాళ్ళింట్లో వుంచితే ఏం బాగుంటుంది చెప్పు” అన్నాడు. డాక్టరు.

డాక్టరు గారి నిర్ణయం ఎలా వుంటుందో తెలుసుకోవాలన్న ఉత్కంఠతో వీధి గుమ్మానికి బయట చెరోవేపు నక్కినుంచున్నారు వీరలక్ష్మి, అమృతలు. డాక్టరుగారి మాట పూర్తయిందో లేదో ఇద్దరూ ఏకకాలంలో లోనికొచ్చారు. అవాక్కయ్యాడు డాక్టరు గారు. ఆయన ఆశ్చర్యాన్నుండి తేరుకొనేలోపే చెప్పింది అమృత. “మీ జింకను మా వాకిట్ల కట్టేసుకోన్రి. మాకేం బాధలేదు.”

“మీ వాకిట్లనా! బాగుండది” మొహమాటపడ్డాడు డాక్టరు గారు.

“అట్లయితె మా దొడ్లె కట్టేసుకుంట గని వాపసిచ్చెడి లేదు” స్థిరంగా చెప్పింది వీరలక్ష్మి.

“డాక్టర్సాబుకిస్తనని తెచ్చిన జింకను నీకెట్ల ఇస్తననుకున్నవు. నీకియ్య జాల ఈర్లక్ష్మీ!” అంతే స్థిరంగా చెప్పాడు రఘునాథరావు.

“నా కొఱక్కాదయ్య సారేదార్ సాబు! డాక్సర్ సాబు జింకను నేను సాకుత. కాకుంటె దొడ్డి డాక్సర్సాబింటికి కొద్దిగ దూరంగ ఉంటది. గంతె కద!” రఘునాథరావు అభ్యంతరాన్ని సునాయాసంగా తోసిపుచ్చింది వీరలక్ష్మి.

ఈలోగా పిల్లలు కూడ ఆసుపత్రి గదిలోకి వచ్చారు. “జింకను పెంచుకుందాం నాన్నా!” అన్నాడు పెద్దాడు.

డాక్టరు గారికి అవుననక తప్పలేదు. కాని కాదనడానికి కొంత ప్రయత్నిద్దామనుకొన్నాడు.

“మన దగ్గర వీలవదు కద రామూ!”

“వీర్లక్ష్మి చిన్నమ్మ పెంచుతానంటోంది కద!” అన్నాడు రాము.

“వీర్లక్ష్మి చిన్నమ్మేంటి. అత్త అనాలి” సరిదిద్దాడు డాక్టరు గారు.

“కాదు నాన్నా! అమృతమ్మ అత్త అయితుంది కదా! అమృతమ్మను వీర్లక్ష్మి వదినా అని పిలుస్తుంది కదా! అందుకని వీర్లక్ష్మి మాకు చిన్నమ్మ అవుతుంది” వివరించాడు రాము.

“ఇదంతా నీకెవరు చెప్పారు” అడిగాడు డాక్టరు.

వీళ్ళిద్దరే అన్నట్లుగా మౌనంగా వేలు చూపించాడు రాము.

“ఇంతకేమంటరయ్య!” అడిగింది వీరలక్ష్మి.

“మరి పచ్చి గడ్డి సంగతి” ఎలాగోలా వద్దనిపించాలని డాక్టరు గారి తాపత్రయం.

“నేన్జూసుకుంటనయ్య” చెప్పింది వీరలక్ష్మి.

“కలువది” అన్నాడు డాక్టరు.

“పచ్చి గడ్డి దినాం కోసుకచ్చిచ్చె మనిషిని నేను మాట్లాడ్త, గడ్డికయ్యె పైసలు డాక్టర్సాబిస్తడు” పంచాయతి ముగిసిపోయిందన్నట్లుగా తీర్పు చెప్పాడు రఘునాథరావు. డాక్టరుగారు తప్ప అందరూ చప్పట్లు కొట్టారు.

“మీకిష్టం లేకపోతే మానేద్దామండి. ఏదో పిల్లలు ముచ్చట పడ్డారని వాళ్ళ తరపున మాట్లాడాను” చెప్పింది డాక్టరమ్మ.

చిన్నగా నవ్వి అన్నాడు డాక్టరు “ఆ జింకపిల్లకూ మనకూ ఏ జన్మలోనో అనుబంధముండి వుంటుంది. అందుకే అది ఇక్కడిదాకా వచ్చింది. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి.”

“షుక్రియా డాక్టర్సాబ్! దాన్ని అడివిల విడువాల్సి వస్తదని భయపడ్డ” గుండెల నిండా ఊపిరి పీల్చుకుంటూ చెప్పాడు రఘునాథరావు.

కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లుతుంటే దండం పెడ్తూ నిల్చుంది వీరలక్ష్మి. పిల్లల మాటను డాక్టరు గారు కాదనలేదని ఆనందపడింది అమృత. పెద్ద పిల్లలిద్దరూ విషయం తెలిసి గంతులు వేస్తే వాళ్ళ గంతుల్ని చూసి విషయం తెలియని చిన్న వాళ్ళిద్దరూ గంతులు వేయసాగారు. భర్త తన సిఫారసు నిరాకరించనందుకు సంతోషపడింది డాక్టరమ్మ. మొత్తానికి ఆ ప్రాంగణమంతా ఆనందం తాండవమాడింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here