Site icon Sanchika

యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-5

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా కలువకుంట లోని ‘అపీతకుచలాంబాసమేత ముక్కంటేశ్వరస్వామి దేవాలయం’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

కలువకుంట

[dropcap]మా[/dropcap] మార్గదర్శకులు సాంబశివరెడ్డిగారు, పురందర రెడ్డిగారు మా యాత్రకి చక్కని ప్రణాళిక వేశారండీ. ఇప్పటిదాకా చిత్తూరు పరిసరాల్లోనే వున్నాము. ఇంక ఊరు వదిలి వెళ్తున్నాము, బయట భోజనం సరిగా వుండదని మళ్ళీ విష్ణుభవన్‌కి వెళ్ళి భోజనాలు పార్శిల్ కట్టించుకుని అక్కడికి దాదాపు 15 కి.మీ.ల దూరంలో వున్న కలవకుంటకి బయల్దేరాము. దోవలో భోజనం కోసం వెతుక్కున్నా, మళ్ళీ ఇక్కడికే వచ్చి వెళ్ళినా సమయం వృథా అవుతుందని అలా చేశారు. వీటన్నింటితో మాకు చాలా సమయం కలసి వచ్చి అన్నీ ప్రశాంతంగా చూడగలిగాము. మధ్యాహ్నం 1-15కల్లా కలువకుంట చేరాము.

అపీతకుచలాంబాసమేత ముక్కంటేశ్వరస్వామి దేవాలయం, కలవకుంట

ఇది బహుదా నదీ సమీపాన వున్న శివాలయం. ఆలయం ముఖద్వారం తీసే వుంది. మధ్యాహ్నం సమయం కదా లోపల అమ్మవారి, అయ్యవారి ఆలయాలు మూసి వున్నాయి. మావాళ్ళు పూజారిగారు శ్రీ జయేంద్ర శివంగారికి ఫోన్ చేస్తే వచ్చి తలుపు తీశారు. చిన్నాయన. బాగా చదువుకున్న వ్యక్తి. అసలు అర్చకులు శ్రీకంఠ గురుక్కల్. ఆయన వేరే పనిలో వుంటే ఈయన వచ్చి తలుపు తీసి ఆయనకు తెలిసినంత మటుకూ వివరాలు చెప్పారు.

ముందు దర్శనం చేసుకోండి అన్నారు. చాలా పురాతన ఆలయం. దాదాపు మూడు అడుగుల ఎత్తున్న పానవట్టం మీద రెండు అడుగుల శివలింగం పైన ఇత్తడి 5 తలల పాము పడగ. లింగం కళ్ళకి గంధంతో సూర్య చంద్రుల్లాగా దిద్దారు.

జనమేజయుడు ప్రతిష్ఠించిన లింగమని చెబుతారు. చోళులు నిర్మించిన ఆలయం. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు అభివృధ్ధి చేశారు. రాయలు 1008 ఆలయాలు నిర్మించాలని అనుకున్నారుట. అన్ని ఆలయాలు పూర్తి చెయ్యగలిగే ఆయుష్షు వుందో లేదోనని 108 ఆలయాలు, 1008 విగ్రహాలు పూర్తి చేశారు. అందుకే ఆయన నిర్మించిన వాటిలో చాలామటుకు శివ కేశవుల ఆలయాలు పక్కపక్కనే వుంటాయి. రాతి స్తంభాలపై విగ్రహాలు చెక్కి వుంటాయి.

పంచభూతాలకి ప్రతీకగా ఏటి ఒడ్డున ఐదు శివాలయాలు కట్టించారని ఇంతకు ముందుకూడా చెప్పాను కదా. వాటిలో ఇది ఒకటి. కొందరు ఈ ఐదేకాక వేదమూరు, చిత్తూరులోని అగస్త్యేశ్వర ఆలయాన్ని కూడా కలిపి సప్త శివాలయాలంటారు. ఈ పంచ లింగాల ఆలయాలన్నీ దక్షిణ ద్వారం ఆలయాలు. అన్నింటికన్నా ఇక్కడ పెద్ద శివ లింగంట.

అమ్మ అపీతకుచాంబిక ఆలయం వెనకాల వున్నది. అమ్మ వెనక వున్న ఏనుగు బొమ్మనుంచి షోలింగర్, పూతలపట్టుకి సొరంగ మార్గాలున్నాయిట.

కాశీ క్షేత్రం తర్వాత అంత ప్రశస్తమైన క్షేత్రం ఇది అనీ, అందుకే దీనిని దక్షిణ కాశీ అంటారనీ అన్నారు. నది ఒడ్డున క్షేత్రం. పైగా ఇక్కడ బహుధా నదితో నీవా నది కలిసే సంగమ ప్రదేశం. కనుక ఈ సంగమంలో చనిపోయినవారి అస్తికలు కలిపి ఈ ఆలయంలో రాత్రి నిద్ర చేస్తారుట. అందుకే ఎవరు ఏ సమయంలో వచ్చినా ఇబ్బంది వుండకుండా వుండాలని రాజద్వారం ఎప్పుడూ తెరిచే వుంచుతారు. అలా నిద్ర చేసినవాళ్ళు మర్నాడు స్వామి దర్శనమయిన తర్వాత శటారి తలపై పెడితేనే వాళ్ళ దోషాలు పూర్తిగా తొలగినట్లు ప్రాచీన కాలంనుంచీ వస్తున్న నమ్మకంట.

ఈ ప్రాంగణంలోనే లక్ష్మీ నారాయణస్వామి ఆలయం కూడా వున్నది. దర్శనం కాలేదు. ఈ ఆలయాలను తేజా గ్రూప్ అధినేత శ్రీ రావూరు ఈశ్వరరావు ఛారిటబుల్ ట్రస్ట్ వారు ప్రత్యేక భక్తి శ్రధ్ధలతో అభివృధ్ధి చేస్తున్నారుట.

ఈ గ్రామానికి కలువపురి, కలువకుంట అనే పేరు రావటానికి కూడా ఒక కథ చెబుతారు. పూర్వం ఒక రాజు తన తల్లిదండ్రుల అస్తికలు కాశీలోని గంగా నదిలో కలపాలని తీసుకుని వెళ్తూ వెళ్తూ ఇక్కడికొచ్చేసరికి అలసిపోయి ఈ సంగమం ప్రాంతంలో అస్తికల మూటనుంచి కాలకృత్యాలు తీర్చుకోవటానికి వెళ్ళాడుట. ఆయన వెంట వస్తున్న కొందరు భక్తులు రాజు తమ చేతికి కూడా ఇవ్వకుండా అంత భద్రంగా పట్టుకొచ్చే మూటలో ఏమున్నాయోనని తీసి చూడగా దానిలో వారికి కలువపూలు కనిపించాయట. రాజు కలువపూల మూటనంత శ్రధ్ధగా పట్టుకొస్తున్నాడేమిటా అని వారాశ్చర్య పోయారుట. పూలమూటని ఇంత జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడేమిటని తిరిగి పెట్టేయబోగా అది జారి ఏట్లో (బహుధా నది.. అక్కడివారు ఏరు అనే చెబుతారు)పడిపోయి, నీళ్ళల్లో పడ్డ అస్తికలన్నీ కలువ పూలుగా మారాయిట. అస్తికలు కలువపూలుగా వికసించిన ఈ ప్రాంతం ఎంతో పవిత్రమైనదిగా భావించి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయసాగారు. ఊరికి కూడా కలువపురి, గుంటలో కలువలు వికసించాయి కనుక కలువకుంట అనే పేర్లు వచ్చాయి.

ఈ కథని ఇంకొక విధంగా చెప్పారు పూజారిగారు. ఇక్కడికి దగ్గరలోనే కలిగిరి కొండ మీద శ్రీ వెంకటేశ్వరుడున్నాడు. కలిగిరికి రెండవ తిరుమలనే పేరు వుంది. కలువకుంటలో కలువలు ఎక్కువగా పూసేవి. పూర్వం ఒకరు ఇక్కడనుండి కలిగిరిలో జరిగే యాగానికి కలువ పూలు కోసుకుని వెళ్ళారు. అక్కడికెళ్ళే లోపల ఒక అశుచిగా వున్న మనిషి దానిని తాకాడు. యాగశాలకు వెళ్ళి చూస్తే మూటలో వున్న పూలన్నీ అస్తికలుగా మారాయి. కారణం తెలుసుకున్న అతను తిరిగి ఇక్కడికి వచ్చి శుచిగా స్నానం చేసి చూస్తే పూలన్నీ చక్కగా కనిపించాయిట. ఏ కధ అయినా ఇక్కడ పడ్డ అస్తికలు కలువపూలుగా మారాయని చెబుతోంది.

విజయనగ రాజుల కాలంలో కలువపురి పట్టణంగా పేరొచ్చింది. ఆ రాజులు యీ నదికి ఆనకట్టకట్టి కాలువ ద్వారా పట్టణ అవసరాలకి నీరు మళ్ళించటంతో కాలువపురి అనే పేరు కూడా వున్నదట. భక్తులంతా కాశీకన్నా పవిత్ర క్షేత్రంగా భావించటంతో దక్షిణ కాశీగా పేరుపొందింది.

ఈ ప్రాచీన ఆలయాలు పల్లవులు, చోళులు, విజయనగర రాజులు మొదలగు అనేక రాజ వంశాలవారిచే అంచెలంచెలుగా అభివృధ్ధి చేయబడి అనేక కానుకలు ఇయ్యబడినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది.

రుద్ర పాదం

2-05కి బయల్దేరాం. దోవలోనే వున్న రుద్ర పాదం చూశాం. హంద్రీ-నీవా ప్రాజెక్టు స్ధలంలో మొదట ఈ రుద్రపాదం వుండేది. ప్రాజెక్టు మూలంగా అక్కడనుండి తీసి ప్రస్తుతం వున్న ప్రదేశంలో స్ధాపించారు.

ఒక మండపంలో గ్రనేట్ రాళ్ళ మధ్య రెండు పాదాలు వున్నాయి కొంచెం పెద్దగా. చుట్టూ ఏడు జతల పాదాల గుర్తులున్నాయి. వాటిని శివుని పాదాలుగా భావిస్తారు. అదే రుద్ర పాదం. అక్కడ అస్తి నిమజ్జనం చేస్తారుట. నదిలో వున్నాయి గనుక రోడ్డు మీదనుంచి కొన్ని మెట్లు దిగి వెళ్ళాలి. నదిలో నీళ్ళు లేవు.

అక్కడనుండి సమీపంలోనే కలిగిరి కొండకి బయల్దేరాము.

Exit mobile version