Site icon Sanchika

యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-2

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా చిత్తూరు లోని ‘శ్రీ కామాక్షీ సమేత శ్రీ అగస్త్యేశ్వరస్వామి దేవస్ధానం’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

శ్రీ కామాక్షీ సమేత శ్రీ అగస్త్యేశ్వరస్వామి దేవస్ధానం, ఈశ్వర గుడి వీధి, చిత్తూరు:

2019 ఫిబ్రవరి 1వ తారీకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరి మర్నాడు ఉదయం 9-25కి చిత్తూరు చేరుకున్నాము. శ్రీ సాంబశివ రెడ్డికి, శ్రీ పురందర రెడ్డికి మా ప్రోగ్రామ్ సంగతి ముందే తెలియజెయ్యటంతో హోటల్ రూమ్, తిరగటానికి కారు ఏర్పాటు చెయ్యటమే గాక ఆ నాలుగు రోజులూ వాళ్ళ పనులు మానుకుని మాతో అన్ని ఆలయాలకీ తిరిగి చూపించారు. మేము చిత్తూరు జిల్లాలో ఇంత తక్కువ సమయంలో ఇన్ని ఆలయాలు చూశామంటే కారణం వారే. గూగుల్‌లో వెతికితే ప్రసిధ్ధ ఆలయాల పేర్లు తప్పితే ఎక్కువ కనబడలేదు. అందుకే కొంతకాలం అసలీ జిల్లాలో ఎక్కువ ఆలయాలు ఏమీ లేవు అనుకున్నాము. కానీ వెళ్ళాక చాలా విషయాలు తెలుసుకున్నాము.

స్నానాలు వగైరా కానిచ్చి 11-15కల్లా ఆలయ సంచారానికి బయల్దేరాము. అందరు రాముళ్ళకన్నా ముందు ఆత్మారాముడు ముఖ్యంగనుక ముందు రైల్వే స్టేషన్ దగ్గరలో వున్న విష్ణు భవన్‌లో టిఫెన్ చేశాము. అది చిత్తూరులో ఫేమస్ హోటల్. మా అబ్బాయి అరుణాచలంలో చదువుతుండగా చూడటానికి వెళ్ళేటప్పుడు చిత్తూరు వెళ్ళే వెళ్ళేవాళ్ళం. అప్పుడే అలవాటయిందీ విష్ణుభవన్‌లో తినటం.

తర్వాత ఈశ్వరగుడి వీధిలోని శ్రీ కామాక్షీ సమేత శ్రీ అగస్త్యేశ్వరస్వామి ఆలయానికి వెళ్ళాము. ఇది పురాతన శివాలయం. పూర్వం చిత్తూరు పేరు చిత్+పురి. చరిత్ర ప్రకారం ఆర్కాడ్ నవాబుల కాలంలో ఇక్కడ కోట వుండేది. ఇప్పుడు లేదు. ఆ ప్రదేశంలో ప్రభుత్వ ఆసుపత్రి వుంది. ఇంకా అన్నీ నూతన కట్టడాలే.

ఆలయం పేరు శ్రీ కామక్షీ అంబాళ్ సమేత అగస్తేశ్వరస్వామి ఆలయం. మేము వెళ్ళేసరికి అప్పుడే తలుపులు వేశారు. మళ్ళీ తియ్యమన్నారు. పూజారిగారు వచ్చి బాగానే మాట్లాడారు. ఆ రోజు శని త్రయోదశి. సాయంకాలం నందీశ్వరుడికి ప్రదోషకాల పూజ జరుగుతుంది. చాలా బాగుంటుంది. రమ్మన్నారు.

ఆలయం అంతా తిరిగి చూశాము. పెద్దదే. ధ్యాన మండపంలో తిరువళం శివానంద మౌన గురుస్వామి విగ్రహం వుంది. ఆయన ఇక్కడ కొంతకాలం వుండి ఆలయాన్ని పునరుధ్ధరించారుట. అమ్మవారు కామాక్షి. స్వామిని అమ్మవారిని, మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు చూశాము. సాయంకాలం మళ్ళీ మేము వచ్చేసరికి నందీశ్వరుడి దగ్గర ప్రదోషకాల పూజ పూర్తయింది. పూజ సమయానికి రాలేక పోయాము చాలా తిరగటంతో.

స్ధల పురాణం:

శ్రీ మునిశేఖర్, కార్యనిర్వహణాధికారి, శ్రీ సి.ఎన్. శివకుమార శివాచార్యులు (స్ధానిక అర్చకులు) ఇచ్చిన కరపత్రం ప్రకారం….

అగస్త్య మహర్షి ఇంకా ఇతర ఋషులు శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చూడటానికి కైలాసగిరికి వెళ్ళినప్పుడు వారందరి బరువుతో ఉత్తర భాగం కృంగి దక్షిణ భాగం పైకి లేచింది. దీనిన గమనించిన పరమేశ్వరుడు అగస్త్య మహర్షిని దక్షిణ దిక్కునకు వెళ్ళమని అక్కడనుండి తన కళ్యాణాన్ని వీక్షించవలసినదిగా ఆజ్ఞాపించాడు. అగస్త్య మహర్షి పరమేశ్వరుని ఆజ్ఞ ప్రకారం దక్షిణ భారత దేశానికి వచ్చి, తన పూజల నిమిత్తం అనేక ప్రదేశాలలో పరమేశ్వరుని స్ధాపించి పూజిస్తూ తన ప్రయాణం సాగించాడు. ఇలా అగస్త్య మహర్షి స్ధాపించిన శివలింగాలన్నీ ఆయన పేరుతో అగస్త్యేశ్వరస్వామి గా పూజలందుకుంటున్నాయి. దక్షిణ భారత దేశంలో అందుకే అగస్త్యేశ్వరాలయాలు ఎక్కువ వుంటాయి. వాటిలో ఇది కూడా ఒకటి అంటారు.

ఇది చాలా పురాతనమైన దేవాలయం. ఈ ఆలయానికి ఈశాన్య భాగంలో ఒక బావి వుంది. దానిని సూర్య పుష్కరిణీ అంటారు. స్వామికి వాయువ్య భాగంలో వున్న బిల్వ వృక్షం స్ధల వృక్షం. స్వామికి ఉత్తరంగా కూడా ఒక బావి వున్నది. దానిని చంద్ర పుష్కరిణి అంటారు.

ఇక్కడ అగస్త్య మహర్ష శివ పూజ కోసం నీళ్ళు కావాల్సి వచ్చి తన కమండలంలోంచి కొద్ది నీరు అక్కడ చల్లి.. నీ వా.. అని పిలిచారుట. అప్పుడు అక్కడ ఒక నదీ ప్రవాహం వచ్చిందని, ఆ నదిపేరు నీవాగా ప్రసిధ్ధి చెందింది అంటారు. ఇప్పుడు ఆక్రమణలవల్ల ఆ నది పరీవాహక ప్రాంతం తగ్గిపోయి, ఎక్కడన్నా చిన్న కాలువలా కనబడుతుందిట.

అమ్మవారు శ్రీ కామాక్షి. ఇంకా ఈ ఆలయంలో శ్రీ మీనాక్షీ సుందరేశ్వర్ల ఆలయం, అంబికా సమేత నటరాజస్వామి, విఘ్నేశ్వరుడు, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఇంకా అనేక దేవతామూర్తుల ఉపాలయాలున్నాయి.

ఈ ఆలయము కామిక ఆగమమునకి చెందినది. ఆలయంలో ప్రదోష పూజలు, శ్రీ కాలభైరవ అష్టమి విశేషంగా జరుగుతాయి.

కంచి మహా స్వాములవారు, శృంగేరి స్వాములవారు ఈ ఆలయాన్ని దర్శించారు. అర్చకులు వంశ పారంపర్యంగా ఏడు తరాలనుంచీ స్వామిని సేవిస్తున్నారు.

పక్కనే వెంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి ఆలయాలు వున్నాయి. అవి తెరిచే వుంటాయి అంటే అటు బయల్దేరాము. వచ్చే వారం వాటి విశేషాలు.

Exit mobile version