యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-29: పుంగనూరు-1

0
3

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా పుంగనూరు లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం గురించి, కాశీ విశ్వేశ్వరాలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం:

[dropcap]పుం[/dropcap]గనూరుని ఇదివరకు పరశురామపురి అనేవారు. “అడుగడుగునా ఆలయముంది పరశురామ పురమంతా ఆధ్యాత్మికంతో నిండిందని” చరిత్రకారులు పేర్కొనేవారుట. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ ఆలయాలలో పుంగనూరు కళ్యాణ వెంకటేశ్వరాలయం కూడా ఒకటి. పుంగనూరు సంస్ధాన పరిపాలకులు పరమత సహనానికి, పరిశుధ్ధమైన పాలనకు గీటురాళ్ళుగా నిలిచారు. వీరు శైవ మతస్ధులు. అయినా పరమత సహనంతో ఎన్నో వైష్ణవ ఆలయాలు కూడా నిర్మించారు. వారు ఎంతో శ్రధ్ధతో నిర్మించిన ఈ ఆలయం గతంలో ఎంతో వైభవంతో విరాజిల్లిన ప్రముఖ క్షేత్రం. భూదాన శిలా శాసనం ప్రకారం ఈ ఆలయాన్ని క్రీ.శ. 1817లో పుంగనూరు పాలకుడు సుగుటూరు ముమ్మడి చిక్కరాయ యశోవంత బహద్దూర్ మరియు ఇమ్మడి శంకర్రాయలు కలసి నిర్మించినట్లు తెలుస్తోంది. చిక్కరాయలు ఈ ఆలయానికి ఉత్సవ మూర్తులైన వెంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవి కళాఖండాలపై తన శాసనం వేసి సమర్పించారు.

కాలక్రమంలో పరిపాలకులైన సుగుటూరు వంశస్ధుల పాలనలో పట్టణంలో విరివిగా శివాలయాలు వెలిశాయి. ఈ క్రమంలో తమ పాలనలో వైష్ణవుల కోరిక మేరకు ఆ నాటి పుంగపురి పాలకుడైన ఇమ్మడి చిక్కరాయ యశోవంత బహద్దూర్ పట్టణం నడిబొడ్డున తిరుమల దేవదేవుడు వెంకటరమణుడి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో మూలవిరాట్ ను సాక్షాత్తూ కొండపై స్వామి వారి మూలవిరాట్ ను పోలిన రీతిలో చెక్కించి ప్రతిష్ఠించారు. స్వామివారితో పాటు శ్రీదేవి, భూదేవిలను కూడా సుందరంగా చెక్కిచారు.

అంతేగాక ఈ ఆలయం నిత్యకళ్యాణంగా వెలగాలని ఆశిస్తూ వివాహాలు ఆలయ ప్రాంగణంలో జరిగేందుకు రెండు వేదికలు కూడా నిర్మించారు. ఇక్కడ తరచూ వివాహాలు జరుగుతూ వుంటాయి. ఆలయంలో గర్భగృహం, అంతరాళం, ముఖమండపాలున్నాయి. శ్రీవారి గర్భగృహ ప్రదక్షిణలు చేస్తే చుట్టూ తొలిస్ధానంలో కూర్చుని నిష్టతో స్వామి వారిని ధ్యానిస్తున్న ఆళ్వార్లను, దశావతారాలను దర్శించవచ్చు.

గర్భగృహంలో స్వామి నిలువెత్తు అద్భుతమైన రూపము భక్తులను ఆకట్టుకుంటూ, తిరుపతిలో వున్నామా అనిపించేట్లు వుంటుంది.

కాశీ విశ్వేశ్వరాలయం:

వెంకటేశ్వరస్వామి ఆలయం ఎదురుగానే చాలా అందమైన పుష్కరిణి, దాని పక్కనే శ్రీ కాశీ విశ్వేశ్వరాలయం వున్నది. ఈ ఆలయంలో 12 అడుగుల పొడవు, 7 అడుగుల వెడల్పుతో అంతరాళము, 30 అడుగుల పొడవు పెడల్పుతో అందమైన శిల్పాలు చెక్కబడిన స్తంభాలపై రంగమండపము నిర్మించబడింది. ఇక్కడి శివలింగాన్ని జమీందార్లు కాశీనుండి గుర్రంపై మోసుకొచ్చారుట. ఇది అద్భుతమైన మహిమగలిగిన శివలింగమని, కోరినవారికి సంతానం ప్రదాత అని చెప్తారు. ఎదురుగా 10 అడుగుల పొడవు, వెడల్పు కలిగిన నాలుగు స్తంభాల మండపంలో పెద్ద నందీశ్వరుడున్నాడు.

మండప ప్రవేశం పై భాగ ఉపాలయంలో వృషభాశీనులై పార్వతీ పరమేశ్వరులు కొలువైవున్నారు. ఈ మండపము రంగమండపంతో కలుపబడింది. రంగ మండపంపై నలువైపుల జంట నందీశ్వర ప్రతిమలు స్ధాపించారు. ఎదురుగా బలిపీఠము, పంచలోహ ధ్వజస్తంభములున్నాయి.

పునాది మట్టమున బేస్‌మెంట్‌పై తెలుగులో శిలాశాసనాలు వున్నాయి. ఈ ఆలయాన్ని క్రీ.శ. 1718 ఇమ్మడిచిక్కరాయ తమ్మేగౌడు నిర్మించచారు. ఈయన భార్య ముద్దమ్మణ్ణి క్రీ.శ. 1720లో పార్వతీదేవి ఆలయాన్ని, 1722లో జగదీశ్వరీ ప్రీతిగా అద్భుతమైన పుష్కరిణిని నిర్మించారు. దేవుని పూజ కొరకు చుట్టూ పూల మొక్కలు నాటించారు. తర్వాత ఇంకా అనేక విధాల అభివృధ్ధి కావించబడింది.

ఈశ్వరాలయానికి ఉత్తరాన అన్నపూర్ణాదేవి ఆలయం 10 అడుగుల పొడవు వెడల్పుతో 31 అడుగుల ఎత్తయిన చక్కటు గోపురంతో వున్నది. ఇక్కడ అమ్మవారు భక్తుల కోరికలు తీరుస్తూ నిత్యం పూజలందుకుంటోంది. కోనేరు చూడటానికి చాలా అద్భుతంగా వున్నది.. ఇక్కడనుంచి సోమేశ్వరాలయానికి బయల్దేరాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here