యాత్రా దీపిక చిత్తూరు జిల్లా – 50 – శ్రీ గవి తిమ్మరాయస్వామి

2
2

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా శ్రీ గవి తిమ్మరాయస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

శ్రీ గవి తిమ్మరాయస్వామి

[dropcap]చి[/dropcap]త్తూరులో చాలా ఆలయాలు చూశాను, వాటి గురించి రాశాను కదా అనుకున్నాను. కాని అంతకు ముందు నా యాత్రలో సహకరించిన శ్రీ సాంబశివ రెడ్డి గారు, శ్రీ పురందర రెడ్డి గారు ఇంకా చూడాల్సినవి చాలా వున్నాయి. అందులో కొన్నయినా చూద్దురుగాని. కనీసం ఇంకోసారి రండి అన్నారు. ఆలయాలు చూపిస్తాము రండి అనేవారు వుండాలేగానీ ఆగటం నా తరమా. కరోనాని కొంత శాంతింపజేసి, మొన్న మార్చిలో స్నేహితురాలు శ్రీమతి కమలా పరచా నేను బయల్దేరాము. కమల షార్ట్ వీడియోలు చేస్తారు. అందుకని ఆవిడకి కూడా ఆసక్తి.

మార్చి 4, 2022 కాచిగూడా నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరి మార్చి 5 వ తారీకు ఉదయం 9-15 గంటలకి చిత్తూరు చేరాము. శ్రీ సాంబశివరెడ్డిగారు స్టేషన్ కి వచ్చారు సుమోతో సహా. లాడ్జికి వెళ్ళి స్నానాలు చేసి, విష్ణు భవన్ లో టిఫెన్ చేసి 11-15కల్లా బయల్దేరాము. రచయిత శ్రీ మునిరత్నం రెడ్డిగారి సలహాతో సాంబశివ రెడ్డిగారు, పురందర రెడ్డిగారు మాకోసం 5 రోజుల ప్రోగ్రాం రెడీ చేసి పెట్టారు. దాని ప్రకారం ఇవాళ మొదటి ఆలయం శ్రీ గవి తిమ్మరాయస్వామిది.

శ్రీ మునిరత్నం రెడ్డి గారు చిత్తూరు జిల్లాలోని అనేక ఆలయాలు దర్శించి, పరిశీలించి, పరిశోధించి అనేక పుస్తకాలు రాశారు. వాటిలో శ్రీ గవి తిమ్మరాయస్వామి స్ధల పురాణ చరిత్ర కూడా ఒకటి. నేను చిత్తూరు యాత్రా దీపికలో చాలా సార్లు వారి పుస్తకాల సహాయం, వారి అనుమతితో తీసుకున్నాను. ఆయన నన్ను చాలా ప్రోత్సహించారు. నేను చిత్తూరు జిల్లాలో ఆలయాల గురించి మాత్రమే రాస్తున్నాను. మీరు అనేక ప్రదేశాలు చూసి రాస్తున్నారు అంటూ. నాకు ఒక్కటే అనిపించింది. జిల్లాకొకరు మునిరత్నం రెడ్డిగారిలాంటి వారు వుండి తీరాలి. ఇంక ఆలయం గురించి..

ఇక్కడ వంశపారంపర్య అర్చకులు శ్రీ పార్థసారథి భట్టార్. వారి కుమారులు శ్రీ కుల శేఖర్ భట్టార్. మేము తిరిగే ప్రదేశాలలో భోజన సౌకర్యం సరిగా వుండదు కనుక వారింట్లో భోజనం చేసి వెళ్ళమని ఆ ఆలయ అర్చక స్వామి శ్రీ కుల శేఖర్ భట్టర్ ముందే చెప్పారుట శ్రీ సాంబశివ రెడ్డిగారితో. వారిది దేవాలయాల అనుబంధం. కుల శేఖర్ భట్టర్ వయసులో చిన్నవాడు. నిజంగా కుల శేఖరుడూ, గుణ శేఖరుడులాగానే వున్నారు. రామ సముద్రంలోని ఆలయాలన్నింటికీ తన శిష్యులతో సహా మాతో వచ్చి, అవసరమైన చోట్ల ఆలయ తలుపులు తీయించి, అర్చక స్వాములకు ముందే విషయం తెలిపి, ఆలయాల గురించి వివరాలు చెప్పి, చెప్పించి చాలా సహాయం చేశారు. కుల శేఖర్ భట్టర్ గారూ, మీకూ, మీ కుటుంబానికీ ఆయురారోగ్య, ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆ తిమ్మరాయ స్వామిని ప్రార్ధిస్తున్నాను.

ఇంక ఆలయం గురించి.. ఆలయం పుంగనూరు నుండి రామ సముద్రం మార్గంలో 14 కి.మీ. ల దూరంలోను, మండల కేంద్రమైన రామ సముద్రంనుంచి 3 కి.మీ. ల దూరంలో వున్నది. ఊలపాడు పంచాయతీ రహదారినుండి మహా ద్వారంగుండా ఒక కిలోమీటరు దూరంలో దిన్నెపల్లి సమీపంలో వుంది. గ్రామం పేరు కొండమోరు. ఇక్కడ కొండలన్నీ 25 కి.మీ. ల పొడవున అడ్డంగా వ్యాపించి వున్నాయి. అంతా అడవులు.

ఇక్కడ స్వామి వెలియటానికి రెండు కథలు చెబుతారు. కులశేఖర్ భట్టార్ చెప్పిన ఒక కథ. ఇక్కడ గౌతమ మహర్షి చాలా కాలం తపస్సు చేశారు. ఆయనకి స్వామి మానసిక దర్శనమిచ్చేవారుట. గౌతమ మహర్షి స్వామిని శ్రీదేవీ, భూదేవీ సమేతంగా అర్చా రూపంలో దర్శనమివ్వమని కోరగా, స్వామి వచ్చే శ్రావణ మాసం దాకా తపస్సు కొనసాగించమనీ, శ్రావణ మాసంలో తన ముందు వున్న గవిలో (గుహ) దర్శనమిస్తానని చెప్పారుట. అలాగే గవిలో పర్వత శిలల రూపంలో వెలిశారుట. గుహలో మూడు శిలలు కనిపిస్తాయి. అవి ఆవిర్భావ స్వరూపాలు. తర్వాత కొంతకాలం ఇక్కడే వుండి ఆ అర్చామూర్తులను పూజించిన గౌతమ మహర్షి అక్కడనుంచి వెళ్ళిపోయారు. ఆ స్వామిని తిమ్మరాయస్వామిగా (చిత్తూరు జిల్లాలో తిమ్మరాయ స్వామి అంటే వెంకటేశ్వరస్వామిట) ఇక్కడివారు కొలవసాగారు. ముందు ఉత్సవ విగ్రహాలను 40 ఏళ్ళ క్రితం ప్రతిష్ఠించారు.

స్వామి శ్రావణ మాసంలో ఆవిర్భవించారనే కాబోలు ఇక్కడ శ్రావణ మాసంలో తిరునాళ్ళు జరుగుతాయి.

స్ధల పురాణం ఇంకొక కథ ప్రకారం వెంకటేశ్వరస్వామి వారు కర్ణాటక రాష్ట్రం మూలూరు దగ్గర చిక్క తిరుపతి నుండి పెద్ద తిరుపతికి వెళ్ళేటపుడు ఈ కొండ పవిత్రతను తెలుసుకొని, ప్రకృతి అందాలకు పరవశుడై ఈ గవిలో ఒక రోజు విడిది చేసి, తమ ప్రతిమలను నిలిపి కొండ గవిగుండా తిరుమల చేరారని భక్తుల విశ్వాసం. తాను విడిది చేసిన విషయం ఆ ప్రాంత పాలేగారికి (రాజు గారికి) రాత్రి కలలో కనబడి మీ వూరి పక్కన కొండ గవిలో మేము తిమ్మరాయ స్వామిగా బొమ్మరాయిలో వెలిశాము, మమ్ములను ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిష్ఠించి నిత్య పూజలు జరిపితే మీకు, మీ ప్రాంతానికి సర్వ సౌఖ్యాలు కలుగ చేస్తానని చెప్పి మాయమయ్యారుట. ఆ రాజు తర్వాత స్వామిని కనుగొని, ఆలయం నిర్మించి, సకల సౌకర్యాలు అమర్చారు.

స్వామికి ముందు ఒక ఉపాలయంలో పద్మావతీ దేవి, ఇంకో ఉపాలయంలో విఘ్నేశ్వరుడు వున్నారు. విఘ్నేశ్వరుడున్న ఉపాలయంలో ఇదివరకు ఆళ్వారుల విగ్రహాలు వుండేవిట. అవి దొంగల పాలైనాయి. ప్రస్తుతం రామానుజాచార్యులు, దేశికర్ల శిలా ప్రతిమలు రెండు మాత్రమే వున్నాయి. ఒక ఉప మండపంలో ఆంజనేయ స్వామి వున్నారు. మునిరత్నం రెడ్డిగారి పరిశోధనలవల్ల ఇంకా చిన్న ఆలయాలు, కోనేరు వగైరాలు కాలగర్భంలో రూపు మాసిపోయాయని తెలిసింది.

ప్రధానాలయానికి సుమారు 330 అడుగుల ఎత్తున కొండ శిఖరముపై మేలు దీప (ఆకాశ దీప) స్తంభం వుంది. కిందనుంచీ కొండ పై వరకూ రాళ్ళు పరచిన దోవ వుంది. అక్కడ వెలిగించిన దీపం కొండ చుట్టూ వున్న సుమారు 60 గ్రామాలకి కనిపిస్తుందిట. గుడికి రాలేనివారు ఆ దీప దర్శనం చేసి స్వామి దర్శనం చేసిన సంతృప్తి పొందేవారట.

కొండమీది స్వామి ఆలయం చేరటానికి దాదాపు 40 మెట్లున్నాయి. వీటిని చెంగప్ప అనే ఆయన కట్టించారుట. ఆయన చనిపోయే వరకు ఆలయం వద్దనే వుండి ఆలయానికి రూపు రేఖలు తెప్పించారుట. ఆయన 1972 లో స్వర్గస్థులైతే తనని అక్కడే సమాధి చెయ్యమని చెప్పారుట. గుడి ముందరే కింద సమాధి చేశారు.

ప్రముఖ గాయని శ్రీమతి శోభారాజు స్వగ్రామం అక్కడికి సమీపంలోని తిరుమలరెడ్డి పల్లెట. ఆవిడ కూడా ఈ ఆలయానికి వచ్చి సంకీర్తన చేశారుట.

1-45కి అక్కడనుండి బయల్దేరి అక్కడికి 3 కి.మీ. ల దూరంలో వున్న రామసముద్రం, బజారు వీధిలో వున్న అర్చక స్వామి కులశేఖర్ భట్టర్ గారింటికి వెళ్ళాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here