Site icon Sanchika

యాజ్యం

“కాలానికి కర్త వుండాడా తాత” అంటా కాకన్న తాతని అడిగితిని.

“ఉంటే గింటే (ఉండి వుంటే) కాలంలా వుండాల, కాలంలా కనపడాల, ఏడా లేనోడు, ఏడా కనబడనోడు కర్త ఎట్లవుతాడుపా” అనె.

“అయితే కర్త కత అంతే అంటావా తాత” అంట్ని.

“ఊపా! కాలానికి కర్త లేడు… కాని కాలం అలా వుంది అంతే… అంతా కాలంలో కలసి పోయేదే” అని ఆడనింకా పోయేకి సురువాయ తాత.

కానీ నేను విని పోయే రకం కాదు.

“కాలానికి కర్త లేనప్పుడు నాకి ఎవరుండారు. ఎవరు లేకుండా ఈ ‘నేను’ ఎవరు?” అంటా ఎదురు యాజ్యానికి దిగితిని.

“ఎదురు యాజ్యానికి ఎనకుండాల… బంతి బోజనానికి ముందుండాల అనేది పెద్దల మాట. నే వస్తాపా” అనే ఎల్లే ఎల్లీశ తాత కాలంలా కలసి పోయేపోయిశా… అయ్యో… అయ్యో…

సెకండ్లు, నిమిషాలు, గంటలు, దినాలు, వారాలు, నెలలు, ఏడాదులు కాలంలా కలసి పోతావుండాయి. రేపో మాపో నేనూ కాలంలా కలసి పోతాను. నాకిబుడు బాగా తెలుసు. నేను కాలం నింకా ఉనికి లాకి వస్తినని. ఈ ‘నేను… నేను… నేను’ కాలంలో బాగమని.

నా కత తెలిసింది.

ఇంక కాలం కతే మిగిలింది.

***

యాజ్యం=గొడవ/జగడం

Exit mobile version