[dropcap]డా. [/dropcap]కరిమిండ్ల లావణ్య వివిధ విశ్వవిద్యాలయాలు, సాహితీ సంస్థలు నిర్వహించిన జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో మాట్లాడిన ప్రసంగాల సమాహారం ఈ వ్యాస తోరణం. ఇందులో పదకొండు వ్యాసాలున్నాయి.
***
“ఈ వ్యాసాలలో భాషా విషయాలు, చారిత్రకాంశాలు, తెలంగాణ భౌతిక-సామాజిక- సాంస్కృతిక విషయాలు, చారిత్రక-సాంఘిక భాషా సాంస్కృతిక చర్చల్లో భారతీయ మహిళా మనస్తత్వాలు… ఇంకా అనేక విషయాలున్నాయి. ఏ వ్యాసమైనా సామాజిక ప్రయోజనాన్ని ఆశించి రచించినట్టుగానే కనిపిస్తుంది.
మనం ఎంత ఎత్తుకు ఎదిగామన్నది కాదు; ఎంత మందిని కలుపుకొని పోతున్నామన్నదే ఇవాళ కావాలి. ఆ విశేషాలు చెప్పడానికి రచయిత్రి డా.లావణ్య స్వీకరించిన అంశాలు సాహిత్య పథికులందరికీ పాథేయాలే! సామాజిక సంస్కర్తలందరికీ కరదీపికలే!
ఆయా వ్యాసాల్లో స్త్రీ చైతన్యానికి సంబంధించిన అంశాలు కనిపిస్తాయి. సాహిత్య విద్యార్థినుల మనోబలాన్ని ఇవి పెంచుతాయి. శాసనస్థ పదజాలాన్ని, మాండలిక పదాలను చర్చించిన వ్యాసాలు ఈ వ్యాసతోరణంలో ఉన్నాయి. అవి మన పద సంపద మూలాలనూ, వైవిధ్యాన్ని తెలియజేస్తాయి” అన్నారు ఆచార్య కసిరెడ్డి “సాహిత్య పథికులకు పాథేయం” అనే తమ ముందుమాటలో.
***
“భాష. చరిత్ర, సాహిత్య రంగాలకు సంబంధించిన వ్యాసాలు ఈ సంపుటిలో ఉన్నాయి.
తొలి తెలుగు శాసనాలు – పదజాలం, మాండలికమే ప్రామాణికం, తెలుగు భాషా పరిరక్షణ సాహితీ స్రష్టల బాధ్యత అన్న మూడు వ్యాసాలు భాషా కోణం నుంచి సాగినవి. తొలి తెలుగు శాసనాలు – పదజాలం వ్యాసంలో సంస్కృతం, ప్రాకృతం, తెలుగు పదాలు శాసనాల్లో కనిపించిన రీతిని చెప్పారు. దేశీ పదజాలాన్ని మిశ్ర, నామ పదాలుగా, అన్య దేశ్యం, మాండలికాలుగా విభజించుకుని పరిశీలన సాగింది.
తరిగొండ వెంగమాంబ, అనిశెట్టి రజిత, రవీంద్రుని చిన్న కథలపై, మధుర బంజారాలపై వ్రాసిన వ్యాసాలలో ఆయా శీర్షికలకు అనుగుణమైన ఆలోచనలు కనిపిస్తాయి. తరిగొండ వెంగమాంబ సాహిత్యంలో స్త్రీల ఆత్మ గౌరవాన్ని చూడడం, రవీంద్రుని చిన్న కథల్లో కనిపించే సమాజాన్ని విశ్లేషించడం, సమకాలీన స్త్రీ వాద రచయిత్రిగా అనిశెట్టి రజితను అంచనా వేయడం, మథుర బంజారాల జీవన విధానాలను వివరించడం వంటివన్నీ వ్యాస రచయిత్రి శ్రద్ధను లావణ్యాన్ని చెబుతాయి” అన్నారు డా. సి.హెచ్. లక్ష్మణ చక్రవర్తి ‘వ్యాస లావణ్యం’ అనే తమ ముందుమాటలో.
***
రచన: డా. కరిమిండ్ల లావణ్య
ప్రచురణ: జాతీయ సాహిత్య పరిషత్, భాగ్యనగర్ శాఖ, తెలంగాణ
పుటలు: 153+XI, వెల: ₹ 40/-
ప్రతులకు: ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు