[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా కాణిపాకం లోని వినాయకుడి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
కాణిపాకం
[dropcap]చి[/dropcap]త్తూరు జిల్లాలోని కాణిపాకం గురించి తెలియనివారు చాలా తక్కువమంది వుంటారు. విఘ్నాధిపతి వినాయకుడు కొలువు తీరిన ఈ ప్రదేశం బాహుదా నది ఒడ్డున, తిరుపతి – బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరుకు 12 కి.మీ. ల దూరంలో వున్నది. ఈ దేవాలయాన్ని 11వ శతాబ్ద ప్రారంభంలో చోళ రాజు మొదటి కులోత్తుంగ చోళుడు నిర్మించాడు. క్రీ.శ. 1336 తర్వాత విజయనగర సంస్ధాన చక్రవర్తులు అభివృధ్ధి చేశారు. ప్రస్తుతం ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో, 15మంది సభ్యులతో కూడిన ట్రస్టీ చేత నిర్వహించబడుతోంది.
స్ధల పురాణం ప్రకారం ఈ స్వామి ఇక్కడ మూర్తీభవించటానికి కారణం ముగ్గురు అన్నదమ్ములు. వారు కూడా పాపం మూడు రకాల అవిటితనంతో బాధపడేవారు. ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ, మరొకరు చెవుడు. వారు వారికున్న కాణిపాకం (ఎకరాంబావు) పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తూ వుండేవారు. వారి పొలంలో ఒక బావి వుండేది. ఆ బావిలో నీరు ఏతాములతో తోడి పొలానికి పట్టేవారు. ఒకసారి బావి పూర్తిగా ఎండిపోవటంతో బావిని ఇంకా లోతుగా తవ్వటం ప్రారంభించారు. కొంచెం తవ్విన తర్వాత గడ్డపారకు రాయిలాంటి పదార్ధం తగలటంతో తవ్వటం ఆపి రాయి పడ్డదా అని చూశారు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతినుంచి రక్తం కారటం చూసి ఆశ్చర్యపోయారు. కొంచెం సేపటిలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది. ఆ నీరు తగిలిన ముగ్గురు అన్నదమ్ముల అవిటితనాలు పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఆ విషయం తెలిసి చుట్టుపక్కల గ్రామస్తులంతా తండోపతండాలుగా నూతి దగ్గరకు వచ్చి ఇంకా లోతుగా తవ్వటానికి ప్రయత్నించారు. ఇంతలో వినాయకుని విగ్రహం వూరే నీటినుంచి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువు అని గ్రహించి కొబ్బరి నీటితో అభిషేకం చేశారు. ఆ కొబ్బరి నీరు ఎకరం పావు దూరం ప్రవహించింది. ఆ అన్న దమ్ముల పొలం కాణి పరకం (తమిళంలో ఎకరంబావు) విస్తీర్ణంలో వున్న బావిలో వెలసిన దేవుడుగనుక ఆ ప్రదేశాన్ని కాణి పరకం అని పిలువసాగారు. అదే రాను రాను కాణి పాకం అయింది. అన్ని శతాబ్దాల క్రితం బావిలో వెలసిన విఘ్ననాయకుడు నేటికీ బావిలోనే వుంటాడు. ఆయన చుట్టూ నీరు వుంటుంది.
అంతేకాదు. ఇంకో విశేషమేమిటంటే, ఈ స్వామి మొదలు ఆవిర్భవించినప్పటినుంచీ కొంచెం కొంచెం పెరుగుతూ వస్తున్నాడు. దానికి నిదర్శనంగా 50 సంవత్సరాల క్రితం స్వామికి అలంకరించి సరిపోక తీసిన కవచాలు గుడిలో చూపిస్తారు. ఈ విగ్రహానికి దెబ్బ తగిలితే రక్తం స్రవించింది గనుక ఈయన సజీవ మూర్తి అంటారు. చాలా మహిమగల స్వామిగా, భక్తులను బ్రోచే వరసిధ్ధి వినాయకుడుగా అందరూ కొలుస్తారు.
అంతే కాదు. ఇక్కడ చేసే ప్రమాణాల పట్ల భక్తులు అమితమైన విశ్వాసం ప్రదర్శిస్తారు. సత్య ప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నశ్వరుడి ముందు అబధ్ధపు ప్రమాణం చెయ్యటానికి ఎవరూ సాహసించరు. ఇక్కడ చేసిన ప్రమాణాలను బ్రిటిష్ కాలంలో న్యాయస్ధానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారుట.
స్వామివారికి నిత్య పూజలతోపాటు పర్వ దినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.
అవకాశం వున్న ప్రతి ఒక్కరూ తప్పక దర్శించుకోవాల్సిన విఘ్న వినాశకారి కాణిపాకం వరసిధ్ధి వినాయకుడు.
Photo Courtesy: Internet