యాత్రా దీపిక చిత్తూరు జిల్లా – 47 – అర్ధగిరి

0
2

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా అర్ధగిరి లోని ఆంజనేయస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

అర్ధగిరి

[dropcap]చి[/dropcap]త్తూరు జిల్లాలో మేము చూసిన పుణ్య క్షేత్రాలలో చివరిది అరగొండ ఆంజనేయస్వామి ఆలయం. అంటే ఈ ఆలయాన్ని చివరికి చూశామని కాదు. చాలా కాలం క్రితం చూశాం. అప్పుడు ఈ యాత్రా దీపికల ఉద్దేశాలు లేవు. ఫోటోలు వున్నాయిగానీ జాగ్రత్త పరచలేదు.

ఈ అరగొండ ఆంజనేయస్వామి ఆలయం తవణంపల్లి మండలంలో ఒక చిన్న కొండమీద వున్నది. అరగొండ గ్రామం పేరు. అర్ధగిరి స్వామి ఆలయం వున్న ప్రదేశం. ఈ ఆలయానికి కూడా త్రేతా యుగంతో సంబంధం వున్న కథ వున్నది.

రావణాసురునితో శ్రీరామచంద్రుడు చేసే యుధ్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోతాడు. అప్పుడు లక్ష్మణుడు స్వస్థుడు కావాలంటే సంజీవనీ మూలిక కావాలని వానర వైద్యుడు సుశేనుడు చెప్తే ఆంజనేయుడు హిమాలయాలలో వున్న ఆ మూలిక కోసం వెళ్తాడు. ఆ మూలికను గుర్తించలేకి మూలిక వున్న పర్వతాన్నే పెకిలించి తీసుకు వస్తాడు. అప్పుడు భరతుడు అది చూసి ఏదో పర్వతం తమ మీదకి వస్తున్నదని, తమ రాజ్యాన్ని రక్షించటం కోసం ఆ పర్వతం మీద బాణ ప్రయోగం చేస్తాడు. అది రెండుగా విరిగి ఒక ముక్క ఇక్కడ పడ్డది అని ఒక కథనం. ఆంజనేయస్వామి పర్వతాన్ని తీసుకు వెళ్తుండగా ఒక ముక్క విరిగి పడిందని ఇంకొక కథనం. ఏది ఏమైనా ఆంజనేయుడు సంజీవనీ పర్వతం తీసుకు వెళ్ళేటప్పుడు విరిగి పడ్డ పర్వతం ముక్కగా ఈ పర్వతాన్ని భావిస్తారు. అందుకే దీని పేరు అర్ధగిరి అయింది. ఈ కొండ కింద గ్రామం అరగొండ.

ఇక్కడ ఆంజనేయస్వామిని కశ్యప మహర్షి ప్రతిష్ఠించాడుట. తర్వాత చోళ రాజులు ఆలయ అభివృధ్ధి గావించారు. ఆంజనేయస్వామి ఇక్కడ ఉత్తరాభిముఖుడుగా వుంటాడు. ఉత్తర దిక్కు కుబేరుడి స్ధానం. అందువలన ఈ స్వామిని సేవించినవారికి ఆర్థిక లోటు వుండదు అని ప్రతీతి. ఈ స్వామి వాలం తలపై వంపు తిరిగి వుంటుంది. ఇలా వున్న స్వామి క్షిప్ర ప్రసాది అంటారు. అంటే కోరిన కోరికలు వెంటనే తీర్చే స్వామి అని అర్థం.

ఇక్కడ ఉపాలయాలలో పెద్ద గణపతి విగ్రహం, శివుడు, పార్వతి వగైరా దేవతలని దర్శించవచ్చు. ఆలయం దగ్గరే సంజీవరాయ సరస్సు వుంది. ఇందులో నీరు ఔషధం కింద సేవిస్తారు. ఈ నీరు కొండలలోని అనేక ఔషధ మొక్కలను ఒరుసుకుంటూ వస్తుంది గనుక దీనికి ఆ గుణం వుందని చెప్తారు. ఇది సంజీవనీ పర్వతం ముక్క కదండీ. ఔషధ మొక్కలు చాలా వుంటాయనీ, వాటిని ఒరుసుకుంటూ ప్రవహించే నీటికి ఔషధ గుణాలు వుంటాయనీ భక్తుల అభిప్రాయం.

ఈ ఆలయం 2004 సంవత్సరం నుంచి దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధీనంలో వున్నది.

చుట్టూ కొండలు, చెట్లతో ఈ ప్రాంతం ఆహ్లాదకరమైన వాతావరణంతో చూడ చక్కగా వుంటుంది. అంతేకాదు. ఏ కాలమైనా ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం వుండటం ప్రత్యేకం.

Image Source: Temple Facebook Page

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here