Site icon Sanchika

వ్యాధి కోవిదులు

[dropcap]కం[/dropcap]టికి కనిపించని భూతం
దావానలంలా అంటుకుంది
తుమ్మితె తప్పు దగ్గితే ముప్పు
వచ్చి మీద పడుతుంది
నిన్ను కబళిస్తుంది
ఇంగ్లీషోడు, అమెరిక వాడు
ఫ్రెంచివాడు, ఇటలీవాడు
రష్యావాడు, చైనావాడు
ఎవరైతే నాకేం
ముట్టుకుంటే అంటుకుంటా
అందరిలోను వ్యాపిస్తా చంపేస్తా
అంటూ విశ్వ మానవాళిని
కాటు వేసింది కరోనా
దీని పేరు కోవిడు అట
ముద్దు పేరు కరోనా….

ఇదొక ప్రమాద ఘంటిక

మూతికి మాస్కులు వేసారు
దూరం అందరు జరిగారు
ఇంటిలో దగ్గరగా చేరారు
తాత బామ్మ అమ్మ నాన్న
అక్క చెల్లి అన్న తమ్ముడు
అందరు ఒకటై నిలిచారు
ఆప్యాయతలు పంచారు
కరోనా వచ్చినా ప్రాణాలు తీసినా
మనసుల బంధం కలిపింది

ఇదొక ఇతిహాసం

పేదల గుండెలు కోసింది
రెక్కాడితె గాని డొక్కాడని
కష్ట జీవులకు కడగండ్లను
మాత్రం మిగిల్చింది
కూడు లేక గూడు లేక
ఆదరించె తోడు లేక
కూలన్న రోడ్డున పడ్డాడు

ఇదొక విషాదం

ఇంటిలో అందరు ఉన్నారు
ఏదో ఒకటి తిన్నారు
ఆటలు పాటలు పాడారు
దూరం ఉన్న మిత్రులు కూడా
దగ్గర దగ్గర అయ్యారు
మనసులో ఊసులు చెప్పారు
మమతలు అందరు పంచారు

ఇదొక వసంత గీతిక

Exit mobile version