[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా శ్రీనివాస మంగాపురం లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీనివాస మంగాపురం:
[dropcap]ఈ[/dropcap] ఆలయం తిరుపతికి 12 కి.మీ. ల దూరంలో చిత్తూరు జిల్లాలో వుంది. ఈ ఆలయం శ్రీమహా విష్ణువుకి మరో రూపం అయిన శ్రీ వెంకటేశ్వరస్వామిది. ఈయనని కళ్యాణ వెంకటేశ్వరస్వామి అంటారు. ఈ ఆలయాన్ని ప్రభుత్వంవారు పురాతన స్మారక చిహ్నంగా గుర్తించారు. ఈ ఆలయం 1967 నుంచి 1981 దాకా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధీనంలో వున్నది. తర్వాత తిరుమల తిరుపతి దేవస్ధానం అధీనంలో వున్నది.
ఈ ఆలయంలో ప్రధాన దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి. ఈయన పడమర ముఖంగా వుంటారు. విగ్రహం నుంచున్నట్లు వుంటుంది. నాలుగు చేతులు శంఖ, చక్రాలు, కటి, వరద ముద్రలతో వుంటాయి. ఈ ఆలయంలో ఇంకా లక్ష్మీ నారాయణ, రంగనాథ స్వామిల ఉపాలయాలు కూడా వున్నాయి.
ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్ధానం తర్వాత అంత మహిమ కలది అని చెప్తారు.
స్ధల పురాణం:
ఆకాశరాజు కూతురు పద్మావతితో వేంకటేశ్వరస్వామి పరిణయమయిన తర్వాత వధూవరులు తిరుమలకు బయల్దేరారు. దోవలో వారు అత్తగారింట్లో ఆగుతారు. వాళ్ళు మంగాపురంలో ఆగటంతో ఆ ఊరు శ్రీనివాస మంగాపురం అయింది. అక్కడనుండి బయల్దేరి దగ్గరలోనే వున్న అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఆయన దర్శనానికి ఆగుతారు. అగస్త్యుడు వారిని ఆశీర్వదించి, కొత్తగా పెళ్ళయినవారు ఆరు నెలలదాకా కొండలెక్కకూడదంటారు. అందుకని ఆ ఆరు నెలలపాటు తన ఆశ్రమంలో వుండమని కోరుతాడు. వారూ అంగీకరించి అగస్త్యుని ఆశ్రమంలో ఆరు నెలలు వుంటారు. ఆరు నెలల తర్వాత పద్మావతీ శ్రీనివాసులు తిరుమలకు బయల్దేరుతున్న సమయంలో వెంకటేశ్వరుడు అగస్త్య మహర్షికి రెండు వరాలిస్తాడు. మహర్షులకిచ్చే వరాలు కూడా ప్రజల కోసమే కదా. ఒకటి ఏదైనా శరీర వైకల్యంతో తిరుమల కొండ ఎక్కి తన దర్శనానికి రాలేని తన భక్తులు కొండ కింద వున్న ఈ ఆలయాన్ని దర్శిస్తే తిరుమల దర్శనంతో సమానమనీ, రెండవది వివాహ సమయం ఆసన్నమయినవారు తిరుమలలో తమ కళ్యాణ మహోత్సవం చూస్తే మంచి జీవిత భాగస్వామి దొరుకుతారనీ. ఈ వరాలిచ్చిన కారణంగా కూడా స్వామి కళ్యాణ వెంకటేశ్వరస్వామి అయ్యాడు.
శ్రీనివాస మంగాపురంలో వెంకటేశ్వరస్వామి విగ్రహం తిరుమలలో స్వామి విగ్రహంకన్నా పొడుగ్గా వుంటుంది. అంతకన్నా అందంగా వుంటుందని కూడా అంటారు. ఇక్కడి విగ్రహం మిగతా అన్ని విషయాలలో తిరుమల వెంకన్న ప్రతిబింబం అంటారు. ఆలయం చాలా వైభవంగా, భక్తుల రద్దీతో వుంటుంది.
ఈ ఆలయం క్రీ.శ. 1324లో సుల్తానుల చేత ధ్వంసం చేయబడింది. ఆలయం మీద వున్న శాసనాల ద్వారా తాళ్ళపాక చిన్న తిరుమలాచార్యుని మనవడు, కవి అన్నమాచార్య ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో పునరుధ్ధరించినట్లు వున్నది. తర్వాత తాళ్ళపాక వంశస్తులే చాలాకాలం దీనిని నిర్వహించారు. తర్వాత భారత ప్రభుత్వం ఆర్కియాలజీ డిపార్టుమెంటు అధీనంలోకి వెళ్ళింది. చివరికి 1967లో తిరుమల తిరుపతి దేవస్ధానం అధీనంలోకి వచ్చింది.
తిరుమలలో స్వామి దర్శనం తృప్తికరంగా లేదనుకునే వారు ఈ స్వామిని దర్శించి తృప్తి పొందవచ్చు.