యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-39 – తిరుపతి-2

0
2

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా తిరుపతి గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

శ్రీరాముడు వేంకటాద్రికి వచ్చుట:

[dropcap]మీ[/dropcap]లో చాలామంది విని వుండక పోవచ్చు. శ్రీరామచంద్రుడు సీతాన్వేషణ సమయంలో వేంకటాద్రిని దర్శించాడు. ఇది నా సొంత కథ కాదండీ. నేనీమధ్య చదివిన శ్రీ వేంకటాచల మహాత్మ్యము అనే పుస్తకమునుంచి (వరాహ పురాణాంతర్గతమైన ఈ శ్రీ వేంకటాచల మహాత్మ్యము శ్రీ తూ.వెం.చూడామణిగారిచే ఆంధ్రీకరింపబడినది) తిరుపతి గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఇక్కడ ముచ్చటిస్తాను అని చెప్పాను కదా. ఆ గ్రంథంలో నేను చదివినదే చెప్తున్నాను.

శ్రీరామచంద్రుడు రావణాసురుని మీద యుధ్ధానికి వానర సేనలతో కూడి వెళ్ళే సమయంలో శేషాద్రి సమీపానికి వచ్చాడుట. అప్పుడు హనుమంతుని తల్లి అంజనాదేవి శ్రీరామచంద్రుని దర్శించి, అద్భుతమైన నీ రాకకోసం ఎదురు చూస్తూ వున్నాను. ఇక్కడ ఇంకా అనేకమంది మనీంద్రులు నీ రాకకోసం ఎదురు చూస్తూ తపస్సు చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా దర్శనమిచ్చి వెళ్ళమని ప్రార్థించింది. దానికి శ్రీరాముడు అమ్మా, నేనిప్పుడు నా కర్తవ్యం కోసం తొందరగా వెళ్ళాల్సి వుంది. అక్కడికి వస్తే ఆలస్యమవుతుంది. తిరిగి వచ్చేటప్పుడు తప్పక వస్తానంటాడు. దానికి హనుమంతుడు రామా, నువ్విప్పుడు ఎక్కడైనా విశ్రమించవలసినది. వానర సేన అంతా కూడా బాగా అలసి వున్నది. ఈ పర్వతము మనం వెళ్ళాల్సిన మార్గంలోనే వుంది. అనేక విధములైన ఫల వృక్షాలు, కందమూలాలు, తేనెపట్లు కలిగిన ఈ పర్వతాన్ని అంజనాద్రి అంటారు. నీకన్నీ తెలుసు..ఇంక నీ ఇష్టం. అంటాడు.

దానికి శ్రీరాముడు నవ్వుతూ సరే నువ్వు ముందు వెళ్తూవుండు, నేను సేనని తీసుకుని వస్తాను అని చెప్పి తానూ సేనని తీసుకుని బయల్దేరుతాడు.. దోవలో నిర్లోముడు అనే బ్రాహ్మణుడు బ్రహ్మలోకమును పొందగోరి బ్రహ్మ గురించి తపస్సు చేస్తూ వున్నాడు. ఆయనకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నువ్వు లక్ష్మణ సమేత రాముడిని దర్శించిన తర్వాత బ్రహ్మలోకం చేరుకుంటావని వరం ఇస్తాడు. ఇప్పుడు శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై రావటంతో వారిని పూజించి ఆతిధ్యమిస్తాడు. తర్వాత శ్రీరాముణ్ణి తాను బ్రహ్మలోకం వెళ్ళటానికి అనుమతి అడుగుతాడు. రాముడు నిర్లోముడిని అనుమతించి తాను వేంకటాచలం పైకి వెళ్తూ కొందరు యక్షులకు శాప విమోచనాన్ని ప్రసాదిస్తాడు. అలా వెళ్తూ ఆకాశగంగ సమీపాన వున్న అంజనాదేవి ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ ఆమె సేవలందుకొని అక్కడనుండి స్వామి పుష్కరిణిని చేరుకుని పరివారంతో పుష్కరిణిలో స్నానం చేశారు. ఆంజనేయుడు రామ లక్ష్మణులకు మధుర ఫలాల్ని సమర్పించాడు.

వానరులందరూ కూడా అక్కడ స్వేచ్ఛగా తిరుగుతూ రావణుణ్ణి తామే చంపేస్తామని పలుకుతూ, ఆడుతూ, విశ్రాంతి తీసుకున్నారు.

వైకుంఠమనెడి గుహలో వానరులు ప్రవేశించుట:

స్వామి పుష్కరిణికీశాన్యభాగముగా గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, మైందుడు, ద్వివిదుడు, సుషేణుడు వెళ్ళి అక్కడ గాడాంధకారమగు ఒక గుహలో ప్రవేశించిరి. వారందరును సింహసదృశ పరాక్రమము కలవారై, మిక్కిలి జాగరూకతతో తమోమయమగు నా గుహలో చాల దూరమేగిరి. అచ్చట కోటి సూర్యులుదయించిన రీతిని అనేక కాంతుల పుంజమైన విద్యుల్లతల ప్రకాశములతో మిళితమైన యొక గొప్ప జ్యోతిని గాంచిరి. అక్కడ రత్న, మాణిక్య, వైఢూర్య ముత్యములచే నిర్మింపబడిన గోపురము గలదియూ, అనేక మంటపములచే గూడినదియు, అనేక దేవ భవనములచే నిబిడమైనదియు, పలు విధములగు వీధులతో గూడినదియు, రథములు, యేనుగులతో గూడినదియు, అనేకులగు స్త్రీలతోను, పురుషులతోను కూడియున్నట్టిదియు, సర్వ విధ మంగళ సుశోభితమైయున్నట్టియు పట్టణము నొండుగాంచిరి. అచటి వారందరును శంఖ చక్రధారులును, చతుర్భుజులును నైయుండిరి. వారందరూ సకలాభరణ భూషితులై సంతోషాతిశయ సంశోభితులైయున్నారు.

దాని మధ్య మిక్కిలి ప్రకాశించునదియగు మణి మంటపము, సకల వాద్యముల ధ్వనులతో వెలుగొందుతున్న ఒక విమానాన్ని చూశారు. దాని మధ్యలో ఆదిశేషునిపై వేంచేసిన నాలుగు భుజములు, శంఖ చక్రములు ధరించినట్టి ఒక మహా పురుషుని చూశారు. ఆయన దక్షిణకరము శయ్యయగు శేషుని పడగపైనున్నది. ఆయన కుడి పాదమును ఎత్తియుంచిన నెడమ మోకాలిపైనుంచుకొనెను. ఆయన తన ఎడమ చేతినిజాపి శ్రీభూ నీళా దేవులచే సేవింపబడుచుండెను. ఆయనను చూసి వీరు ఆశ్చర్య చకితులయ్యే సమయంలో చతుర్భుజుడును, దండ హస్తుడును నగు నొక పురుషుడు వీరిని గాంచి అతి త్వరితముగ దండమునెత్తి వారినందరను బెదరించెను. ఆ వానరులందరు భయపడి బయటకు వచ్చి మిగిలిన వానరులకు ఈ సంగతి చెప్పారు. వారంతా రావణుడు మహా మాయలు నేర్చినవాడు, కోరిన విధముగా రూపములను ధరించువాడు, వంచకుడు. అతడే ఇట్లీ గుహలో నుండెనో, లేక మరియొక రావణుడో యత్న పూర్వకముగా విచారించవలెను అని వానరులందరు కలసి హడావిడిగానా గుహ వద్దకు వెళ్ళిరి. ఈ వానరులచట పూర్వము చూచిన పట్టణముగాని, చిహ్నములుగాని కానజాలరైరి. భ్రమచే వెంటనే నా పర్వతమునంతను వెదకిరి. భ్రమయనియే నిశ్చయించి యూరకుండిరి. తెల్లవారగనే వారందరూ అచటినుంచి పయనమైరి.

ఆ గుహ గురించి ఇంకా వివరంగా చెప్పుమని సూతుణ్ణి మిగతా మునులు కోరగా అది దేవ మాయ అని నేనూ విన్నాను. ఆ వైకుంఠ గుహ దేవతలకు, మునీశ్వరులకు కూడా తెలియరానిది. పరమాత్ముని మాయచే, విష్ణులీలచే, పూర్వము వానరులకు ప్రకాశింపజేయబడినది. ఆ గుహలో గానుపించిన శంఖచక్రధారులగు వారందరును పరమానంద స్వరూపులగు ముక్తులును, నిత్యులునునైయుండిరి. వారు బ్రహ్మానందముననుభవింతురు అని తెలిపెను.

ఈ కథలు చాలామందికి తెలియజేయాలనే కుతూహలంచే సేకరించి పంపుతున్నాను. వచ్చేవారం నుంచి మళ్ళీ మన యాత్ర మామూలుగా ప్రారంభమవుతుంది. తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామికి నమస్కారాలు అర్పించటం తప్ప, తిరుపతిని వర్ణించే సాహసం చెయ్యలేకపోయాను.

సేకరణ.. పి.యస్.యమ్. లక్ష్మి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here