[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘యాత్ర’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఉ[/dropcap]రుకులు పరుగుల కాలం నడుస్తుంది చిత్రంగా
ఉలుకని పలుకని నిశ్శబ్ద నది అలలా
దీర్ఘ కవితలా బతుకు సుదీర్ఘమే
వేళ్ళు రాయని పదపంక్తుల
కళ్ళు వినని భావోద్వేగాలు రంగుల కలలా
యాత్ర అద్భుతమే
ఆకాశ వీధుల కలిసే వెండి వెన్నెలలా
నడక అబ్బురమే
అవని అంచుల తిరిగే
సుందర పూల చల్లగాలిలా
ముడిపడని ఆశనిరాశల మేఘం
దాహం తీరని ఎడారి తలపున
ముడివీడని చినుకు తడి
ఊపిరి పూసే వసంత గీతం
పూల సుఖదుఃఖాల కాలం
నడిపిస్తుంది నిన్నూ నన్నూ మోస్తూ
బాధల పల్లకిలో ఆశల పందిరి
ఆనంద పల్లవిలో చీకటి వెలుగునీడల్లా