Site icon Sanchika

యాదోం కీ బారాత్-9

[box type=’note’ fontsize=’16’] ‘యాదోం కీ బారాత్’ పేరిట తన అనుభవాలను, జ్ఞాపకాలను పాఠకులకు అందిస్తున్నారు శ్రీ వారాల ఆనంద్. [/box]

[dropcap]నా[/dropcap] జీవితంలో 80వ దశకంలోని మొదటి సంవత్సరాలు అంత్యంత ముఖ్యమయినవి. వ్యక్తిగత జీవితంలోనూ సృజనాత్మక జీవితంలో కూడా. సాహిత్యమూ, ఉద్యమాలూ, అర్థవంతమయిన సినిమాలూ ఇట్లా అనేకమయిన విషయాలు నా జీవితంలోకి అప్పుడే వచ్చాయి. ముఖ్యంగా కళాత్మక సినిమాల గురించి నాకున్న ‘చిటికెడంత అవగాహన పిడికెడంత’ కావడమూ అప్పుడే జరిగింది. కరీంనగర్ ఫిలిం సొసైటీ కార్యక్రమాలూ, వేములవాడలో ఫిలిం సొసైటీ స్థాపన, తర్వాత క్రమంగా సిరిసిల్లా, జగిత్యాల, హుజురాబాద్ లలో ఏర్పాటు ఇదే సమయంలో జరిగాయి. ఎన్నో మీటింగులు, సెమినార్లు, అనుభవాలు.

నిజానికి అప్పటికి తెలుగులో సమాంతర సినిమా విస్తరించలేదు. కొన్ని విలక్షణ ప్రయత్నాలు మాత్రం జరిగాయి. బి.ఎస్.నారాయణ రూపొందించిన ‘నిమజ్జనం’, ‘ఊరుమ్మడి బతుకులు’, గౌతం ఘోష్ ‘మా భూమి’, మృణాల్ సేన్ ‘ఒక ఊరి కథ’, శ్యాం బెనెగల్ ‘అనుగ్రహం’ లాంటివి కొంత ముందూ వెనకా అప్పుడే వచ్చాయి. ఇక వాస్తవిక దోరణిలో టి.మాధవ రావు దర్శకత్వం వహించిన ‘చిల్లర దేవుళ్ళు’ లాంటి సినిమాలూ వచ్చాయి. వీటికి తోడు ఆ కాలంలోనే మిడిల్ సినిమాగా చెప్పుకునే కె.విశ్వనాథ్ సినిమాలు (శంకరాభరణం, సిరివెన్నెల, సాగర సంగమం), ఇంకా బాపు సినిమాలు, మరో వైపు కె. బాలచందర్ సినిమాలు వచ్చాయి.

వీటన్నింటి నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో భారతీయ ప్రధాన స్రవంతి సినిమాకు సమాంతరంగా వచ్చిన బెంగాలీ, మలయాళీ, కన్నడ తదితర భాషా చిత్రాల ప్రదర్శన, అధ్యయనం కోసం ఫిలిం సొసైటీలు పని చేయడం ప్రారంభించాయి, కేవలం దేశీయ చిత్రాలే కాకుండా బైసికిల్ థీవ్స్, రషోమాన్, లాంటి అంతర్జాతీయ సినిమాల్నీ అప్పుడే ఈ సొసైటీలు ప్రదర్శించాయి. కేవలం ప్రదర్శించడమే కాకుండా వాటిపైన చర్చలు, సెమినార్లు నిర్వహించాయి. వాటి నిర్వహణలో నేను ప్రధాన భూమికను పోషించడం నాకెంతో ఉపకరించింది.

సెమినార్లు, సమావేశాలు:

వేములవాడ ఫిలిం సొసైటీలో మేము ప్రధానంగా నిర్వహించిన రెండు సమావేశాల గురించి ప్రస్తావిస్తాను. ఒకటి సుప్రసిద్ధ కవి కె.శివారెడ్డి గారితో జరిగింది. ప్రత్యూష సినిమా నిర్మాణంలో రచయితగా ఆయన పాలుపంచుకున్నారు. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన శ్రీ జట్ల వెంకట స్వామి నాయుడు పూనా ఫిలిం ఇన్స్టిట్యుట్‌లో చదువుకుని వచ్చారు. సమాంతర ప్రయోగాత్మక సినిమా గురించి తనకు గొప్ప పట్టు అభినివేశమూ ఉండింది. నిజామాబాద్‌కు చెందిన కొందరు యువకులు ముందుకువచ్చి సినిమా నిర్మాణానికి ఉపక్రమించారు. ఆ జిల్లాలో పాదుకుని వున్న ‘జోగిని’ ఆచారం పైన రూపొందిన ఆ సినిమా ‘ప్రత్యూష’. దానికి జట్ల దర్శకత్వ బాధ్యతను నిర్వహించారు. శివారెడ్డి రచనా సహకారంతో పాటు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారు. వేములవాడలో మాకు అప్పటికే సాహిత్య పరంగా పరిచయం చనువు వున్న శివారెడ్డి గారిని ఫిలిం సొసైటీ కార్యక్రమానికి ఆహ్వానించాం. ప్రత్యూష సినిమా ప్రింట్ తన వద్ద వుంటే ఖైరతాబాద్ నుండి దాన్ని తీసుకొచ్చి గోకుల్ టాకీసులో వేశాం. ఉదయం ప్రదర్శన మధ్యాహ్నం గ్రామపంచాయతి మీటింగ్ హాలులో సెమినార్. అప్పటి వేములవాడ సర్పంచ్ ప్రతాప చంద్రమౌళి మాకు పూర్తి సహకారం అందించేవారు. సెమినార్‌తో పాటు కరీంనగర్ జిల్లా ఫిలిం సొసైటీల సమావేశం. అందులో కె.శివారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గోన్నారు. ప్రత్యూష సినిమా నేపథ్యం, నిజామాబాద్ యువకుల చొరవ, జోగిని వ్యవస్థ, దర్శకుడు జట్ల వెంకట స్వామి గురించి సవివరంగా గొప్ప చైతన్యవంతంగా మాట్లాడారు. నిర్దిష్ట, లక్ష్యం, నిబద్ధతతో కృషి చేస్తే యువకులు చరిత్ర నిర్మించవచ్చునని ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. వేములవాడ లాంటి మారుమూల సాహిత్య కార్యక్రమాలతో పాటు సమాంతర సినిమాల చర్చ జరగడం పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేసారు. ఇక ఆ రోజు పాల్గొన్న మరో అతిథి కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ జాతీయ అంతర్జాతీయ ఫిల్మ్ సొసైటీ ఉద్యమ నేపథ్యం, లక్ష్యాలను వివరించారు. గొప్ప చారిత్రక అధ్యయనంతో ఆయన మొత్తంగా ఫిలిం సొసైటీ ఉద్యమ రూపము, కర్తవ్యమూ వివరించారు. సిరిసిల్ల, జగిత్యాల కరీంనగర్ తదితర ప్రాంతాల నుండి వచ్చిన ప్రతినిధులకు మంచి ప్రేరణాత్మక సమావేశం అది. అందులో కిరణ్, రవీంద్ర, నగుబోతు ప్రభాకర్, నల్ల ప్రభాకర్, సిరిసిల్ల రుద్ర రవి, ఫసి, జగిత్యాల లక్ష్మీకాంత్ ఇట్లా ఎందరో పాల్గొన్నారు.

ఇక రెండవ సందర్భం బి.నరసింగ రావు ‘రంగుల కల’ నిర్మాణ సమయం. 9 అక్టోబర్ 1983 వేములవాడ ఫిలిం సొసైటీ ద్వితీయ వార్షికోత్సవ సందర్బం. అతిథిగా బి.నరసింగ రావుని పిలవాలని నిర్ణయించుకున్నాం. ఆయన అప్పటికే ‘మాభూమి’ నిర్మాతగా కళాకారుడిగా చాలా పాపులర్. అంతే కాకుండా ‘రంగులకల’ అన్న సినిమా తీస్తున్నారు. దానికి దర్శకత్వ బాధ్యతతో పాటు హీరోగా కూడా చేస్తున్నారు. రూప హీరోయిన్. ‘మాభూమి’ అప్పటికి ఉత్తర తెలంగాణా జిల్లాల్లో గొప్ప ఊపున్న సినిమా. ఇంకేముంది నేను హైదరాబాద్ వెళ్లి ఆయన్ని కలిసాను. వేములవాడ రావడానికి అంగీకరించారు. ఏర్పాట్లు మొదలు పెట్టాం. ఏవో అనివార్య కారణాల వలన కార్యక్రమం వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేనే మళ్ళీ వెళ్లాను. ఉదయమే సికింద్రాబాద్ ఆదయ్య నగర్‌లో వున్న వాళ్ళ ఆఫీసుకు చేరుకున్నాను. నరసింగ రావు గారికి విషయం చేప్పాను. ‘మీకు సమయం ఇచ్చాను ఉపయోగించుకోలేక పోయారు. ఇంకో తేదీ నాకు సాధ్యం కాదు. నాకూ సినిమా పనులున్నాయి’ అన్నారు. నేను హతాశున్ని అయ్యాను. ఆయన్ని ఎట్లా ఒప్పించాలో తెలీని స్థితి. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన దేవిప్రియ కలగ జేసుకున్నాడు. దేవిప్రియకు నేనూ జింబో వేములవాడ అప్పటికే బాగా తెలుసు. నర్సింగ్ అట్ల అనొద్దు. మారు మూల గ్రామంలో ఫిలిం క్లబ్ పెట్టి పిలిచినప్పుడు వెళ్ళాలి. వీలుజేసుకోవాలి అని సర్ది చెప్పారు. నాకు ధైర్యం వచ్చింది. నేనూ రిక్వెస్ట్ చేసాను. నరసింగ రావు అంగీకరించారు. నాతో పాటు మిత్రులూ వస్తారు అన్నాడు. అంతకంటేనా అన్నాను. ఫిలిం సొసైటీ జర్నల్ ‘చయనిక’లో వేయడానికి ‘రంగులకల’ స్టిల్స్‌కు చెందిన ‘బ్లాకులు’ తీసుకున్నాను. అప్పటికి ఆఫ్సెట్ ప్రింటింగ్ లేదు. ఫోటోలు అచ్చు వేయడానికి బ్లాకులే దిక్కు. తిరిగి అందజేయాలనే కండీషన్ మీద బ్లాకులు తీసుకుని బతుకు జీవుడా అంటూ తిరుగు ప్రయాణ మయ్యాను. అనాటి కార్యక్రమానికి బి. నరసింగ రావు, ప్రముఖ చిత్రకారుడు వైకుంఠం, సుదర్శన్, ఉప్పల నరసింహం పాల్గొన్నారు. వైకుంఠం గారిది వేములవాడ పక్కనే వున్న బూర్గుపల్లి గ్రామం. వేములవాడలో ఆయనకు బందువులు మిత్రులు వున్నారు. నాస్తాల్జిక్ అయిపోయారు. ఆ రోజున ఉదయం టాకీసులో సభ తర్వాత ఎప్పటిలాగే గ్రామ పంచాయత్ మీటింగ్ హాలులో సెమినార్. ఘనంగా జరిగిన సెమినార్‌లో బి.నరసింగరావు అంతర్జాతీయ సినిమా నుంచి మొదలు ప్రాంతీయ సినిమా దాకా అనేక విషయాల్ని సవివరంగా వివరించి ఉత్తేజ పరిచారు. జిల్లా అన్ని ప్రాంతాల నుంచీ ఫిలిం సొసైటీ కార్యకర్తలు కవులూ కళాకారులూ హాజరయ్యారు. అందరికీ, ముఖ్యంగా నాకు, అదొక చైతన్య సందర్భం. అంతమంది గొప్ప వాళ్ళతో వేములవాడ వీధుల్లో తిరగడం, నటరాజ్ హోటల్లో చాయ్ తాగడం ఇన్నేళ్ళ తర్వాత ఇప్పటికీ తాజా అనుభవంగానే వుంది. ‘చయనిక’లో ఫోటోలు వేయడం వ్యాసం రాయడం గెస్ట్ లకూ నచ్చింది.

***

ఇక నాకూ నాతో పాటు జిల్లాలోని అనేక మంది ఫిలిం లవర్స్‌కి EYE OPENER అనదగ్గ కార్యక్రమం ఫిలిం అప్రిసియేషన్ కోర్సు. కరీంనగర్ ఫిలిం సొసైటీ (9,10 ఏప్రిల్ 1983) రెండు రోజుల పాటు ఈ కోర్సుని మున్సిపల్ ఆడిటోరియం ‘కళాభారతి’లో నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా వున్న కళాకారులు కళాభిమానులు హాజరయ్యారు. అప్పుడు కరీంనగర్ ఫిలిం సొసైటీ అంటే దాని అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్, కార్యదర్శి రేణికుంట రాములు, డి.నరసింహా రావు, ఉప్పల రామేశంలు నాలుదిక్కులా నిలబడి నడిపే దిశా నిర్దేశకులు. నేను పీ.ఎస్. రవీంద్ర, ఇట్టేడు కిరణ్ వేములవాడ నుంచి, రుద్ర రవి, ఫసి, ముత్యం రెడ్డి సిరిసిల్లా నుంచి, ఆవునూరి సమ్మయ్య తదితరులు హుజురాబాద్ నుంచి, ఎన్.లక్ష్మీకాంత్ జగిత్యాల నుంచి ఇంకా అనేక మంది హాజరయ్యాం. కొడం పవన్, జూకంటి జగన్నాథం, నిజాం వెంకటేశం కూడా హాజరయ్యారు. అప్పుడు కరీంనగర్ ఫిలిం సొసైటీ గౌరవ అధ్యక్షుడిగా వున్న కలెక్టర్ ఆర్.చంద్రశేఖర్ అద్బుతమయిన సహకారం అందించారు. పూర్వ అధ్యక్షుడు అంపశయ్య నవీన్, కె.సాయి రెడ్డి తదితరులు కూడా సహకిరించిన వారిలో వున్నారు. ఫిలిం అప్రిసియేషన్ కోర్సును 8 ఏప్రిల్ శుక్రవారం జిల్లా పరిషద్ మీటింగ్ హాలులో సుప్రసిద్ధ దర్శకుడు, కెమెరామన్ శ్రీ నిమాయి ఘోష్ ప్రారంభించారు. మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యుట్‌లో అధ్యాపకులుగా వున్న శ్రీనివాసన్, రమణన్‌లు కోర్సులో బోధించడానికి వచ్చారు. ఆ ముగ్గురూ దాదాపు నలభై సంవత్సరాల క్రితం రైలులో ఖాజీపేట్ వచ్చి అక్కడినుండి కరీంనగర్ చేరుకున్నారు. ఎక్కడి మద్రాస్, ఎక్కడి రైలు స్టేషన్ కూడా లేని కరీంనగర్. ఎంత శ్రమ తీసుకున్నారో. వారి నిబద్ధతకు సలాం చేయాల్సిందే. నిమాయి ఘోష్‌ను చూడడం ఒక అనుభూతి. ఆయన సత్యజిత్ రే తో కలిసి పని చేసారు. ‘చిన్నమ్మూల్” సినిమాని రూపొందించారు. ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం సొసైటీస్‌కి దక్షిణ భారత ఉపాధ్యక్షుడిగా వున్నారు. ఆయన ఆ రోజు చేసిన ప్రారంభోపన్యాసం రికార్డ్ చేయదగినది. అసలు సినిమా అంటే ఏమిటి దృశ్య ప్రధానమయి భావాల్ని ఎంత ప్రతిభావంతంగా ఆవిష్కరిస్తుందో ఆయన వివరంగా చెప్పారు. హాలంతా పిన్ డ్రాప్ సైలెన్స్.

ఇక తర్వాతి రెండు రోజులూ కళాభారతిలో శ్రీనివాసన్, రమణన్‌ల సినిమా ఫిలిం అప్రిసియేషన్ కోర్సు క్లాసులు. పూనా ఫిలిం ఆర్కైవ్ నుంచి తెప్పించిన 16mm ఫిలిమ్స్‌ను ప్రదర్శిస్తూ వారిచ్చిన క్లాసులు ఎంతో గొప్పవి. అసలు సినిమాలో 24 ఫ్రేమ్స్ అంటే ఏమిటి, స్క్రీన్ ప్లే అంటే ఏమిటి ఎట్లా రాస్తారు, దృశ్యాన్ని ఎట్లా కన్సీవ్ చేస్తారు ఇట్లా ఒకటేమిటి ‘పతేర్ పాంచాలి’, ‘రాషోమాన్’, ఒక్కో సినిమా క్లిప్స్‌గా చూపిస్తూ వారు చెప్పిన అంశాలు నాకయితే మనసులో నిలిచిపోయాయి. అంతర్జాతీయ స్థాయిలో సినిమాను శ్రీనివాసన్ విశ్లేషించిన తీరు చిరస్మరనీయమయింది.

రెండవ రోజు సాయంత్రం ఫిలిం అప్రిసియేషన్ కోర్సు ముగింపు సమావేశంలో కలెక్టర్ ఆర్. చంద్రశేఖర్ అతిథిగా హాజరయి కోర్సులో హాజరయిన వారందరికీ సర్టిఫికెట్స్ ప్రదానం చేసారు.

అట్లా ఆ ఫిలిం అప్రిసియేషన్ కోర్సు అందరి మదిలో నిలిచి పోయింది. నాకయితే అర్థవంతమయిన సినిమాల్ని చూడడానికీ, అధ్యయనం చేయడానికీ ఎంతో కొంత విశ్లేషిస్తూ రాయడానికీ పునాది వేసింది. అందుకు నిమాయి ఘోష్, శ్రీనివాసన్, రమణన్ లకు రుణపడి వున్నాను. ఇంకా మా మిత్రుడు నరేడ్ల శ్రీనివాస్‌కి మనసారా కృతజ్ఞతలు.

మిగతా మళ్ళీ వారం…

(ఇంకా ఉంది)

Exit mobile version