[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా కొట్రకోన లోని శ్రీ మల్లీశ్వర ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
శ్రీ మల్లీశ్వర ఆలయం, కొట్రకోన
[dropcap]మ[/dropcap]ర్నాడు (5-2-2019) ఉదయం ఫలహారం అయ్యాక 9 గంటలకు బయల్దేరి 9-25 కి కొట్రకోన చేరాము. చిత్తూరునుంచి 8 కి.మీ.ల దూరంలో గంగాధర నెల్లూరు మండలంలో వున్నది ఈ ఆలయం. 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం గాలి గోపురం ముందు భాగమున తమిళంలో శాసనాలున్నాయి. నీవా నదీ తీరాన నిర్మింపబడి పూర్వం అత్యంత వైభవంగా వెలిగిన ఆలయాల్లో ఇది ఒకటి.
ఆలయం చుట్టూ ప్రహరీ వుంది. ప్రవేశ ద్వారం దక్షిణం వైపు వుంది. ప్రదక్షిణ మండపం వృత్తాకార స్తంభాల పైవుంది. లోపల ప్రదక్షిణ మండపాన్ని వేరు చేస్తూ 60 అడుగుల పొడవు 40 అడుగుల వెడల్పుతో గర్భాలయం నిర్మించారు. ప్రదక్షిణ మండపం నుండి గర్భాలయం వేరుపడిన చోట వెలుతురు మండపంలోకి వచ్చేటట్లు నిర్మించారు. అలాగే వర్షపునీరు వస్తే బయటకి పోవటానికి వీలుగా కింద కాలువలు నిర్మించారు.
గర్భాలయంలో స్వామి తూర్పుకభిముఖంగా వుంటారు. ఎదురుగా గోడలకున్న కిటికీలనుంచి ఉషోదయంలో సూర్య కిరణాలు స్వామివారిని తాకేటట్లు నిర్మించారు.
గుడి చుట్టూ అతి చిన్న కందకంలా వుంది. చిన్న గుడే. తాళం వేసి వుంది. తాళం చెవులు తెచ్చారు. ఆలయం పునర్నిర్మిస్తున్నారు. బయట గణపతి, దక్షిణామూర్తి, ఇంకా గోడలకి చిన్న శిల్పాలున్నాయి. వెనక మహావిష్ణు, బ్రహ్మ, శివ దుర్గ, కత్తి యుధ్ధం, యుధ్ధ సేన వగైరా బొమ్మలున్నాయి. పునర్నిర్మాణం జరుగుతోందికదా. రాళ్ళ గుట్టలు వగైరా నిర్మాణం జరుగుతున్న స్ధలంలాగే వుంది.
పూర్వం సమస్త పూజలతో ఈ ఆలయం భూలోక వైకుంఠంగా వుండేది. ఈ ఆలయానికి చోళరాజులు విశేష భూ మాన్యాలిచ్చారు. ఆలయార్చనలకుగాను బ్రాహ్మణులకు అగ్రహారాలిచ్చారు. చోళ రాజులు నీవా నదీ తీరం పవిత్రమైనదని ఇక్కడ నిర్మించిన ఈ ఆలయం ప్రస్తుతం పునర్నిర్మాణం జరుగుతున్నది.