Site icon Sanchika

యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-12

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా తవణంపల్లి లోని ‘శ్రీ కాళభైరవేశ్వరస్వామి ఆలయం’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

తవణంపల్లి శ్రీ కాళభైరవేశ్వరస్వామి ఆలయం

[dropcap]11[/dropcap]-40కి సిద్ధేశ్వర కొండనుంచి బయల్దేరి మళ్ళీ టి. పుత్తూరు రామాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని 12 గంటలకు అక్కడనుండి బయల్దేరి తవణంపల్లిలోని కాళభైరవేశ్వరస్వామి ఆలయానికి వెళ్ళాము. దగ్గరే. టి.పుత్తూరు నుంచి 5 నిమిషాలు పట్టింది.

ఇంతకు ముందు దీని పేరు తవ్వలపల్లి. గాండ్ల (గౌండ్లు) కులస్తులు ఎక్కువ. నూనె ఆడిస్తారు. ఇక్కడ నూనె చాలా శ్రేష్ఠమైనది.

ఇది చాలా పురాతన ఆలయం. చిన్నదయినా చుట్టూ విశాలమైన స్ధలం వున్నది. ఆలయం వున్న ప్రదేశం చిన్న కొండలాగా వుంది.

ఆలయం చాలా పురాతనమైనదవటంతో పునర్నిర్మించాలని ఆలోచిస్తున్నారు. బెంగుళూరు వాస్తవ్యులు విగ్రహాలు ఇచ్చారుట. వాటితో కళ్యాణం చేస్తారు. పక్కనే కళ్యాణ మండపం వుది.

ఆలయం వారు ముద్రించినదాని ప్రకారం స్ధల పురాణం….

పూర్వం సుమారు 1000 సంవత్సరాల క్రితం కాణిపాకం గ్రామంలోని నీలకంఠేశ్వరస్వామి గుడిలో శ్రీ కాళభైరవేశ్వరస్వామి క్షేత్ర పాలకునిగా కొలువై వున్నాడు. స్వామివారికి నిత్యం ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు, ఉదయం మరియు సాయంత్రం వేళల్లో పూజలు చేస్తూ వుండేవారు. పూజారి గుడికి వెళ్ళే సమయంలో ఆయన కుమారుడు కూడా గుడికి వచ్చి కొంత దూరంలో పిల్లలతో కలిసి ఆడుకుంటుండేవాడు. పూజ అనంతరం బ్రాహ్మణుడు ప్రసాదమును గుడి పక్కన ఆడుకుంటున్న పిల్లలకు పంచి అక్కడే వున్న తన కుమారుని తీసుకుని ఇంటికి వెళ్ళేవాడు. ఒక రోజు సాయంత్రం పూజ చేయడానికి పూజారి గుడికి వెళ్ళాడు. అతని కొడుకు తర్వాత కొంత సమయానికి ఆడుకోవటానికి గుడి వద్దగల ఆట స్ధలం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ పిల్లలు లేక పోవటంతో కొంత సేపు అక్కడే చూసి, తన తండ్రి గుడిలో వుంటాడు కదా అని గుడికి వెళ్ళాడు. అప్పుడు అతని తండ్రి ప్రసాదం తయారు చేసే పనిలో వుండటంతో తన కుమారుని గమనించలేదు. తండ్రి తనను గమనించకపోవటాన్ని గ్రహించి, ఆ పిల్లాడు తన తండ్రిని ఆట పట్టించటానికి గర్భ గుడి తలుపు చాటున దాక్కున్నాడు. ప్రసాదం తయారు చేసి నైవేద్యం పెట్టే లోపు పిల్లవాడు నిద్రలోకి జారుకున్నాడు.

పూజారి పూజానంతరం యధా ప్రకారం తలుపు మూసి గడియ వేసి ఆట స్ధలం దగ్గరకు వెళ్ళి, పిల్లలకు ప్రసాదం పంచి, తన కుమారుడు ఎక్కడ అని పిల్లలను అడిగాడు. వాళ్ళు తమకు తెలియదు అని చెప్పగా పూజారి తన ఇంటికి వెళ్ళి భార్యను కుమారుడు ఎక్కడ అని అడుగగా, మీరు వెళ్ళిన తర్వాత అతను కూడా మీ వెనుకే వచ్చాడు అని సమాధానం చెప్పింది. పూజారి తన కుమారుడు ఆట స్ధలం వద్ద లేడు. గుడి వద్దకు రాలేదు. అని చెప్పటంతో, భార్యా భర్త ఇద్దరు కలిసి అన్ని చోట్లా వెతికారు. తన కుమారుని ఆచూకీ తెలియక పోవటంతో వాళ్ళు దుఃఖంతో విలపిస్తున్నప్పుడు ఒక పెద్దాయన వచ్చి మీ కుమారుడు గుడికి రావటం నేను గమనించాను. గుడిలో వెదకండి అని చెప్పాడు.. పూజారి, “నేను గుడిలోంచే వచ్చాను. అక్కడ నా కుమారుడు లేడు” అని తెలుపగా అందుకు అతని భార్య ఎందుకైనా మంచిది ఒకసారి గుడి వద్దకు వెళ్ళి చూద్దామని గ్రామస్తులతో కలిసి గుడి దగ్గరకు వెళ్ళి గుడి తలుపులు తెరువబోగా గుడి తలుపులు తెరుచుకోలేదు.

పూజారికి దుఃఖంతో కూడిన ఆవేశం ఎక్కువై ఏమి చెయ్యాలో అర్థం కాక, గుడిలో తమ బిడ్డ వున్నాడో లేడో చూడాలని గుడి తలుపులు బద్దలు కొట్టటానికి సిధ్ధమయ్యాడు. ఆ ఊరి పెద్దలు వారించినా, పూజారి వినకుండా గునపంతో తలుపులు పగలగొట్టటానికి ప్రయత్నించాడు. వెంటనే లోపలనుంచి, “నీ కుమారుడు హాయిగా నిద్రిస్తున్నాడు. నిద్రాభంగం కలిగించకుండా రేపు ఉదయం వచ్చి నీ కొడుకుని తీసుకుని వెళ్ళు” అన్న మాటలు వినిపించాయి. దానితో పూజారికి, భార్య, గ్రామస్తులు నచ్చచెప్పి ఇంటికి తీసుకుని వెళ్ళారు.

దేవుని విగ్రహం మాట్లాడటం ఏమిటని అనుమానంతో రాత్రి వేళ పూజారి ఒక్కడే గుడి దగ్గరకు వెళ్ళి, గుడి తలుపులు పగలగొట్టటానికి ప్రయత్నించగా, గుడిలోంచి భీకర గంభీర ధ్వనులతో, “నీవు గుడి తలుపులు పగుల కొట్టి లోనికి ప్రవేశిస్తే, నీ కుమారుని పదహారు ముక్కలుగా చేస్తాన”ని మాటలు వచ్చాయి. కానీ, పూజారి ఆ మాటలు వినిపించుకోకుండా తలుపులు బద్దలు కొట్టి గుడిలోనికి ప్రవేశింపగా అతని కుమారుడు పదహారు ముక్కలుగా పడి వున్న దృశ్యాన్ని చూసి పూజారి దుఃఖంతో ఏడ్చి మతి భ్రమించి తన కుమారుడి పదహారు ముక్కలుగా చేసిన దేవుని విగ్రహం వుండకూడదని శ్రీ కాళహస్తేశ్వరస్వామి విగ్రహాన్ని అదే గునపంతో బద్దలు చేసి, ఒక గంపలో వేసుకొని తెచ్చి భవనంపల్లి (తవణంపల్లి)లో వున్న ఎత్తయిన గుట్టపై పెట్టాడు. అప్పుడు ఆ శ్రీ కాళ భైరేశ్వర స్వామి, “నాకు ఇటువంటి పరిస్ధితి ఏర్పరిచిన నీకు మగ సంతానమే లేకుండా పోవుగాక.” అని శాపం ఇచ్చాడుట. ఆ శాపం వలన ఇప్పటికీ ఆ పూజారి వంశస్తులకి ఆడ పిల్లలేగానీ మగ పిల్లలు కలగలేదు. ఆ ఆడ పిల్లలకి పుట్టిన మగ పిల్లలే పూజలు చేస్తున్నారు.

తర్వాత తవణంపల్లి లింగాయత్ వంశస్ధుల స్వప్నంలో దేవుడు కనిపించి నేను మీ ఊరి గుట్టపైన వెలసియున్నాను. నాకు గుడి కట్టి పూజలు చేయవలసినదిగా వివరించాడు. తర్వాత గ్రామస్థులకు ఈ విషయం తెలియజేసి అందరూ కలిసి గుట్ట పైకి వెళ్ళి చూడగా, దివ్యమైన తేజస్సుతో ప్రకాశవంతమైన కాంతులతో, శ్రీ కాళభైరవేశ్వరస్వామి విగ్రహం కన్పించినది. అంతకు ముందు లేని విగ్రహం అప్పుడు కనబడటంతో గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు . స్వామికి గుడి నిర్మించి, పూజలు చేయడం ప్రారంభించారు.

ఇక్కడ గర్భగుడిలో కాళ భైరవేశ్వర స్వామి వున్నాడు. ఆయనకి ముందు పెద్ద శివలింగం వున్నది. దానికి కూడా ఒక కధ వున్నది. ఆ లింగం కాణిపాకం పక్కన బాహుదానదిలో దొరికితే బండి మీద ఇక్కడికి తీసుకొచ్చి రాత్రికి బండి బయట ఆపారుట. తెల్లవారి చూసేసరికి లింగం బయటలేదు. గుడి లోపల వుంది. బయట రాయి మీద బండి వచ్చి ఆగినట్లు చక్రాల గుర్తులున్నాయి. గట్టి రాతి నేల మీద బండి గుర్తులు వుండటం ఆశ్చర్యం అన్నారు.

ఇంకొక అద్భుతం ఏమిటంటే ఈ లింగం పెరుగుతోంది. ఇది వరకు దుత్తలతో పాలు, నీరు వగైరాలతో అభిషేకం చేసేవారుట. ఇప్పుడు పై కప్పుకు లింగానికి మధ్య దుత్త పట్టదు.

పక్కనే కళ్యాణ మండపం వున్నది. అక్కడి విశేషాలు తెలిపినవారితో కలిసి ఫోటో తీయించుకుని బయటకొచ్చాము. అక్కడ రాతి మీద బండి చక్రాల గుర్తులే కాదు .. ఇంతకు ముందు నేను చూడని ఇంకొక విశేషం చూపించారు. అది తెలుసుకోవటానికి వచ్చే వారం దాకా ఆగాల్సిందే మరి.

Exit mobile version