Site icon Sanchika

వ్యథ

[dropcap]గు[/dropcap]ట్టలుగా శవాలు
మట్టిలో ఒదిగిన ఎముకలు

బూడిదలా మారిన అస్తిత్వం
నీరులా జారి సంద్రంలో పొందిన స్థిరత్వం

ఆకాశం నిండా గద్దలు
తినడానికేమీ లేని ఊళ్లు
మాంసం ముద్ద లేని బొక్కల గూళ్ళు
ఆకలితో కళ్లలో నీళ్లు

గాలి ఎటు వీచినా కష్టమే
గాలి ఏ మాత్రం పీల్చినా కష్టమే

ఇప్పటికే ముసుగేసుకున్న మనిషికి
మరో ముసుగు కానుక
అరిషడ్వార్గాల్లో సగానికి సగం
ఇక పట్టింది గ్రహణం

అసలేం సాధించామని
చంద్రుణ్ణి చేరుకొని అంతరిక్షాన్ని
జలాంతర్గామిలో జలచరాలను
ఓడప్రయాణమని సముద్రపు నీటిని
సేద తీరాలని రేవుని
సాంఘీకరణ అని అరణ్యాల్ని
వైవిధ్యపు విందు అని జంతువుల్ని
వాణిజ్యమని అడవినీ, చెట్లను
వాడుకుని, మళ్ళీ నొక్కి చెబుతున్నా, వాడుకుని

విశ్వాన్నే జయించిన విజేతలా
విర్రవీగిన నువ్వు
ఇప్పుడు నీ చేతులకి, నీ అహానికి
నీ దర్పానికి వేసుకున్నావు ముసుగు

గాలి ఎటు వీచినా కష్టమే
గాలి ఏ మాత్రం పీల్చినా కష్టమే

కుటుంబం, బంధువులు
పెళ్ళిళ్ళూ పేరంటాలు
ఆటలూ సమావేశాలూ
విందులూ వినోదాలూ
చేతిలో చేయివేసి ప్రేయసిపై
చూపే ఆప్యాయతలు
స్నేహితుడి భుజంపై చేయివేసి
వెన్నుతట్టే సందర్భాలు
తల్లిదండ్రుల కాళ్లపై పడి
తీసుకునే ఆశీర్వాదాలు
లోకువ చేసి, మళ్ళీ నొక్కి చెబుతున్నా, లోకువ చేసి

విశ్వాన్నే జయించిన విజేతలా
విర్రవీగిన నువ్వు
వావివరసలనే జ్ఞాపకంగా మార్చేసావు
నవ్వుల పువ్వుల్ని నలిపేసావు!

Exit mobile version