[వర్తమాన ఆఫ్రికన్ కవయిత్రుల కవితలను పాఠకులకు పరిచయం చేసే క్రమంలో వార్సన్ షైర్ రచించిన రెండు కవితలని అనువదించి అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి]
24 ఏళ్ల వార్సన్ షైర్ కెన్యాలో జన్మించిన సోమాలియా కవయిత్రి. లండన్‌లో నివాసం. Young poet laureate for London కి ఎన్నికైన మొదటి ఆఫ్రికన్ కవయిత్రి. ‘బ్యూటీ & అగ్లీ’ అనే రెండు కవితలను వార్సన్ 3000-పౌండ్స్ బ్రూనెల్ యూనివర్సిటీ ఆఫ్రికన్ పోయట్రి ప్రైజ్ కోసం రాశారు. ‘విమెన్ హూ ఆర్ డిఫికల్ట్ టు లవ్’ వార్సన్ పాపులర్ కవితల్లో ఒకటి. ఈ కవితలో చాలాసార్లు స్త్రీగా ఉండడం అంటే అందంగా, భయంకరంగా, విచిత్రంగా ఉండడం తప్ప ఇంకేం ఉంది అనే భావన కనిపిస్తుంది. ఆమె కవితలు అందమైన పదాలు, పోలికలతో మెరిపించడమే కాదు కోరిక లోని ఆకర్షణ, ప్రమాదం, హింసలోని నొప్పి, రెండూ స్త్రీ కి ఎంత నష్టమో చాలా లోతుగా చర్చిస్తాయి.
~
1) బ్యూటీ -అందం
మీకు నా చిన్న చెల్లి గురుంచి చెప్తాను.
ఆమె తన కాళ్ళ మధ్యలో సబ్బుతో శుభ్రంగా కడుక్కునేది.,
ఉంగరాలు తిరిగే వెంట్రుకల కోసం ప్రార్థించేది కూడా.
ఆమెకి నా వయసున్నప్పుడు పక్కింటామె భర్తను తన వైపుకి తిప్పుకుంది..
బహుశా ప్రేమించిందేమో కూడా.
అతని పేరుని తన ముంచేతి పై కాల్చుకుని అచ్చేయించుకుంది
వారాల తరబడి ఆమె నుంచి నాసి రకపు సెంటు., చచ్చిన చేపల వాసన వస్తుండేది.
నాకు బాగా జ్ఞాపకం.,
ఒక నాటి తెల్లారు ఝామున నాలుగు గంటలకు., ఆమె సింక్ పైకి వంగుతూ నాకు కన్ను కొట్టింది
ఆమె చిన్న రొమ్ముల కొనలు పంటి గాయాలతో ఉన్నాయి.
‘అబ్బాయిలు చాలా హరామ్’ అని చెప్తూ పళ్ళ బిగువున నవ్వింది.
నేనది ఎప్పటికీ మరిచి పోలేను.. మీరు కూడా మరవకండి.
++++++++++
కొన్ని రాత్రుల తరబడి ఆమె గదిలోంచి అరుపులు వినిపిస్తూనే ఉండేవి.
ఆమెని ఆ బాధలో నుంచి బయట పడవేయడానికి మేము ‘సూరాహ్ -ఆల్-బకహరాహ్’ చదివే వాళ్ళం.
ఆఖరికి ఎలా అయిపోయిందంటే..
ఆమె గొంతు నుంచి వచ్చే ఏ శబ్ధం అయినా మాకు సెక్స్ లాగా మాత్రమే వినిపించేది.
చివరికి మా అమ్మీ.. మా చెల్లి నోట్లోనుంచి అల్లా అనడాన్నే నిషేదించింది!
2) అగ్లీ – కురూపి
నిన్నే విను.. నీ కూతురొక కురూపి.
కోల్పోవటం అంటే ఏంటో పాపం నీ కూతురుకి బాగా తెలుసు
ఆమె ఈ నగరాన్ని మొత్తంగా తన కడుపులో మోస్తున్నది.
ఆమె పసిదానిగా ఉన్నప్పుడు ఆమె బంధువులు ఎత్తుకునేవాళ్ళు కాదు.
ఆమె సముద్రపు నీళ్ళల్లో చెల్లా చెదురైన చెక్కముక్కలా ఉండేది.
అయితే మాత్రం.. తనని తిరస్కరిస్తూ వచ్చిన వారందరికీ..
ఆమె ఒక యుద్ధాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చింది.
సరే., ఆమెకి పదిహేనేళ్లు వచ్చేప్పటికి ఏం చేశారు మీరు?
వెంట్రుకలను తాడు లాగా అల్లుకుని దానికి సాంబ్రాణి పొగ దట్టంగా ఎలా పట్టించాలో నేర్పించారు
అంతేనా.. ఆమెకి పరిమళాలు వెదజల్లే గులాబీ అత్తరు నీటితో..
గొంతుని ఎట్లా పుక్కిటి పట్టాలో చెప్పారు
ఆమె దగ్గినప్పుడల్లా.. నీలాంటి మకాంటీ తెగ అమ్మాయిలు ఎప్పుడూ
ఖాళీ తనపు లేదా ఒంటరి తనపు వాసన వేయకూడదు అనే వారు.
కానీ నువ్వు ఆమె తల్లివి!
ఆమెనెందుకని నువ్వు హెచ్చరించలేదు?
ఆమె నొక కుళ్లిపోయిన పడవలా వొడిసి పట్టుకుని.,
నా బిడ్డా.. ఇలా ఉంటే ఎలా?
నీ దేహం ఇలా ఎగుడు దిగుళ్ళ మహా ఖండాంతరాలతో కప్పడి పోయి ఉంటే..
నీ పళ్ళు చిన్నచిన్న గుంపుల్లా కొక్కిరి బిక్కిరిగా ఉంటే..
నీ కడుపు ఒక ద్వీపంలా లోతుగా ఉంటే..
ఇక నీ తొడలు సరిహద్దులలాగా ఉంటే..
పురుషులు నిన్నే మాత్రమూ ప్రేమించలేరు అని ఎందుకు చెప్పవు?
ఏ పురుషుడు మాత్రం ఇలాంటి అందమే లేని స్త్రీతో తన బెడ్ రూమ్ కాలబడిపోవాలని అనుకుంటాడు చెప్పు?
నాకు ఇది చెప్పు ముందు.
అసలు నీ కూతురంటే ఏంటి ఇప్పుడు?
నేను చెబుతానుండు
నీ కూతురి మొఖం ఉంది చూశావూ.. అది ఒక దాడికి గురి అయిన స్థలం!
మరి ఆమె చేతులు మాత్రం?
యుద్ధం చేసే రెండు ఆయుధాలు!
ఇక ఆమె రెండు చెవుల వెనకాల చెరొక శరణార్థ శిబిరాలే ఉన్నాయి సుమా..
ఇక మొత్తంగా.. ఇలా
ఆమె శరీరమంతా చాలా అసహ్యమైన వాటితో అంటించబడి కాలిపోతున్నది.
ఇన్నింటిని తన వొంటిపై మోస్తుందా నీ కూతురు..?
అయ్యో భగవంతుడా..
మరి ఆమె ఎందుకీ ప్రపంచాన్ని సరిగ్గా తొడుక్కోలేదు.. ఎందుకు?
~
మూలం: వార్సన్ షైర్
అనువాదం: గీతాంజలి