Site icon Sanchika

యాదృచ్ఛికం?

[dropcap]సా[/dropcap]రథి అడ్మిన్ బ్లాక్ నుండి బయటపడ్డాడు. రిసెప్షన్ దగ్గర రఘు ఎదురు పడ్డాడు. “ఎక్కడికి” అంటూ రఘును కళ్ళతో పలకరించాడు సారథి. “ఒక ముఖ్యమైన ఫోన్ వచ్చింది. లీవ్ పెట్టి హైదరాబాద్ వెళుతున్నాను” అన్నాడు రఘు.

“నాదీ అదే పరిస్థితి. నేనూ అక్కడికే వెళుతున్నాను. పదండి కలిసి వెళదాము” అన్నాడు నవ్వుతూ సారథి.

ఇంతలో అదే ఆఫీసులో పని చేసే శ్రీధర్, మాణిక్యంలు స్కూటర్‌పై ఎటో వెళ్ళాలని బయలుదేరి, మెయిన్ గేట్ దాకా వెళ్ళి, మళ్ళీ స్కూటర్‌ను నెనక్కి తిప్పుకొని ఆఫీస్ వైపు వచ్చారు.

“ఏమిటీ హడావిడి. పోయిన వాళ్ళు వెనక్కి వచ్చారు” ప్రశ్నించాడు రఘు.

“చాలా ముఖ్యమైన పనిపైన బయలుదేరాము. గేటు దగ్గర ఉన్న టీ కొట్టులో పరమ శనిగాడు భండార్కర్ ఉన్నాడు. మమ్మల్ని చూసాడు. ‘కహా జారహే హై’ అంటూ పలకరించాడు. ఇంక మేము వెళ్ళినా లాభం లేదనుకొని, యేదో సమాధానం చెప్పి, వెనక్కి వచ్చాము”

ఆ మాటలతో రఘు కాస్తా నిరాశలో పడ్డట్లుగా కనిపించినా, తప్పక వెళ్లాల్సిన పని కావడంతో అసహనంగా ముందుకు కదిలాడు. ‘ఏమిటీ సమస్య’ అన్నట్లుగా చూస్తూ, సారథి కూడా ముందుకు కదిలాడు.

“మనం హైదరాబాద్‌కు వెళ్ళడానికి కనీసం మూడు, నాలుగు గంటలు పడుతుంది. అన్నీ వివరంగా చెబుతాను. ముందు మనం ఆ దరిద్రుడి కళ్లల్లో పడకుండా వెళ్ళాలి” అంటుండగానే, భండార్కర్ టీ త్రాగి, అటుకేసి వచ్చాడు.

“క్యా బై కహా జా రహే హై, చుట్టీ లగా యే క్యా! సారథి సాబ్! ఆప్ భీ జా రహే హై!” తమలపాకు నములుతూ, నవ్వుతూ ప్రశ్నించాడు.

“కొంచెం ముఖ్యమైన పని మీద వెళుతున్నాము” అంటూ రఘు ముందుకు కదిలాడు. “ఔను” అన్నట్లుగా తలూపుతూ సారథి రఘును అనుసరించాడు. బస్ స్టాండ్‌లో బస్సెక్కారు. బస్సు వేగంగా పరుగెడుతుంది.

“ఇంతకీ ఏమిటీ హడావిడిగా బయలుదేరారు” సారథి అడిగాడు.

“నెల రోజుల క్రింద మా అమ్మాయిని చూడడానికి పెళ్ళివారు వచ్చారు. మా అమ్మయిని చూసి వెళ్ళారు. మాకు ఆ సంబంధం చాలా నచ్చింది. అయితే చూసి వెళ్ళిన వాళ్ళు ఇన్ని రోజులు యే విషయం తేల్చలేదు. ఉన్నట్టుండి ప్రొద్దున, నేను ఆఫీసుకు వచ్చిన తరువాత,పెళ్లి కొడుకు తండ్రి ఫోన్ చేసాడు. ‘మీ ఆమ్మాయి మాకు నచ్చింది. మీరు వెంటనే బయలుదేరి వస్తే, అన్ని విషయాలు మాట్లాడుకుందాము. రేపటి నుండి మూఢాలు వస్తున్నాయి. ఈ రోజే మాటాముచ్చటలు చేసుకుందాము’ అన్నాడు. దానితో ఇలా అర్జెంట్‌గా లీవ్ పెట్టి మరీ బయలుదేరాల్సి వచ్చింది. మరి మీ సంగతి” అన్నాడు రఘు

“నేను ఐదు సంవత్సరాల క్రితం హైద్రాబాద్‌లో ఫ్లాట్ బుక్ చేసాను. బిల్డర్‌ను గుడ్డిగా నమ్మి ఇరవై లక్షలు దాకా ముట్ట చెప్పాను. ఒక రసీదు లేదు, కాగితం లేదు, ఒక డాక్యుమెంటూ లేదు. ఆ బిల్డర్ ఇప్పటి దాకా ఇల్లు కట్టలేదు. పోనీ స్థలం మా పేరు పైన రిజిస్టర్ చేయమన్నా చేయలేదు. డబ్బులైనా వెనక్కి ఇవ్వమంటే కుదరదన్నాడు. ఈ మధ్య కాలంలో రకరకాల ఇష్యూస్ అయ్యాయి. ఇన్ని రోజులు ఆ ఇష్యూతో బాగా నలిగిపోయాను. దానితో నేను పూర్తిగా ఆ డబ్బు పైన, ఫ్లాట్ పైన ఆశలు వదుకున్నాను. అయితే ఉన్నట్లుండి ఈ రోజు పొద్దున, ఆఫీసుకు వచ్చిన తరువాత అతడే ఫోన్ చేసి, ‘ఫ్లాట్ త్వరలో హ్యాండ్ ఓవర్ చేస్తాం. డాకుమెంట్స్ సిద్ధం అయ్యాయి. రిజిస్ట్రేషన్ కూడా చేస్తాం, ఒకసారి వచ్చిపొండి’ అన్నాడు. దానితో ఇలా బయలుదేరాను” అన్నాడు సారథి.

“వెరీ గుడ్. అయితే ఇద్దరం ముఖ్యమైన పనుల మీదే బయలుదేరాం” అన్నాడు రఘు.

“ఔనూ! మనం బయలుదేరుతుంటే మాణిక్యం వాళ్ళు ‘భండార్కర్ అక్కడ ఉన్నా’డంటూ, యేదో దయ్యాన్నో, భూతాన్నో చూసినట్లుగా వెనక్కి వచ్చారు. ఇంతకీ భండార్కర్ గారి కథేమిటి? మీరు కూడా అతడిని చూడగానే అదోలా ముఖం పెట్టారు” అడిగాడు సారధి.

“సార్! మీరు వచ్చి కొన్ని రోజులే అయింది. మీకు ఆయన గురించి తెలియదు. అయన పరమ శనిగాడు. పైగా ఆయనది ఐరన్ టంగ్. అయినా ఇపుడు మనం శుభం కోరి వెళుతున్నాము. ఆయనను గురించి చర్చించుకోవడం అనవసరం అనుకుంటాను”

“సార్! నేను మానవత్వాన్ని, భగవంతుడిని పరిపూర్ణంగా విశ్వసిస్తాను. నాకు ఈ పిచ్చి విశ్వాసాలపైన, శకునాలపైన నమ్మకం లేదు. మన మంచీ చెడులకు మనమే కర్తలము. వేరొకరి వలన మంచో, చెడో జరగడం నిజం కాదు. సరే! నా అభిప్రాయాలు అలా ఉండనివ్వండి. మీకు ఇబ్బంది లేకుంటే అతని గురించి చెప్పండి”

“నిజానికి ఇలాంటి విషయాలలో నేను మధ్యస్థుడిని. వీటిని పూర్తిగా నమ్మను. అట్లా అని కొట్టి పారేయను. అనుభవాలు మాత్రం అన్నిటికన్నా గొప్పవి అన్న విషయాన్ని మాత్రం పూర్తిగా నమ్ముతాను. ఆయన గురించి చెబుతాను వినండి” అంటుండగా, వేగంగా వెళుతున్న బస్సుకు హఠాత్తుగా యేదో వెహికిల్ ఎదురు రావడంతో, ఒక్కసారిగా డ్రైవర్ బ్రేక్ వేసాడు. అందరూ ముందుకు తూలారు.

“కండక్టర్! డ్రైవర్ ఇంతకు ముందు ఇసుక లారీ నడిపినాడా? ఆ స్పీడ్ యేందీ?” అసహనంగా ప్రశ్నించాడు ఒక ప్రయాణికుడు.

“యేమీ పరవాలేదు. ఆయన పర్‍ఫెక్ట్ డ్రైవర్. వారం రోజుల కింద ఆయనకు మా సంస్థ బెస్ట్ డ్రైవర్ అవార్డ్ ఇచ్చింది” అన్నాడు కండక్టర్. బస్సు మళ్ళీ వేగం పుంజుకుంది. తూలిన వారందరూ మళ్ళీ సీట్లలో సర్దుకున్నారు.

“మీరేదో చెబుతూ ఆగారు” అన్నాడు సారథి.

“పాపం శమించుగాక. దేవుడు మన పట్ల ఉండు గాక. అతని క్యారెక్టర్‌ను వర్ణిస్తూ చెబుతాను. వినండి” అన్నాడు రఘు. సారథి వినడానికి సిద్ధపడ్డాడు. బస్సు ప్రయాణంతో పాటు, వారి సంభాషణ కొనసాగుతుంది.

“ప్రవీణ్ రావు గణపతిరావు భోలేనాధ్ భండార్కర్! మన ఆఫీసులో సెక్షన్ ఆఫీసర్. పొట్టిగా లావుగా ఉంటాడు. చిలకమర్తి వారి గణపతి ఇతడేనా అన్నట్లుగా ఉంటాడు. ఎప్పుడూ, యేదో తింటూ, తాగుతూ ఉంటాడు. చాల మంచివాడు. ఏ మాత్రం కల్మషం లేని మనిషి. రెండు మూడు మంచి మాటలు మాట్లాడితే పొంగిపోయే బోళా శంకరుడు. ఇదంతా బాగుంది. ఇది నాణానికి ఒక వైపు. నాణానికి మరొక వైపు మరొకటుంది. ఎవరైనా ముఖ్యమైన పనుల మీద వెళుతుంటే అతడు ఎదురు పడినా, అతడు ‘ఎక్కడికి వెళుతున్నారు?’ అని ప్రశ్నించినా లేదా మనమేదైన ముఖ్యమైన పని మీద ఉన్నప్పుడు అతడు అక్కడికి వచ్చినా, అంతే.. వాళ్ళ పని బూడిదపాలు. వాళ్ళ పరిస్థితి సర్వ మంగళం.”

“ఊరుకోండి. మనుషులు ఎదురు పడితే, పలకరిస్తే, మాట్లాడిస్తే చెడు జరుగుతుందా?”

“అయ్యో! ఆయన యేమైనా నాకు పగవాడా అలా చెప్పడానికి”

“నాకు నమ్మ బుద్ది కావడం లేదు”

“మిమ్మల్ని నమ్మించాలని కాదు కాని, నేను కొన్ని జరిగిన విషయాలు చెబుతాను. ఆపై నమ్మడం,నమ్మక పోవడం మీ యిష్టం”

“చెప్పండి”

“ఆడిటర్ వెంకట్ రెడ్డి కొత్త కారు కొన్నారు. కొన్న మరునాడు ఆఫీసుకు తీసుకొని వచ్చారు. మొదటి అభినందన భండార్కర్ నుండి అందుకోవద్దని అనుకుంటుండగా, గేట్ లోనే ఎదురైన భండార్కర్, ‘రెడ్ది గారు కంగ్రాట్స్! హావ్ యే సేఫ్ డ్రైవ్’ అంటూ విష్ చేసాడు. దానితో వెంకట్ రెడ్డి గుండెలో భయం మొదలైంది. ఆయన భయపడినట్లుగా రెండవ రోజే కారు యాక్సిడెంట్ అయింది. కారు నుజ్జునుజ్జు అయింది. అదృష్టవశాత్తు చావును తప్పించుకున్నాడు.”

“దీనికి భండార్కర్ గారి పలకరింపుకు సంబంధమేమిటి? నాకయితే ఇది కేవలం యాదృచ్ఛికంగా తోస్తుంది”

“మరొక విషయం చెబుతాను. లేక లేక మన స్టోర్ కీపర్ రాధారాణికి నలభైయ్యవ సంవత్సరంలో పెళ్లి కుదిరింది. పెళ్ళికి మన స్టాఫ్ అందరం వెళ్ళాము. భండార్కర్ కూడా వచ్చాడు. ఆయన ఆ రోజు ఎటో వెళ్ళే తొందరలో ఉన్నాడు. పెళ్లికూతురు మెడలో తాళికట్టిన మరుక్షణం, వేదిక పైకి వెళ్ళి ‘దీర్ఘ సుమంగళీభవ’ అని దీవించి వెళ్ళిపోయాడు. అక్కడికీ మేము అతడిని యేదో మాటల్లో పెట్టి ముందే వెళ్ళకుండా ఆపే ప్రయత్నం చేసినా, తగుదునమ్మా అంటూ అందరికంటే ముందు వెళ్ళాడు. దీవించాడు. మేము అప్పటి నుండి యేదో కీడు శంకిస్తునే ఉన్నాము. మేము అనుకున్నట్లే అయింది. పెళ్ళి అయిన రెండు రోజులకే రాధారాణి భర్త గుండెపోటుతో మరణించాడు. ఇపుడేమంటారు”

“భండార్కర్ గారు కల్మషం లేని మనిషి. పైగా ఆయన ఎవరి దుఃఖాన్ని కోరడు. నాకు ఇదీ యాదృచ్ఛికమే అనిపిస్తుంది”

వేగంగా వెళుతున్న బస్సుకు మళ్ళీ యేదో అడ్డు రావడం, మళ్ళీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో బస్సులోనున్న వారు అందరూ ముందుకు తూలారు.

“ఏంది బై! డ్రైవర్ యేమన్న తాగిండా యేంది. చూస్తే చంపేట్టున్నడు” అన్నాడొక ప్రయాణికుడు.

“నేను రోజు ఈయన డ్రైవ్ చేసే బస్సులోనే ట్రావెల్ చేస్తాను. పర్‌ఫెక్ట్ డ్రైవర్” అన్నాడు మరొక ప్రయాణికుడు.

మళ్ళీ రఘు, సారథితో మాటలు కొనసాగించాడు.

“మీరు మన ఆఫీసులో ఉన్న ప్రతి సెక్షన్‌లో పని చేసే ఎవరినైనా అడగండి. భండార్కర్ ఎదురు కావడం వలననో, పలకరించడం వలననో, అభినందనలు తెలుపడం వలననో వాళ్లకు కలిగిన కష్ట నష్టాలను వివరిస్తారు”

సారథి ఆసక్తిగా వినసాగాడు.

“మీకు మరి కొన్ని విషయాలు చెబుతాను. ఆయనతో పాటూ మనం ‘టీ’ తాగుదామని వెళ్ళామనుకోండి. రేయింబవళ్ళు ‘టీ’అమ్మే వ్యక్తి, ఆ రోజు కనబడడు. లీవ్ కోసం బాస్ క్యాబిన్ వైపు వెళుతున్నాం అనుకోండి. అపుడే భండార్కర్ ఎదురుపడి, ‘క్యా లీవ్ లగా రహే హై క్యా’ అన్నాడనుకోండి, అంతే.. అంతకు ముందే ‘లీవ్ సాంక్షన్ చేస్తాను. లెటర్ పట్టుకు రండి’ అన్న బాస్ , క్షణాలలో ‘నో లీవ్’ అంటూ మాట మార్చేస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు సంఘటనలు, ఉదంతాలు. అనుకున్నవి జరుగవు, అనుకోని ప్రమాదాలు, ఊహించని పరిణామాలు ఎదురౌతాయి.”

“మీరిన్ని చెబుతున్నా నాకెందుకో యివన్నీ సహజంగాను, ఎపుడైనా, ఎక్కెడైనా, ఎవరికైనా జరిగేవే అనిపిస్తుంది. ఇవన్నీ యాదృచ్ఛికాలుగానే అనిపిస్తున్నాయి.”

“సరే! అయితే నేను చివరగా మన ఆఫీసులో జరిగిన ఒక సంఘటన చెబుతాను. మన సెక్షన్‌లో పని చేసే భాస్కర్, శేషూలు మీకు తెలుసు. చాలా జోవియల్. ఫన్ క్రియేటర్స్. వీళ్లు ఎప్పుడూ భండార్కర్‌ను టార్గెట్ చేస్తూ సెటైర్లు, జోక్స్ వేస్తుంటారు. అది మీరూ చూసి ఉంటారు. ఆయన కూడా వీటిని పెద్దగా సీరియస్‌గా తీసుకోకుండా, ‘నా పాలిట మీరు రాహువుకేతువులయ్యారు’ అంటూ, వారు వేసే జోక్స్‌ను లైటర్ వెయిన్‌లో తీసుకునేవాడు. ఒక రోజు భండార్కర్ గారు లీవులో ఉన్నాడు. ఆ రోజు మన బాస్ కూడా రాలేదు. బాస్ రాలేదంటే ఆఫీసుకు నేషనల్ హాలిడే ప్రకటించినట్లే కదా. ఎప్పుడూ సరదాగా ఉండే భాస్కర్, శేషూలకు యేమీ తోచలేదు.

“ఈ రోజు బండన్న రాలేదు. బోర్ కొడుతుంది” అన్నాడు భాస్కర్. భండార్కర్‌ను చాలా మంది ‘బండన్న’ అని ముద్దుగా పిలుస్తారు.

 “ఔనన్నా! నిజమే బండన్న లేకపోతే ఆఫీసు కళ తప్పింది” అన్నాడు శేషు.

అక్కడే ఉన్న సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ హరీశ్, “అన్నా! నాకొక ఉపాయం వచ్చింది. మనం బండన్న ఆఫీస్ చరిత్రలో ముఖ్య ఘట్టాలను రికార్డ్ చేద్దాము. ఆఫీసులో పని చేయబోయే ముందు తరాలకు మార్గదర్శకంగా ఉంటుంది. ఎనీ హౌ కొత్త సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేసాము. న్యూ వెర్షన్ విత్ గుడ్ కాన్ఫిగరేషన్” అన్నాడు. “గుడ్ ఐడియా!” అన్నాడు భాస్కర్.

భాస్కర్ ,శేషూ, హరీశ్ లు భండార్కర్ గారు ఆ సంస్థలో చేరినప్పటి నుండి ఏయే సందర్భాలలో ఎవరెవరిని ఎలా పలకరించాడో, వారికి ఎలాంటి దుర్గతులు పట్టాయో గుర్తు చేసుకుంటూ, చెప్పుకుంటూ, నవ్వుకుంటూ ఫార్మాట్ రూపంలో టైప్ చేయసాగారు. మధ్యలో భాస్కర్, “ఎప్పటికప్పుడు సేవ్ చెయ్యాలి. లేకుంటే కరెంట్ పోతుంది, జనరేటర్ పాడయి పోతుంది. ఎంతైనా బండన్న చరిత్రను రాస్తున్నాము” అంటూ నవ్వుతూ అన్నాడు.

“తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. అలాగే మీరు కూడా మీకేమీ కావద్దని దేవుడిని మొక్కుకోండి” అన్నాడు నవ్వుతూ హరీశ్.

అలా రెండు గంటల పాటు మిత్రులు నవ్వుతూ, తుళ్లుతూ టైప్ చేసారు. ఇంతలో లంచ్ అవర్ కావడంతో అందరూ లంచ్‌కు సిద్ధమయ్యారు. అంతే.. యేమి జరిగిందో తెలియదు. కంప్యూటర్ నుండి పొగలు వస్తూ ఒక్కసారిగా పేలిపోయింది. అందరూ ఉలిక్కిపడి లేచి, ఎవరికి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడి వారు అక్కడే సర్దుకున్నారు. ఇంక ఆ తరువాత అలాంటి సాహసాలు ఎవ్వరూ చేయలేదు”

“మీరెన్నైనా చెప్పండి. నా దృష్టిలో ఇది కూడా యాదృచ్ఛికమే.”

“అంటే చెడు దృష్టి, నరఘోష, శుభాశుభ శకునాలు యేవీ లేవంటారు. ఐరన్ టంగ్, ఐరన్ లెగ్ వంటి మాటలు వట్టిగానే వచ్చాయంటారు”

“చూడండి! మనం అపుడపుడు కొత్త పనికి, మంచి పనికి పూనుకుంటాము. ఆ ప్రయత్న ప్రారంభంలో ఎందరో ఎదురు అవుతుంటారు. పలకరిస్తుంటారు. ఒక వేళ మంచి జరిగితే అది మన ప్రయోజకత్వంగా, చెడు జరిగితే, ‘దరిద్ర ముఖాలు ఎదురయ్యాయి, దరిద్రుడు పలకరించాడు’ అంటూ ఎదుటి వాళ్ళ వల్లనే అలా జరిగింది అంటూ, మన అపజయాన్ని నిర్దాక్షిణ్యంగా ఎదుటి వాళ్ళకు అంటకడతాము. ఇది పూర్తిగా తప్పు. మనం చేసే మంచీ చెడులకు మనమే కారకులం. ఒక్కొక్కసారి ఎంత మంచి ప్రయత్నం చేసినా ఫలితం నెగిటివ్‌గా ఉండడం సహజం. దానికి ఇతరులతో సంబంధం లేదు. ఎప్పటికప్పుడు మంచి ఆలోచనలతో, మంచి పద్ధతులతో, మంచి పనులు మన శక్తికి తగినట్లుగా చేస్తూ పోవడం, ఫలితం గురించి ఆలోచించకపోవడం, అంతేకాక, ఆ ప్రయత్నంలో వచ్చే మంచీచెడులను సమానంగా స్వీకరించడం.. ఇదే నాకు తెలిసిన సిద్ధాంతం.

భగవద్గీత శ్లోకాలను ఉదహరిస్తూ చెప్పే తెలివితేటలు నాకు లేకపోయినా, పరమాత్ముడు కూడా ఇదే చెప్పాడని భావిస్తున్నాను. అనవసరంగా పక్క వ్యక్తులను అలా మాటలతో బాధించి ఐరన్ టంగ్, ఐరన్ లెగ్ అని వారికి ట్యాగ్ తగిలించి కామెంట్స్ చేయడం చాలా అమానుషం. నిష్కల్మషంగా, యే అసుర ప్రవృత్తి లేకుండా మనతో మాట్లాడే వారిని, అభినందించే వారిని ఇలా మాటలతో హింసిస్తే, మానవత్వాన్ని అవమానించినట్లే. ఇక్కడ మరొక విషయం చెప్పాలి.

ఒక్కొక్క సారి మనను బాగా ప్రేమించి, మన అభివృద్ధి కోరుకునేవారు ఎదురు వచ్చినా, విషస్ చెప్పినా మన పని పాడయిపోతుంది. దానికి మీరు ఏమంటారు? ఎంతో శ్రద్ధతో, సదుద్దేశంతో చేసే పూజలు, పునస్కారాలు ఫలించవు. పుణ్య క్షేత్రాలకు వెళ్లిన వాళ్ళు ప్రమాదాలకు గురి అవుతుంటారు. అంటే సోకాల్డ్ దరిద్రపు ముఖాల ఎఫెక్ట్ దేవుని దర్శన భాగ్యము కంటే గొప్పా? లేదా దేవుడు వాళ్ల పైన పగ బట్టి అలా చేసి ఉంటాడా? ఇదంతా ఉత్తి భ్రమ. మళ్లీ చెబుతున్నాను మన కష్ట సుఖాలు మనవి. భగవంతుడిని విశ్వసిస్తూ, అపజయాలను విశ్లేషించుకుంటూ గెలుపు కోసం ఆశావహ దృక్పథంతో, మన శక్తికి తగిన ప్రయత్నం చేస్తూ ముందుకు పోవాలి. ఇది నాకు తెలిసినది. అర్థమయినది.”

రఘు అర్థమయి, అర్థం కానట్లుగా, ఇది కాదు, ఇంకేదో ఉంది అన్నట్లుగా చూసాడు. కాని మౌనంగా ఉన్నాడు. సారథి పుస్తకం తీసాడు.

ఎదురుగా హెవీలోడ్‌తో లారీ వేగంగా వస్తుంది. వేగంగా బస్సును నడుపుతున్న డ్రైవర్ అప్రమత్తంగా ఉన్నాడు.

చెవిలో సెల్ ఫోన్‌తో, నోటిలో ఉన్న గుట్కాతో హెవీలోడ్‌తో డ్రైవ్ చేస్తున్న ట్రక్ డ్రైవర్ నోటిలో ఊరిన లాలాజలాన్ని ఉమ్మడానికి ముఖాన్ని కిటికి నుండి బయటికి పెట్టాడు. రోడ్డుపై పెద్ద గుంత వచ్చింది. దానిని తప్పించబోయాడు. కొన్ని సెకన్లు స్టీరింగ్ పట్టు తప్పింది. బస్సు డ్రైవర్ ఎదురుగా మృత్యు శకటమై వస్తున్న లారీని తప్పించబోయాడు. చేయలేకపోయాడు. ఆ తరువాత యేమి జరిగినదో తెలియదు. బస్సు దొర్లుతూ రోడ్దు పక్కన ఉన్న పల్లపు ప్రాంతంలో పడిపోయింది. పెద్ద శబ్దం. హాహాకారాలు. ఆర్తనాదాలు.

సీట్లలో ఉన్నవారు ఎగిరి పడ్దారు. కొందరు బయటికి విసిరి వేయబడ్డారు. కొందరు నలిగి పోయారు.

బస్సు బయట విసిరి వేయబడ్ద వాళ్లలో రఘు, సారథులు ఉన్నారు. ఇద్దరూ ఒకరికొకరు కనబడుతున్నారు. బహుశా బాగా దెబ్బలు తగిలినట్లున్నాయి. రఘు సారధితో, నీరసంగా పదాలు కూడ బలుక్కుంటూ, “ఇదీ యాదృచ్ఛికమేనంటారా?” అన్నాడు.

సారథి యేదో చెప్పాడానికి నోరు తెరిచాడు.

“…”

చేత కాక పోవడంతో కళ్ళు, నోరు మూసుకున్నాడు.

Exit mobile version