[box type=’note’ fontsize=’16’] ‘యాదోం కీ బారాత్’ పేరిట తన అనుభవాలను, జ్ఞాపకాలను పాఠకులకు అందిస్తున్నారు శ్రీ వారాల ఆనంద్. [/box]
ఉద్యోగ పర్వం – మంథని
[dropcap]జీ[/dropcap]వితంలో అనేకసార్లు ఊహించని విధంగా మలుపులు ఎదురవుతాయి. వాటిల్లో మన ప్రమేయం అసలే ఉండక పోవచ్చు. కానీ ఏం చేస్తాం, మలుపు తిరిగి ప్రయాణం కొనసాగించడమే. సరిగ్గా నాకు అట్లే జరిగింది. హాయిగా యూనివర్సిటీలో చదువుతూ హాస్టల్‌లో ప్రతి గురువారం సాయంత్రం హాఫ్ చికెన్, ప్రతి ఆదివారం ఫుల్ చికెన్ తింటూ ఏవో పోటీ పరీక్షలకు తయారవుదామనుకుంటున్న వేళ ఓ కాగితం చేతుల బెట్టి మంథనికి తరిమేశారు. ఆర్డర్ వచ్చిన తర్వాత నాలుగు రోజుల మీమాంస.. తర్వాత 18 జనవరి 1980న మంథని బస్సేక్కేసాను. గమ్మత్తుగా బస్సులో డిగ్రీలో మా జూనియర్ చెన్నారెడ్డి కలిసాడు. బాగా పాటలు పాడేవాడు. ఎటు అని అడిగితే తనకూ మంథని లోనే ‘పోస్ట్ఆఫీసు’లో ఉద్యోగం వచ్చింది అన్నాడు. కలిసి మంథని వెళ్లాం. మంథని మా కరీంనగర్ జిల్లాలోనిదే అయినప్పటికీ ఎప్పుడూ వెళ్ళలేదు. పెద్దపెల్లి దాటలేదు. మంథని గోదావరి పక్కనే వున్న వూరు. అప్పుడు మంథని అంటే బ్రాహ్మలకు పెట్టింది పేరు. అనేక మంది అక్కడి యువకులు బాగా చదువుకున్న వారని పెద్ద పొజిషన్లో ఉంటారని చెప్పేవారు. అది అసెంబ్లీ నియోజక వర్గం కూడా. అక్కడినుండే పీ.వీ.నరసింహా రావు అనేక సార్లు ఎం.ఎల్.ఏ గా గెలిచాడు. అలాంటి మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు లైబ్రేరియన్‌గా వెళ్లాను.
బస్సు దిగగానే చుట్టూ గుడిసె హోటల్లు, దుమ్ము నిండిన రోడ్లు, మట్టి మిద్దెలు వామ్మో అనిపించింది. కానీ కొంచెం ఉత్సాహం తెచ్చుకుని దగ్గరలో వున్న కాలేజీకి వెళ్లాను. సొంత భవనం లేని కాలేజీ స్కూలు భవనంలో వుంది. అక్కడి స్కూలు పాత హైస్కూలు. చాలా పేరున్న స్కూలే. కానీ ఇంటర్మీడియట్ ప్ర్రారంభయ్యాక ఉదయం స్కూలు, మధ్యాన్నం కాలేజీ. షిఫ్ట్ సిస్టం అన్నమాట. లోపలికి వెళ్లి ప్రిన్సిపాల్ గారిని కలిసాను. గణపతి గారని కామర్స్ లెక్చరర్ ఇంచార్జ్‌గా వున్నాడు. కొంత అనుమానంగా చూసినట్టు అనిపించింది. జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి కూర్చున్నాను. ఆఫీసులోకి తీసుకెళ్ళి క్లర్క్స్‌ని వాళ్ళని పరిచయం చేసాడు. ఎక్కడ ఏ ఊరని అన్ని వివరాల్ని ఆరా తీసాడు. ఇంతలో నాలుగయింది. ‘ఇక ఇవాలటికి వెళ్ళండి’ అన్నాడాయన. అమ్మయ్య అనుకుని బయలుదేరాను. బస్ స్టాండ్ గుడిసె హోటల్లో మంచి చాయ్ తాగి బస్సెక్కాను. బతుకు జీవుడా అనుకున్నాను. కానీ తెల్లరినుంచి రోజూ రావాలి కదా.. అన్న ఆలోచన ఉసూరుమనిపించింది. ఇల్లు చేరి అమ్మ చేతి వంట తిని కాలేజీ వివరాలు కొన్ని చెప్పి నిద్రకుపక్రమించాను. ఉద్యోగంలో మొదటి రోజు అట్లా గడిచింది.
***
మర్నాటి నుండి అంతా రొటీన్. కాలేజీకి వెళ్ళగానే “మీ లైబ్రరీ చార్జ్ ఎకనామిక్స్ సార్ దగ్గర వుంది. ఆయన లీవులో వున్నాడు. వచ్చిం తర్వాత చార్జ్ తీసుకోండి” అన్నాడు ప్రిన్సిపాల్ గణపతి. ప్రిన్సిపాల్ రూములో కూర్చుంటే “మీరు ఇక్కడ కాదు ఆఫీసులో కూర్చోండి” అన్నాడు. నేను కొంచెం గుర్రుగా చూసాను. ఆయన మెల్లగా సనుగుతూ అన్నాడు “మీరు రాడికలా…” అని. ఎందుకన్నాను.. “మీ గడ్దం అదీ..” అని మళ్ళీ నసిగాడు. నేను నవ్వేసి అలాంటిది ఏమీ లేదన్నాను. అప్పుడనిపించింది నిన్నటి నుండీ ఆయన చూపుల్లో వున్నతేడాకు ఇదా కారణం అనిపించింది.
ఆయన అనుమానం కూడా కొట్టి పారేయాల్సింది కాదు. ఎందుకంటే అప్పుడు ఉత్తర తెలంగాణా జిల్లాలు అట్టుడికి పోతున్నాయి. మంథనికి ఒక పక్క గోదావరిఖని సింగరేణి గనులు. అందులో యాక్టివ్‌గా వున్న కార్మిక సంఘాలు, మరో వైపు కాటారం అడవులు అందులో వున్న ఉద్యమ ఉధృతి.. ఆ నేపథ్యంలో కాంపస్ నుంచి వచ్చాడు గడ్దం పెరిగి వుంది… గణపతి గారి అనుమానం.. భయం.. కరక్టే అనిపించింది.
రెండు మూడు రోజుల్లో కోటేశ్వర్ రావు లీవు నుంచి వచ్చాడు. పూర్తి స్థాయి లైబ్రేరియన్ చేరాడని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నాడు. క్రమంగా చార్జ్ తీసుకున్నాను. ఒక్కో పుస్తకం చూసే ఓపిక లేక పోయింది. ఏదో అయింది అనిపించాను. అప్పుడు అక్కడే హైస్కూలులో పని చేసే ఇద్దరు టీచర్లు రాజిరెడ్డి, వెంకటనర్సయ్యలు పరిచయమయ్యారు. ఇంకా టీచర్ పి.కిషన్ మంచి మిత్రుడయ్యాడు. రాజిరెడ్డి వేములవాడ దగ్గరి వూరి కావడంతో మా తాతయ్య వాళ్ళ గురించి తనకు కొంత తెలుసు. క్రమంగా కాలేజీ వాతావరణానికి అలవాటవుతున్నట్టే వుండేది కాని ఏదో తెలీని అసంతృప్తి. రోజూ కరీంనగర్ నుండి వచ్చి పోవడం ఇబ్బందిగా వుండేది. అంతా అక్కడే రూము తీసుకుని వుంటే మంచిది అనే సలహా ఇవ్వసాగారు. నాకూ అదే మంచిది అనిపించింది. కానీ అప్పుడక్కడ అయ్యన్న హోటల్ అని ఒకే ఒక హోటల్ వుండేది, భోజనానికి కేవలం అదొక్కటే దిక్కు. మంథని లో నేను పరిశీలించిన విలక్షణ మయిన అంశాలు రెండు. ఒకటి మగవాళ్ళు వంటలకు వెళ్ళడం. అనేక మంది తమ కుటుంబాల్ని మంథనిలో వదిలి మహారాష్ట్రకు వంటలకు నెలల కొద్దీ వెళ్ళే వాళ్ళు. రెండవది అనేక మంది ఇంజనీరింగ్ కోర్సు చదివి విదేశాలలోనో, దేశం లోని వివిధ మహా నగరాలలోనో సెటిల్ అయిపోవడం. అందుకే మంథని వూరు వదిలేసిన పాత ఇల్లులా దిగులుగా కనిపించేది. (ఇప్పుడు చాలా మారింది లెండి).
వెంకట్ నరసయ్య నేనూ ఒక రూములో చేరాం. మొదట హోటల్ తిండి అనుకున్నా కొన్ని రోజులు వంట చేసుకున్నాం. అప్పుడే సాంబశివుడికి మొదటిసారి రాస్తేనే రైల్వే రిక్రూట్‌మెంట్‍౬లో ఉద్యోగంవచ్చింది. కర్నాటక లోని హుబ్లీ పోస్టింగ్ ఇచ్చారు. వెళ్లి జాయిన్ అయ్యాడు. అక్కడి నుంచి ఉత్తరాలు రాసేవాడు. తన ఎదుటి క్వార్టర్ లోని అమ్మాయి గురించి రాసే వాడు. తన ప్రేమ కథా వివరాల్నీ ఎంతో ప్రేమగా రాసేవాడు. మేం చాలా క్లోజ్ కదా ఏదీ దాచుకునే వాళ్ళం కాదు. మరో వైపు కోడం పవన్ కుమార్ ఏ.ఎం.ఐ.ఈ. కోసం మద్రాస్ చేరాడు. అక్కడి నుంచి ఉత్తరాలు రాసేవాడు. ఆయనదో కథ. నవ్వుకునే వాళ్ళం.
ఇక కాలేజీలో విద్యార్థులు లైబ్రరీకి రావడం మొదలయింది. నేను కొంచెం పిల్లల్ని చదవడం వైపు ప్రోత్సహించడం ప్రారంభించాను. అది కూడా అకాడెమిక్ చదువులే కాకుండా సాహిత్యం చదవాలని చెప్పసాగాను. ముఖ్యంగా అమ్మాయిలు నవలల పట్ల, కొందరు కవిత్వం పట్లా ఆసక్తి చూపడం మొదలు పెట్టారు. అందులో రమాదేవి అని ఒక అమ్మాయి చొరవగా వుండేది. “మెయిన్ రోడ్డులోనే సార్ మా ఇల్లు రండి” అని పిలిస్తే ఒక రోజు వెళ్లాను. ఆమె చెల్లెలు ‘శంకరాభరణం’ లోని పాటలు చాలా బాగా పాడి వినిపించింది.
***
‘శంకరాభరణం’ సినిమా అప్పుడు వీస్తున్న గాలి. అంతటా ఆ సినిమా హవా నడిచింది. నేను కూడా జీవితంలో ఎక్కువగా అయిదు సార్లు చూసిన సినిమా అది. పాపులర్ సినిమా కావడంతో పాటు అప్పుడే నాకు ఉద్యోగం రావడంతో ఇంట్లో వాళ్లకు మిత్రులకు అనేకమందికి నేనే ఆ సినిమా చూపించాల్సి వచ్చింది. అంతకు ముందు ఒకటికి ఎక్కువ సార్లు చూసిన సినిమాలు రెండే. అవి ఒక్కొక్కటి మూడేసి సార్లు చూసాను. స్కూల్లో వుండగా కరీంనగర్ భారత్ టాకీసులో ‘యాదోం కీ బారాత్’ చూసాను. అప్పటికి అది ఓ విలక్షణమయిన సినిమా అనిపించింది. చురాలియా.. లాంటి పాటలు ఆనాడే ఆకట్టుకున్నాయి. ఇక డిగ్రీలో వుండగా నటరాజ్ టాకీసు లో ‘కభీ కభీ’ కూడా మూడుసార్లు మూడురోజులు వరుసగా మ్యాటినీ షో లు చూసాను. ‘కభీ కభీ’ లో ‘మై పల్ దో పల్ కా షాయర్’ లాంటి పాటలు కట్టేసాయి.తర్వాత ఎప్పుడూ ఒకే సినిమాని అనేక సార్లు చూడలేదు.
***
అట్లా మంథనిలో రెండునెలలు గడిచాయో లేదో నన్ను సిరిసిల్ల జూనియర్ కాలేజీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఆ విషయం చెబుతూ ప్రిసిపాల్ గణపతి “బాగానే పైరవీ చేసావు.. చూడ్డానికి అమాయకంగా ఉంటావు గని” అన్నాడు. నేను నవ్వి “నాకేమీ తెలీదు మా మామయ్య డాక్టర్ ఒకరు వున్నారు, తన పనే అయివుంటుంది” అన్నాను. “రిలీవర్ వచ్చేంతవరకు నిన్ను వదిలేది లేదు” అన్నాడు. నాకేమీ అర్థం కాలేదు.
తర్వాత రఘుపతి మామయ్య చెప్పాడు. తనప్పుడు వేములవాడలో మెడికల్ ఆఫీసర్. సిరిసిల్ల లయన్స్ క్లబ్‍లో యాక్టివ్‍గా ఉండేవాడు. అప్పుడే సిరిసిల్లకు చెందిన వ్యాపారవేత్త భోగ వెంకట స్వామితో కలిసి ఏదో పని మీద హైదరాబాద్ వెళ్ళాడు. మాటల సందర్భంలో నా గురించి ప్రస్తావన వస్తే “మన ఎం.ఎల్.ఏ. సి హెచ్ రాజేశ్వర్ రావు గారు ఇక్కడే కదా వెళ్దాం పదండి” అని ఎం.ఎల్.ఏ. క్వార్టర్స్‌కి వెళితే ఆయన అందుబాటులో లేక పోవడంతో వెనుతిరిగారు. ముందు చూస్తే నేరెళ్ళ ఎం.ఎల్.ఏ. శ్రీ పాటి రాజం కనిపించారట. “డాక్టర్ గారు వెంకట స్వామిగారు ఏంటో వచ్చారు” అని అడిగాడంట. “ఒక చిన్న పని మీద ఎం.ఎల్.ఏ. సి హెచ్ రాజేశ్వర్ రావుగారి వద్దకు వచ్చాం, ఆయన లేరు” అంటే; “ఏమిటా పని మేం చేయమా” అన్నాడంట పాటి రాజం. అప్పుడు “మా అల్లుడు మంథని కాలేజీలో పనిచేస్తున్నాడు. మన సిరిసిల్ల కాలేజీలో ఖాళీ వుంది ట్రాన్స్ఫర్ కావాలి” అనగానే “అయ్యో పదండి” అని హైయ్యర్ ఎడుకేషన్ ఆఫీసుకు పోయారంట. అక్కడ జేడీ సుబ్బరాజుని కలిసి పాటి రాజం గారు విషయం చెప్పగానే “అప్లికేషన్ ఇవ్వండి సర్ వెంటనే చేస్తాం” అన్నాడంట. నా అప్లికేషన్ రెడీగా లేదు. మామయ్యే బయట కొచ్చి తానే రాసి వెళ్లి ఇచ్చాడంట. ఏముంది రెండు రోజుల్లో ఆర్డర్ మంథనికి వచ్చింది. అప్పటి లీడర్లు అట్లా వుండేవాళ్ళు, ఆఫీసులూ అట్లా పనిచేసేవి.
బదిలీ ఆర్డర్ అయితే వచ్చింది కానీ రిలీవ్ చేయడం లేదు. ఇంతలో వరంగల్ నుంచి పార్థసారధి అనే అతను పూర్తి స్థాయి ప్రిన్సిపాల్‌గా వచ్చాడు. అతనూ అంతే భీష్మించుకు కూర్చున్నాడు. మళ్ళీ పైరవీ స్టార్ట్. మేము డిగ్రీ చదివేటప్పుడు ధర్మయ్య గారు బాటనీ హెడ్‌గా చేసే వారు తర్వాత కరీంనగర్ విద్యాశాఖాధికారిగా వచ్చారు. ఆయన మా మేన వదిన రాణి వాళ్ళాయన డాక్టర్ లక్ష్మినారాయణ గారికి మేనమామ. అట్లా మాకు కొంచెం చుట్టరికం వుంది. ఆయన మంథని స్కూలుకు ఇన్స్పెక్షన్‌కు వచ్చాడు. అది తెలిసి మళ్ళీ రఘుపతి మామయ్యే “ఒక మాట చెప్పండి” అంటే స్కూలు కాలేజీకి ప్రిన్సిపాల్ ఒకడే కనుక రిలీవ్ చేయమని కొంచెం సీరియస్ గానే చెప్పాడు. ఇక ఏముంది చార్జ్ తీసుకొమ్మని రాజిరెడ్డికి చెప్పి వెంటనే రిలీవ్ చేసారు. కాని ఆ రోజు కరీంనగర్ హోటల్ ఆశోకాలో పార్టీ ఇవ్వాల్సి వచ్చింది. ఫిజిక్స్ లెక్చరర్ ఎం.ఎస్.మాధవ రావు నేనూ ప్రిన్సిపాల్ పార్థసారధి.. మరొకరెవరో వుంటే పెద్ద మందు పార్టీ ఇచ్చాను.
మర్నాడు మళ్ళీ కొత్త ఊరు కొత్త కాలేజీ కొత్త వాతావరణం… శురూ
ప్రభుత్వ జూనియర్ కాలేజీ సిరిసిల్లలో కొత్త ప్రస్థానం ఆరంభమయింది.
వివరాలతో మళ్ళీ వారం కలుద్దాం…
సెలవ్.
(ఇంకా ఉంది)