యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-30: పుంగనూరు-2

0
2

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా పుంగనూరు లోని సోమేశ్వరాలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

సోమేశ్వరాలయం:

[dropcap]కా[/dropcap]శీ విశ్వేశ్వరాలయం నుంచీ సోమేశ్వరాలయానికి వెళ్ళాము. మధ్యలో అప్పటి రాజుల పేలెస్, కోట గోడ చూసి బయటనుంచే ఫోటోలు తీసుకున్నాము.

1400 సంవత్సరాల క్రితమే ఏర్పడిన పుంగనూరు ఆనాడు ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిధ్ధి చెందింది. దక్షిణాపథంలో పరిపాలన సాగించిన వైదుంబులు, బాణులు, నోళంబులు, పడమటి గొంగులు, రేనాటి చోళుల కాలంలో పుంగనూరు ప్రాంతం ప్రముఖ పాలెంగా వుండేది. (వీళ్ళల్లో కొందరి పేర్లు కూడా మనం వినివుండం కదా.)

పుంగనూరు కేంద్రంలో వందకు పైగా ఆలయాలు వీరి పాలనలో ఏర్పడ్డాయి. పుంగనూరును పాలించినవారిలో అధికులు శైవ మతస్తులు అయినప్పటికీ వైష్ణవ ఆలయాలను కూడా నిర్మించి తమ భక్తి భావాలు చాటుకున్నారు. పుంగనూరులోని శైవాలయాలలో నగిరి వీధిలో వెలసిన శ్రీ సోమేశ్వరాలయం ప్రముఖమైనది, పురాతనమైనది. క్రీ.శ. 7వ శతాబ్దం ప్రథమార్ధంలో మదనపల్లె వద్ద చిప్పిలిని ప్రధాన కేంద్రంగా చేసుకుని పులినాడు అంటే నేటి పుంగనూరు తదితర ప్రాంతాలను పాలించిన రేనాటి చోళుల పాలనలో శ్రీ సోమేశ్వరస్వామి ప్రతిష్ఠ జరిగినట్లు తెలుస్తోంది. క్రీ.శ. 1487 లో జమీందార్ల పాలన ప్రారంభం తరువాత ఈ ఆలయం అభివృధ్ధి చెందింది. ఆలయానికి సమీవంలో పుంగనూరు పాలకుల రాజకోట నిర్మంపబడి వుంది. కోట వృత్తాకారంగా వుండి 12 బురుజులతో, చుట్టూ అగడ్త నీటితో నిండి శత్రు దుర్భేద్యముగా వుండేదిట.

ఈ ఆలయంనందలి స్వామివారు రాజ వంశీకుల ఇలవేలుపు అని చెప్పడానికి ఆనవాళ్ళున్నాయి. ఈ ఆలయంలో తమిళంలో రాయబడిన శిలా శాసనం వుంది. శాసన లిపినిబట్టి చోళుల కాలంలో ఈ ఆలయంలో సోమేశ్వరస్వామి వారిని ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. తర్వాత జమీందారీ పాలనలో ఈ ఆలయం ఎప్పటికప్పుడు దశలవారి అభివృధ్ధి చెందుతూ వస్తోంది.

తూర్పు ముఖంగా నిర్మింపబడిన ఆలయం చుట్టూ ఎత్తైన ప్రహరీవుంది. ప్రవేశ ద్వారం మూడంతస్తుల గోపురంతో అలరారుతోంది. ప్రవేశించగానే బలిపీఠం, ధ్వజస్తంభం వున్నాయి. వాటిని ఆనుకుని నంది మండపం వుంది. మండపం మధ్యన స్వామివారిని చూస్తున్న నందీశ్వరుడు కొలువై వున్నాడు. నంది మండపం ఎదురుగా ప్రధానాలయంలో ముఖ మండపం, అంతరాళం, గర్భగృహం వున్నాయి. గర్భాలయంలో ఎత్తైన సోమసూత్రం పై పరమశివుడు శ్రీ సోమేశ్వరస్వామి పేర పూజలందుకుంటున్నాడు. స్వామివారి వెనక భాగాన పంచలోహ నాగేంద్రుడు స్వామివారికి నీడయై నిలిచాడు.

దక్షిణం వైపున సన్నటి దారి వుంది. ఈ దారి రాజవంశీకులకు ప్రత్యేకమైన ప్రవేశద్వారంగా వుండేది. స్వామి ఆలయానికి దక్షిణాన విశాలమైన వసార, అంతరాళం, గర్భగుడితో వున్న దేవీ మందిరం వుంది. ఇక్కడ అద్భుతమైన రూపంలో పార్వతీ దేవి పూజలందుకుంటోంది. భక్తుల కోర్కలు తీర్చే తల్లిగా, సంతానాన్ని అనుగ్రహేంచే దేవతగా పార్వతీదేవిని భక్తులు కొలుస్తారు.

ఆలయంలో శ్రీ మీనాక్షి సుందరేశ్వరస్వామి ఆలయాలున్నాయి. ఇక్కడి నవగ్రహాలకు దోషపూజలు నిర్వహిస్తే శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇందులోనే శ్రీకృష్ణుని ఆలయంలో మురళీకృష్ణుడు భక్తలనాకట్టుకుంటాడు.

ఇక్కడనుంచి సుగటూరు గంగమ్మ ఆలయం దగ్గరలోనే వుంది.. చాలా మహిమగల తల్లి అంటే అటు బయల్దేరాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here