మావో కమ్యునిస్టు పాలన లోని నియంతృత్వాన్ని గురించి చెప్పిన ఆత్మకథ – వైల్డ్ స్వాన్స్

0
3

[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]

[dropcap]‘వై[/dropcap]ల్డ్ స్వాన్స్’ జంగ్ చాంగ్ అనే చైనా రచయిత్రి రాసిన నవల. ఇది మొదట 1991లో పబ్లిష్ అయ్యింది. ఇప్పటి దాకా 37 ప్రపంచ భాషలలోకి అనువాదం అయి, పదమూడు మిలియన్ల కాపీలు అమ్ముడుపోయిన పుస్తకం ఇది. ఎందరో పుస్తక ప్రేమికులు దీన్ని చదివి పదిమంది చేత చదివించారు కూడా. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు కొన్ని ఇంటర్వ్యూలలో తనను చాలా కదిలించిన పుస్తకంగా దీన్ని పేర్కొన్నారు. ఇది రచయిత్రి ఆత్మకథ. మూడు తరాల చరిత్రను రికార్డు చేసిన పుస్తకం. అలాగే చైనాలోని రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను విపులంగా చర్చించిన పుస్తకం. మూడు తరాల స్త్రీల జీవితాలను ముఖ్యాంశాలుగా తీసుకుని రచయిత్రి తన దేశ పరిస్థితులను వాటి క్రింద నలిగిపోయిన స్త్రీల జీవితాలను ముఖ్యంగా చూపే ప్రయత్నం చేసారు.

జంగ్ చాంగ్ అమ్మమ్మ తల్లి జీవితంతో ఈ ఆత్మ కథ మొదలవుతుంది. తన కన్నా ఆరు సంవత్సరాలు చిన్న వానితో ఆమె వివాహం జరుగుతుంది. అప్పుడు ఆమె వయసు కేవలం ఎనిమిది సంవత్సరాలు. వరుడు రెండు సంవత్సరాల పసి కూన. ఆడపిల్ల అని ఆమె పుట్టినప్పుడు నిరాశపడిన తల్లి తండ్రులు ఆమెకు పేరు కూడా పెట్టరు. రెండో పిల్ల అని ఆమెను పిలిచేవారు, ఆమె తల్లికి రెండవ సంతానం కాబట్టీ. అటువంటి పరిస్థితులలో జీవించిన ఆమె తనకు పుట్టిన ఆడపిల్లకు పేరుపెట్టి ఏదో సాధించిన దానిలా ఆనందిస్తుంది. అలా పుట్టగానే పేరు పెట్టించుకోవడం బిడ్డ అదృష్టం అని మురిసిపోతుంది. యు ఫాంగ్ అనే ఈ అమ్మాయే రచయిత్రి అమ్మమ్మ. ఈమెను ఒక మిలిటరీ జనరల్ కోరితే అతనికి ఉంపుడుగత్తెగా తండ్రే పంపించి వేస్తాడు. యు ఫాంగ్ తండ్రి ఉద్యోగంలో స్థిరపడడానికి తన కూతురుని అలా పావుగా ఉపయోగించుకుంటాడు. ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించి ఆ మిలిటరీ జనరల్ ఆమెను అందరి ముందు తన ఉంపుడుగత్తెగా స్వీకరిస్తాడు. దీన్ని బట్టి ఆ దేశ సాంప్రదాయంలోనే ఒక డబ్బున్న మగవాడు ఎందరో ఉంపుడుగత్తెలను సమాజం ముందు గౌరవంగా స్వీకరించవచ్చు అన్నది తెలుస్తుంది. ఈ కార్యక్రమం నిర్వహించడం వలన ఆమెకు ఉండడానికి ఒక పెద్ద ఇల్లు అలాగే ఎంతో మంది సేవకులు ఏర్పడతారు. ఈ పనివాళ్ళ పని ఆమెపై నిఘా ఉంచి ఆమె కార్యకలాపాల గురించి అ జనరల్‌కు చెప్పడం. ఒక రకంగా పంజంరంలో చిలక లాంటి జీవితం ఆమె అనుభవిస్తూ ఉంటుంది. కేవలం మూడు రోజులు ఆమెతో గడిపిన జనరల్ వెళ్ళిపోయి మళ్ళీ ఆరు సంవత్సరాల తరువాత తిరిగి వస్తాడు. ఆ మూడు రోజుల జీవితంతో ఆమె గర్భవతి అవుతుంది. ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. ఆమే బావో క్విన్. జనరల్ జబ్బు పడి మరణిస్తున్నప్పుడు అతనికి వారసులు లేరని అతని భార్య ఈ బిడ్డను తన దగ్గర ఉంచుకోవాలని ప్రయత్నిస్తుంది. యు ఫాంగ్‌ను తన ఇంటికి పిలిపించుకుంటుంది. బిడ్డను తీసుకుని ఆమెను పంపేయాలని కుటుంబీకులు కుట్ర చేస్తున్నప్పుడు ఆ బిడ్డ చనిపోయిందని కథ అల్లి యు ఫాంగ్ తన పుట్టిన నగరానికి పారిపోతుంది. చనిపోయే ముందు ఆ జనరల్ ఆమెను చట్టపరంగా స్వతంత్రురాలిగా ప్రకటించడం వలన ఆమెకు ఇక ఒంటరిగా జీవించే వెసులుబాటు లభిస్తుంది. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడే ఒక 65 సంవత్సరాల డాక్టర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడుతుంది. జియా అనే ఆ డాక్టర్‌తో ప్రేమలో పడుతుంది. అ డాక్టర్ ఆమె కూతురుకు తన ఇంటి పేరు ఇచ్చి ఆ బిడ్డకు తండ్రిగా యు ఫాంగ్‌కు భర్తగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు.

ఈ సమయంలోనే జపాన్ చైనా పై యుద్దం ప్రకటిస్తుంది. యుద్దానంతరం చైనా కష్టకాలాన్ని ఎదుర్కుంటూ ఉంటుంది. కొమింతాంగ్ ప్రభుత్వం, కమ్యునిస్ట్ పార్టీ నేత్రుత్వంలో రెడ్ ఆర్మీ ఇద్దరూ చైనా విముక్తి కోసం పోరాడుతుంటారు. మావో నేతృత్వంలో రెడ్ ఆర్మీ బలపడి కొమితాంగ్ సైనికులకు ఎదురొడ్డి గెలిచి దేశంపై అధికారాన్ని సాధిస్తుంది. ఈ సమయంలో కొమితంగ్ సైనికులతో సంబందం ఉందని అనుమానం ఉన్న అందరినీ దేశద్రోహులుగా నిర్ణయిస్తుంది ప్రభుత్వం. వారికి శిక్షలు విధించబడ్డాయి, కొందరు చంపివేయబడ్డారు. బావో క్విన్, డీ హాంగ్ అని పేరు మార్చుకుంటుంది. ఆమెకు కొమింతాగ్ సైనికులతో పరిచయాలు ఉంటాయి. జపాన్ సైనికుల పైశాచికత్వం నుండి ఆమె కుటుంబాన్ని వారు కాపాడుతారు. వారి పట్ల ఆ కృతజ్ఞత ఆమెలో ఉంటుంది. పద్నాలుగేళ్ళ వయసులో ఆమె కమ్యునిస్ట్ పార్టీలో చేరుతుంది. ఒక కొరియర్‌గా పార్టీలో పని చేస్తూ ఉంటుంది. పార్టీతో నమ్మకంగా పనిచేస్తున్నా కొమింతాంగ్ సైనికులతో ఆమెకున్న పరిచయం ఆమెను జీవితాంతం వేటాడుతుంది.

పార్టీలో పని చేస్తూనే మరో కమ్యునిస్ట్ నాయకుడు వాంగ్ యో ను ఆమె వివాహం చేసుకుంటుంది. పార్టీ వర్కర్లుగా నియమాలను పాటిస్తూ ఆ దంపతులు చాలా బాధ్యతతో పార్టీకి సేవలు అందిస్తారు. ఎన్నో మానసిక శారీరిక కష్టాలకు గురి అవుతారు. తమ జీవితంలో అన్ని సమయాలలో పార్టీకే మొదటి ప్రాధాన్యత ఇచ్చి నడుచుకుంటారు. భర్తతో కలిసి ఉన్న సమయం కూడా చాలా తక్కువ. పుట్టిన ఐదుగురు పిల్లలను దేశానికే అప్పజెపుతారు. పిల్లలు వేరు వేరు సంరక్షణ కేంద్రాలలో పెరుగుతారు. ఒకే కప్పు క్రింద ఆ కుటుంబం జీవించాలని ప్రయత్నించిన ప్రతిసారీ పార్టీ అధికారులు వారిని ఎన్నో ఇంటర్వ్యూల చేసి మానసిక హింసకు గురి చేస్తారు. పెద్దలను డెటెన్షన్ సెంటర్లకు పంపిస్తారు. సొంత దేశంలో సొంత పార్టీలో ఎంతో నిబద్ధతతో వ్యవహరించినా విపరీతమైన మానసిక హింసకు గురి అవుతుంది ఈ కుటుంబం.

మావో దేశ ప్రగతి కోసం కొన్ని ప్రయోగాలు పెద్ద ఎత్తున చేపడతాడు. స్టీల్ తయారీ, రైట్ ఆలోచన నిర్మూలన, సాంస్కృతిక విప్లవం, వీటన్నిటి కారణంగా దేశంలో అల్లకల్లోల పరిస్థితులు కలుగుతాయి. విపరీతమైన ఆహార కొరత ఏర్పడి లక్షల సంఖ్యలో ప్రజలు మరణిస్తారు. పార్టీ నియంతృత్వం భరించలేక ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటారు. దేశంలో పరిస్థితులు ఎంత దారుణంగా తయారవుతాయి అంటే చంటి బిడ్డలను చంపి తిన్న తల్లితండ్రులు గురించి కూడా వారు వినవలసి వస్తుంది. పార్టీ అనుమానం ఉన్న వారిని, తమకు నచ్చని వారిని రైట్ వింగ్ సానుభూతిపరులుగా నిర్ణయించి ఎందరినో హత్య చేయిస్తుంది. పాఠశాలలు మూత పడతాయి. విద్యార్దులంతా రెడ్ రిబెల్స్ అవుతారు. వీరు తమకు అనుమానం ఉన్న వారిని రైట్ సానుభూతిపరులుగా నిర్ణయించి వారితో అతి క్రూరంగా ప్రవర్తించడం మొదలెడతారు. ప్రొఫెసర్లు, యాక్టర్లు, రచయితలు ఎవరయినా వ్యక్తిత్వంతో తమ సొంత ఆలోచనా పటిమతో ఆలోచిస్తే వారందరినీ దేశద్రోహులుగా నిర్ణయిస్తుంది ప్రభుత్వం. వారిని లేబర్ కాంపులకు పంపడం లేదా చంపివేయడం జరుగుతుంది. ఫామిలీ ప్లానింగ్ కోసం ప్రచారం చేస్తున్న ఒక ప్రొఫెసర్ను కూడా రైటిస్ట్ అని నిర్ణయిస్తుంది ప్రభుత్వం. దేశ జనాభా పెరుగుదల వలన కూడా కరువుని నియంత్రించలేక పోతున్నాం అన్న అతని వాదన ఎవరికీ నచ్చదు.

మావోని ప్రశంసిస్తూ ప్రతి సమావేశంలో ఇచ్చే స్లోగన్ల సాంప్రదాయం జంగ్ తండ్రికి నచ్చదు. ఎన్నో సంవత్సరాలుగా కమ్యునిస్ట్ పార్టీతో పని చేస్తున్న అతనికి ఈ నినాదాల గోల వ్యక్తిగత సోత్కర్షగా అనిపిస్తుంది. ఇది నిజమైన కమ్యునిస్టు నియమాలకు వ్యతిరేకమని అంటాడు అతను. అందుకని అతన్ని కూడా తిరుగుబాటుదారుడిగా ముద్ర వేసి లేబర్ కాంపుకు ప్రభుత్వం పంపిస్తుంది. కమ్యునిస్టు సిద్దాంతాలను నమ్మిన అతను మావోకి స్వయంగా ఒక లేఖ రాస్తాడు. అతన్ని జైలులో పెట్టి దారుణంగా హింసిస్తుంది ప్రభుత్వం. అవి తట్టుకోలేక మానసికంగా బలహీనపడి అతని మతి భ్రమిస్తుంది. అతన్ని స్కిజోప్రేనియా రోగస్తుడిగా ప్రభుత్వం ముద్ర వేస్తుంది. ఒంటరిగా మానసికంగా చనిపోయి అవమానింపబడి అతను మరణిస్తాడు. ఏ కమ్యునిజాన్ని అతను జీవితాంతం నమ్ముకున్నాడో అదే కలుషితం అయిపోయి నియంత్రుత్వంలోకి మారడం అతను తట్టుకోలేకపోతాడు. అతని మరణం తరువాత ప్రభుత్వం అతని పై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని అతను నిజాయితీ పరుడని ప్రకటన విడుదల చేస్తుంది.

మావో మరణం తరువాత జంగ్ చాంగ్ చైనా వదిలి బ్రిటన్ వెళ్ళిపోటుంది. ఇంగ్లీష్ భాషను అభ్యసించడానికి స్కాలర్షిప్ సంపాదించుకుంటుంది. బ్రిటన్ లోనే పౌరసత్వం తీసుకుంటుంది. ఆమె ముగ్గురు సోదరులు కూడా పశ్చిమ దేశాలకు వెళ్ళిపోతారు. కేవలం ఒక అక్క మాత్రమే చైనాలో ఉండిపోటుంది. కమ్యునిస్ట్ దేశంలో ప్రజల కష్టాలను నియంతలుగా మారిన ఆ దేశ నాయకుల పాలనలో వారు అనుభవించిన హింసను ప్రపంచానికి పరిచయం చేసిన నవల ఇది. చాలా సంఘటనల వాస్తవ రూపాన్ని ప్రపంచం ముందుకు తెచ్చే ప్రయత్నం చేసారు రచయిత్రి. 530 పేజీలున్న ఈ నవల మావో పాలనలో, అతని నేతృత్వంలో జరిగిన ప్రయోగాల వెనుక ఉన్న హింసను గురించి చాలా సమాచారం ఇస్తుంది. ఈ నవల తెలుగులో “అడవి గాచిన వెన్నెల” అనే పేరుతో అనువాదం అయ్యింది.

ఈ ఆత్మకథ ఆధారంగానే రంగనాయకమ్మగారు “కమ్యునిస్టు పార్టీ ఎలా ఊండకూడదు” అనే ఒక ఆలోచనాత్మక పుస్తకాన్ని రచించారు. దాని ఆధారంగా ఈ పుస్తకంలో చర్చించిన సంఘటనలన్నీ వాస్తవాలని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది రచయిత్రి ఇంగ్లీషులో రాసారు. చైనా భాషలోకి కూడా ఇది అనువాదం అయ్యింది. కాని దీన్ని చైనాలో బాన్ చేసారు. చైనా భాషలో ఈ పుస్తకం హాంగ్‌కాంగ్, తైవాన్ దేశాలలో మాత్రమే దొరుకుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here