Site icon Sanchika

యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-43 – నాగలాపురం

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా నాగలాపురం లోని శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

నాగలాపురం:

[dropcap]శ్రీ[/dropcap] మహా విష్ణువు దశావతారాల గురించి తెలియని వారుండరు కదా. అందులో మొదటిది మత్స్యావతారం. ఈ అవతారంలో స్వామి విగ్రహాన్ని పూజించే స్ధలం తెలుసా మీకు. అదే నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం. చూడ చక్కని ఆలయం. అంతకన్నా చక్కని, విశేష రూప దేవుడు.

స్ధల పురాణం:

ఇదివరకు ఈ ప్రదేశాన్ని వేదపురి అనీ, వేదారణ్య క్షేత్రమనీ, హరి కంఠా పురమనీ పిలిచేవారు. ఎందుకో తెలుసా? పూర్వం ప్రళయం తర్వాత బ్రహ్మ దేవుడు సృష్టి చేయ సంకల్పించి తపస్సులో కూర్చున్నాడు. ఆ సమయంలో సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర వున్న వేదాలను దొంగిలించి సముద్రంలో దాచిపెట్టాడు. వేదాల ఆధారం లేకపోతే సృష్టి సాధ్యం కాదు. సోమకాసురుణ్ణి ఎదిరించలేని బ్రహ్మదేవుడు శ్రీ మహా విష్ణువుని ఆశ్రయించాడు.

శ్రీ మహా విష్ణువు మత్స్యావతారంలో సముద్ర గర్భంలో వున్న సోమకాసురుడితో అనేక సంవత్సరాలు యుధ్ధం చేసి, అతన్ని చంపి వేదాలను తెచ్చి ఈ స్ధలంలోనే బ్రహ్మకిచ్చినట్లు స్ధల పురాణంలో చెప్పబడ్డది.

మూల విరాట్టు నడుము నుండి పాదభాగము వరకు మత్స్య రూపంలో దర్శనమిస్తాడు. ప్రధాన దైవం ఇలా దర్శనమిచ్చే ఆలయం బహుశా ఇది ఒక్కటేనేమో. చతుర్భుజుడు. ఈయన చేతిలో వున్న సుదర్శనం ప్రయోగ చక్రం. అంటే శత్రువు మీద ప్రయోగించటానికి సిధ్ధంగా వున్నట్లు వుంటుంది. ఇరు పక్కలా దేవేరులు శ్రీదేవి, వేదవల్లి.

భక్తాంజనేయస్వామి, లక్ష్మీ నరసింహ స్వామి, సీతా రామచంద్రస్వాములను ఉపాలయాల్లో దర్శించవచ్చు

చారిత్రకాంశాలు:

క్రీ.శ. 1517లో శ్రీకృష్ణ దేవరాయలు తిరుమల సందర్శించి వెళ్తూ ఈ ఆలయాన్ని దర్శించారు. అప్పుడు ఈ స్వామి పేరు శ్రీ కరియ మాణిక్య పెరుమాళ్. అంతకు ముందు ఈ ఆలయం పల్లవులచే నిర్మించబడింది. చిన్న ఆలయం. ఆ సమయంలోనే రాయలవారు తల్లి కోరికమీద ఈ ఆలయాన్ని జీర్ణోధ్ధరణ చేసి, అనేక దానములు చేసి ఈ ఊరి పేరుని తన తల్లి పేరున నాగమాంబపురముగా నామకరణము చేసెనని ఈ ఆలయంలోని శాసనము ద్వారా తెలియుచున్నది. తర్వాత బ్రిటిష్ వారి హయాంలో నాగలాపురంగా మారింది. రాయలు దీనిని పునరుధ్ధరించి, వేదనారాయణ స్వామి ఆలయంగా మార్చాడు.

ఈ ఆలయం పంచ ప్రాకారములతో, సప్త ద్వారాలతో, అత్యంత కళాత్మకమైన శిల్ప కళతో, సుందర ఆలయంగా తీర్చి దిద్దబడింది. పంచ ప్రాకారాలు మానవ శరీరంలోని ఐదు కోశాలకు, సప్త ద్వారాలు సప్త చక్రాలకు ప్రతీకలుగా సాధకులు ఆధ్యాత్మిక రహస్యాల నేపధ్యంలో విశ్లేషిస్తారు. ఆలయం వాస్తు కళ ఉచ్చస్ధితిలో వున్నప్పుడు నిర్మింపబడింది. ఎన్నో సంవత్సరాలు శిల్పకారులనందరినీ ఇక్కడే వుంచి ఆలయం నిర్మింప చేశారు.

ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఒక పెద్ద కంచు గంట వున్నది. స్వామికి నైవేద్యం పెడుతున్నప్పుడు ఈ గంటని మ్రోగిస్తారు. పూర్వం శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ వున్నప్పుడు స్వామి నైవేద్య సమయంలో ఆయనే ఈ గంటను స్వయంగా మ్రోగించేవారట.

విశేషము:

శ్రీమహావిష్ణువు సంవత్సరాల తరబడి సముద్రంలో సోమకాసురుడితో యుధ్ధం చేస్తున్నప్పుడు సూర్యుడు తన వెచ్చని కిరణాలు పంపి స్వామి శరీరానికి వెచ్చదనం కలుగజేశాడుట. ప్రతి ఏడూ మార్చి 23, 24, 25 తేదీలలో సాయంకాలం మూల విరాట్టుకు 630 అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్య కిరణాలు నేరుగా వచ్చి, మొదటి రోజున స్వామి వారి పాదభాగాన, రెండో రోజున స్వామివారి నాభి భాగాన, మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరించడం దీనికి ప్రతీకగా చెప్పుకుంటారు. ఈ కారణంగానే ఆ మూడు రోజులు స్వామివారికి సూర్య పూజోత్సవాలు జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాలనుండి కూడా భక్తులు తండోప తండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు.

26, 27, 28 వ తేదీలలో మూడు రోజులు తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా జరుగును. అదే విధంగా ఏప్రిల్ నెలలో పౌర్ణమి నుండి 10 రోజులు బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగును. ప్రతిరోజు మూడు పూటలా నిత్య పూజలు జరుగుతాయి.

ఈ ఆలయం 1967 సెప్టెంబరు 24న తిరుమల తిరుపతి దేవస్ధానం వారి ఆధీనంలోనికి వచ్చింది. ఆ నాటి నుండి నిత్య, వార, పక్ష, మాస, సంవత్సరోత్సవాలు కన్నుల పండుగగా జరుగుచున్నవి.

తిరుమల తిరుపతి దేవస్ధానంవారు భక్తుల సౌకర్యంకోసం రోజూ ఈ ఆలయం మరి కొన్ని ఆలయాలను దర్శించే విధంగా బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు.

Exit mobile version