యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-19: వేపంజేరి

0
3

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా వేపంజేరి లోని ‘శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం, వేపంజేరి.

[dropcap]సం[/dropcap]స్కృతంలో వేం అంటే పాపములు, పంచ అంటే అయిదు, హరి అంటే హరించేది అని అర్థం. ఈ మూడు వదాలు కలిపితే వేంపంచహరి అవుతుంది. సామాన్య మానవులకు తెలిసీ తెలియక పంచేంద్రియాలతో చేసే పంచమహా పాతకాలను పోగొట్టే శ్రీమన్నారాయణుడు వెలిసిన పవిత్ర క్షేత్రం ఇది. ఇచటి స్వామి వలెనే ఈ క్షేత్రం కూడా పంచమహా పాతకాలను సైతం హరించే శక్తిని కలిగివుందని, అందువల్ల దానికి కూడా వేంపంచహరి అనం పేరు వచ్చిందట. కాలక్రమంలో ఆ పేరు వేపంజేరి కింద మారిందంటారు.

200 సంవత్సరాల క్రితం నిర్మింపబడిన ఈ ఆలయం శిధిలావస్ధకు చేరుకోగా, స్ధానికులు, భక్తులు పూనుకుని 1986లో ఆలయాన్ని పునరుధ్ధరించారు. అప్పటినుండి స్వామికి నిత్యారాధనతోబాటు, ఆయా విశేష దినాలలో విశేషోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి.

శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి

ఆలయంలో స్వామి తన ఎడమ ఊరువు మీద సిరులిచ్చే లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకుని శ్రీ లక్ష్మీ సమేత నారాయణస్వామిగా దర్శనమిస్తారు. శ్రీ స్వామివారి సుదర్శన చక్రం కూడా గర్భగృహంలో దర్శనమిస్తుంది.

స్ధల పురాణం

ఇప్పటి చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతాన్ని ఇదివరకు తొండమండలం అనేవారు. ఈ తొండమండలం దేవాలయాలకి ప్రసిధ్ధి చెందినది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించిన ఒక రాజు తన ఇష్టదైవమైన శ్రీమన్నారాయణుడికి ఆలయం నిర్మించాలనుకున్నారు. అదే ఆలోచనలతో ఆయన నిద్రించినప్పుడు ఒక కల వచ్చింది. శ్రీమన్నారాయణుడు జ్యోతి స్వరూపుడుగా కనిపించి, ఒక నిర్ణీత ప్రదేశాన్ని చూపించి అదృశ్యమయ్యాడు. రాజు పరమానందంతో మర్నాడు తనవారందరినీ తోడ్కొని, మేళతాళలతో, పూర్ణకుంభంతో ఆ ప్రదేశాన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆ స్ధలంలో పూర్ణకుంభాన్ని వుంచాడు. “ఇక్కడే నాకు జ్యోతి దర్శనం జరిగింది. జ్యోతి ఇక్కడే అదృశ్యమయింది. దేవుడు నిర్దేశించిన దివ్య స్ధలం ఇదే” అంటూ పూర్ణకుంభాన్ని అక్కడ వుంచాడు. అందరూ ఓం నమో నారాయణా అంటూ నారాయణుని దివ్యనామాన్ని కీర్తించారు. వేద పండితులు వేద మంత్రాలు చదివారు. అక్కడ చేరినవారంతా నారాయణ నామస్మరణ చేస్తుండగా అక్కడ నారాయణుడు జ్యోతి స్వరూపంగా ప్రత్యక్షమయ్యాడు. తర్వాత ఆలయ నిర్మాణం జరిగింది.

ఆళ్వారుల సందర్శన

దక్షిణ భారత దేశంలో, ముఖ్యంగా తమిళనాడులో విష్ణుభక్తి వ్యాప్తికి కృషి చేసిన ఆళ్వారులలో పలువురు ఈ ఆలయాన్ని దర్శించారు. తిరుమంగై ఆళ్వార్, నమ్మాళ్వార్, విశిష్టాద్వైత సిధ్ధాంత సంస్ధాపకుడైన శ్రీ రామానుజాచార్యులు తిరుమల ప్రయాణంలో ఈ ఆలయాన్ని దర్శించారుట.

ప్రస్తుతం ఇక్కడ శ్రీ జానకిరామిరెడ్డి గారు ఛైర్మెన్‌గా వున్నారు. ఈయన ఆలయం విషయంలో అత్యంత శ్రధ్ధ తీసుకుంటున్నారు. ఆలయంలో ఇంకా నిర్మాణాలు జరుగుతున్నాయి.

శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దర్శనం తర్వాత అక్కడనుండి బయల్దేరాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here