యాదోం కీ బారాత్ – 4

0
2

[box type=’note’ fontsize=’16’] ‘యాదోం కీ బారాత్’ పేరిట తన అనుభవాలను, జ్ఞాపకాలను పాఠకులకు అందిస్తున్నారు శ్రీ వారాల ఆనంద్. [/box]

సిరిసిల్ల – పాత వూరు – కొత్త ప్రస్థానం

[dropcap]ప్ర[/dropcap]భుత్వ ఉద్యోగుల మొతాద్ ఎంత.. పావలా కవర్ వస్తే చాలు పెట్టే బేడా సర్దాల్సిందే.. చిన్నప్పుడెప్పుడో మిఠాయి దుకాన్లో విన్న మాట. నాకూ నిజమయింది. బదిలీ కవర్ రాగానే  కొన్ని అడ్డంకుల్ని తప్పించుకుని మంథని జూనియర్ కాలేజీ నుండి బయలుదేరాను, మొత్తంగా మంథని ఊరుని, అక్కడి మనుషుల్ని పూర్తిగా చూడకుండానే ఆ ఊరును వదిలేసాను. ఇక ఏముంది, నా  ఉద్యోగపర్వంలో రెండవ మజిలీ ఆరంభం. సిరిసిల్ల తెలిసిన ఊరే. తెలిసిన మనుషులే. దగ్గరి బంధువులున్న ఊరే. వేములవాడ అంత కలె దిరిగిన వూరు కాదు కానీ అప్పటికే అక్కడ నాకు కొన్ని జ్ఞాపకాలున్నాయి. ఎప్పుడయినా ఏ వూరయినా ఏ  మనుషులయినా కాలగమనంలో ఎన్నో అనుభవాల్ని, జ్ఞాపకాల్ని మిగులుస్తారు. అందులో సంతోషం పంచినవి, దుఖం కలిగించినవీ కూడా వుంటాయి. గుర్తుంచుకుంటే తరచి చూసుకుంటే జీవితంలో ప్రతి మలుపూ ప్రతి మజిలీ స్మరణీయమయినవే. అట్లా సిరిసిల్ల చేరగానే మొదట గుర్తొచ్చినవి అక్కడి బంధుత్వాలు ఆ మనుషులు. తర్వాతి కాలంలో నా ఉద్యోగ పర్వం ఫలితంగా ఏర్పడిన పరిచయాలు వాటిని మించిన సృజనాత్మక లోకం లో ఏర్పడిన అనుబంధాలు గొప్పవి. చిరకాలం నిలిచిపోయేవి.

***

మొదట సిరిసిల్లలో నాకున్న బంధుత్వాలని, అనుబంధాలని యాది జేసుకుంటాను.

***

ఆ వూరిలో నాకున్న బంధువుల్లో ముఖ్యమయినది మా మేనత్త సక్కుబాయి. మా నాన్నకు ఇష్టమయిన చెల్లెలు. పోగా ఆమెను తానొక్కడే ప్రమీలా అని పిలిచేవాడు. ఆమె శ్రీవారు ఆకుల శంకర్. జూనియర్ కాలేజీలో క్లర్క్‌గా పనిచేసేవాడు. వాళ్లకు ఒక కూతురు, ముగ్గురు కొడుకులు. వసంత, శ్యాం సుందర్, రవి, ప్రకాష్. శ్యాం నాకంటే సీనియర్ కాగా రవి నా బాచ్. నేను ఇంటర్ చదువుతున్న కాలమది. మొదటి సంవత్సరం పూర్తి కాగానే మా నాన్న నన్ను సిరిసిల్లకు పంపించాడు. తనకు చిన్నప్పటి అతి దగ్గరి మిత్రుడయిన బాలమల్లయ్యగారి అన్న నాగమల్లయ్య సిరిసిల్లలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా పనిచేస్తూ ఉండేవాడు. ఎండాకాలం సెలవుల్లో  నన్ను ఆయన వద్దకు కెమిస్ట్రీ కోసం పంపించాలని నాన్నకు అనిపించి పంపాడు. ఇంకేముంది. నేను సక్కుబాయి అత్త ఇంట్లో మకాం. సిరిసిల్ల వెంకటేశ్వర ఆలయం వద్ద వున్న వాళ్ళ ఇంట్లో ఉంటూ నాగమల్లయ్య సార్ దగ్గరికి ప్రైవేట్ కోసం వెళ్లేవాన్ని. నాతో పాటు శ్యాం కూడా వచ్చేవాడు. అక్కడికి వచ్చే వాళ్ళల్లో సుధ అనే అమ్మాయి ఇంకా గుర్తుంది. తానేప్పుడో మర్చిపోయి వుంటుంది. అట్లా ఆ ఎండాకాలం కెమిస్ట్రీ తోనూ వారి ఇంట్లోనూ గడిచింది. కానీ ఆ అనుబంధం ఎందుకో నాతో బలపడలేదు. అట్లని దూరమూ కాలేదు. సిరిసిల్ల కాలేజీలో ఉద్యోగంలో చేరినప్పుడు శంకర్ మామ అక్కడే పనిచేస్తూ ఉండేవాడు. కాలేజీ టర్మ్స్‌లో కూడా నేను తనతో అంతగా కలిసి పోలేదు. ఎందుకో తెలీదు కానీ ఆ కాలేజీలో పనిచేసిన నాలుగేళ్ళల్లో వాళ్ళింటికి నాలుగు సార్లు వెళ్లిందీ లేదు.

***

సిరిసిల్లలో వున్న మరో అనుబంధం రంగయ్య వకీలు, సిరిసిల్ల పెద్దమ్మ వాళ్ళది. మా తాతయ్య కొల్లాపూరు నుంచి వేములవాడకు రాక ముందే సిరిసిల్లలో పెద్ద పేరున్న వకీలు రాంచందర్ రావు. తాతయ్య వాళ్ళ అన్న. ఆయన కూతురు విశాలాక్షి( సిరిసిల్ల పెద్దమ్మ అనేవాన్ని). అల్లుడు రంగయ్య గారు కూడా వకీలే. వారికి ఒక కూతురు, ముగ్గురు కొడుకులు. కూతురు ప్రమీల గొప్ప మానవ విలువలుకల మనిషి. ప్రేమలు అనుబంధాలూ కలగలిసిన ప్రేమమూర్తి ఆమె. ఆమె మంచితనం బాధ్యతా గుణం వల్లనే మంగారి కుటుంబం పది కాలాల పాటు నిలబడింది. ఉమ్మడిగా ఎదిగింది. తను తనకు మేనమామ వరుసయిన మా రఘుపతి మామయ్యను పెళ్ళాడడంతో నాకు అక్క కావాల్సిన తను అత్తయ్య అయింది. సిరిసిల్ల పెద్దమ్మ కొడుకుల్లో మొదటివాడు ప్రొఫెసర్ డాక్టర్ రాంచందర్. ఉస్మానియాలో పనిచేసాడు. రెండవ అన్నయ్య డాక్టర్ వెంకటేశ్వర్లు. కామారెడ్డిలో డాక్టర్‌గా పనిచేసి. వైద్యుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. విలువలతో బతికాడు. అందరిపట్లా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఉండేవాడు. ఇక మూడవ వాడు డాక్టర్ శేషగిరి చిన్న వయసులోనే లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. సిరిసిల్లలో పనిచేసిన రోజులకంటే అంతకు ముందే ఆ ఇంటితో నాకు అనుబంధం వుండేది. నాకు సిరిసిల్ల పెద్దమ్మ అంటే గౌరవమూ అభిమానమూ అంతే కాదు ప్రమీలత్తమ్మ తల్లి అని కూడా కొంత మొగ్గు వుండేది.

***

ఇక సిరిసిల్లలో మరో కుటుంబం రాజేశ్వరమ్మమ్మ వాళ్ళది. తనకు మా అమ్మకు దగ్గరి పోలికలు. ఇద్దరివీ అమాయకత్వం నిండిన చూపులు. ప్రేమ నిండిన మాటలు. వాళ్ళది ప్రధానంగా వ్యవసాయ కుటుంబం. వాళ్ళ అబ్బాయి పేరు కూడా ఆనందే. అందరూ నందూ అని పిలిచేవాళ్ళు. అన్ని శుభ కార్యాలకూ వచ్చేవారు. అన్ని కష్ట సందర్భాల్లోనూ వుండేవాళ్ళు.

***

సిరిసిల్లలో నన్ను బాగా ప్రభావితం చేసిన కుటుంబం ఆనందమ్మ పెద్దమ్మ వాళ్ళది. అక్కడ నేను పనిచేసిన నాలుగు సంవత్సరాలూ నేను బాగా దగ్గరగా కలివిడిగా తీరిగిన ఫామిలీ అది. గోవర్దన్ పెదనాన్న మా అమ్మకు మేనబావ వరుస. మా కాలేజీ స్కూలు విభాగంలో అధ్యాపకుడిగా పని చేసేవాడు, అత్యంత సౌమ్యుడు. వాళ్లకు నలుగురు అమ్మాయిలు. రాజ్యలక్ష్మి(రాజ్యం అక్కయ్య), ఉమా రాణి, కృష్ణవేణి (కృష్ణ), శ్రీదేవి. తమకు అందరూ అమ్మాయిలే అనేమో ఆనందమ్మ పెద్దమ్మ నన్ను సొంత కొడుకులా చూసేది. అంతా అన్నయ్యా అంటూ అభిమానంగా వుండేవాళ్ళు. వారంలో రెండు సార్లు మధ్యాహ్నం కిషన్ సార్ స్కూటర్ తీసుకుని వాళ్ళింటికి వెళ్ళడం. టిఫిన్లు టీలు నాకు సర్వ సాధారణమయి పోయిందక్కడ. అంత కలివిడిగా వుండే ఆ ఇంట్లో తర్వాతి సంవత్సరాలల్లో మూడు విషాదాలు జరిగాయి. ఒకటి గోవర్ధన్ పెదనాన్న మరణం. తర్వాత అనారోగ్యంతో రాజ్యం అక్కయ్య మృతి, తర్వాత కృష్ణ వేణి భర్త ప్రొఫెసర్ రమేష్ రోడ్డు ప్రమాదంలో పోవడం. మౌనంగా కన్నీళ్లు కార్చడం తప్ప వాళ్ళను ఎట్లా ఒదార్చగలను.

***

అట్లా సిరిసిల్ల అనగానే బంధువుల్లో ఆ నాలుగు కుటుంబాలూ మదిలో మెదులుతాయి. అవట్లా వుంటే అప్పటికి సిరిసిల్ల అంటే కల్లోలిత ప్రాంతంగా పేరు. నిమ్మపల్లి కోనారావుపేట పోరాటాలూ, ఆంక్షలు నిషేదాలూ వున్న గ్రామాలు. కాలేజీ విద్యార్థుల్లో కూడా ఆ చైతన్యం కనిపించేది.

నేను జూనియర్ కాలేజీలో చేరిన మొదటి రోజు అనుభవాలు ఇంకా ఫ్రెష్ గానే వున్నాయి. పగలు కాలేజీ కనుక 12 గంటలకల్లా కాలేజీ చేరాను. మొదట ఆఫీసులో క్లర్క్ గా ఉన్న శంకరయ్య మామను కలిసాను. అక్కడే టైపిస్టు మల్లారెడ్డి, భూమ్రెడ్డి‌లకు హాయ్ చెప్పాను. ప్రిన్సిపాల్ శ్రీ కే.మోహన్ రావును కలిసి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి బయటకు రాగానే. “ఏయ్ హలో” అన్న పిలుపు వినిపించి వెనక్కి చూస్తే శ్రీధర్ రావు సార్. ఒక్క సారిగా సంభ్రమాశ్చర్యాలు ముప్పిరిగొన్నాయి. తను నాకు ఇంటర్‌లో ఫిజిక్స్ చెప్పాడు. “అరె నువ్వా ఆనంద్ కదా” అన్నాడు. “నమస్తే సర్” అన్నా. అందరితో బిగ్గరగా “ఆనంద్ నా స్టూడెంట్, ఇప్పుడు కొలీగ్” అన్నాడు. “చాలా సంతోషంగా వుంది. పద ఇంటికి వెళ్దాం. భోజనం చేసి వద్దాం” అన్నాడు. తిని వచ్చాను సార్ అన్న వినిపించుకోకుండా బండి మీద ఎక్కించుకుని తమ ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంట్లో కూడా “నా స్టూడెంట్ ఇప్పుడు నా కొలీగ్” అంటూ పరిచయం చేసాడు. నాకు మొదటి రోజు ఎంతో ఉత్సాహం కలిగింది. తిరిగి కాలేజీకి వచ్చి మిగతా స్టాఫ్‌ని పరిచయం చేసుకున్నాను. అప్పుడక్కడ సివిక్స్ చెప్పే శ్రీ బి.నారాయణ రెడ్డి సార్  మా నాన్నకు చిరకాల మిత్రుడు. నాక్కూడా చిన్నప్పటి నుండే తెలుసు. ఎకనామిక్స్ లక్ష్మణ్ రావు సర్, బాటనీ రమణయ్య, మాత్స్ సాంబయ్య, ఇంగ్లిష్ జయంత్ కుమార్, హిస్టరీ జగన్నాధ చార్య అట్లా అందరినీ కలుస్తూ వుంటే తెలుగు అధ్యాపకుడు పార్వెల్ల గోపాలకృష్ణ గారూ కలిసారు. ఆయన నాకు గంజ్ స్కూల్లో కొంత కాలం తెలుగు చెప్పారు. తర్వాత జువాలజీ లాబ్‌కు వెళ్తే అక్కడ వేములవాడకు చెందిన లెక్చరర్ యాద కిషన్, కామర్స్ లెక్చరర్ మామిడిపల్లి  రాజన్నలు కలిసారు. వాళ్ళతో అంతకు ముందు పెద్దగా స్నేహం లేకున్నా పరిచయం వుండేది. నేను డాక్టర్ సుబ్రహ్మణ్యం గారి మనవడినని తెలుసు వాళ్లకు. జాయిన్ అయిన మొదటి రోజు అందరినీ కలవడంతో సరిపోయింది. అది మార్చి నెల కావడంతో అప్పటికే ఎండలు పెరుగుతున్నాయి. కాలేజీ బిల్డింగ్ అంతా చూస్తుంటే పాత హైస్కూలు భవనం. దానికి తోడు లాబులకు క్లాసులకు, రేకుల షెడ్లు. ఆఫీసు, ప్రిన్సిపాల్ గదులు మాత్రం సిమెంట్ కట్టడాలు. బిల్డింగ్ వెనకాల విశాల మయిన క్రీడా మైదానం. ఎంట్రన్స్ గేటు నుంచి విశాలమయిన దారి. కాలేజీ వాతావరణం బాగా నచ్చింది. నాకు అంతే కాదు ఇదే కాలేజీలో కదా నా అనేకమంది మిత్రులు చదివింది అనిపించింది. అట్లా  అనిపించగానే వాళ్ళు చదివిన చోట నేను ఉద్యోగం కోసం కోసం వచ్చాను. వాళ్ళ చదివులింకా ముగియనే లేదు. చిన్ననాటి స్నేహితులు పి.ఎస్.రవీంద్ర, శివన్న బావ, సాంబశివుడు, రమేష్ చంద్ర, రమేష్ ఇట్లా అనేక మంది చదువుకు, వారి పరీక్షల రద్దుకు ఇది వేదిక అయింది అన్న విషయం గుర్తుకు రాగానే ఎట్లాగో అనిపించింది.

ఆ రోజు ముగించుకుని సాయంత్రానికి కరీంనగర్ చేరుకున్నాను. మళ్ళీ తెల్లవారితే సిరిసిల్ల ప్రయాణం. కొంత ఉత్సాహంగానే వుండేది. కాలేజీకి కొంచెం ముందు చేరగానే అక్కడ స్కూలు విభాగంలో పని చేస్తున్న తెలుగు అధ్యాపకుడు మా వఝల శివ కుమార్ వాళ్ళ నాన్న శ్రీ సాంబశివ శర్మ కనిపించారు. వారీ ఆనందూ జైన్ అయ్యవటగా సంతోషం అన్నాడు. నాకూ సంతోషంగానే అనిపించింది. ఇక పీఈటీగా వున్న దేవరాజం సార్ మా నాన్నకు బాగా తెలిసిన కొలీగ్. అంజన్న కొడుకా బాగున్నావా అని పలకరించాడు. ఇక ఎన్.సి.సి. నారాయణ సార్ కూడా పెద్ద దిక్కులాగె అనిపించాడు. అయినా మనం పనిచేసేది కాలేజీ లో కదా అనుకున్నాను.

ఇక ప్రిన్సిపాల్ మోహన్ రావుది ఖమ్మం జిల్లా. సనాతన బ్రాహ్మడు. తెల్లటి దోతీ అంగీలతో కొంచెం కలివిడిగానూ మరికొంత కటువుగానూ వున్నట్టు అనిపించింది. స్కూలు కాలేజేలకు తానే హెడ్.  శ్రీధర్ రావు సార్ పరిచయంతో నాకు ప్రిన్సిపాల్ వద్ద గౌరవాభిమానాలే దక్కాయి. కాలేజీలో బి.నారాయణ రెడ్డి లక్ష్మణ్ రావు తదితరులది ఒక వర్గమని శ్రీధర్ రావు రాజన్న మొదలయిన వాళ్ళది మరో వర్గమని రెండు రోజులకే అర్థం కాసాగింది. శ్రీధర్ రావుది  ప్రిన్సిపాల్ అనుకూలవర్గం గానూ మిగతా వాళ్ళు వ్యతిరేక వర్గం గానూ నాకర్థమయింది. వాటన్నింటితో మనకేం పని. మొదట అందరినీ అర్థం చేసుకోవాలి. విద్యార్థులతో సహా అందరిలో కలిసిపోవాలి. అదీ అప్పటి నా ఎజెండా.

అట్లా కాలేజీ వాతావరణంలో సెటిల్ అవుతూనే కరీంనగర్ నుంచి రోజూ రావడంకాదు కాని సిరిసిల్ల లో రూము తీసుకోవాలని ఆలోచించడం మొదలు పెట్టాను. అది తెలిసి. అక్కడెందుకు వేములవాడ ఇంట్లో వుండి రోజూ పోయి రావచ్చు అన్నాడు రఘుపతి మామయ్య. ఒక రకంగా అది ఆర్డరు. నాన్నని అడిగితే నీ ఇష్టం అన్నాడు. అప్పటికి తాతయ్యతో వున్న సాన్నిహిత్యం కూడా వేములవాడలో ఉండడానికి మరో కారణం.

ఏముంది బట్టలు తీసుకుని వేములవాడకు చేరుకున్నాను. దాంతో వేములవాడ సిరిసిల్ల ప్రస్థానం ఆరంభయింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here