Site icon Sanchika

విల్లీ

[మాయా ఏంజిలో రచించిన ‘Willie’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]

(ఎవరికీ ఎక్కువగా తెలియని, వికలాంగుడైన ఒక వ్యక్తి నుద్దేశించి రాసిన కవిత. అవిటితనం శరీరానికే గాని మనసుకు ఎంత మాత్రమూ కాదని ఈ కవిత తెలుపుతుంది. విల్లీని అంకుల్ విల్లీగా తన ఆత్మకథల్లో సంబోధించేది మాయా.)

~

[dropcap]ఎ[/dropcap]లాంటి కీర్తి ప్రతిష్ఠలు లేని
మనిషొకడుండేవాడు – విల్లీ అని
అరుదుగా ఏ కొందరికో అతని పేరు తెలుసు
ఎప్పుడూ కుంటుతూ ఈడుస్తూ నడిచే వికలాంగుడు
నేనిలాగే వుంటాను
నేనిలాగే సాగుతుంటాననేవాడు

ఏకాంతం అతని చుట్టూ ఆవరించి ఉండేది
పడక మీద శూన్యమే అతనికి తోడు
తడబడే అతని అడుగుల్లో
అంతులేని నొప్పి ప్రతిధ్వనించేది
నాయకులందరి అడుగుజాడల్లో
నేను నడుస్తా.. వారిని అనుసరిస్తాననేవాడు

నేను ఏడవచ్చు
చనిపోనూ వచ్చు
నా కొరకు చూస్తే
మీకేం కనిపిస్తుందో చూడండి
ప్రతి వసంతంలోను నా ఆత్మ
తిరుగాడుతునే ఉంటుంది,
పిల్లలందరి కేరింతల్లో నేనుంటాననేవాడు

ప్రజలు మామా అని
బాబూ అని
ఓయ్ అని పిలుస్తూ
నువ్విక ఒక్కరోజు కూడా బతకబోవని అనేవారు
చిన్నపిల్లలాడే ఆటలన్నిట్లో నేను బతికేఉంటానని
అతడిచ్చే బదులు వినడానికి వారు ఎదురు చూసేవారు

అతడనేవాడు..
మీరు నా నిదురలోకి చొరబడవచ్చు
నా కలల్ని దొంగిలించవచ్చు
నా ఉషోదయ సమయాలను భయపెట్టొచ్చు
అచ్చంగా వేసవి సమీరం లాగానే
నేనిలాగే నడుస్తాను
నవ్వుతాను, ఏడుస్తాను
నాకోసం వేచి ఉండండి
నాకోసం చూడండి
నా అంతరంగం బహిరంగ సముద్రపు ఉప్పెన
నాకోసం చూడండి
నన్నడగండి చెబుతా
శరదృతువులోని ఆకుల గలగలని నేను

సూర్యుడుదయించే వేళ
నేను కాలాన్ని!
చిన్నారులు పాడేవేళ
నేనా పాటకి లయని!!

~

మూలం: మాయా ఏంజిలో

అనువాదం: హిమజ


Malcolm X హత్యతో మాయా బాగా కుంగిపోయింది. అతని ఆసరాతో ఆఫ్రికన్ ప్రజలకి ఎంతో మేలు చేయాలనుకున్న ఆమె ఆకాంక్షలు హతాశమైపోయాయి. తన అన్నతో కలిసి ఎక్కడైతే తను గాయనిగా కెరియర్ మొదలు పెట్టిందో అక్కడికి Hawaii కి చేరుకుంది. మరికొంత కాలానికి తన రచనా వ్యాసంగాన్ని సీరియస్‌గా తీసుకొని కృషి చేసేందుకు గాను Los Angeles కి మారిపోయింది. అక్కడే ఎన్నో నాటకాలను రచించి, అందులోని పాత్రలనూ పోషించింది. మార్కెట్ రీసెర్చర్‌గా Watts లో పనిచేస్తున్నప్పుడే ఆ వేసవిలో ఆఫ్రికన్లపై జరిగిన దాడులకు (1965) ప్రత్యక్ష సాక్షిగా ఉంది. 1967 లో తిరిగి న్యూయార్క్ చేరుకుంది. అక్కడ కలిసిన Rosa Guy ఆమె జీవితకాలస్నేహితుడిగా ఉండిపోయాడు.

ఉద్యమ రచయిత James Baldwin 1950లో తిరిగి పారిస్‌లో కలిసాడు. అతన్ని ఈసారి my brother అని పిలిచింది మాయా. ఆఫ్రికన్ ప్రజల శ్రేయస్సు కోరుకునే వారిద్దరి మధ్య మంచి అవగాహనతో కూడిన స్నేహం మరింత బలపడింది. మాయా మరో స్నేహితుడు Jerry Purcell ఆర్థికంగా బాసటగా నిలబడడం వలన ఆమె రచనా వ్యాసంగం నిరాటంకంగా కొనసాగింది.

1968 లో Jr. Martin Luther King మాయాని ఒక ‘మార్చ్’ నిర్వహించమని కోరాడు. మాయా అంగీకరించింది కానీ కొంతకాలం వాయిదా వేసింది. అనుకోని విధంగా Jr. King మాయా 40వ పుట్టినరోజు నాడే హత్యకు గురయ్యాడు.

Exit mobile version