యాదోం కీ బారాత్-8

0
3

[box type=’note’ fontsize=’16’] ‘యాదోం కీ బారాత్’ పేరిట తన అనుభవాలను, జ్ఞాపకాలను పాఠకులకు అందిస్తున్నారు శ్రీ వారాల ఆనంద్. [/box]

[dropcap]జ్ఞా[/dropcap]పకాల్ని రాయాలనుకున్నప్పుడు అవసరమా అనుకున్నాను. గొప్పగా ఏముంటాయి అని కూడా అనుకున్నాను. కానీ జీవితం గురించి, ఆయా కాలాల గురించీ ఎన్నో విషయాలు రికార్డ్ అవుతాయి అని కూడా అనుకున్నాను. అట్లా మొదలయిందీ బారాత్. అయితే ఈ జ్ఞాపకాలు ఎంత ఆబ్జెక్టివ్‌గా రాసినా కొందరు మిత్రులు బాధపడుతున్నారు. తిడుతున్నారు. ఆ విషయం రాయకుంటే ఏమయింది అంటున్నారు.

“ఓటమి తెలియనప్పుడు గెలుపు మజా ఏముంటుంది…”

“ఏదో చిన్న అవమానం ఎదురుకానప్పుడు జీవితంలో సన్మానం ఏమి ఆనందమిస్తుంది”. ఏది ఏమయినా బాధల్నీ సంతోషాల్నీ గుది గుచ్చుకుంటూ జీవితం సాగింది. జ్ఞాపకాలూ సాగుతాయి.

***

సిరిసిల్లా కాలేజీలో పనిచేసిన రోజులు ఎంత చైతన్యం. ఒక్క సిరిసిల్లనే కాదు స్కూళ్ళల్లో కాలేజీల్లో విద్యార్థుల మధ్య పనిచేయడమే గొప్ప చైతన్యం. మామూలు ఆఫీసు రొటీన్ as per the last month పని కాదది. ప్రతి రోజు నూతనత్వమే. కొత్త సమస్యలు, సరికొత్త స్పందనలు. 80ల్లో అది మరీ ఎక్కువ. ఓ పక్క పెల్లుబికే రాజకీయ చైతన్యం. మరో పక్క లంపెన్ వర్గాలు రెండూ ఉండేవి. ముఖ్యంగా ఆ రోజుల్లో ప్రైవేట్ కాలేజీలు లేవు. ఎవరు చదువాలన్నా గవర్న్మెంట్ కాలేజీకే రావాలి. పైగా కో-ఎడ్యుకేషన్. బెల్లు మొగిందంటే చాలు. లెక్చరర్ మారే సమయంలో కాలేజీ అంతా జాతరలా ఒకటే గోల గోలగా వుండేది. క్లాసులన్నీ ఎంగేజ్ కాగానే అంతా పిన్ డ్రాప్ సైలెన్స్. భలే వుండేది. ఇక మా లైబ్రరీ కూడా అంతే పిల్లలు వుంటే అతివృష్టి లేకుంటే ఎడారి. అప్పటికి వేములవాడ ప్రాంతం కూడా కలిపి మొత్తం సిరిసిల్ల తాలూకాకు ఒక్కటే జూనియర్ కాలేజీ. సిరిసిల్ల ప్రాంతమంతా గొప్ప చైతన్యంతో కూడుకున్నది, కల్లోలిత ప్రాంత చట్టం అమలయి వున్న గ్రామాలవి. అంతా నివురుగప్పిన నిప్పులా వుండేది. సిరిసిల్లా పట్టణ విద్యార్థులు, ఆర్థికంగా కొంత మెరుగయిన కుటుంబాల విద్యార్థులు ఒక రకంగా వుండేవాళ్ళు. పల్లెలనుంచి వచ్చిన వాళ్ళు అందుకు భిన్నంగా కనిపించేవాళ్ళు. అమ్మాయిల్లోనయితే ఎక్కువ మంది ముడుచుకుని వుంటే కొంత మంది మాత్రం చలాకీగా వుండేవాళ్ళు. ఈ నేపధ్యంలో భిన్నమైన అనుభవాలు.

అప్పటికే సిరిసిల్ల కాలేజీలో పరీక్ష సెంటర్ డిబార్ కావడం లాంటివి జరిగాయి. విద్యార్థుల్లో మాస్ కాపీ తత్వం వుండేది. దానికి తోడు కొంతమంది అధ్యాపకులు విద్యార్థుల్లో బోగస్ పాపులారిటీ కోసం పరీక్షల్లో ‘నఖల్ల’కు అవకాశం కల్పించేవాళ్ళు. ఎవరమయినా పరీక్ష హాల్లో కొంత స్ట్రిక్ట్‌గా వుంటే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వచ్చేది. దాడులు చేసేవాళ్ళు. అలాంటి సంఘటనలు సిరిసిల్లాలో రెండు జరిగాయి. ఒక ఏడాది వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. వేములవాడ నుంచి కలిసి రావాల్సిన నేనూ కిషన్ సార్ వేర్వేరుగా వచ్చాం. నేను బస్సులో వచ్చాను. కాలేజీ గేటు దగ్గరే ఏదో కోలాహలం కనిపించింది. నా మానాన నేను వస్తున్నాను. మురళి అనే విద్యార్థి మరికొందరు అరేయి అంటూ నా మీదికి వచ్చారు. ఊహించని పరిణామం. చిట్టీలు గుంచుకుంటావారా అంటూ దాడికి దిగారు. ఇంతలో ఆ గుంపులోనే రఘు అని నన్ను కొంత అభిమానించేవాడు, ఉరికి వచ్చి ఆ గుంపును ఆపాడు. సార్ను ఏమనొద్దురా అంటూ. అప్పటికే వాళ్ళు కాళ్ళూ చేతులూ ఆడించారు. అవి నన్ను తాకలేదు. ఇంతలో బాటనీ అటెండర్ కనకయ్య వచ్చి సార్ రండి అంటూ లోనికి తీసుకెళ్ళాడు. రఘు లేకుంటే ఆరోజు నా వీపు ‘సాఫ్’ అయ్యేదే. లోనికి వెళ్తుంటే చెప్పారెవరో అప్పటికే పరీక్షల రూములో కిషన్ సార్ మీద అటాక్ చేసారని. ఉదయం 8కే పరీక్ష మొదలయింది. పరీక్ష ముగీసే సరికి ఏమి జరిగిందో ఎవరు చెప్పారో కాని స్టూడెంట్స్ వచ్చి సారీ చెప్పారు. అంతటితో ఆ వివాదం ముగిసింది.

ఇక మరో సందర్భంలో సాయంత్రం వేళ పరీక్షల విభాగం గదిలో ఒక విద్యార్థి మంఛి ఎకనామిక్స్ అధ్యాపకుడు లక్ష్మణ్ రావు గారి మీద అటాక్ చేసాడు. అదీ పరీక్షల విషయంలోనే. నేను అక్కడే వున్నాను. సార్ దాన్ని ప్రతిష్ఠగా తీసుకుని పోలీసు కంప్లైంట్ చేసాడు. కేసు నమోదయింది. నేను విట్నెస్. కోర్టులో కేసు పడింది. ఆ విద్యార్థి కుటుంబం నుంచి రఘుపతి మామయ్య ద్వారా వొత్తిడి. వాడి భవిష్యత్తు పాడయిపోతుందని వేదన. ‘దాడి జరిగింది నిజం కోర్టులో నేనదే చెబుతాను’ అన్నాను. సార్‌తో రాజీ పడితే నాకేమీ అభ్యంతరం లేదన్నాను. ఎట్లాగో సర్దుకున్నారు. కానీ కేసు కేసే కదా. కోర్టుకు నేను కూడా వెళ్లి అటూ ఇటూ కాకుండా సాక్ష్యం చెప్పి వచ్చాను. కేసు పోయింది. అదొక భిన్నమయిన అనుభవం.

మరోసారి మళ్ళీ పరీక్షల సమయమే.. బాలరాజు లాంటి కొందరు స్టూడెంట్స్‌కి నా ఇన్విజిలేషన్ నచ్చలేదు. నఖలు కొట్టనీయవా అంటూ నువ్వయితే కాలేజీ బయటకురా అంటూ గుంపుగా తయారయ్యారు. ప్రిన్సిపాల్‌కు ఈ విషయం తెలిసి నా వద్దకు వచ్చాడు. ఇంతలో రుద్ర రవి, ఫసి, ముత్యం రెడ్డి లాంటి మిత్రులు కరీంనగర్‌కు కలిసి వెళ్ళడానికి నావద్దకు కారులో వచ్చారు. ప్రిన్సిపాల్ అది చూసి ఆనంద్ వెంటనే వెళ్ళు అంటూ నన్ను తరిమినంత పనిచేసారు. ఆ ప్రహసనం అట్లా ముగిసింది.

***

ఈ అనుభావాలు ఇట్లా వుంటే స్ఫూర్తివంతంయినవి మరికొన్ని. ప్రగతిశీల భావాలున్న పిల్లలు నా చుట్టూ చేరేవాళ్ళు. లైబ్రరీకి వచ్చేవాళ్ళు. నేనేమో ఈ పుస్తకం చదవండి అది చదవండి అంటూ చలం, శ్రీశ్రీ తదితరుల రచనలు ఇచ్చే వాణ్ని. కొందరు ఆసక్తిగా చదివేవాళ్ళు. మరికొందరేమో సిద్దాంత గ్రంధాలు అడిగే వాళ్ళు. అవి కాలేజీలలో వుండవు అంటే ఇంట్లో వుంటే ఇవ్వండి వస్తాం అనేవాళ్ళు. నేనేమో అప్పటికే సమాంతర సినిమాల పట్ల ఆసక్తి పెంచుకొని వున్నాను. సరిగ్గా ఆదే సమయంలో ప్రముఖ కవి అభ్యుదయ రచయితల సంఘం కార్యవర్గ సభ్యుడు శ్రీ చొప్పకట్ల చంద్రమౌళి సిరిసిల్లా కాలేజీలో లెక్చరర్‌గా చేరాడు. ఆర్.పుల్లయ్య గారు ప్రిన్సిపాల్. వేములవాడ నటరాజ కళానికేతన్ కార్యక్రమాలతో చనువున్న చొప్పకట్ల కొలీగ్ కావడంతో నాలో ఉత్సాహం పెరిగింది. ఆ ఏడు కాలేజీ వార్షికోత్సవంలో ‘అడవి తల్లికి దండా లో… తల్లి అడివికి దండా లో… రేలా రేలా రే..’ లాంటి పాటలతో విద్యార్థినీ విద్యార్థులతో నృత్యాలు చేయించాం. విద్యార్థుల్లో ఎంత ఉత్సాహమో చెప్పలేను.

ఇదిట్లా వుంటే నారాయణ అనే విద్యార్థి ఎంతో ఉద్రేకంగానూ ఆలోచనాత్మకంగానూ ఉండేవాడు. బాగా దగ్గరయ్యాడు. మనిషిలో ఏదో అసహనం. ఎదో చేయాలనే తపన. ఎవరిమీదో చెప్పలేనంత కోపంగా ఉండేవాడు. నేనతన్ని కొంత సాహిత్యం వైపు మరల్చే ప్రయత్నం చేసాను. ఇంతలో నాకు బదిలీ అయి గోదావఖనికి వెళ్లాను. ఒక రోజు గోదావరిఖని నుండి కరీంనగర్‌కు వస్తూ చాయ్ కోసం పెద్దపల్లి బస్ స్టాండ్‌లో దిగాను. బయటకు వస్తుంటే ఒకతను నమస్తే సార్ అని పలకరించాడు. ఎప్పటి ఎప్పటి విద్యార్థులో కలవడం మామూలే కదా. ఆగి పలకరించాను. గుర్తు పట్టారా సారన్నాడు. లేదన్నాను. మాది సిరిసిల్ల. మీ స్టూడెంట్‌ని అన్నాడు. చాలా సంతోషం వేసింది. బాగున్నావా ఏం చేస్తున్నావ్ అన్నాను.. బాగానే వున్నాను సర్. మీకు తెలిసిందా సార్ అన్నాడు. ఏమిటీ సంగతి అన్నాను. మన నారాయణ అంటూ ఆగాడు.. ఏమయింది అన్నాను ఆదుర్దాగా.. కామారెడ్డిలో ఎన్త్రత్రకౌంటర్ చేసారు సర్ అన్నాడు… అంతే కొయ్యబారి పోయాను. నోట మాట రాలేదు. పోస్టర్లు వేస్తుంటే పట్టుకున్నారు తర్వాత.. అన్నాడు నాకింకేమీ వినిపించలేదు. దుఖం పొర్లుకోచ్చింది. ఎంత తెలివయినవాడు.. మనసున్నవాడు.. “మీకు చాలా దగ్గరగా ఉండేవాడు కదా సార్, చెప్పాలనిపించింది. వుంటాను సర్.మళ్ళీ కలుస్తాను” అంటూ అతను వెళ్ళిపోయాడు. బస్సు డ్రైవర్ పిలుపుతో కళ్ళు తుడుచుకుంటూ బస్సెక్కాను. ఇట్లా ఒక్క నారాయణే కాదు ఎంతమందో.. గుర్తు చేసుకుంటే మనసంతా కన్నీటి ఉప్పెనవుతుంది.

***

1980 నుంచి మూడు నాలుగేళ్ల పాటు కాలేజీ అనుభవాలు ఇట్లా వుంటే కాలేజీ బయట సాంస్కృతిక రంగంలో వేములవాడ ఫిలిం సొసైటీ, సిరిసిల్లాలో ఫిలిం సొసైటీ ఏర్పాటు, మా ‘లయ’ కవితా సంకలనం వెలువడడం ప్రధాన జీవనానుభావాలు. సాహిత్యమూ, కళాత్మక సినిమా రంగాలతో నా సహజీవనం అప్పుడే మొదలయింది. సినిమాలు, ఫిలిం సొసైటీ ఉద్యమం ఒక పార్శ్వమయితే సాహిత్యం మరోటి.

సాహిత్యం విషయానికి వస్తే 1982లో వెలువడ్డ ‘లయ’ మా మొదటి సంకలనం.

70వ దశకం చివర, 80వ దశకం తొలి రోజుల్లో తెలుగు సాహిత్య ప్రపంచంలో మినీ కవిత ఓ ఉప్పెన. దాదాపు ఆనాటి యువకవులంతా మినీ కవితా రచనలో మునిగిపోయారు. మరో వైపు కందుర్తి లాంటి వాళ్ళు మినీ కవితని అంగీకరించలేదు. అనేక వాదాలూ వివాదాలూ నెలకొన్నాయి. ఆ నేపథ్యంలో వేములవాడ పోయెట్రీ ఫోరం నుంచి వెలువడిన అయిదుగురు యువ కవుల సంకలనం ‘లయ’ (‘RHYTHM’). అందులో జింబో, వఝల శివకుమార్, పి.ఎస్.రవీంద్ర, అలిశెట్టి ప్రభాకర్, వారాల ఆనంద్ రాసిన మినీ కవితలున్నాయి. అప్పుడు ‘లయ’కు మంచి స్పందనే వచ్చింది. ప్రస్తుతం నా దగ్గర లేవు గానీ మంచి సమీక్షలూ వచ్చాయి. అట్లా ‘లయ’ ఈ అయిదుగురు కవులకూ గొప్ప లాంచింగ్ పాడ్ అనే చెప్పుకోవచ్చు.

***

“కవిత్వం మన జీవన విధానానికీ, జీవిత సంఘర్శణలకీ ప్రతిస్పందన”

“ఎక్కడ సమస్యలుంటాయో అక్కడ సంఘర్శన వుంటుంది, అక్కడ కవిత్వమూ వుంటుంది, ఆ సంఘర్షణలకు ‘లయ’గా ఈ సంకలనం మీ ముందుకు తెస్తున్నాం” అని ప్రకటించి ఈ సంకలనాన్ని తెచ్చాము.

నేను అప్పటికే లైబ్రరీ సైన్స్ కోర్సు పూర్తి చేసి మొదట మంథనిలో తర్వాత ఏప్రిల్ 1980లో సిరిసిల్ల జునియర్ కాలేజీ చేరిపోయాను. రవీంద్ర ఫోటో స్టూడియో ఏర్పాట్లల్లో, శివకుమార్ పై చదువులకు జబల్పూర్ వెళ్ళే ప్రయత్నాల్లోనూ వున్నారు. జింబో భరత్ భూషణ్ తీసిన ఫోటో, శేఖర్‌తో లెటర్స్ రాయించి పుస్తకానికి కవర్ పేజీ ప్రింట్ చేయించాడు. ఇక ఇన్నర్ పేజీల బాధ్యత నేను తీసుకుని సిరిసిల్లా లోని ఒక ప్రెస్‌లో అచ్చు. బైండింగ్ పనులు చూసాను. అట్లా ‘లయ’ వెలుగులోకి వచ్చింది. అప్పటికే కరీంనగర్లో శిల్పి స్టూడియోతో మాకు సన్నిహితుడయిన అలిశెట్టి ‘లయ’లో భాగస్వామ్యానికి అంగీకరించాడు.

అప్పుడు మొదలయిన కవుల్లోంచి అలిశెట్టి సెలవంటూ లోకం నుంచి వెళ్ళిపోగా ఇప్పటికీ జింబో, వఝల శివకుమార్, పి.ఎస్. రవీంద్ర, వారాల ఆనంద్ సృజనాత్మక రంగంలో వుండడం, అందరూ దాదాపు అప్పటి అదే ఉత్సాహం కలిగి వుండడం నాకెంతో సంతోషంగా వుంది.

‘లయ’లోని కొన్ని కవితల్ని ఇక్కడ ఇస్తున్నాను 1980ల నాటి ఈ మినీ కవితల్ని చదవండి

~

బతుకు

“నే చచ్చిపోతాననే కదూ
నీ బాధ
పిచ్చివాడా
ఈ వ్యవస్థలో మనం బతికింది
తొమ్మిది మాసాలే”

-జింబో

~

వేదనా గీతం

మాకు మీలా సేఫ్టీ లాకర్లల్లో
వసంతాల్ని బంధించడం చేత కాదు
వ్యధల్ని గుండెల్లో బంధించుకోవడం తప్ప

మాకు వెన్నెల్లో రమించడం తెలీదు
సూర్యుడిలో వెన్నెల్ని కోరుకోవడం తప్ప

ఊహా విహాసయంలో గంధర్వ
విపంచి వినిపించదు
పేగుల తీగల వేదనా సహిత గీతం తప్ప

కారణం
మీరు మా చెమటని
మేం మా ఆకల్నీ తిని బతుకుతాం

-వఝల శివకుమార్

~

రాత్రి చనిపోయింది

వర్షం భోరున ఏడుస్తోంది
అప్పుడే వెళ్ళిపోయాడు చంద్రుడు
నాకేమిటని

గాలి వీస్తోంది
నేనున్నాని
సూర్యుడు తొంగి చూస్తున్నాడు
మబ్బుల తెర అడ్డం వస్తుంది
నేను అప్పుడే లేచి చూసాను
చనిపోయింది ఎవరా అని

ఆలోచిస్తే తెలిసింది
చనిపోయింది రాత్రేనని

-పి.ఎస్.రవీంద్ర

~

రీప్రింట్

ఈ సమాజం
అచ్చు తప్పులున్న
ఓ గొప్ప పుస్తకం

ఇప్పుడు కావాల్సింది
తప్పొప్పుల పట్టిక
తయారు చేయడం కాదు

ఆ పుస్తకాన్ని
సమూలంగా
పునర్ ముద్రించడం జరగాలి

-వారాల ఆనంద్

~-

ఉనికి

అలా
సమాధిలా
అంగుళం మేరకన్నా
కదలకుండా పడి వుంటే ఎలా

కొనాళ్ళు పోతే
నీ మీద నానా గడ్డీ మొలిచి
నీ ఉనికే నీకు తెలిసి చావదు

-అలిశెట్టి ప్రభాకర్

***

అట్లా ‘లయ’ కవితా సంకలనం నా యాదిలోనూ తెలుగు కవితా ప్రపంచంలోనూ మిగిలిపోయింది.

‘లయ’ గురించిన విశేషాల్ని మరోసారి…

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here