Site icon Sanchika

యాత్రా దీపిక చిత్తూరు జిల్లా – 49 – కమ్మగుట్టపల్లి

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా కమ్మగుట్టపల్లి లోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

కమ్మగుట్టపల్లి

[dropcap]ఇ[/dropcap]ది రెండో విశేషం. ఎదురుకుండా వుండే రాజ్ కుమార్ కుటుంబం మాకు చాలా సన్నిహితులు. రాజు నా రచనలు చూస్తూ వుంటాడు. ఒకసారి “ఆంటీ, మా స్నేహితులు కూడా మీ చిత్తూరు జిల్లా యాత్ర చూస్తున్నారు. వాళ్ళు చిత్తూరు జిల్లా వాళ్ళే. వాళ్ళు అభివృధ్ధి చేస్తున్న ఆలయం మీరు చూశారా? పూతల పట్టు గురించి వ్రాశారు కదా! ఆ మండలంలోనే వుంది. ఈ మధ్య బాగా అభివృధ్ధిలోకి వస్తోంది” అని మరో కొత్త ప్రదేశం గురించి చెప్పాడు. “ఒక ప్రాంతంలోని ఆలయాలు అన్నీ చూడటానికి మేము వెచ్చించే సమయం సరిపోదు. అందుకే తెలిసిన ఆలయాలలో పురాతనమైనవి ఎంచుకుని చూస్తాము” అన్నాను.

అప్పుడు చెప్పాడు తను చూసి వచ్చిన ఈ ఆలయం గురించి.. రాజ్ కుమార్ అందించిన సమాచారం ప్రకారం నెట్ లోంచి సేకరించిన సమాచారం ప్రకారం పురాతనమైన ఈ ఆలయం గురించి మీకు చెప్పి ఈ చిత్తూరు యాత్ర ముగిస్తున్నాను. ఈ సమాచారం అందించిన శ్రీ రాజ్ కుమార్‌కి వారి స్నేహితులకీ కృతజ్ఞతలు.

ఈ ఆలయం చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలంలో కమ్మగుట్టపల్లి గ్రామంలో వున్నది. ఇక్కడ వున్న దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఈ ఆలయం చాలా పురాతనమైనది. అసలు ఆ ప్రాంతంలో ఒక ఆలయం వుందని కూడా తెలిసేట్లు లేదు భూమి మీద చూస్తే ఏవో కొన్ని సూచనలు తప్పితే. అక్కడ వుండే రిటైర్డ్ ఉపాధ్యాయుడు శ్రీ మునుస్వామి నాయుడు గారికి నిద్రలో ఒక కల వచ్చింది. అందులో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కనిపించి, ఆలయం గురించి చెప్పి, దానిని పునర్నిర్మించాలని ఆదేశించారు. శ్రీ మునుస్వామి నాయుడు ఎంత అదృష్టవంతులో కదా. ఇది జరిగింది 2002 సం. లోనే.

నాయుడుగారు, ఇంకా మిగతా భక్తులు కలిసి వెంటనే ఈ ప్రాంతాన్ని తవ్వడం ప్రారంభించారు. కొంత తవ్విన తర్వాత, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, అమ్మవారు, నలుగురు ఆళ్వారులు, జయ విజయులు, గరుడాళ్వారు విగ్రహాలు లభించాయి. ఈ విగ్రహాలు 200 సంవత్సరాలకు పైగా పురాతనమైనవని పురావస్తు నిపుణులు చెప్పారు. వెంటనే, ఈ విగ్రహాలు శుభ్రపరచి మే 14, 2002లో ప్రతిష్ఠించారు. అప్పటినుంచే స్వామికి రోజువారీ పూజలు, ఇతర ఆచారాలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి.

మార్చి 20 2014 నాడు శ్రీ మునుస్వామి నాయుడుగారు స్వర్గస్తులయ్యారు. తర్వాత శ్రీ కంకిపాటి హనుమంతరావు ఈ బాధ్యతను చేపట్టారు. ఆలయాన్ని పునర్నిర్మించి, విగ్రహాలను మరింత మెరుగుపరిచారు. కలశ స్ధాపన చేపట్టారు. ధ్వజ స్తంభాన్ని, బలిపీఠాన్ని సిధ్ధం చేశారు. కోనేరు, మాడ వీధులు కూడా సిధ్ధంగా వున్నాయి.

ఇంకా ముఖ మండపం, ప్రహరీ గోడ, గాలి గోపురం, క్షేత్ర పాలకుడు శివుడి ఆలయం, హనుమంతుని ఆలయం, సమీపంలోని కొండపై స్వామి వారి పాదాలు, దర్శనానికి వచ్చే పాదచారులకు మెట్లు, స్వామి వారి వాహనాలు, ఇలా అభివృధ్ధి పరచాల్సిన అంశాలు చాలా వాటికి ప్రణాళికలు సిధ్ధం చేస్తున్నారు. ఇప్పటివరకి సుమారు 60 లక్షల రూపాయలు ఖర్చు చేయబడింది.

అంతే కాదు. ఈ ఆలయం మానవ సమానత్వాన్ని పాటిస్తుంది. ప్రత్యేక లైన్లు, ప్రత్యేక దర్శనాలు లేవు. ముందుగా వచ్చిన వారికి ముందుగా దర్శనం, గోత్ర నామాలతో పూజ జరుగుతుంది.

ఈ ఆలయాన్ని ఇంకా అభివృధ్ధి చెయ్యాలని కృషి చేస్తున్నారు.

ముగింపు

ఇప్పటిదాకా చిత్తూరు జిల్లాలో మేము చూసిన ఆలయాల గురించి చెప్పాను. దీనికి సహకరించిన అందరి పేర్లూ ఆ వ్యాసాల్లో ఇచ్చాను. మరొక్కసారి ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభివందనాలు.

ఈ చిత్తూరు జిల్లా యాత్రా దీపికని మహా మహిమాన్వితుడు టి.పుత్తూరుకి కోరి వచ్చిన శ్రీ సీతా లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీ కోదండ రామస్వామి పాద పద్మాలకు సమర్పిస్తున్నాను.

Exit mobile version