(వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘వ్యాసభారతంలో అసలు కర్ణుడు’ పుస్తకానికి కస్తూరి మురళీకృష్ణ వ్రాసిన ముందుమాటను అందిస్తున్నాము)
[dropcap]ప్ర[/dropcap]పంచంలో ప్రజాస్వామిక ధర్మం అంటూ ఏదయినా వుంటే అది ఒక్క భారతీయ ధర్మం మాత్రమే. ఈ ధర్మం గురించి ఎవరు ఏదైనా ఎలాగైనా మాట్లాడవచ్చు. వినదగు నెవ్వరు చెప్పిన అన్నది నరనరానా ఇంకిన భారతీయులు తమ ధర్మం గురించి పరాయివారు ఏది చెప్పినా, ఎలా చెప్పినా నమ్మేస్తారు. తమని ఎంత చులకన చేస్తే అంతగా వారిని గౌరవిస్తారు. తమని ఎంతగా అవమానపరచి, చులకన చేస్తే అంతగా ఎదుటివారిని గొప్పగా భావించే బానిస మనస్తత్వం, న్యూనతాభావాలు భారతీయులు ప్రదర్శిస్తారు. అందుకే భారతీయ ధర్మం గురించి తెలిసి మాట్లాడేవారి కన్నా, తెలియకుండా మాట్లాడేవారే ఎక్కువ. భారతీయ ధర్మాన్ని అర్థం చేసుకుని మాట్లాడేవారికన్నా అర్థం చేసుకునే ప్రయత్నాలేవీ చేయకుండా, వక్రదృష్టితో లేనిదాన్ని ఊహించి వివరించే వారే ఎక్కువ. ఉన్నది ఉన్నట్టు వివరించే వారికన్నా, లేనిది ఉన్నట్టు ఊహించి తమ మానసిక దౌర్బల్యాలను, మూర్ఖత్వాన్ని, చేతకానితనాన్ని ధర్మానికి ఆపాదించి ధర్మాన్ని దూషించి, ధర్మానుయాయులు ధర్మం పట్ల విముఖులయ్యేట్లు చేయాలని ప్రయత్నించేవారే ఎక్కువ. ఇలాంటి వారందరి మాటలను ప్రజలు ప్రామాణికంగా భావించి, అలా తప్పుడు పలుకులు పలికేవారిని మేధావులుగా భావించి గౌరవించటం, వారి తప్పుడు పలుకులను చిలుకపలుకుల్లా వల్లె వేసి తమ ధర్మాన్ని తామే చులకన చేసుకుంటూ తమని తాము గొప్పవారిగా భావించుకుంటూ కాలర్లెగరేయటం నిత్యానుభవమే. అందుకే ఆత్మగౌరవం, ఆత్మాభిమానం కొరవడి, ఆత్మన్యూనతాభావంతో అధిక సంఖ్యలో అతి సులభంగా స్వధర్మాన్ని వదలి భయావహమైన పరాయి ధర్మాన్ని స్వీకరిస్తున్నారు. తరచిచూస్తే, ఇలాంటి దుస్థితి నెలకొనటానికి ప్రధాన కారణం భారతీయ ధర్మం గురించి అసలయిన విషయాలను సరయిన రీతిలో సప్రామాణికంగా వివరించే వ్యవస్థ లేకపోవటమే!!!
ఇస్లామీయ బాలురకు తమ ధర్మం గురించి చెప్పేందుకు మదరస వ్యవస్థ వుంది. బాల్య స్థాయి నుంచీ మత సిద్ధాంతాలు చేరువ అవటంతో తమ మతం పట్ల విశ్వాసమూ, గౌరవ భక్తి ప్రపత్తులు కనిపిస్తాయి. క్రిస్టియన్ మతంలో నాలుగేళ్ళు రాగానే బాలబాలికలకు మత సిధ్దాంతాలను బోధిస్తారు. సామూహిక కార్యక్రమాల ద్వారా వారిలో తామంతా ఒకటి అన్న ఐక్య భావనను కలిగిస్తారు. యూదులు, పర్షియన్ల గురించి చెప్పాల్సిన అవసరంలేదు. ప్రపంచంలో ఏ దేశంలో వున్నా యూదుకు హిబ్రూ భాషను తప్పనిసరిగా నేర్చుకోవటమే కాదు, తమ మతాన్ని అతి నియమంగా పట్టుదలతో పాటిస్తారు. ఇజ్రాయెల్ రక్షణకోసం తమ సర్వ శక్తులను వినియోగిస్తారు. భారతీయ ధర్మానుయాయులకు భారతీయ ధర్మాన్ని బాల్యంనుంచీ సరయిన రీతిలో బోధించి ధర్మం పట్ల అభిమానాన్ని కలిగించే వ్యవస్థ లేకపోవటంవల్ల, సినిమాల నుంచి, దుర్వ్యాఖ్యానాలు, వ్యాసాలు, ఉపన్యాసాలలోని వ్యంగ్యదూషణల ద్వారానే తమ ధర్మాన్ని తెలుసుకోవాల్సివస్తోంది. అందుకే ఆత్మన్యూనతాభావాన్ని భారతీయ ధర్మానుయాయులు అధికంగా ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో మూల శాస్త్రాలను పరిచయం చేస్తూ, వాటిని వివరిస్తూ ధర్మాన్ని పరిచయం చేయాల్సిన అవసరం ఎంతో వుంది. శ్రీపతిశర్మ వ్యాస భారతంలో కర్ణుడి పాత్రను తీసుకుని భారతంలో కర్ణుడి పాత్ర ప్రస్తావన వున్న 17 సందర్భాలలో వున్న దాదాపుగా 160 పై శ్లోకాలను వ్యాఖ్యాన సహితంగా వివరిస్తూ కర్ణుడి పాత్రను ఆవిష్కరిస్తూ రచించిన ఈ పుస్తకం సమకాలీన సమాజానికి అత్యంత ఆవశ్యకమయిన పుస్తకం. భారత రామాయణాల గురించి ఎవరికివారు తోచినట్టు ఊహించి, లేని కథలు కల్పించి పాత్రల వ్యక్తిత్వ హననం చేస్తూ, ధర్మాన్ని చులకన చేసేందుకు ఈ సృజనాత్మక స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్న సమయంలో, ఏది మూలమో, ఏది కల్పననో తెలియని అయోమయంలో ధర్మానుయాయులు కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఇది మూలం, మూలంలోని శ్లోకాల అర్థం ఇది, దాని వెనుక దాగిన పరమార్థం ఇది, ఈ శ్లోకాల ద్వారా ఆవిషృతమయిన కర్ణుడి వ్యక్తిత్వం ఇది అని సప్రామాణికంగా, సరళమయిన భాషలో సామాన్య పాఠకుడిని దృష్టిలో వుంచుకుని శ్రీపతిశర్మ చేసిన ఈ ప్రయోగాత్మక రచన అత్యంత అభినందనీయమేకాదు, వాంఛనీయం కూడా.
గతంలో ద్రౌపది పాత్ర గురించి అవాకులూ చవాకులూ రాసి ఉత్తమ సాహిత్య సృజనకు సాహిత్య అకాడెమీ అవార్డు అందుకున్నాడొక రచయిత. రామాయణం పాత్రలకు లేని వికృతులు ఆపాదించి తమ వ్యక్తిగత బలహీనతలకు సైధ్ధాంతిక ముసుగు వేసి ప్రామాణికతను సాధించే ప్రయత్నం చేసి ఉత్తమ సృజనకు సాహిత్య అకాడెమీ బహుమతి పొందిందొక రచయిత్రి. ఈ రకమయిన వికృతులు ప్రామాణికమవుతున్న వేళ, ఎవరి మెప్పునూ ఆశించక, ఎలాంటి గుర్తింపు కోసం ప్రాకులాడక, నిర్మోహంగా, చిత్తశుద్ధితో కర్తవ్య నిర్వహణ చేస్తున్న శ్రీపతిశర్మ అభినందనీయుడు. ఈ చిన్ని పుస్తకం చదివిన తరువాత మన కళాకారులు సృష్టించిన కర్ణుడికీ, వ్యాసుడి ప్రదర్శించిన కర్ణుడికీ ఎంతో తేడా వుందన్నది స్పష్టమవటమే కాదు, ఒక పద్ధతి ప్రకారం, భారతీయ ధర్మంపై జరుగుతున్న దాడి స్వరూపం బోధపడుతుంది. మనం గౌరవించే ప్రతీదీ అవహేళనకు గురవుతున్నది. మన భాష అర్థం మారిపోతున్నది. మనకు పవిత్రమన్న ప్రతీదీ అసలయిన అర్థం కోల్పోయి విపరీత, వికృతార్థంలో చలామణీ అవుతోంది. కైంకర్యం, శఠగోపం, తీర్థం, చిదంబర రహస్యం, కుంభకోణం, స్వాహా, చెవిలో పువ్వు.. ఒకటా రెండా మనం పవిత్రంగా భావించే చర్యలు, వాటిని సూచించే పదాలు ఇలాంటి విపరీతార్థంలో చలామణీ అవుతున్న సమయంలో శ్రీపతిశర్మ రచించిన ఈ చిన్ని పుస్తకం అత్యంత ప్రతిభావంతమయిన రీతిలో ఈ దాడి స్వరూపాన్ని మనసుకు హత్తుకునే రీతిలో ప్రకాశమానం చేస్తుంది. మూలానికి దూరం వెళ్ళటం వల్ల మన మౌలిక ధర్మాన్ని ఎలా విస్మరిస్తూ మనం మనం కాకుండా పోతున్నామో చెప్పకనే చెప్తుందీ పుస్తకం.
ఇప్పటికే శ్రీపతిశర్మ ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అన్న రచనలో వాల్మీకి రామాయణంలోని మర్మాలను సౌందర్యాన్నీ తెలుగు పాఠకులకు చేరువ చేశాడు. ఇప్పుడీ పుస్తకం ద్వారా మరో అడుగు ముందుకువేసి, భారతంలో కీలకమైన పాత్రను మూలం ఆధారంగా చేరువ చేశాడు. ఇలా, మూలం ఆధారంగా పురాణ పాత్రల వ్యక్తిత్వాన్ని వివరించే ప్రక్రియను శ్రీపతిశర్మ ఒక ఉద్యమంలా చేపట్టాల్సిన అవసరం ప్రస్తుతం వుంది. శ్రీపతిశర్మ స్వతహాగా సృజనాత్మక రచయిత కావటంతో, కావ్య సౌందర్యాన్ని దర్శించగలిగే హృదయం వుండటం వల్ల, కవి హృదయాన్ని అర్థం చేసుకుని భావాన్ని వివరించే శక్తి వుండటం వల్ల, శ్రీపతిశర్మ కర్ణుడి పాత్ర సృజనలో వ్యాసహృదయాన్ని అత్యంత సుందరంగా ఆవిష్కరించాడు. ఇదే పద్ధతిలో ఇతర పురాణ పాత్రల వ్యక్తిత్వాలను కూడా ఆవిష్కరిస్తే భారతీయ సమాజంలో నెలకొని వున్న ఒక లోటును పూడ్చినవాడవుతాడు. ముఖ్యంగా, దుర్వ్యాఖ్యానానికి , అపార్థాలకు గురవుతున పాత్రల అసలు వ్యక్తిత్వాలను పాఠకుల ముందుంచటం వల్ల, భారతీయ ధర్మానుయాయులలో నెలకొని వున్న సందేహాలను తీర్చి వారి ఆత్మవిశ్వాసం స్థిరపడి ఆత్మగౌరవం ఇనుమడించటంలో దోహదపడినవాడవుతాడు. ముఖ్యంగా మళ్ళీ మూలాన్ని సామాన్యులకు చేరువ చేసినవాడవుతాడు. శ్రీపతిశర్మ ఈ విషయంపై దృష్టి పెట్టాలని అభ్యర్ధన.
తెలుగు కావ్యాలు పఠించి ఆనుభవించే శక్తి సమాజంలో సన్నగిల్లటం అర్థం చేసుకున్న విశ్వనాథ సత్యనారాయణ ‘సాహిత్య సురభి’ అనే గ్రంథంలో 300 పద్యాలను పరిచయం చేశారు. డాక్టర్ సి. నారాయణరెడ్డి ‘మందార మకరందాలు’ పుస్తకంలో చక్కటి భాగవత పద్యాలను సులువయిన భాషలో వివరించారు. ఇదే పంథాలో సంస్కృత ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలను మూలం ఆధారంగా వివరించాల్సిన ఆవశ్యకతను శ్రీపతిశర్మ రచించిన ఈ చిన్ని పుస్తకం స్పష్టం చేస్తుంది. అందుకు శ్రీపతిశర్మ అభినందనీయుడు. ఈ ప్రక్రియ ఇలా కొనసాగాలని ఆశిస్తున్నాను. శ్రీపతిశర్మ తన బాధ్యత నిర్వహిస్తున్నాడు. ఈ పుస్తకాన్ని స్వీకరించి ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజానిది.
***
రచన: వేదాంతం శ్రీపతిశర్మ
ప్రచురణ: Notion Press
పుటలు: 94
వెల: ₹ 199.00
ప్రతులకు
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/Vyaasabhaaratamlo-Asalu-Karnudu-%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B8%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A3%E0%B1%81%E0%B0%A1%E0%B1%81/dp/B0C2DZZMNB/