[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా వేల్కూరు లోని శ్రీ తిరుమలేశ్వరీ తిరుమలేశ్వర ఆలయం గురించి, శ్రీ రమా రమణీ మాధవనారాయణాలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
[dropcap]కొ[/dropcap]ట్రకోన నుంచి వేల్కూరు వెళ్ళాము. చిత్తూరు – పుత్తూరు రోడ్డులో, చిత్తూరుకి 10 కి.మీ.ల దూరంలో, గంగాధర నెల్లూరు మండలంలో వున్నదీ గ్రామం. వేయి గడపలున్న ఊరుగా వేల్కూరు అయింది. పూర్వం దీనిని సహస్రపురి అని కూడా పిలిచేవారుట. పూర్వం మహా పట్టణంగా విరాజిల్లిందని, వేల్పుల వూరని, అది వాడుకలో వేల్కూరు అయిందని కూడా అంటారు. మునుపు కొందరు రాజులకు ముఖ్య పట్టణంగా వున్న ఈ ఊరు నీవా నదికి పశ్చిమ భాగాన వున్నది. పేరుకి తగ్గట్లే ఇదివరకు ఇక్కడ అనేక ఆలయాలు వుండేవి.
శ్రీ తిరుమలేశ్వరీ తిరుమలేశ్వర ఆలయం:
ఈ ఆలయం గ్రామానికి దక్షిణంగా వున్న అద్భుత శిల్ప నిర్మాణం. ఇందులో శివలింగాన్ని మార్కండేయ మహర్షి ప్రతిష్ఠించాడంటారు. జనమేజయ మహారాజు ఆలయం నిర్మించారని ప్రతీతి. 120 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు, 7 అడుగుల ఎత్తయిన ప్రహరీలో ప్రధానాలయం తూర్పు ముఖంగా వుంటుంది. స్తంభాలు చక్కని శిల్పాలతో తీర్చారు. ప్రవేశ మండపము, నవకుశ మండపము, గర్భ గుడి వున్నాయి. 23 అడుగుల ఎత్తయిన గోపురం ఏక కలశంతో అందంగా వుంటుంది.
ఆలయంలో శ్రీ తిరుమలేశ్వర, శ్రీ తిరుమలేశ్వరీ దేవులు ప్రధాన దేవతలు. నందీశ్వరుడు, నవగ్రహాలు, ఈశాన్యంలో చేద బావి, బలిపీఠం, ధ్వజ స్తంభం అన్నీ చక్కగా అమర్చారు. ఆలయం ముందువైపు గోడలకు తమిళ శాసనాలున్నాయి. పంచ లోహ ఉత్సవ మూర్తుల, వాహనాలు దొంగల పాలయినాయి. నవాబుల కాలంలో కూలద్రోయబడిన ఈ ఆలయంలోని విగ్రహాలు కొన్ని దొంగిలింపబడగా, కొన్ని అర్చకులు తీసుకెళ్ళి తమ గృహములలో పాతిపెట్టారు. 1980లో ఈ విగ్రహాలు బయల్పడగా తిరిగి ఆలయంలో ప్రతిష్ఠించబడి, మహా కుంభాభిషేకం జరిపించారు. తర్వాత 40 రోజులకే విగ్రహాలు మళ్ళీ దొంగల పాలయ్యాయి. ఆలయం ప్రవేశంలోనూ, రంగ మండపం దక్షిణంలోనూ శాసనాలున్నాయి. ఆలయం వెలుపల స్వామివారి పాదపీఠం వుంది.
ఆలయాలు దేవాదాయ శాఖవారి అధీనంలో వున్నాయి. గ్రామ సమీపంలో రాతి యుగంనాటి భూగర్భ సమాధులు ఏడు చుట్ల కోటలవలే వృత్తాకారంలో రాళ్ళు పేర్చబడి వున్నాయి. గత చరిత్రకు ఆనవాలుగా, గ్రామ ఔన్నత్యములను తెలిపే బృహద్ నిర్మాణాలుగా పూర్వ వైభవ చిహ్నాలుగా వున్నాయి. ఈ ఆలయంలోని శాసనాలను 1889 సంవత్సరంలో పురావస్తు శాఖవారు సేకరించి ఆంధ్ర దేశ శిలా శాసనాల పుస్తకంలో సర్వే నెంబరు 9 గా నమోదు చేశారు.
10-15కి అక్కడనుంచి బయల్దేరాము.
శ్రీ రమా రమణీ మాధవనారాయణాలయం:
గ్రామం మధ్యలో నిర్మించబడిన మహత్తర ఆలయం ఇది. వైశంపాయనుడు స్వామివార్లను ప్రతిష్ఠించగా, జనమేజయుడు ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. 160 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పు, 7 అడగుల ఎత్తు గల ప్రహరీలో ఆలయం తూర్పు ముఖంగా నిర్మింపబడింది. ఆలయం ముందు భాగమున 5 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పుగల బలిష్టమయిన రాతి బండకి ఇరువైపులా శాసనాలున్నాయి. క్రీ.శ. 1967లో ఈ ఆలయం పునరుధ్ధరింపబడినట్లు తెలుస్తున్నది. ప్రాచీన విగ్రహాలు భిన్నమవగా కొత్తవాటిని ప్రతిష్ఠించారు. ప్రధానాలయం, నవకుశ మండప, గర్భాలయం వున్నాయి. కళ్యాణ మండపాన్ని నిర్మించారు. ఇక్కడ కళ్యాణాలు జరుగుతుంటాయి. ఇక్కడ ప్రధాన దేవుడు శ్రీ మహావిష్ణువు. ఇంకా సప్తఋషులు, ఆళ్వారులు వగైరా విగ్రహాలున్నాయి. ఆలయంలో అలివేలు మంగ, నాంచారి, వెంకటేశ్వరస్వామి కూడా పూజలందుకుంటున్నారు.
అక్కడనుంచి తంగాల్ మౌనగురుస్వామి ఆశ్రమం చాలా ప్రసిధ్ధి చెందింది, దగ్గరేనంటే అటు బయల్దేరాము.