Site icon Sanchika

‘వర్లి’ గిరిజన చిత్ర కళ

[గిరిజనుల ‘వర్లి చిత్ర కళ’ గురించి వివరిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్ ఈ రచనలో.]

[dropcap]వ[/dropcap]ర్లి కళ అనేది మహారాష్ట్రలోని గిరిజనులు సృష్టించిన కళ. సాంప్రదాయ గిరిజన శైలితో ఈ కళ ఉద్భవించింది. కాగితం మరియు కాన్వాసులపై వర్లి చిత్రకళను చిత్రిస్తారు. ‘జివ్య మాషే’ ఈ వర్లి చిత్రకళకు మంచి గుర్తింపును తీసుకురావడం వల్ల అతనిని వర్లి పెయింటింగ్ యొక్క ఆధునిక పితామహుడిగా కీర్తిస్తారు. ఈ మధ్య కొన్ని కంపెనీలు పురాతన సంప్రదాయ కళలను తిరిగి ప్రచారం లోకి తేవడం ప్రారంభించాయి. దాని వలన ఇలాంటి వర్లి, కచ్ వర్కులు తిరిగి తమ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. గిరిజన సంస్థలు ఆదివాసీ కళలను ప్రచారం లోకి తీసుకువస్తున్నాయి. భారతదేశం లోని అతి పెద్ద తెగలలో వర్లి తెగ మొదటిది. ఈ తెగ ముంబైకు వెలుపల నివసిస్తుంది. 1970 లలో ప్రాచుర్యం పొందిన ఈ గిరిజన శైలి పదవ శతాబ్దం AD ల కాలం నాటిదని భావిస్తున్నారు. ఈ కళ మాతృప్రకృతి భావనపై కేంద్రీకృతమై ఉంటుంది. ప్రకృతి అంశాలపై ఎక్కువగా వేస్తారు. కళాకారులు తమ గుడిసెలనే కాన్వాసుగా ఉపయోగిస్తున్నారు.

ఈ చిత్రకళను ఎక్కువగా గోడల పైనే వేస్తారు. మట్టి గుడిసెల్లో గోడలకు ఎర్ర మట్టి రంగును పూశాక దానిపై తెలుపు, నలుపు రంగులో ఈ చిత్రకళను వేస్తారు. కేవలం రేఖలతోనే మనిషి రూపు రేఖలు గీసేస్తారు. ఏ వస్తువైనా మనిషైనా త్రికోణాలు, గీతలతో మాత్రమే ఈ శైలి ఉంటుంది. చూడటానికి సులభంగా అనిపిస్తుంది కానీ శ్రద్ధ పెట్టాల్సిందే, తల కోసం ఒక గుండాన్ని గీయటం, శరీరానికి రెండు త్రికోణాలను వ్యతిరేక దిశలో గీయటం రెండు పుల్లల్లాంటి కాళ్ళు, చేతులు – చూస్తుంటే గీయటం ఎంత సేపు అనిపిస్తుంది, కానీ ప్రాక్టీస్ అవసరం.

డ్రాయింగ్ షీటు మీద ఒక కుటుంబాన్ని చిత్రిద్దాం. పొద్దు గూకాక ఇంటికి చేరే భార్యాభర్తలు ఒక పాపను వేస్తున్నాను. భర్త తల మీద కట్టెల మోపు, భార్య తలపై కుండ, వీరి వెనకగా చిన్న పాపను వెయ్యదలిచాను. పొద్దుగూకింది కదా అని ఆకాశంలో చంద్రుడు చుక్కలు పెట్టేశాను. దగ్గరగా ఉన్న గుడిసెలో కాంతి వెలుగుతున్నట్లుగా పసుపురంగును వేశాను. ఆకాశం నిండు బులుగు రంగురు వేశాను.

మొదటగా డ్రాయింగ్ షీటు బ్యాక్‌గ్రౌండును తయారు చేసుకోవాలి. దాని తర్వాత నలుపు రంగు స్కెచ్ తీసుకొని పురుషుడు, మహిళ బాలిక బొమ్మల్ని చిత్రించాను. మొదట్లో స్కెచ్ పెన్నుతో వేసుకుని కొద్దిగా చెయ్యి తిరిగాక బ్రష్‌తో వేసుకోవచ్చు. ఒకటి రెండు సార్లు వేస్తే చెయ్యి తిరిగి నైపుణ్యం వస్తుంది.

వేట, వ్యవసాయం, నాట్యం వంటి అంశాలను ఆదిమానవుడు గుహలపై చిత్రీకరించాడు. ఆనాటి సాంఘిక జీవనం తప్ప ఎక్కడా పురాణ చిత్రాల జోలికి పోలేదు. గోడల మీద నుండి కాగితాల వరకు పాకిన ఈ కళ చాలా కాలం వరకూ కూడా వివాహిత స్త్రీల కాలక్షేపపు కళ గానే మిగిలి పోయింది వర్లి, మల్ఖర్ కోలీ అనే తెగలు ప్రకృతిని పూజిస్తారు. సూర్యచంద్రులు, ఉరుములు, మెరుపులు, గాలి, వర్షం వంటి ప్రకృతి అంశాలన్ని ఆరాధ్యదైవాలుగా భావిస్తారు. జనన మరణాలలో వివాహాలలో వృత్తాలను చిత్రిస్తారు. మృత్యువును అంతంగా కాకుండా ఆరంభంగా చిత్రిస్తారు. ఇప్పుడు వృత్తాకారంలో నిలబడిన మహిళలను చిత్రిద్దాం.

చాలా వరకు పూర్వకాలపు ముగ్గుల్లో అమ్మాయిలను ఇలాగే చిత్రిస్తారు. రెండు పెద్ద వృత్తాలను గీసుకొని వాటి మధ్యగా అమ్మాయిలను నిలబెడితే బాగుంటుంది. వృత్తాకారంలో ఉన్న అమ్మాయిలు ఒకరి చెయ్యి మరొకరు పట్టుకున్నట్లుగా ఉంటుంది. మధ్యలో ఒక తబలాను పెడదాం. ఏదైనా మ్యూజికల్ పరికరాన్ని పెట్టవచ్చు. చుట్టూ బార్డర్‌ను కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ముందుగా పెన్సిల్‌తో వేసుకున్న చిత్రాలకు రంగులు అద్దాలి. మహిళల దుస్తులకు రంగులు అద్దవచ్చు. గుండ్రటి తలలకు కొప్పులు పెడితే అమ్మాయిలు అయిపోయినట్లే. బార్డర్‌ను కూడా త్రికోణాలుగా వేసి రంగులు వేస్తే బాగుంటుంది. వర్లి చిత్రకళను అందంగా వాడుకోవచ్చు నాలుగు మూలలా సూర్యుడ్ని కూడా వేయవచ్చు.

నాలుగు కర్రల ఫ్రేమ్‌తో ఒక హ్యంగింగ్ చేద్దాం. ఈ చిత్రంలో కేవలం రెండు వర్లి చిత్రాలు గీద్దాం. దీనిని చాలా సులభంగా చేశాను. ఇద్దరు మహిళలు ఒక డ్రమ్‌ను మాత్రమే వేశాను. బ్యాక్‌గ్రౌండ్  కూడా ఒక రంగునే వాడాను . కేవలం పసుపు రంగునే తీసుకున్నాను. అయితే ఈ చిత్రానికి బార్డర్‌గా చిన్న సైజులో మహిళలు చేయి చేయి పట్టుకుని నడుస్తున్నట్లుగా గీశాను. బార్డర్ లోని మహిళలకు కేవలం నలుపు రంగును మాత్రమే వాడాను. మధ్యలో ఉన్న మహిళలకు రంగులు వేశాను. ఇద్దరూ కలిసి డ్రమ్ వాయిస్తున్నట్లుగా వేశాను. ఇలా తయారు చేసిన అట్టును నాలుగు కర్రలతో ప్రేమ్ చేసినట్లుగా అతికించాలి. వెనకవైపున వేలాడదీసేందుకు గట్టి తాడును అతికించాలి. గోడకు వేలాడదీసుకుంటే బాగుంటుంది.

సాదుగా ఉండే తెల్లని కాగితం పైన కాకుండా మిక్స్‌డ్ కలర్‌తో తయారు చేద్దాం. దీని కోసం తెల్లని కాగితాన్ని తీసుకొని దాని పై క్రేయాన్స్‌తో ఆకుపచ్చ పసుపు పచ్చ రంగులతో దిద్దుకోవాలి. లేదా ఎరుపు, పసుపు పే స్ట్రేల్స్‌తో కలిపి రంగుల్ని బ్రష్ సహాయంతో మిక్స్‌డ్ బ్యాక్‌గ్రౌండ్‌ను తయారు చేసుకోవాలి. దీనిపై మనకు వచ్చిన చిత్రాలను వేసుకోవాలి. ఇక్కడ ఒరే మహిళనే వేసుకుందాం. అది కూడా ఇక్కడ తెలుపు రంగును వాడదాం. ఇప్పటి దాకా చిత్రాలను నలుపు రంగుతో కాకుండా తెలుపురంగును వేస్తే బాగుంటుంది. నాలుగు మూలలా అర్ధ చంద్రాకార వృత్తాలను గీసి వీటి మధ్యలో మరల వర్లి మనుష్యులను గీయాలి. వాటి మధ్యలో సూర్యుడ్ని గీయాలి. సూర్య చంద్రులు ఈ తెగల ఆరాధ్య ధైవాలు. అందుకే ప్రతి చిత్రంలో వారి సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా గీసుకుంటే బాగుంటుంది. సెంటర్‌లో ఉన్న మహిళను గీసి ఆమె దుస్తులకు బాగా గీతలా డిజైన్‌ను వేశాను. ఈ మహిళ కొమ్ము బూర ఊదుతున్నట్లుగా వేశాను. తర్వాత ఈ మహిళ దుస్తులకు రంగులు వేయనవసరం లేదు, కేవలం తెలుపు రంగుతోనే డిజైన్ చేయాలి.

ఈ చిత్రాన్ని కూడా తెలుపు రంగు పెయింట్ తోనే వేద్దాం. ఇందాకట్నుంచి నలుపు రంగును వాడాం కదా! మహారాష్ట్రకు సంబంధించిన వెబ్ సైట్లు, బస్సులు, భవనాల వంటి వాటిపై వర్లి చిత్రాలనే అధికారికంగా చిత్రించినారు. ఏదో ఒక సంగీత వాయిద్యాన్ని వాయిస్తూ ఉన్న మనిషి, అతని చుట్టూ అనేక మంది నాట్యం చేస్తున్నట్లుగా ఉండే దృశ్యాలు ఎక్కువగా ఉంటాయి. చెట్లు, మనుషులు, పక్షులు ఒకదానితో ఒకటి కలిసి స్పందించే చిత్రాలు ఎక్కువగా ఉంటాయి. మామూలుగా మట్టి గోడలపై ఎర్ర బూజు పూసి దానిపై తెల్లని పెయింట్‌తో వర్లి చిత్రాలను గీసినట్లుగా కాగితంపై వేద్దాం. అదే రంగు కాగితం పై వేసి దాని మీద తెలుపు రంగు చిత్రాలను వేద్దాం. కాగితంపై ఎర్ర మట్టి రంగును వేసుకుని నలుగురైదుగురు మనుష్యులను గీసి ఇద్దరు మనుష్యులు వాయిద్యం వాయుస్తున్నట్లుగా వేద్దాం. వెనకవైపు రెండు కొబ్బరి చెట్లను ప్రకృతికి గుర్తుగా వెయ్యాలి. ఇలా రకరకాలుగా వర్లి చిత్రకళను వేద్దాం.

Exit mobile version