[dropcap]ఆ[/dropcap][dropcap][/dropcap]ధునిక కవిత్వం యీనాడు యువత చేతిలో విభిన్న కోణాలలో రూపు దిద్దుకుంటోంది. అరుదైన పార్శ్వాలను స్పృశిస్తోంది. ఆయా పార్శ్వాలలోని మూలాలను శోధించి, సమస్యలను మథించి వాటికి తమదైన శైలిలో పరిష్కార దిశగా సూచనలిస్తూనే, సమాజాన్నీ, అందులో తమకు అన్యాయం చేసిన వర్గాలని వేలెత్తి మరీ ప్రశ్నిస్తోంది. దానికి తోడు అనేక కుల, జాతి, మత, వర్ణాలున్న మన దేశంలో ఏదో ఒక వర్గానికి అన్యాయం జరుగుతూనే ఉంది. న్యాయం డబ్బున్నవాడి చుట్టమై, వారికి కొమ్ము కాసే అధికార వర్గం చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుని పాక్షిక న్యాయానికి ఒడిగట్టడంతో పేదలు, మధ్యతరగతివారు సమిధల్లా మాడిపోతూ బ్రతుకులు చాలిస్తున్నారు.
మరీ ముఖ్యంగా పురుషాధిక్య సమాజంలో ప్రజాస్వామ్యం పేరుతో అతి స్వేచ్ఛగా సంచరిస్తూ, అన్ని వర్గాల స్త్రీలకు స్వేచ్ఛ యిస్తున్నామనే నెపంతో దారుణాతి దారుణంగా వారి హక్కులను కాలరాస్తున్నారు. అవసరమైతే అవకాశం చూసుకుని వారి జీవిత కుసుమాలను నిర్దాక్షిణ్యంగా నలిపేస్తున్నారు.
యిటివంటి పరిస్థితులలో గత కొన్ని సంవత్సరాలుగా, తామేంటి, తమ జీవన విధానం ఏమిటి? అని నిర్ణయించుకోలేక, సమాజంలో అధికార యంత్రాంగం నుంచి కన్న తల్లిదండ్రుల వరకు అందరిచేత నిరసింపబడి ఒక ప్రత్యేక వర్గంగా మిలిగిపోయి, జీవచ్ఛవాల మాదిరి బ్రతుకీడుస్తూ బ్రతుకున్నవారే అటు స్త్రీ, యిటు పురుషుడు కాని మూడో రకం వ్యక్తులు ట్రాన్స్‌జండర్స్. యీనాటి సమాజంలో తమ హక్కుల కోసం పోరాడుతూనే భిక్షాటనం చేసుకుని జీవిస్తున్న ఈ వర్గం వారు అవకాశం యిస్తే తామూ అన్ని రంగాలలో తమ ప్రతిభను చాటుతామని నినదిస్తున్నారు. తమకు ఆపన్న హస్తం అందించి, తమను ఆదరించే ఒక విశాల సహృదయత కోసం పరితపిస్తున్నారు.
అటువంటి వారి జీవన గతులను పరిశీలించి, పరిశోధించి, వారి బాధను తనదిగా భావించి, వారి సమస్యలను సమాజానికి ఎత్తి చూపుతూ ఆధునిక సమాజాన్ని తనదైన శైలిలో, ఆధునిక కవిత్వంతోనే ప్రశ్నించిన వ్యక్తి చిరంజీవి శ్రీ జాని బాషా చరణ్ తక్కెడశిల.
ఒకరి బాధను అర్థం చేసుకోవాలంటే వారి కోణంలో ఆలోచించి, వారే తానుగా ఆ బాధను అనుభవిస్తేనే మానవీయ కోణంలో ప్రతిస్పందించగలం. అటువంటి ఉత్తమ బాధ్యతను తన కనీస బాధ్యతగా స్వీకరించి “సమాజంలో మేము ఎందుకు? ఎలా బ్రతకాలి? ‘వై'” అని వారి తరఫున సమాజాన్ని దీర్ఘకవిత రూపంలో ప్రశ్నిస్తున్నారు.
కొన్ని చోట్ల తమకు తాము సమాధాన పడుతూనే తమ అంతరంగాల అట్టుడుగున పొరల్లోని లావా లాంటి ఆవేదనకు మీ బదులేమిటి? అని ఎలుగెత్తి సంఘటితంగా ప్రశ్నిస్తున్నారు. ముప్ఫై రెండు కవితలుగా రాసిన ఈ దీర్ఘ కావ్యం కాలక్షేపం కోసం కాకుండా, కవితాత్మ హృదయంతో చదివితే శ్రీ జాని గారి కవితల ద్వారా బాధితుల హృదయ ఘోష అవగతమయ్యే అవకాశము ఉంది.
మొదటి కవితలోనే కొందరి జీవితాలు ఉన్నత స్థాయిలో ఉన్నాయని, మరికొందరి జీవితాలు అథమ స్థాయిలో ఉన్నాయని చెబుతూనే, ఏ స్థాయీ లేని కొందరు –
“మరి మేమూ
గగనానికి… పుడమికి మధ్య
వ్రేలాడుతున్నాము…” అని నిర్వేదంగా తమ మధ్య స్థాయిని గుర్తు చేస్తారు.
తమలోని లోపాలను తామే గుర్తించి ఏమీ చేయలేని అసహాయతలో
“మాలో మేము
తొంగి చూసుకున్నప్పుడు
తనువులోని అణువణువు మగాడిదే
కానీ…
హృదయపు సంద్రంలో
కెరటాల ఆలోచనలన్నీ
స్త్రీతనం వైపు పరుగులిడుతుంటే –
అపుడే మాకర్థమౌతుంది –
మేమొక చీకటి ఆడపిల్లలమని!” అని వాపోతారు.
కన్నవారు, సమాజంలోని ప్రజలు అన్ని విధాలుగా చీదరించుకుని వెలివేస్తే –
“మగతనాన్ని గుమ్మాన వదిలేసి
ఆడతనాన్ని అస్యహించుకున్న శరీరాలతో
సమాజంలోకి అడుగుపెట్టాము-” అని విధి లేని పరిస్థితులలో కుటుంబ వ్యవస్థను కాదని ఒంటరిగా బ్రతికేందుకు సిద్ధమౌతూ సమాజంలోకి అడుగుపెట్టవలసి వచ్చిన ఆవశ్యకతను వ్యక్తం చేస్తారు.
చివరకు సమాజంలో తమలాంటి వారే తమను ఆదుకున్నారని సగర్వంగా చెబుతూ –
“మా కోసం పోరాడే కొన్ని దేహాలు
మేఘాలకు చిల్లులు వేసి దూకితే
అందులో తడిసిన మా ఆలోచనలు
పచ్చని చొక్కాలు తొడిగి మొలకెత్తుతాయి” అంటూ జీవితంపై తమకు గల ఆశ మొలకెత్తుతుందని, తమ పోరాటంలో గెలిచి నగ్న సమాజాన్నే నడిపే శక్తి తమలో ఉందని నిరూపించగలమన్న ధీమా వ్యక్తం చేస్తారు.
అయితే సమాజంలోకి అడుగుపెట్టిన క్షణమే తాము మృగాళ్ళ చూపులకు చిక్కామని, కాలంతో పాటు పరుగులు తీస్తున్న తమను ఆ కామాంధులు కాటేశారని చెబుతూ వారి నీచ నికృష్ట చర్యని మనసున్న మనిషి గుండెల్లోకి యిలా ఒంపుతున్నారు:
“ఒకనొక గంటలో
ఆ నీచపు అంగాలు
మా శరీరంలో చొచ్చుకుపోవడంతో…
మా దేహమంతా
రకతం ఏరులై పారుతుంటే…”
పై కవిత చదువుతుంటే మానవత్వం ఉన్న హృదయపు రక్తం మరిగిపోయి ఆర్ద్రతను స్రవిస్తుందని చెప్పక తప్పదు. అయితే యిహలోకపు దేవతామూర్తులుగా కీర్తింపబడే వైద్యులే తమ వైద్యం చేయడానికి నిరాకరించినప్పుడు వారి రోదన ఎవరు ఆలకిస్తారు? అని ప్రశ్నిస్తూనే తమకు ఎవరు ఎంత అన్యాయం చేసినా సమాజ హితమే తాము కోరతామని చెబుతున్నారు.
“అక్షరాలు మా మస్తిష్కంలో
నిక్షిప్తం కాకపోయినా
ఆశీసుల మంత్రాలు
మా నాలుకలపై
తాండవం చేస్తూనే ఉంటాయి” అంటాడు కవి వారి పక్షాన నిలబడి.
“నువ్వు హిజ్రా, కొజ్జా, జాకో,
పాయింట్ ఫైవ్, చెక్క, ఆడంగి వెధవవి
రకరకాలుగా పిలిచి
పసిరెక్కలను విరిచి
మూలన విసిరేస్తే
ఈ నవీన కోరికల కామాంధులు
రెండు ముఖాలు తగిలించుకుని తిరుగుతుంటే
వారి కన్నా మేము మేలని
సన్నగా నవ్వుకున్నాము” అని ఏడవలేక నవ్వుతారు వారు.
సమాజంలో అనుక్షణం వివక్షతకు గురవుతూ, బ్రతికే దారిలేక, ఎలాగైనా బ్రతకాలన్న కోరికతో, వేరే దిక్కు లేక, స్త్రీతనపు వాంఛను ఎరగా వేసి శరీరాన్ని అమ్ముకుంటున్న మాకు
“ఇపుడు మరొక శిల్పి కావాలి!
అనవసర ముక్కలను కోసేసి
శిల్పాన్ని చేసే ఒక శిల్పి కావాలి!” అని తమను అలా మలిచే మానవత్వపు శిల్పి కోసం మా నిరీక్షణ అంటూ నినదిస్తున్నారు వారు.
ఈ సమాజంలో ఒక స్త్రీకి అన్యాయం జరిగితే మహిళా సంఘాల ప్రతినిధులు, చైతన్యవంతులు ధర్నాలు, ర్యాలీలు చేసి సంచలనం సృష్టిస్తారే!
“అదే స్త్రీ తత్వాన్ని
మా శరీర గర్భంలో
నింపుకున్న మాకు
న్యాయం ఉండదు ఎందుకో!
అడుగడుగునా వివక్షే!” అని గుండెలవిసేలా ఆక్రోసిస్తూ –
“మరి మాకేవీ?
స్త్రీ పురుష సమాన హక్కులు?
మాకేవీ రిజర్వేషన్స్?” అని కదం తొక్కుతూ ప్రశ్నిస్తున్నారు.
బిడ్దలకు ఏ కష్టం వచ్చినా తల్లి తన గుండెలో దాచుకుంటుంది! ఆమెను మించిన ప్రేమమూర్తి యీ ప్రపంచంలో ఎవరూ లేరు. కన్న తల్లిదండృలే తమను నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటివేసారు. యిపుడు బ్రతుకుతున్న యీ బ్రతుకులో తమకు ఆనాటి ప్రేమమూర్తి కావాలని….
“బంధాల తేనె తుట్ట నుండి
కాస్త అమ్మ ప్రేమను
సేకరించి ఇవ్వగలరా?” అని జాలిగా అర్థిస్తూనే –
“చిట్లిన మా బంధాల వేళ్ళు అతికిస్తే
ఒంటరితనాన్ని
మా దేహాల నుండి కక్కేస్తాము” అని తాము ఒంటరితనంతో ఎంతగా అలమటించి పోతున్నారో తెలియజేస్తారు వారు.
ప్రస్తుత సమాజమంతా యంత్రాల మయం. యంత్రాలను కనుగొని వాటిని సక్రమంగా పనిచేయించడానికి మనిషి తాను కృత్రిమ యంత్రమవుతున్నాడు. అలాంటి మనుషులున్న సంఘంలో –
“మనుషులు యంత్రాలైనప్పుడు –
చెమట ముద్దలను
ఎందుకు గుర్తిస్తారు?” అని ప్రశ్నిస్తూనే –
ఏ న్యాయ పోరాటం చేసినా, అలా చేసిన వారిని గెలుపు తప్పనిసరిగా వరిస్తుందన్న ఆశా భావపు నమ్మకాన్ని తమ విజయంగా భావిస్తూ –
“నేడో రేపో
గెలుపు
మా నెత్తిపై
తాండవిస్తుందిలే!”అ ని దృఢంగా పలికారు చివరి కవితలో.
ఎన్ని కవితలలో ఒకే రకపు భావాలు విభిన్న పదగుంభనలతో రచించిన కవి కృషి ప్రశంసనీయం. అయినప్పటికీ, మానవత్వం ఉన్న ప్రజాప్రతినిధులు, తమకు వారు ప్రశ్నిస్తున్న ప్రాథమికంగా జీవించే హక్కును అవగాహన చేసుకుని ప్రభుత్వాల సహకారంతో వారికి సముచిత న్యాయం చేసి వారికి చేయూతనందించినపుడు రచయిత చేసిన ప్రయత్నం పూర్తి సఫలీకృతమవుతుంది.
***
రచన: జాని బాషా చరణ్ తక్కెడశిల
పుటలు: 67
వెల: రూ. 150
ప్రతులకు: జాని బాషా చరణ్ తక్కెడశిల
3-4-173-A, శివాలయం వీధి,
పులివెందుల, వైఎస్‌ఆర్ కడప జిల్లా 516390
ఫోన్: 9491977190
ఇతర ప్రముఖ పుస్తక కేంద్రాలు.