వాట్సాప్ విచిత్ర చేష్టలు

8
2

[dropcap]సు[/dropcap]బ్బులుకీ సెల్ ఫోను మనవలు కొనిచ్చినప్పట్టి నించి పని ఎక్కువయ్యింది. ఎవరు ఒక్కసారి ఎదురుపడినా వాళ్ళ నెంబరు సెల్ఫోనులో పెట్టుకోవడం. భర్తగారు హెయిర్ కట్‌కి వెడితే భర్తగారి ఫోను ఏనాడు పలకదని హెయిర్ కట్ వెంకటసామి ఫోన్ నంబరు దాన్లో పెట్టుకుంది. ఆలస్యమైతే కంగారు – “అయ్యగారు ఇంకా రాలేదేమిటి వెంకటసామి” అంటూ ఫోను. టైలర్ అప్పలరాజుది సరేసరి, తొంభై సార్లు చేస్తే కానీ జాకెట్లు ఇవ్వడు. ఒకటి ఏమిటి ఇలా ఎంత మంది నెంబర్లో, వాచ్‌మెన్, పచారి కొట్టువాడు.. ఆఖరికి ##పెంటయ్య చెత్త రెండు రోజులు పట్టికెళ్లక పోయినా ఫోనే మరీ. ఈ రోజుల్లో ప్రతి ముష్టివాడి చేతుల్లోను ఫోన్లేనాయె.

సుబ్బలక్ష్మికి కోతికి కొబ్బరికాయలాగా రెండు పప్పెట్లు పెద్దవి భర్తగారికి ప్రెజెంటుగా వచ్చాయి. పప్పెట్ల సంస్థ రత్నమాల భర్తగారికి ఆయన సంస్థ ప్రెసిడెంటు కదా అని సరదాగా ఆ బొమ్మలు ప్రెజెంటు చేసింది. ఈ బొమ్మలు చూడగానే సుబ్బులు మైండ్‌లో బంగారయ్య సింగారక్క మెరిసారు. ఈ బొమ్మలు ఆ వేషాలకి సరిగ్గా సరిపోతాయి. ఓ పాట పాడుతూ ఈ బొమ్మలు ఆడిస్తే అని బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. అక్కడే ఆడుకుంటున్న మనవరాళ్ళిద్దరిని బ్రతిమాలి “వాట్సాప్‌లో ఈ బొమ్మలతో వీడియోలు తియ్యండర్రా ప్లీజ్, నేను పాడతాను” అంది. వాళ్లకేదో పిజ్జా ఎరవేస్తే కాదనలేక “సరే” అన్నారు. పాడిందో పాట. హాస్యంగా ఉండాలని ఘంటసాలగారి పాట ఎంచుకుంది. పోలీసేంకటసామి పాట అది.

“మరువలెనురా నిన్ను నేను మరువలేనురా. ఓ.. పంచదార వంటి పొలిసేంకటసామి.. నిన్ను నేను మారువలేనురా.
ఓయ్ వాలు కన్నుల మువ్వలెంకటసామి నిన్ను నేను మరువలేనురా.
నీకు వచ్చింది కోరమీసం నాకు వచ్చింది దోర వయసు
ఇద్దరి మనసు ఒక్కటైతే.. హోయ్.. ఇద్దరి మనసు ఒక్కటైతే
ఎనక చింతల్లేని బతుకె ఎంకటసామి
నిన్ను నేను మరువలెనురా….
కన్నూ కన్నూ కలిసిందోయ్ .. నిన్నూ నన్నూ కలిపిందోయ్
ఈడనున్న నేనేడనున్న నీ నీడనేనోయ్ .. హోయ్..సందు లేదు మనకు చందమామ తోడు.
పోలీసెంకటసామి నిన్ను మరువలేనురా”

పిల్లలు ఈ పాటకి బ్రహ్మాండంగా వీడియో తీశారు. అది ఫామిలీ గ్రూపులో పెట్టమంది పిల్లలని, అంటే వాళ్ళ పిల్లలకి మనవలికి. పిల్లలు వెళ్ళిపోయాక తోచింది. ఈ బొమ్మలు పంపిన రత్నమాలకి కూడా పంపితే సంతోషిస్తుంది కదా.. అని. అంతే గబగబా నాకు తెలుసులే అని రత్నమాలకీ పంపింది.

కాసేపట్లో ఫోను. “హలో? ” అనగానే

“చాలా బాగా తీసారండి వీడియో”

“యవరమ్మా మీరు?”

“అయ్యో నేనండి, మీ వదిన చెల్లెలి ఆడబడుచుని”.

‘ఇదేమిటి ఈ అమ్మాయికి ఎలా వెళ్ళింది రత్నమాలకు మాత్రమే పంపితే?’ అనుకుంది.

ఇంతలో మరో ఫోను. “సూపర్బ్ అండి వీడియో” మరొకళ్ళు.

“నే గుర్తు పట్లేదు. ఎవరండి?”

“నేను, మీ మనవరాలికి డాన్స్ నేర్పే టీచరునమ్మా”

“చచ్చానురా బాబు, తెలిసీ తెలియని నొక్కుడు. ఎటు పోయిందో! పిల్లల్ని అడిగేదాకా ఎందుకా కంగారు నాకు!”.

అంతలో ఎక్కడ నించో వచ్చిన మనవరాల్ని అడిగింది “ఇదేమిటే? ఒక్క అమ్మాయికి పంపితే ఎన్నో ఫోనులు వస్తున్నాయో, చూడు!” అంటూ ఫోను ఇచ్చింది.

“నువ్వు పొరపాటున అందరికి ఇది వెళ్ళేటట్టు పంపావు మామ్మా” అంది.

“చచ్చానురా దేవుడా ఇంకా ఎన్ని ఫోన్లు వస్తాయో”.

సాయింత్రం అమ్మాయి ఆడబడుచు టైలర్ దగ్గిర నించి జాకట్టు కుట్టడానికి ఇచ్చినవి తెచ్చిస్తూ “ఆంటీ, టైలర్ మీ వీడియో చూసాడుట. సూపర్బ్, అమ్మగారు బ్రహ్మాండంగా పాడారు అన్నాడు. ఏం పాడారు ఆంటీ?”

“ఏమిటీ! టైలరా! రామచంద్రా ఎంత భాగవతం జరిగింది!” మనసంతా పాడైపోయింది – ఈ వెంకటసామి దేశాలు కూడా వెళ్లి ఉంటాడే! బుర్ర మీసాల వెంకటసామి. ఏం చెయ్యాలిరా భగవంతుడా!

సాయింత్రం శ్రీవారు రాగానే “ఏమండీ మంచినీళ్లు కావాలా” అంది.

“మంచినీళ్లు అఖ్ఖర్లేదు, గాడిది గుడ్డు అఖ్ఖర్లేదు. చేసిన నిర్వాకం చాలు. ఊళ్ళో ప్రతి అడ్డమైన వాడు పలకరించే పలకరింపుతో దాహం తీరి పోయింది. ఛీ ఛీ! వెధవ పాట! ఎంత మందో, ఎంత మందో! హెయిర్ కట్ వెంకటసామి, మిర్చి బజ్జి వీరసామి, కేటరింగ్ కనకయ్య. ఒకళ్ళు ఏమిటీ ఊరంతా నీ ఫ్రెండ్సేగా! ఆఖరికి చెరుకుబండిగాడి దగ్గిర నించి అమ్మగారి వీడియో బ్రహ్మాండం సారూ, చూసారా అంటూ పలకరింపులు. చెంబెడు చెరుకు రసం పంపు అంటూ ఫోన్లు మరీ! చేతిలోనే ఉంటుంది కదా ఎప్పుడు! అందరూ అమ్మగారీడియో బ్రహ్మాండమండీ అంటూ పక్క ఉన్న పది మందికీ వినిపించేస్తున్నారు.”

ఇంకా మిగతా మాటలు ఏమీ సుబ్బులు చెవులోకి ఎక్కలేదు. దుఃఖం ముంచుకొస్తోంది. ఎంతంత దూరం వెళ్లి పరువు తీస్తోందో ఈ వీడియో! ఆ హాస్యం పాటా నేనును. ఎందుకలాంటి బుద్ధులు పుడతాయి తనకి తెలియదు! హాస్యంగా ఉన్నా అసభ్యంగా ఉండకూడదు కదా! మనస్సంతా పాడైపోయింది. దుఃఖంతో నిద్ర పట్టక తెల్లవార్లు దొల్లింది. బుర్రలో నిద్రలో అంతా వాట్సాప్పు, అడ్డమైన వాళ్ళ నంబర్లు, భర్తగారి తిట్లు, అందరి హేళనలు, నవ్వులు, వికవికలు, పకపకలు. గజిబిజిగా అయిపోయింది మైండ్ అంతా. సెల్ఫోనులో పెట్టుకున్న ప్రతి చెత్త నంబర్లు వాట్సాప్లో కూర్చున్నాయి! ఛీ వెధవ వాట్సాప్పు! తెల్లవారింది ఎలాగో. ఉదయం లేవక తప్పదుగా. బెల్లు మ్రోగగానే తలుపు తీసింది. చెత్త పట్టుకెళ్లే పెంటయ్య “సెత్త యివ్వండమ్మా. అమ్మా శానా బాగా పాడారమ్మా, మా ఓళ్లంతా ఇని…”

“చెత్త లేదు చెదారం లేదు ఫో” అని పరుగు పరుగున బెడ్‌రూములోకి పోయి భోరుమంటూ మంచం మీద పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here