దారిద్య్రదేవత దాండవింపగజేయు
ధనధాన్యసంపత్తుదరుగజేయు
ఆండ్రబిడ్డలనెల్లనన్నార్తులుగజేయు
సంఘాన మర్యాద సమయజేయు
సత్సంప్రదాయంబుసన్నగిల్లగజేయు
కాయంబు రుజచేతగ్రమ్మజేయు
నరములత్రాణను నాసమెందగజేయు
కోపతాపంబుల దోపజేయు
రోగముల పుట్టయౌనటురోతగొల్ప
క్రుళ్లజేసియుకాయముంగూలనేసి
మానవుని జీవితంబును మాయజేయు
ఘోరదుర్వృత్తి యెంచనీ జారవృత్తి. (21)
పాపాల చిట్టాను పదియింతలుగజేయు
పరుమప్రతిష్ఠటలంబాడుజేయు
అంటుజబ్బులచేతనలమటింపగజేయు
సుఖరోగములచేత స్రుక్కజేయు
కడుచర్మరుగ్మతంగాసిల్లగాజేయు
కుష్టుక్షయలచేత గ్రుళ్ళజేయు
నరములతీపుచే నాశమెందగజేయు
రక్తహీనత చేత రాలజేయు
అతిప్రమాదంబునై యొప్పియవనిలోన
మరణమేకాని యెద్దేని మందులేని
వ్యధియౌ ‘యైడ్సు’ ప్రజలకుంబ్రబలరీతి
సోకజేయునుగాదె యీ క్షుద్రగుణము. (22)
ఇట్టి హీన కార్యకింకమీదటనైన
మట్టుబెట్టకున్నమనుజ తతికి
మంచియెటలగల్లు? మనుగడయెట్లబ్బు?
సౌఖ్యమెటులభించు? శాంతియెట్లు. (23)
ఒకనాడు ధర్మోననున్నతంబౌచును
విలసిల్లనట్టి భూతలము నేడు
ఒకనాడు దానాననుత్తేజతంబౌచు
ఉల్లసిల్లనయట్టి యుర్వి నేడు
ఒకనాడు ప్రేమచేనున్మీలనంజౌచు
ధగధగమెరసిన ధాత్రి నేడు
ఒకనాడు శాంతాన నుత్తమెత్తమమౌచు
భాసిల్లినట్టిదీ వసుధ నేడు
దుష్టదౌర్భాగ్యమయ్యునికృష్టమగుచు
కరమువర్తిల్లు వ్యభిచార సరళితోడ
పంకిల మవంగ సకల ప్రపంచమందు
దేశమాతకు దరుగదే దివ్యయశము. (24)
పాపకల్మషమౌచునుబరగుచుండి
ప్రజలకపకారమును జేసిపాడుజేయు
జారవృత్తది నీకేల? భారతీయ!
వీడగదవయ్య యాదారి జాడలన్ని. (25)
ఆరాటమే కాని యాహ్లదమే లేని
పరకాంత పొందును వదలుడయ్య
వ్యాధిబాదలెగాని యారోగ్యమేలేని
వేశ్యాగృహంబుల వీడుడయ్య
మెరమెచ్చలే కాని, మేలేమియును లేని
సానివాడల జోలిమానుడయ్య
ధననష్టమేకాని, కనసౌఖ్యమునులేని
భోగినులను గూడబోకుడయ్య
బంధుజాలంబు లోపల పరువుదీయు
సంఘమందున కీర్తిని సమయజేయు
మంచి మర్యాదలన్నింటిమంటగలుపు
దురితమౌ యిట్టివృత్తిని దోలుడయ్య
భవ్యగుణులారా! భారత పౌరులారా! (26)
భార్యబిడ్డలుననియెడి బంధములను
సమయజేయుచు, మమతకుజావొసంగు
నరుని బాధ్యతలన్నింటి నాశపఱుచు
వేశ్యకాంతల పొందును వీడుడయ్య
భవ్యగుణులారా! భారతపౌరులారా! (27)
ఎన్ని చట్టాలు వచ్చిన నేమిఫలము
ప్రజలలోపలచైతన్యబలములేక
అడ్డగించుట సాధ్యమా యవనియందు?
ఇట్టి దుర్వృత్తి మానుటే యింపునగును. (28)
వ్యభిచారవృత్తిచే వసుధలోగల్గెడు
కష్టాలబ్రజలకుం స్పష్టపఱచి
వారకాంతలవల్లబ్రబలెడు రోగాల
పద్ధతిందేలిపివిశుద్దరీతి
జారగుణమునవచ్చు శక్తిహీనత నెల్ల
సత్కృపామతితోడ జాటిచెప్పి
పరకాంతసంభోగపాపపుకార్యాన
అడుగంటుగౌరవంబనుచుదెల్పి
సంఘమందున విలసిల్ల చదువరులును
బోధకుల్, జ్ఞానఖనులును పుష్కలముగ
చిత్తశుద్ధిని వర్తించి చెలగిరేని
దుష్టవృత్తులదోలుట కష్టమగున? (29)
ఎక్కడ నుండియో యెవ్వరోవచ్చెద
రిక్కార్యమునకంచునెంచకుండ
ఎందరో మేధావులీదేశముననుండ
నేనేలటంచును మానకుండ
కొందరే నిపుణులు గూర్మినీ పనిజేయ
ధాత్రిమేమేలంచుదలచకుండ
నిరుపేదనౌ నాకు బరగనిక్కార్యమ్ము
సాధ్యమా? యంచును జంకకుండ
వ్యభిచరమ్మునగలిగెడి వ్యాధి బాధ
చాల విపులంబుగా సర్వజనులకైరుక
పరచుటయె యికపైన నీ బాధ్యతనుచు
భావనంజేసిసాగుమో భారతీయ! (30)
చిత్తశుద్ధి నరుని శ్రేయస్సు కోసమై
స్వార్ధరహితబుద్ది శక్తికొలది
నీతిబోధలెన్నోనేర్పుమీరగజేయ
స్వర్గమౌచు వసుధ వరలుగాదె! (31)