యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-23: మొగిలి

0
3

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా మొగిలి లోని మొగిలీశ్వరాలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

మొగిలి:

[dropcap]ఉ[/dropcap]దయం 10 గంటలకి మొగిలి వెంకటగిరి రామాలయం నుంచి మొగిలిలో మొగిలీశ్వరాలయానికి వచ్చాము. ఆలయం కొంచెం పెద్దదే. చాలా పురాతనమైన ఆలయం. భక్తుల సందడి చాలా ఎక్కువగా వున్నది. పూజలు చేయించుకుంటున్నారు. కార్యనిర్వహణాధికారి శ్రీ బి. చంద్రమౌళిగారిని కలిశాము. స్ధల పురాణం గురించి అడిగితే ఆఫీసులో లేకపోయినా, తన సంచీలో వున్న ఒక్క కాపీ నాకిచ్చారు. దాని ప్రకారం….

పూర్వం బ్రహ్మ, విష్ణుల మధ్య ఎవరు గొప్ప అనే తగాదా రావటం, వారు శివుడి దగ్గరకు వెళ్ళటం, శివుడు తన తేజో లింగం ఆద్యంతాలు ఎవరు ముందు కనుక్కుంటారో వారే గొప్ప అనటం, ఇరువురూ ఆ పోటీలో ఓడిపోవటం కధ అందరికీ తెలిసిందే కదా. ఆ సమయంలో బ్రహ్మ ఒక గోవు, మొగలి పువ్వుల సహాయం తీసుకోవటంతో వాటికి కూడా శాపాలు వస్తాయి. ఆ రెండూ పరమేశ్వరుని ప్రార్థించి కొద్దిగా శాప విమోచనాన్ని పొందుతారు. మొగలి పువ్వు పరి పరి విధాల శివుణ్ణి ప్రార్థించగా, శివుడు భూలోకంలో నీ పేరు మీదుగా స్వయంభువుగా అవతరించి పూజలందుకుంటాను. ఆ విధంగా నీ పేరు ఆ చంద్రతారార్కంగా నిలచిపోతుందని వరమిచ్చాడు. పార్వతీ వల్లభుడు స్వయంభువుగా మొగలి పొదల ప్రక్కన ఒక చెలమలో అవతరించాడు. అప్పుడు ఆ ప్రాంతమంతా మొగలి పొదలతో కప్పబడి వున్నందున ఆ లింగము ఎన్నో ఏళ్ళపాటు ఎవరికీ కనిపించలేదు.

తర్వాత ఆ శివుణ్ణి ఎలా కనుక్కున్నారు అనే దానికి ఒక కథ వున్నది.

ఆ మొగలి పొదల సమీపంలో మొగిలివారి పల్లె అనే గ్రామం వుండేది. దానిలో ఒక బోయ దంపతులు వుండేవారు. వారు చాలా పేదవారు. ఆ బోయవాని భార్య నిండు చూలాలుగా వున్నప్పుడు ఒక రోజు కట్టెలకోసం అడవిలోకి వెళ్ళింది. అక్కడే అకస్మాత్తుగా నొప్పులు వచ్చి పండంటి బిడ్డని ప్రసవించింది. మొగిలి పొదల దగ్గర పుట్టాడుగనుక ఆ పిల్లాణ్ణి అంతా మొగిలప్ప అని పిలవసాగారు.

మొగిలప్ప చిన్ననాటినుండి ఉత్సాహంగా తిరుగుతూ, తల్లిదండ్రులకు సహాయంగా వుండేవాడు. కొంచెం పెద్దయ్యాక అదే వూరిలో ఒక పెద్ద రైతు ఇంట్లో పనికి కుదిరి, ఆ ఇంటి పశువులను సమీపంలో అడవిలో మేపుకొస్తూ వుండేవాడు. వస్తూ వస్తూ యజమానికి, తమ ఇంటికి కావలసిన వంట చెరకు కూడా అడవి నుంచి తెచ్చేవాడు.

ఒకనాడు మొగిలప్ప అడవిలో పశువులను మేపుతూ వంట చెరకు కోసం ఎండిన మొగిలి పొదలు నరకసాగాడు. కొద్దిసేపటికి అకస్మాత్తుగా కంగుమని శబ్దము వినిపించి రక్తము ఎగజిమ్మింది. అది అంతకంతకు అధికమై అక్కడున్న చెరువంతా రక్తమయమయ్యింది. మొగిలప్ప భయంతో మొగిలి పొదలను తొలగించి చూడగా రక్తము ధారాపాతంగా కారుతున్న శివలింగము కనిపించింది. వెంటనే ఆ బోయవాడు (మొగిలప్ప) దగ్గరలోని ఆకులు, మూలికలు తెచ్చి పసరు పిండి గాయాన్ని శుభ్రముగా తుడిచి కట్టు కట్టాడు.

ఆనాటినుండి మొగిలప్పకు శివునియందు అధిక భక్తి కలిగింది. ప్రతి రోజు శివలింగాన్ని దర్శించి, ఆ చుట్టు ప్రక్కల ప్రదేశమును శుభ్రము చేసి, తనకు తోచిన విధముగా సమీపంలోని పూలను తెచ్చి అలంకరించి, అడవిలో దొరికే పండ్లు నైవేద్యంగా పెట్టేవాడు.

రాను రానూ మొగిలప్పకి శివ భక్తి అధికమయ్యి ఇంటి గురించి పట్టించుకునేవాడు కాదు. తల్లిదండ్రులు వివాహం చేస్తే మారుతాడేమోనని వివాహం చేశారు. అయినా మార్పు రాలేదు. శివ భక్తి తగ్గలేదు.

ఇలా వుండగా అతని పశువుల మందలోని ఒక ఆవు మధ్యలో తప్పించుకుని ఎటో వెళ్ళి వచ్చేది. సాయంత్రం పాలు కూడా సరిగా ఇచ్చేది కాదు. దానితో యజమాని కోపగించాడు. మొగిలప్ప ఆ సంగతేమిటో కనుక్కుందామని ఒక రోజు ఆ గోవుని కనిపెట్టుకుని వున్నాడు. అది ఎటో వెళ్తుంటే దాని వెనకే వెళ్ళాడు.

అది దేవరకొండ వైపు వెళ్తే దాని వెనకే వెళ్ళాడు. అది తిన్నగా దేవరకొండ పైకి ఎక్కి అక్కడవున్న ఒక బిలంలో ప్రవేశించింది. మొగిలప్పకూడా ఆ గోవు వెనకే ఆ రహస్య బిలంలో చాలా దూరం ప్రయాణించాడు. చాలా దూరం వెళ్ళాక ఆ గోవు ఒక విశాల ప్రదేశం చేరుకుంది. ఆ ప్రదేశమంతా అమూల్య రత్న రాసులతో ప్రకాశవంతంగా వుంది. మొగిలప్ప ఒక చెట్టు చాటున దాక్కున్నాడు.

అంతలో జగన్మాత పార్వతీదేవి ఒక బంగారు పాత్ర తీసుకుని ఆ ధేనువు దగ్గరకు వచ్చింది. ఆ గోవు పొదుగునుండి ధారాపాతంగా వచ్చు పాలతో ఆ పాత్ర నిండింది. మొగిలప్ప అదంతా ఆశ్చర్యచకితుడై చూస్తుండగా పార్వతీ దేవి గమనించి తన అనుమతి లేనిదే ఆ ప్రదేశమునకు వచ్చినందుకు మొగిలప్పను శపించబోయింది. మొగిలప్ప పార్వతీ దేవి పాదములపై పడి వేడుకొనగా మాత శాంతించి అతడిని కరుణించి జ్ఞానోపదేశం చేసింది. అతనికి ఆకలిదప్పులు లేనట్లు వరమొసగింది. కానీ ఈ రహస్యం ఎవరికైనా చెప్పినచో అతని తల వేయి మ్రుక్కలై మరణం చెందుతావని మొగిలప్పని హెచ్చరించింది.

మొగిలప్ప ఇంటికి చేరుకొని సర్వం త్యజించి శివ ధ్యానములో మునిగెను. ఎవరు పలకరించినా పలకక, ఏమీ తినక, నిద్రాహారాలు మాని శివ ధ్యానంలో వుండేవాడు. అతని తల్లి ఇదంతా చూసి దిగులుతో మంచాన పడింది. భార్య జరిగిన విషయం చెప్పమని ఎన్నో విధాలుగా అడిగి, చాలా ఒత్తిడి చేసి ఆ రహస్యం చెప్పకపోతే అతని కళ్ళెదుటే మరణిస్తానని బెదిరించి ఊరి పెద్దలతో పంచాయతీ పెట్టించింది.

దానితో మొగిలప్ప తనకు మరణం తప్పదని గ్రహించి, గ్రామ ప్రజలందరిని పిలిపించాడు. ఊరి పొలిమేరలో చితి ఏర్పాటు చేసుకుని అందులో నిలబడి చేతులు జోడించి అందరి సమక్షంలో ఆ రహస్యం తెలిపెను. మరుక్షణం అతని తల వేయి ముక్కలై మరణించెను. ఊరి ప్రజలందరు సంభ్రమాశ్చర్యాలలో మునిగి మొగిలప్పను కీర్తించారు. అతని భార్య పశ్చాత్తాపం చెంది విలపించింది. తానుకూడా ఆ చితిలో పడి భర్తతో సహగమనం చేసింది. మొగిలప్ప చితి వున్న ప్రదేశాన్ని మొగిలప్ప గుండంగా వ్యవహరిస్తారు. నేటికీ మొగిలివారిపల్లెలో ఈ ప్రదేశాన్ని చూడవచ్చంటారు.

మొగిలీశ్వరాలయం ముందుగా మిరియాల వర్తకులచే కట్టబడిందని, తర్వాత కాలంలో క్రమక్రమంగా అభివృధ్ధి చెందింది అంటారు. చోళ రాజుల కాలంలో ఆలయాన్ని పూర్తిగా పునర్నిర్మించారు. కామాక్షీదేవిని ప్రతిష్ఠించి, పుష్కరిణిని నిర్మించారు. ఇంత పురాతన ఆలయాన్ని దర్శించిన సంతోషంతో అక్కడనుంచి బయల్దేరాము.

ఇంకా వేరే విశేషాలు వచ్చే వారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here