యాత్రా దీపిక చిత్తూరు జిల్లా – 48 – గట్టు

0
1

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా గట్టు లోని వేంకటేశ్వరస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

గట్టు

[dropcap]కిం[/dropcap]దటి వారం దాకా చిత్తూరు జిల్లాలో మేము చూసిన ఆలయాల గురించి వివరించాను. ఈ మారు రెండు చిన్న సంఘటనలు, నాకానందం కలిగించేవి జరిగాయి. ఫేస్‌బుక్ స్నేహితురాలు శ్రీమతి కామకోటి లక్ష్మీ రాఘవ (అల్లూరి అమ్మణ్ణి) గారు కురబలకోట, చిత్తూరు జిల్లా నుంచి ఆవిడ రాసిన గట్టు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి దేవాలయ చరిత్ర పుస్తకం పంపారు. మా ప్రయాణంలో ఈ ఆలయం గురించి కూడా చెప్పారు. కానీ సమయాభావం వల్ల చూడలేక పోయాము. నన్నొదిలేసి అలా వెళ్తారా అని ఆ వేంకటేశ్వరస్వామి ప్రశ్నిస్తున్నట్లు నా చేతికి ఆయన పుస్తకం వచ్చింది. అందుకే మేమీ ఆలయాన్ని దర్శించలేక పోయినా శ్రీమతి లక్ష్మీ రాఘవ గారి పుస్తకం నుంచి సేకరించిన ఈ ఆలయం వివరాలు ఈ వారం ఇస్తున్నాను. (ఫోటోలు కూడా వారి సౌజన్యంతోనే). వచ్చేవారం ఇంకొక విశేషం చెబుతాను.

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి. ఈయన ఎంత మహిమగల దేవుడో తిరుమలకీ, ఆయన ఆలయాలకీ వచ్చే ఆయన భక్తులను చూస్తే తెలుస్తుంది. ఎంతో మందికి ఎన్నో మహిమలు చూపిస్తూ, అడుగడుగునా తానున్నానని నిరూపిస్తూ, భక్తుల మనసుల్లో నిలిచిపోయే ఆ దివ్య మంగళ విగ్రహాన్ని తలచుకోని వారుండరు కదా. మనం కూడా చిత్తూరు జిల్లాలోని గట్టులో వెలిసిన ఆయన విశేషాలు తెలుసుకుందాము.

చిత్తూరు జిల్లాలో మదనపల్లెకు 20 మైళ్ళ దూరంలో వున్న ఈ గ్రామం పేరు రికార్డుల ప్రకారం ఘట్టు. అయితే తర్వాత కాలంలో ప్రజల నోళ్ళల్లో పడి అది గట్టుగా మారి వుండవచ్చు. ఇక్కడి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర వున్నది. ఈ స్వామి ఈ గ్రామంలో కొలువు తీరటానికి కారణం ఒక కథ చెబుతారు. ఈ గ్రామంలోని శ్రీ గిరియప్పగారనే ఆయనకి ఒక రాత్రి స్వామి కలలో సాక్షాత్కరించి తాను ఒక బావిలో శిలా రూపంలో వున్నానని, తనని వెలికి తీసి గట్టులో ప్రతిష్ఠించవలసినదిగా కోరారట. ఆ తరువాత కొద్దిరోజులకు బురకాయలకోట – తుమ్మనంగుట్ట మధ్యలో వున్న కోనాపురం అనే వూరిలోని కపిలబావిలో నీటిమట్టం తగ్గిపోయిందని బావిలో పూడిక తీస్తూ వుండగా తట్టలు రాతికి తగిలినట్టు శబ్దం వినిపించి ఏమటా అని జాగ్రత్తగా తవ్వి చూడగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారి పెద్ద విగ్రహం బయట పడ్డదట.

కోనాపురం బావిలో విగ్రహం బయటపడ్డదనే వార్త గట్టులోని గిరియప్పగారికి చేరింది. ఆయన తనకు వచ్చిన కలను గుర్తు చేసుకుని అక్కడికి వెళ్ళి ఏడు కాడెద్దులతో బండి కట్టి స్వామివారి విగ్రహాన్ని గట్టు గ్రామానికి తీసుకువచ్చి, ఆ విగ్రహానికి తగినట్లుగా ఆలయ నిర్మాణం చేసి స్వామిని ప్రతిష్ఠించారని కధనం.

అంతకు ముందు ఆ విగ్రహం కోనాపురంలో విశాలమైన గుడిలో వుండేదనీ, చుట్టూ నాలుగు కోనేర్లు వుండేవనీ, మహమ్మదీయుల దండయాత్ర కాలంలో విగ్రహాన్ని భిన్నం చేస్తారేమోనన్న భయంతో హిందువులు కపిల బావిలో ఆ విగ్రహాన్ని జలాదివాసం చేసి వుండచ్చని అంటారు. మహమ్మదీయుల దండయాత్రల కాలంలో చాలా ఆలయాలలో అలా జరిగిన కథలు వింటూ వున్నాము.

అలా గట్టు గ్రామం చేరిన స్వామిని ప్రతిష్ఠించిన తర్వాత గిరియప్పగారే నిత్య పూజలు నిర్వహించేవారుట. తర్వాత శ్రీనివాసపురం తాలూకా రోణూరునుండి శ్రీ రామభట్టరు గారిని పూజకోసం ఏర్పాటు చేశారుట. గట్టు గ్రామంలోని సంపన్న కుటుంబం అయిన శ్రీ కొమార గోపాలరావుగారు ఈ ఆలయానికి తొలుత ధర్మకర్తలుగా వ్యవహరించి, దేవుడికి మాన్యాలు ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఆ తరువాత వారసులుగా వచ్చిన అల్లూరి వంశంవారు నేటికీ ఆలయ ధర్మకర్తలై తిరుమల బ్రహ్మోత్సవం వలె సాంప్రదాయరీతిలో తిరునాళ్ళను జరుపుతున్నారు.

మొదట్లో శ్రీరామనవమినాడు జరిగే స్వామి కళ్యాణం తర్వాత కాలంలో కుటుంబ సభ్యుల అనుకూలం కోసం వైశాఖ శుధ్ధ అమావాస్యనాడు జరపటం మొదలైంది. క్రమంగా ఊరి ప్రజలు కూడా పాలు పంచుకోవాలని ఇతర కులాల వారినీ ఉభయదారులుగా కలుపుకుని ఉత్సవాలను జరపడం సాంప్రదాయం చేశారు. వైశాఖ బహుళ ద్వాదశినాడు అంకురార్పణ చేసి ధ్వజారోహణ చేస్తారు. పంచమి దాకా సాగే ఈ ఉత్సవాలలో ఒక్కొక్క రోజు వాహన సేవ ఒక్కొక్క కులం వారి ఉభయంతో సాగుతాయి.

వైశాఖ బహుళ ద్వాదశినాడే మొదలయ్యే స్వామివారి తిరుణాల అంకురార్పణతో మొదలవుతుంది. దీనికోసం పుట్ట మన్ను సేకరించి, నవ ధాన్యాలు మొలక పోసి, యాగశాలలో కలశారాధన చేసి, మృత్యుంజయ హోమము, వాస్తు హోమము, వాస్తు పూజ చేస్తారు. తరువాత ధ్వజారోహణతో మొదలయిన ఉత్సవాలు ధ్వజారోహణతో ముగుస్తాయి.

చరిత్ర

శ్రీ వేంకటేశ్వరస్వామి కోనాపూర్ దేవుడిగా వెలిసి, గట్టు గ్రామానికి శ్రీ గిరియప్ప ద్వారా చేరి కొన్ని వందల సంవత్సరాలు అయినట్లు తెలుస్తున్నది. అప్పట్లో గట్టు గ్రామంలో సంపన్న కుటుంబమైన కొమార గోపాలరావుగారు మొదట ధర్మకర్తలుగా వ్యవహరించి, దేవుడికి మాన్యాలు ఇచ్చినట్లు వుంది. అప్పుడు అతి పురాతనమైన తేరు వుండేది. దానికి రాతి చక్రాలువుండి ఆ చక్రం మీద కొమార గోపాలరావు పేరు చెక్కబడి వున్నదిట. తర్వాత కాలంలో ఆలయం ముందు భాగంలో వున్న నాగులకట్ట మీద పాత రథానికి వున్న రాతి చక్రాలతో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. దీనివల్ల తిరునాళ్ళలో ఎక్కువమంది కళ్యాణోత్సవం చూడటానికి వీలుగా వుంటోంది. అంతేకాదు. అత్యంత కళతో వున్న ఒక పంచలోహ గరుడువాహనం కూడా ఇప్పటికీ వుంది. దాని ఫలకంపై సూర్యనారాయణ అనే పోలీసు ఆఫీసరు, హేవళంబి నామ సంవత్సరం 1897లో బహూకరించినట్లు వుందిట. ఈ ఆధారాలతో అప్పటినుంచే తిరుణాల జరిగి వుండచ్చని తెలుస్తోంది.

ఈ ఆలయాన్ని అభివృధ్ధి చేసినవారిలో ముఖ్యులు ధర్మకర్త శ్రీ అల్లూరి నరసింగరావుగారు, వారి కుటుంబీకులు. వీరు తరతరాలుగా ఆలయాభివృధ్ధిలో పాలు పంచుకుంటున్నారు.

ఆలయం

ఆలయం చుట్టూ విశాలమైన ప్రాంగణం. తూర్పు ముఖంగా వుండే ఆలయం. ప్రధాన ద్వారానికి ఇరువైపులా మంగళ వాయిద్యకారులు కూర్చుని మేళతాళములు వాయించడానికి అనువుగా రెండు చిన్న వంది-మాగధ మండపాలు వున్నాయి.

గర్భాలయంలో సుమారు ఐదున్నర అడుగుల నిలువెత్తు మూల విగ్రహం తిరుపతి దేవుడిని తలపింప చేస్తుంది. నల్లని మేనితో సాలగ్రామ శిలామూర్తి మంగళ రూపం నేత్రానందంతోబాటు పవిత్రభావాన్ని కలుగజేస్తుంది. ఇంకా స్వామివారి పాదాలపై మువ్వల అందెలు, నడుమున బిగించిన ఉదరపట్టెడ, ఊర్ధ్వ హస్తములు రెండూ శంఖ చక్రములు ధరించి, కుడి హస్తం వరద ముద్రతో, ఎడమ హస్తము నడుము కింది భాగంలో కటిపై పెట్టుకుని వుంటారు. శ్రీవారి వక్షస్ధలంపై శ్రీమహాలక్ష్మి స్వరూపం.

అనేక మహిమలు చూపించిన ఈ స్వామియొక్క విశేషం ఒకటి చెప్పి ఈ వ్యాసం ముగిస్తాను. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున పాదయాత్రగా కర్ణాటకనుంచి తిరుమలకు కొందరు భక్తులు వస్తూ వుంటారు. వారు కొత్తకోట తర్వాత వచ్చే ఈ గట్టు గ్రామంలోని వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో విశ్రమించి, మర్నాడు బయలుదేరేవారు. ఒకసారి వారు ధర్మకర్తల ఇంటికి వచ్చినప్పుడు వారి ఇంట పూజ గదిలో వున్న ఉత్సవ విగ్రహాలను చూసి ప్రశ్నంచగా, గుడిలో దొంగల భయం ఎక్కువగా వున్నందువల్ల ఇంట్లోనే వుంచుకుని కాపాడుకుంటున్నాము అని అల్లూరి మూర్తి దంపతులు వివరించారు. పాదయాత్రవారు ఒక అభ్యర్థన చేశారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారి దర్శనం తరువాత వెనక్కి వెళ్ళి బెంగుళూరులో స్వామి కళ్యాణ మహోత్సవం పెద్ద ఎత్తున జరపడం ప్రతి ఏడాదీ ఆనవాయితీగా జరుగుతోందనీ, ఆ కార్యక్రమానికి గట్టులోని శ్రీవారి ఉత్సవ విగ్రహాలను శాస్త్రోక్తంగా తీసుకువెళ్ళి కళ్యాణం జరిపించి, తర్వాత వెంటనే గట్టుకు చేర్చగలమనీ అడిగితే అల్లూరి మూర్తి దంపతులు అంగీకరించారు. అప్పటినుంచీ బెంగుళూరునుండీ ప్రత్యేకంగా కారులో వచ్చి విగ్రహాలు తీసుకు వెళ్ళటం, కళ్యాణం తరువాత కానుకలు, సారెతో శ్రీవారు కొత్త దంపతులుగా గట్టు గ్రామం చేరటం అలవాటైంది. అది ఇప్పటికీ జరుగుతోంది.

అంతే కాదు. నడిచే దేవుడనే పేరుగాంచిన కంచి పీఠాధిపతి, శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర స్వామివారు ఈ ఆలయానికి విచ్చేసి ఆలయ ఆవరణలో ధ్యానం చేసుకున్నారుట.

వచ్చేవారం ఇంకొక విశేషంతో చిత్తూరు యాత్ర, మేము చూసినంతవరకూ, ముగుస్తున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here