యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-44 – గుడిమల్లం

0
2

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా గుడిమల్లం లోని పురాతన శివాలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

గుడిమల్లం

[dropcap]గు[/dropcap]డిమల్లం, చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలానికి చెందిన చారిత్రకంగా ప్రాముఖ్యత చెందిన ఓ గ్రామం. ఇక్కడ ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయం ఉంది. ఇది క్రీ.పూ. 2 లేదా 3 శతాబ్దములో నిర్మించినట్లు ఇక్కడ బయలుపడిన శాసనాల ద్వారా చరిత్రకారులు నిర్ణయించారు. ఈ ఆలయానికి సంబంధించిన మరికొంత సమాచారము చంద్రగిరి కోటలో గల మ్యూజియంలో లభ్యమవుతుందన్నారు.

దేవాలయ చరిత్ర

చంద్రగిరి రాజుల సమయంలో ఈ దేవాలయం ఉచ్చస్ధితిలో వుంది. తర్వాత ముస్లిం పాలకులు చంద్రగిరి సంస్ధానంతో పాటు ఈ దేవాలయాన్ని కూడా చాలా వరకూ ధ్వంసం చేశారు. కానీ మూల విరాట్‌కి మాత్రం ఎటువంటి నష్టం జరగలేదు.

ఆలయ విశిష్టత

గర్భగుడి వెనకనుంచి చూస్తే గజపృష్ఠాకారంలో, అంటే ఏనుగు కూర్చుని వుంటే వెనక నుంచి ఎలా వుంటుందో అలాంటి ఆకారంలో వున్నది. అర్ధ, మహా మండపములకన్నా గర్భగుడి ఎత్తు తక్కువగా వుంటుంది. ప్రాంగణము ఒక దానికంటే మరి ఒకటి అత్యున్నతములుగా మలచబడ్డవి. మహా మండపం చుట్టూ ఎత్తైన స్తంభములు కూడ ప్రత్యేకము. గుడి మండప నిర్మాణం దక్షిణ ముఖంగా వుండటంతో ద్వార శిల ముఖ ద్వారము అయింది. దేవాలయ విమాన తలము ఇటుకలచే నిర్మించబడి, లింగమును పోలియుండుటచే లింగాకృత విమానముగా పిలువబడుచున్నది.

ఈ దేవాలయ సముదాయము చుట్టు ప్రాకారపు పశ్చిమ ముఖమున గోపుర ద్వారము, ఉత్తరమున కార్తికేయ, దేవి, సూర్యుడు వున్నారు. ఈ సముదాయాలన్నీ పరిపల్లవ, బాణ, చోళ శిల్ప శైలిని పోలియున్నవి. ఇక్కడ లభ్యమైన శాసనాల ప్రకారం క్రీ.శ. 842 నుండి యాదవ దేవరాయల కాలము క్రీ.శ. 1346 వరకు పలు విధముల దానములతో నిత్య పూజలు జరిగేవి.. శాసనాలు గుడి గోడల్లో చాలా వున్నాయి. విక్రమ చోళ మహారాజు శాసనంతో శిధిలమైన కొన్ని చోట్ల గోపురం, బావి పునర్నిర్మింపబడ్డవని తెలుస్తోంది.

శివలింగం

ఇక్కడ శివలింగం చాలా విశిష్టమైనది. శివలింగములోనే ఒక యక్షుని భుజాలమీద నిలుచున్న పురుషుడు.. రెండు చేతులతో, కుడి చేతిలో ఒక పొట్టేలుని తలక్రిందులుగా, ఎడమ చేతిలో పూర్ణ కుంభము (కల్లు కుండ), భుజమున పరశువు (గొడ్డలి) కలిగి వుంటుంది. లింగము చుట్టు నిర్మింపబడిన చతురస్ర వేదిక అర్ధ పీఠమై తొలి దశకు చెందివున్నది. ఈ వేదికన నిల్చినట్టి దేవతా శిల్పము వైదిక పురాణ వర్ణితమైన స్ధానిక కట భంగిమన మలచబడ్డది. మరుగుజ్జు యక్షుని భుజాలపై స్ధానకాసనమున మలచబడుట దీని ప్రత్యేకత. ఈ యక్ష పురుషుడు ఆశీనుడైన శరీరముతో కూడి భగవంతుని భారము మోయుచున్నట్లుంటుంది. పురుషాకృతిని పోలియున్న ఈ స్ధానిక మూర్తి ప్రత్యేకాకృతి పోలియున్న కర్ణములు, పంకజ పాదములు. ఈ సవేదిక లింగమునందలి సూచిక పటము బారు హత, బుధ్ధ గయల వేదికలను పోలి సమకాలీనమై యున్నది. ఈ వేదిక ఉపరితలము భగ్నమై వుండ వాస్తవాకృతిని పునర్నిర్మించారు. సవేదికయైన లింగము పీఠము తక్క మిగిలిన నిర్మాణములు మలి చక్రవర్తులచే కూర్చబడి 2, 3 శతాబ్ధములనుండి నేటివరకు పవిత్ర క్షేత్రమై అలరారుతున్నది. విగ్రహం నవపాషాణాలచే మలచబడ్డది. ఈలింగము అతి ప్రాచీనమైన లింగముగా గుర్తించబడింది. ఆ కాలపు శైవారాధనకు ఒక ఉదాహరణగా చెప్పబడుతోంది.

(21-1-2010లో మేము వెళ్ళినప్పుడు అక్కడ వున్న బోర్డునుంచి కాపీ చేసిన విషయమిది).

ప్రాంగణం పెద్దదే. ఆలయం అంత పెద్దది కాదు. అమ్మ ఆనందవల్లి. ముందు గోపురం గోడమీద వినాయకుడు, ప్రత్యేక మండపాలలో షణ్ముఖుడు, వల్లీ దేవసేన.

చాలా కాలం నిత్య ధూప, దీప నైవేద్యాలతో వెలుగొందిన ఈ ఆలయాన్ని 1954లో ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకుంది. ఆనాటి నుండి గుడిలో పూజలు ఆగిపోయాయి. గుడిమల్లం గ్రామస్తులలో ఒకరైన వున్నం గుణశేఖర నాయుడు 2006 నుంచి 2008 వరకు డైరెక్టర్ జనరల్, ఆర్కయాలజీతో సమాచార చట్టం ఆయుధంగా చేసిన పోరాటంలో డిపార్టుమెంటు వారి దగ్గర గుడికి సంబంధించిన వివరాలేమీలేవనే విషయం బయట పడింది. ఈయన చేసిన కృషి ఫలితంగా 2009 నుంచి గ్రామస్తులు గుడిలో పూజలు జరిపేందుకు అనుమతి సాధించాడు. గతంలో ఉజ్జయినిలో లభించిన కొన్ని రాగినాణాలపై ఈ లింగమును పోలిన బొమ్మలు ఉన్నాయి. ఈ నాణాలు క్రీ.పూ. 3వ శతాబ్ధానికి చెందినవిగా గుర్తించబడ్డాయి.

పై సమాచారం మేము వెళ్ళి వచ్చిన తర్వాత సేకరించింది. మేము వెళ్లినప్పుడు డిపార్టుమెంటు మనిషి ఒకరుండి వారికి తెలిసింది చెప్పారు. మిగతాది బోర్డు చూడమన్నారు.

డిపార్టుమెంటు ఉద్యోగస్తుడు ఈ ఆలయం గురించి ఇంకో రెండు విశేషాలు కూడా చెప్పారు.

మొదటిది సూర్య కిరణాలు ఏడాదికొకసారి నంది వెనకనున్న జాలీగుండా వచ్చి స్వామి పాదాల మీద పడతాయి.

రెండవది గర్భగుడి పల్లంలో వుంటుంది. 60 సంవత్సరాలకొకసారి కాశీనుంచి గంగ వచ్చి పరశురాముడి పాదాలదాకా వచ్చి, షవర్ లాగా స్వామిని అభిషేకిస్తుంది దాదాపు ఒక గంట. తర్వాత ఆ నీరంతా ఇంకిపోతుంది. చివరిసారి డిసెంబరు 4, 2005 సంవత్సరంలో వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here