యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-17. స్కంద పుష్కరిణి, 18. దశావతార పుష్కరిణి

0
2

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా కార్వేటి నగరం సమీపం లోని ‘స్కంద పుష్కరిణి’ గురించి, వేపంజర్ల లోని ‘దశావతార పుష్కరిణి’ గురించి, వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

17. స్కంద పుష్కరిణి:

[dropcap]ఈ[/dropacap] వారం చిత్తూరు జిల్లాలోని రెండు పుష్కరిణిల గురించి చెప్తాను. కార్వేటి నగరంనుంచి మేము భోజనాలయ్యి 3-35కి స్కంద పుష్కరిణి చేరుకున్నాము. చూడటానికి కన్నుల పండుగగా వున్నది. విశాలమైన పుష్కరిణి. అక్కడ రాజరాజేశ్వరి పీఠం వున్నదిట. కొంచెం దూరంలో కొండలు. ఒక కొండమీద మురుగన్ ఆలయం వుందిట. మొదట్లో అక్కడ త్రిశూలం మాత్రం వుండేదిట. తర్వాత ఆలయ నిర్మాణం జరిగింది. కొండ ఎక్కలేక కిందనుంచే స్వామికి నమస్కారం. కెమేరా జూమ్ చేసి ఆలయం ఫోటో.

విశాలమైన పుష్కరిణి చూసేసరికి చాలా హాయిగా అనిపించింది. కొంత సేపు అక్కడే కూర్చోవాలనిపించింది. కానీ సమయం మమ్మల్ని తరుముతోంది కదా. ఇదివరకు ఈ పుష్కరిణిలో తామర పువ్వులు చాలా వుండేవిట. అంత పెద్దపుష్కరిణిలో తామర పువ్వులను ఊహించుకుని సంబరపడి పోయాము. చుట్టు పక్కలంతా శుభ్రంగా కూడా వున్నది.

పుష్కరిణి ఎదురుగా చిన్న చిన్న దేవాలయాలు వున్నాయి. అందులో మురుగన్‌ది ఒకటి. స్వామిని సందర్శించుకుని అక్కడనుండి తప్పనిసరై బయల్దేరాము.

18 దశావతార పుష్కరిణి:

అక్కడనుంచి వేపంజర్ల వచ్చాము. ఇక్కడ పురాతన లక్ష్మీనారాయణ స్వామి ఆలయం వున్నది. దాని గురించి తర్వాత చెప్తాను. ముందు ఇక్కడ పుష్కరిణి గురించి చెబుతాను. ఆలయానికి కొంచెం దూరంలోనే వుంది ఈ దశావతార పుష్కరిణి. దీనికి టికెట్ వుందండోయ్. మనిషికి 30రూపాయలు. టికెట్ తీసుకుని లోపలకెళ్ళాము. స్కంద పుష్కరిణికంటే కొంచం చిన్నదే. కానీ చాలా ఆకర్షణలు వున్నాయి.

పుష్కరిణి చుట్టూ దశావతారాల విగ్రహాలు. ఎదురుగా శేషశయన విష్ణుమూర్తి పెద్ద విగ్రహం. పుష్కరిణి మధ్యలో కాళీయమర్దన కృష్ణుడి విగ్రహం.

పక్కనే నక్షత్ర వనం. మానవులమీద నక్షత్ర ప్రభావం వుంటుందని మనం విశ్వసిస్తాము. మానవాళి మంచి చెడ్డలు, జయాపజయాలు, అదృష్ట దురదృష్టాలపై నక్షత్రాల ప్రభావం వుంటుందని మనం విశ్వసిస్తాము. మనం చెప్పుకునే 27 నక్షత్రాల ప్రభావం 27 చెట్లపై వుంటుందిట. దీనికోసం ఎంతో ఆలోచించి నక్షత్రవనాన్ని ఏర్పాటు చేశారుట. ఆ నక్షత్రాలవారు ఆ చెట్లని పూజిస్తారు. ఈ వనంలో గుండ్రంగా ప్రతి నక్షత్రానికి సంబంధించిన చెట్టు వివరాలతో వున్నది. వాటి ముందు నవగ్రహాలు, మధ్యలో భార్యా సమేత త్రిమూర్తులు. ఇంకా ఇక్కడ లక్ష్మీ నారాయణ స్వామితోబాటు అష్టలక్ష్మీ నిలయ, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్, శ్రీ యోగ నరసింహస్వామి తదితర దేవాలయాలు ఒకే చోట ఏర్పాటు చేసి నిత్య పూజలు జరుకపుతున్నారు. ప్రతి ఆదివారం స్వామికి కళ్యాణోత్సవం వుంటుందిట. అవివాహితులు, సంతానం లేనివారు స్వామివారికి నివేదించుకుని భక్తి శ్రధ్ధలతో కోరితే కోరికలు తీరుతున్నాయని పలువురు భక్తులు చెబుతున్నారుట. ఇంకొక విశేషం… ఆలయ ట్రస్టీ శ్రీ కె.ఎస్. శ్రీధర్ భక్తులకు వైద్యసేవలందించే నిమిత్తం ఉచిత వైద్యశాలను కూడా నిర్మించినట్లు తెలిపారు.

అంతా వివరించానుగానీ అసలు సంగతి చెప్పలేదు. ఇక్కడ 21 అడుగుల దశావతార విగ్రహం వున్నదండీ. ఇందులో విష్ణుమూర్తి దశావతారాలు దర్శనమిస్తాయి. ఇలాంటి విగ్రహాన్నే కొంతకాలం క్రితం విజయవాడ సమీపంలో పెద్ద గుడి కట్టి ప్రతిష్ఠించారు. విగ్రహానికి ముందు వెంకటేశ్వరస్వామి నామంలా అందంగా ఏర్పాటు చేశారు. ఈ పుష్కరిణిని దర్శించటంవల్ల దైవారాధన, మానసిక ప్రశాంతత రెండూ చేకూరుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here