యాదోం కీ బారాత్ -1

0
2

[box type=’note’ fontsize=’16’] ‘యాదోం కీ బారాత్’ పేరిట తన అనుభవాలను, జ్ఞాపకాలను పాఠకులకు అందిస్తున్నారు శ్రీ వారాల ఆనంద్. [/box]

సామాజిక పోరాటాలూ – ఉన్నత చదువులు – యూనివర్సిటీలో చేరిక

[dropcap]నా[/dropcap]కు తెలిసి నేను మధ్య తరగతి జీవిని. పట్టణ వాసన వున్న వాణ్ని. చాలా వాటిని ప్రేమించాను, అభిమానించాను, ఆరాధించాను, ప్రేరణ పొందాను. కానీ అందులోకి దిగలేదు, కాళ్ళకు మట్టి అంటలేదు, ఒంటికి సురుకూ అంటలేదు. కానీ నేను నా విశ్వాసాల్ని, ప్రేమల్ని అభిమానాన్ని అట్లే ఉంచుకున్నాను. మారలేదు. నమ్మిన దానికి ఎప్పుడూ వ్యతిరేకమయితే కాలేదు. శత్రువుగానయితే మారలేదు. బహుశా నేను నమ్మింది మనసా వాచా అనుసరించింది ఇదే.

పేర్లెందుకు గానీ కొందరు నాకు మిత్రులే ఒకప్పుడు ఏమి చెప్పారు? ఎట్లా వున్నారు? ఎంతమందిని చైతన్య పరిచారు? ఇప్పుడు ఎక్కడ వున్నారు? ఏం చేస్తున్నారు? చూస్తూ వుంటే ఆలోచిస్తే చాలా బాధగా వుంటుంది. సరే కాలం గడిచిన కొద్దీ వయసు పెరిగిన కొద్దీ మార్పు సహజమే అనుకున్నా.. వారిలో కొందరు ఇప్పటికీ గత చరిత్ర గురించే చెప్పుకోవడం.. దాని వెలుగుననే చెలామణీ అయ్యేందుకు ప్రయత్నించడం చూస్తే చాల కష్టం కలుగుతుంది. చూస్తూ వుండడం తప్ప ఏం చేయగలం…

***

నేను డిగ్రీ చదువుతున్న కాలంలోనూ తర్వాత ఖాళీగా వున్న ఏడాదిలోనూ ఉస్మానియా కాంపస్‌లో చేరిన కాలంలోనూ సామాజికంగా అనేక మార్పులు జరిగాయి. 69 ప్రత్యేక తెలంగాణా ఉద్యమం, 1975లో ఇందిరా గాంధీ పాలనలో దేశంలో ఎమర్జెన్సీ దాని ప్రభావాలూ చూసాం. కాలేజీల్లో, యూనివర్సిటీల్లో కదలిక మొదలైంది. ఆలోచన ఆరంభమయింది. ఆందోళనా షురూ అయింది. అంతే కాదు, అప్పటిదాకా కల్లా కపటం తెలీని తెలంగాణా పల్లెలు క్రమంగా చైతన్యం సంతరించుకోవడం ఆరంభించాయి. ఉత్తర తెలంగాణా అందులో ముఖ్యంగా మా కరీంనగర్ జిల్లా పల్లెలు అప్పటిదాకా వున్న పల్లెల్లా లేవు. పచ్చగా లేవు. అప్పటిదాకా ఆవి నిజాం కాలంలో దేశ్‌ము‌ఖ్‌లు, జమీందార్లు తర్వాత దొరల పాలన దౌర్జన్యాలను చవిచూసాయి. తర్వాత దొరల ఆగడాలను ప్రశ్నించే వారిని హింసించేవారు. గ్రామ పెద్దలు పంచాయితీలు నిర్వహించి ఇష్టానుసారం తీర్పులు చెప్పి దడువతులు (డిపాజిట్లు) కూడా తిరిగి ఇచ్చేవారు కాదు. తీర్పులు ఎట్లున్నా అడిగే స్థితి వుండేది కాదు. వెట్టి చాకిరీ సర్వ సాధారణం. ఇట్లా అనేక అష్ట కష్టాలు పడుతున్న పల్లెల్లో క్రమంగా చలనం మొదలయింది అప్పుడే. 75 ఎమర్జెన్సీకి ముందే ప్రారంభమయినప్పటికీ అత్యవసర చట్టం అమలులో వున్న కాలంలో రహస్యంగా నడిచిన కార్యకలాపాలు ఎమర్జెన్సీ ఎత్తేసాక ఉద్రుతం అయ్యాయి. మా కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా రెండు గ్రామాలు ప్రధాన వేదిక లయ్యాయి. అవి సిరిసిల్లా తాలూకా లోని నిమ్మపల్లి, జగిత్యాల తాలూకా లోని మద్దునూరు. ఆ గ్రామాల్లో ఏర్పడ్డ రైతుకూలీ సంఘాలు దేశం లోనే సంచలనం సృష్టించాయి. పట్టణాల్లోనూ నగరాల్లోనూ వున్న యువకులు విద్యార్థులు అనేక మంది ‘గ్రామాలకు తరలండి’ (GO TO VILLAGE CAMPAIGN) అన్న పిలుపు నందుకుని పలు గ్రామాలకు చేరారు. పాలేర్ల జేతాలు పెంచాలని, వ్యవసాయ కూలీ రెట్లు పెంచాలని అంతా ఐకమత్యంగా పోరాటం ఆరంభించారు. జగిత్యాల ప్రాంత ఉద్యమం 9 సెప్టెంబర్ 1978 రోజు నాటికి ‘జైత్రయాత్ర’ స్థాయికి చేరింది. జగిత్యాల పట్టణంలో పాత బస్‌స్టాండ్ పక్కనే వున్న డిగ్రీ కాలేజీ మైదానంలో రైతుకూలీ సంఘం నేతృత్వంలో భారీ బహిరంగ సభ ఊరేగింపు నిర్వహించారు. జగిత్యాల జైత్రయాత్ర పేర ప్రసిద్ది పొందిన ఆనాటి కార్యక్రమం మొత్తం నక్సలైట్ ఉద్యమానికి గొప్ప ప్రేరణగా నిలిచింది.

ఇవన్నీవింటూ వాటి గురించి తెలుసుకుంటూ వుండేవాళ్ళం. జైత్త్రయాత్ర ప్రేరణతో అలిశెట్టి ప్రభాకర్ లాంటి కవులు ఎదిగారు. 78-79 ప్రాంతం లోనే నేనూ మా మిత్రుడు డి.వెంకటేశ్వర్ రావు కలిసి కవిత్వం మీద అభిమానంతో జగిత్యాల వెళ్లి అలిశెట్టిని తన పూర్ణిమా స్టూడియోలో కలిసాం. కలిసింది మొదటి సారే అయినా ఎంతో ఆప్యాయంగా స్నేహంగా మాట్లాడుకున్నాం. తర్వాత మా స్నేహం చాలా ఏళ్ళపాటు సాగింది. కలిసి కవిత్వం రాసాం. తర్వాతి కాలంలో జింబో, వజ్జల, పి.ఎస్.రవీంద్ర, నేనూ, అలిశెట్టి కలిసి ‘లయ’ కవితా సంకలనం వేసాము. ఇదిట్లా వుంటే ఎమర్జెన్సీ రోజుల్లో సిరిసిల్లకు చెందిన కొందరు కవులు ఇందిరా గాంధీ 20 సూత్రాల పథకాన్ని కీర్తిస్తూ రాసారు. వాటితో సంకలమూ ముద్రించారు. దాని పై చాలా విమర్శలు వచ్చాయి. అది వేరే విషయం.

***

వేములవాడలో మరో మరపురాని సంఘటన అప్పటి గవర్నర్ శ్రీమతి శారదా ముఖర్జీ పర్యటన. వేములవాడ గొప్ప శైవక్షేత్రం కనుక మొదటినుంచీ ప్రముఖుల రాకపోకలు ఎక్కువే. అందులో భాగంగానే 78లో ఒక రోజు అప్పటి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ శ్రీమతి శారదా ముఖర్జీ పర్యటన ఏర్పాటు అయింది. వేములవాడలో సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి పోలీసు స్టేషన్ ఉండేది. సిరిసిల్ల సర్కిల్ స్థాయి, జగిత్యాల డివిజన్(డీ.ఎస్.పీ) స్థాయిలో వుండేది. గవర్నర్ పర్యటన కనుక భారీగానే బందోబస్తు ఏర్పాటు అయింది. మేమంతా ఎప్పటిలాగే ఉదయమే గుడి ముందుకు వెళ్లి తర్వాత వెంగయ్యను కలిసి హోటల్లో టీ తాగే కార్యక్రమంలో వున్నాం. గవర్నర్‌ను వీలయితే చూడాలనీ అనుకున్నాం. ఇంకో వైపు గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా రైతు కూలీ సంఘం నేతృత్వంలో చలపతి రావు తదితరులు వందలమంది రైతులతో సహా గుడి ముందుకు చేరుకున్నారు. గవర్నర్ దైవదర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత విషయం తెలుసుకుని ‘బేటా ఇదర్ ఆవో’ అని నాయకుణ్ణి పిలిచి వినతి పత్రం తీసుకుంది. తర్వాత ఆమె వెళ్ళిపోయింది. అంతా ప్రేక్షకుల్లా చూస్తున్న మేమంతా ఇళ్ళకు బయలుదేరాం. ఇట్లా ఇండ్లకు చేరామో లేదో ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఏమయిందో స్పష్టంగా తెలీదు కాని గవర్న వెళ్లి పోగానే పోలీసులు లాఠీ చార్జ్ చేయడం మొదలు పెట్టారు. అంతేకాదు కనిపించిన వాళ్ళను కనిపించినట్టు దుకాణాదార్లతో సహా వీరు వారని లేకుండా కనించినవాణ్ని కనిపించినట్టు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. స్టూడియోలో వున్న మా మిత్రుడు వెంగయ్యను కూడా అరెస్ట్ చేసారు. మేమంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాం. రెండు నిముషాలు గుడి దగ్గర ఆగి వుంటే మా పరిస్థితీ అంతే. దెబ్బలు తిన్నవాళ్ళు తీవ్రంగా తిన్నారు. స్టేషన్‌లో పెట్టిన వాళ్ళను మర్నాటికి గానీ విడిచిపెట్టలేదు. అట్లా గవర్నర్ పర్యటన బాధాకరమయిన జ్ఞాపకంగా మిగిలిపోయింది.

***

ఈ నేపథ్యంలో నేను హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లైబ్రరీ సైన్స్‌లో చేరాను. అడ్మిషన్ పూర్తి కాగానే అప్పటికే హైదరాబాద్‌లో మోజం జాహీ మార్కెట్ ప్రాంతంలో రూము తీసుకుని ఉంటున్న బావ మంగారి శివప్రసాద్ రూముకు చేరుకున్నాను. తను అప్పుడు మసాబ్ టాంక్ పాలీటెక్నిక్ కాలేజీలో చదువుతున్నాడు. జింబో కూడా అప్పటికే కొంత కాలంగా అక్కడ వున్నాడు. పక్క రూములో విజయకుమార్, అశోక్ కుమార్ అనే ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు వుండేవారు. తర్వాత అంతా మంచి స్నేహితులమయ్యాం. ఉస్మానియాలో హాస్టల్ వసతి ఏర్పడే దాకా అక్కడే వున్నాం. జింబోకి ఉస్మానియా లా కాలేజీలో సీటు వచ్చింది. తనకు వెంటనే ‘ఈ’ హాస్టల్‌లో వసతి ఏర్పాటయింది. నాకు ఆర్ట్స్ కాలేజీ కనుక ఎ హాస్టల్‌లో రూముల్లేక పోయాయి. దాంతో వుండడానికి వసతి లేదు. మెస్ ఇచ్చారు. బాగా ఇబ్బందిగా వుండేది. అప్పుడు జింబో వాళ్ళ రూము 28 లోనే గెస్ట్‌గా వున్నాను. నేనూ జింబో, కరీంనగర్‌కే చెందిన నలిమెల వీరేశం, భోంగిర్‍కి చెందిన దామోదర్ రెడ్డిలము రూములో వుండేవాళ్ళం. లైబ్రరీ సైన్స్ క్లాసులు కూడా ఆర్ట్స్ కాలేజీలో రూముల్లేక ‘డి’ హాస్టల్ లో వున్న చివరి గదుల్లో నడిచేవి. చాలా అనామకంగా అనిపించేది. పేరుకు యునివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులం కానీ ఎక్కడో షెడ్డుల్లో మా క్లాసులు, ఘోరంగా వుండేది. కానీ ఏమి చేయగలం. డిపాట్మెంట్‌లో ఆచార్యులుగా ఏ.ఏ.ఎన్.రాజు, వేణుగోపాల్, ఎం. లక్ష్మన్ రావులు క్లాసులు చెప్పేవారు. రాజు సర్ డిపార్ట్మెంట్ హెడ్, వేణుగోపాల్ సర్ కొంత సీరియస్‌గా వుండేవారు. లక్ష్మణ్ రావు సర్ సరదాగా స్టూడెంట్స్ తో స్నేహంగా వుండేవారు. సబ్జెక్ట్ అంతా కొత్త. క్లాసిఫికేషన్, కాటలాగింగ్, బిబిలియోగ్రఫీ, ఇట్లా వుండేది. మొదట్లో అంతా గందరగోళం. తర్వాత సర్దుకుంది. క్లాసులో ముప్పై మంది విద్యార్థులం. ముగ్గురు అమ్మాయిలు హన్నా సునీత, లక్ష్మిశకుంతల, మరొకరు. మిగతా అంతా అబ్బాయిలమే. ఇంతలో కాలేజీ ఎన్నికలొచ్చాయి. యూనివర్సిటీ మొత్తం విద్యార్తి రాజకీయాలతో అట్టుడికి పోతూ వుండేది. కాంపస్ లోని వివిధ కాలేజీలు వివిధ విద్యార్థి సంఘాలకు ఆలవాలంగా ఉండేవి. ఇంజినీరింగ్ కాలేజీ మరియు ఆర్ట్స్ కాలేజీ లు పీ.డీ.ఎస్.యు.కు, సైన్స్ కాలేజీ ఆర్.ఎస్.యు.కు; లా కాలేజీ ఏబీవీపీ లకు పెట్టని కోటలా ఉండేవి.

మా కాలేజే ఎన్నికల్లో పీడీఎస్‌యు మరియు ఇతర లెఫ్ట్ విద్యా సంఘాలు కలిసి పానెల్ ప్రకటించాయి. అధ్యక్ష స్థానానికి పీ.డీ.ఎస్.యు.కు చెందిన తులా రాజేంద్ర కుమార్, కార్యదర్శి స్థానానికి లక్ష్మీకాంత్ రావు నిలబడ్డారు. ప్రచారం ముమ్మరంగా సాగుతున్న సమయంలో మా క్లాస్ నుండి నూరుశాతం రాజేంద్ర కుమార్ పానెల్‌కి మద్దతుగా వున్నాం. క్లాసులో మెజారిటీ లెఫ్ట్ భావజాల మద్దతుదారులు ఉండడం ఒక కారణమయితే మరొకటి మా క్లాసులని ఆర్ట్స్ కాలేజీ భవనం లోకి మార్చాలనే డిమాండ్ మరొకటి. అట్లా రాజేంద్ర కుమార్ పానెల్ ఘన విజయం సాధించడంలో మేము ప్రధాన పాత్ర పోషించాం. ఎన్నికల ఫలితాల తర్వాత డిపార్ట్మెంట్‌ను ఆర్ట్స్ కాలేజీకి మార్చారు. క్లాసులు నడిచిన ‘డి’ హాస్టల్ రూముల్ని మాకు ఉండేందుకు కేటాయించారు. నేను సీతారాములు ఒక రూములోకి చేరాం. ఇక క్లాసులో కరీంనగర్ జిల్లాకే చెందినా గోపాల్ రెడ్డి, నర్సింగ్ రావు, డి,మనోహర్, వరంగల్ కు చెందిన సంపత్ కుమార్ రావు, రవీంద్రా చారి, ఉమాశంకర్ తదితరులం చాలా క్లోజ్‌గా వుండేవాళ్ళం. వీళ్ళల్లో చాలా మంది అప్పటికే పీజీ కోర్సులు పూర్తి చేసి వచ్చినవారు. నర్సింగ్ రావు ఎం.ఎస్సీ, మనోహర్ ఎం.ఏ ఇంగ్లీష్, ఇక ఉమాశంకర్ లాంటి వాళ్ళు ఇన్ సర్వీస్‌లో వున్నవాళ్ళు. అయితే అందరమూ ఎంతో స్నేహంగా ప్రేమగా వుండేవాళ్ళం. ఇక మనోహర్‌తో పరిచయమయిన మరో మిత్రుడు డి.దామోదర్ రావు ఇప్పుడు నమస్తే తెలంగాణా దినపత్రిక ఎం.డీ.గా వున్నాడు. ఇక గోపాల్ రెడ్డి హిస్టరీ అధ్యాపకుడిగా చేరి కొన్నేళ్ళు నాతో పాటు ఎస్.ఆర్.ఆర్.కాలేజీలో పని చేసాడు. సి.హెచ్.నరసింగ రావు కరీంనగర్‌లో ఏర్పాటయిన పీజీ సెంటర్‌లో లైబ్రేరియన్ చేరి చాలా కాలం పని చేసాడు. మనోహర్ ఇంగ్లీషు అధ్యాపకుడయి వరంగల్‌లో స్థిరపడ్డాడు. ఉమాశంకర్ వరంగల్ ప్రాంతీయ గ్రంథాలయంలో చాలా కాలం చీఫ్‌గా పనిచేసాడు. సంపత్ నేను మాత్రం మొదట వివిధ జూనియర్ కాలేజీల్లో పనిచేసి తర్వాత డిగ్రీ కాలేజీలో సర్వీస్ చేసాం. దురదృష్టం ఏమంటే గోపాల్ రెడ్డి, ఉమాశంకర్ లు అనారోగ్యం తోనూ, నర్సింగ్ రావు దొంగల దాడిలోనూ చనిపోయి దూరమయ్యారు.

……….

ఇక డీ హాస్టల్ లో వుండే కాలంలోనే జింబో క్లాస్‌మేట్ అయిన నందిగం కృష్ణారావు పరిచయం గొప్ప అనుభవం. ప్రతిభావంతుడయిన గొప్ప రచయిత నందిగం కృష్ణారావు చాల క్లోజ్‌గా ఉండేవాడు. అప్పటినుంచీ వున్న స్నేహం ఇప్పటికీ అంతే ఆప్యాయంగా సాగుగుతున్నది. ఆయన వచన రచనా శైలి ఇప్పటికీ నాకు ఎంతో ఇష్టం. అంత మంచి వ్యంగ్యాత్మక వచనం రాసే వాళ్ళు మాలో చాలా అరుదు.

………

అదే సమయంలో సికిందరాబాద్ ఎస్పీ కాలేజీలో డిగ్రీలో చదువుతున్న వేములవాడ మిత్రుడు సాంబశివుడు నా కెంతో దగ్గరయ్యాడు. తాను ఆర్ట్స్ కాలేజీ వెనకాల రైల్వే స్టేషన్ అవతల బౌద్ధ నగర్‌లో వుండే తమ మేనమామ ఇంట్లో వుండేవాడు. ప్రతి రెండు రోజులకొక సారి ఇద్దరమూ కాంపస్ లోనో, వాళ్ళ ఇంటిదగ్గారో కలిసేవాళ్ళం. వాళ్ళ ఇంటి దగ్గరయితే హోటల్ షోలా మా అడ్డా. లేకుంటే సీతాఫల్‌మండిలో వున్న మరి ఇరానీ హోటల్‌లో చాయ్ అడ్డా. ఆ హోటల్ లో మనం కోరిన పాటల్ని డబ్బులు ఇస్తే వేసేవాళ్ళు. అట్లా పాటలు వింటూ ఏవో చర్చలు చేస్తూ వుండేవాళ్ళం. అదే టైంలో సాంబశివుడు బావమరిది పూర్ణచందర్ పరిచయం కూడా.

అట్లా కాంపస్‌లో లైబ్రరీ సైన్స్ కాలంలో సాంబశివుడు నేను ఎంతో దగ్గరయ్యాం.

ఇంకా అదే సమయంలో సాహితీ మిత్రులు నందిని సిధారెడ్డి, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, మరీ విజయరావు, అంబటి సురేందర్ రాజు, గుడిహాళం రఘునాధం ఇట్లా అనేకమందితో పరిచయాలూ స్నేహాలూ కుదిరాయి…

ఆ వివరాలతో మళ్ళీ వారం కలుస్తాను..

ఇప్పటికి సెలవ్.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here